సహజస్థితే బ్రహ్మానందం
>> Monday, September 12, 2011
శాస్త్రమంటే మరచిన దానిని గుర్తుకు తెచ్చేదని అర్థం. మహాపురుషులు, జ్ఞానులు, శబ్దమూలమెరిగిన వారు శోధించినందువల్ల లభించినవే శాస్త్రములు. ఇవే సత్యసూక్తములు. శాస్త్రయో నిత్వాత్ అని సూత్రము. వేదముల ద్వారానే బ్రహ్మము అనుభవములోకి వస్తుందని శాస్త్రం బోధిస్తుంది. వేదవిద్యను తెలుసుకోవాలంటే శాస్త్రమే ప్రమాణము. ప్రతి మనిషీ బ్రహ్మస్వరూపమే. వేద రూపమే. శాస్త్ర స్వభావమే. అజ్ఞానం వల్ల ఈ సత్యాన్ని మరచి వర్తిస్తున్నాడు. మానవుడి మూల స్వభావం ఏమిటే తెలియజేసేది శాస్త్రమే. శాస్త్రం అనంతం, ఆకాశసమానం. దానిని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఆయవు చాలదు.
శాస్త్రసారం తెలుసుకుంటే చాలు. ఏది తెలుసుకుంటే బ్రహ్మానందం కలుగుతుందో అదే అసలు విద్య. అదే ఆత్మవిద్య. అదే బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మవిద్యకు ప్రమాణం శాస్త్రం. "మానవుడంటే కేవలం పైకి కనిపిస్తున్న శరీరధారికాదు. స్థూల శరీరం, సూక్ష్మవరీరం, మనసు, బుద్ధి, చిత్తతం, అహంకారంగా ఏడు శరీరాల సమగ్ర స్వరూపం మానవదేహం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే అయిదు కోశాల స్వరూపం మానవశరీరం. ప్రపంచంలో ఏ పదార్థమైనా, దేనివలన పుట్టి పెరిగి, చివరకు దేనియందు కలిసిపోతుందో ఆ కారణమే బ్రహ్మము. ఆ విచారణంతా తపస్సే. తపస్సు అనుభూతి కలిగిస్తున్నది. అనుభూతే విభూతికి కారణం అవుతున్నది.
బ్రహ్మానందానుభవం
జీవకోటి సమస్తమూ ఆనందాన్నే కోరుకుంటున్నది. నిజానికి జీవి స్వభావం ఆనందమే. అవిద్య వల్ల ఆనందం దూరమైంది కనుక, తిరిగి ఆనందాన్ని పొందాలనుకుంటుంది. ఆనందం బ్రహ్మమే. ఓంకారం బ్రహ్మమే. ఆ ప్రణవమే ప్రకృతి నిండా ఉంది కనుక, ప్రకృతీ బ్రహ్మమే. ఆత్మతత్వమూ బ్రహ్మమే. ఇదంతా అనుభవంలోకి రావటమే బ్రహ్మానందానుభవం. ఇంతటి అనుభవం కలగటానికి శాస్త్రమే కారణం. లోపలి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి ఉన్న బంధాన్ని విశిదపరచేదే శాస్త్రం''.
శాస్త్రం కర్మానుభవానికి, జ్ఞానానుభూతికి కారణం అవుతున్నది. తత్తుసమన్వయాత్ అనే సూత్రం శాస్త్ర పరమావధిని బోధిస్తున్నది. అజ్ఞానం వల్ల కలిగే ఆశలు, సంకల్పాల వంటివి జ్ఞానం వైపు నడిపించలేవు. కానీ, జ్ఞానం వల్ల కలిగే సమన్వయ భావన ఆనందాన్నే ఇస్తుంది. విషయ జ్ఞానము, వస్తు వివేకము అజ్ఞానమే. అది అనందాన్ని ఇవ్వలేదు. కొంత సుఖాన్ని కలిగించవచ్చు, తాత్కాలికంగా. ఇక మోక్షమా! దేహాతీమైన అనుభవం అది. జ్ఞానానుభవమే నిత్య, సత్య,శాశ్వతం. నిజానికి ఆనందము, జ్ఞానము జీవికి స్వభావసిద్ధంగా సహజాలే. అవిద్య కారణంగా జీవుడు తన సహజ స్థితిని తెలుసుకోలేకపోతున్నాడు.
సర్వం బ్రహ్మమయం
కర్మలు ముక్తినీయవు. చిత్తశుద్ధిని మాత్రం కలిగించగలవు. కర్మలన్నీ బంధనాలే. బంధనలన్నీ బాంధవ్యాలే. బాంధవ్యం వల్ల మోహము, మోహం వల్ల వ్యామోహం, వ్యామోహం వల్ల వ్యసనం ఏర్పడుతున్నాయ్. ఇదంతా వెలపల ప్రపంచం నిత్యమూ అనుభవిస్తున్నదే. లోపలి ప్రపంచం జ్ఞాన, అనందమయం కనుక, అట్టి ప్రపంచం త న యందున్నదని జీవుడు తెలుసుకోగలిగితే, ఆనందం జీవుడి స్వంతం! జ్ఞానం జీవుడి సొత్తు! దేహంలేని పరమాత్మ, దేహంలో వుండటమే బహువిచిత్ర సన్నివేశం. అన్నమయంతో ప్రారంభమై, ఆనందమయంతో పూర ్తయ్యే ప్రయాణము ఆంతరంగికం. ఆదే విచారణ.
శంకరుల దివ్య ప్రబోధమంతా సమన్వయ విధానమే! దేహానికి - ఆత్మకు, స్థూలానికి - మూలానికి, ఆధారానికి - ఆధేయానికి, అశాశ్వతత్వానికి - శాశ్వతత్వానికి మధ్య సమన్వయం సాధించాలి. సమన్వయమే ఆనందం. సంఘర్షణ ఎప్పటికీ విషాదమే. మతాలన్నీ మార్గ ప్రబోధకాలే. సమన్వయం ఉంటే అన్ని మార్గాలు, ఒకే గమ్యం వైపు నడిపిస్తాయి. అనందానుభూతతిని సమన్వయంతోనే సాధించుకోవాలి.
మతంలేని మానవుడు లేడు. మార్గం లేకుండా గమ్యమూ లేదు. అయితే సమన్వయమెరిగిన విజ్ఞులు బహుకొద్దిమంది. రుషులు, మహాత్ములు, యతులు, యోగులు, అవధటటూతలు, మహాపురుషులు, జ్ఞానులు, ఆత్మవేత్తలు సమన్వయాన్నే ప్రవచించారు. ఆచరించారు. ప్రబోధించారు. చైతన్యాన్ని కలిగించారు. కార్పణ్యంతో కాక కారుణ్యంతో ఈ భావశుద్ధిని, అనుభవసిద్ధిని, పరిణితత బుద్ధితో సాధించుకోవలసిన దివ్య భావనే సమన్వయ రీతి. సర్వమత, సర్వధర్మ, సర్వమర్మముల సమగ్ర దృష్టే అసలు తెలి. అదే అచ్చతెలివి. అదే అసలైన బ్రహ్మవిద్య. వేదములు, శాస్త్రము, జీవుడు, శరీరము, అంతరంగ ప్రపంచము, ప్రపంచవేదికలు.. సర్వమూ బ్రహ్మమయమని ఎరగమంటున్నారు శంకరభగవత్పాదులు. తమ స్వీయ గాఢానుభూతిని ప్రపంచానికి పంచిన పరమ సత్యాచార్యులకు నిత్యనీరాజనం.
ఫ్రం ఆంధ్రజ్యోతి.కాం
0 వ్యాఖ్యలు:
Post a Comment