ప్రశ్నలెన్నైనా సమాధానమొక్కటే...
>> Thursday, August 4, 2011
- [అప్పరుసు రమాకాంతరావు]
శివుడవో మాధవుడవో ఎవరనీ నిర్ణయించేదిరా అని త్యాగయ్య సంశయపడ్డాడు. వ్యాసుడు, పరాశరుల్లాంటి వారికీ; శుక శౌనక మహామునులకే అర్థం కాని పరమార్థ పరబ్రహ్మమది. పరమాత్మతత్వం తనకు కూడా తెలియదని పోతనామాత్యుడు వాపోయాడు. ఎవరా పద్మభవుడు? ఏడీ... ఎక్కడ ఉంటాడు? ఏమో ఎవరికి తెలుసు. కోటానుకోట్ల సూర్యులను సృజించినవాడు ఎంతటి శక్తిమంతుడో ఊహించనైనా లేము. వేదాలు, సమస్త వాఞ్మయాలు నిర్వచించలేని నిరామయుడు ఆ దైవం! అణువిచ్ఛేదం వల్ల ఉత్పన్నమైన మహాభీకర భీభత్సంతో పోలుద్దామనుకొంటే- విశ్వంలోని లెక్కించ తరం కాని అణువుల లయకారకుడు ఆ దైవమే! పంచభూతాలు త్రిగుణాత్మకాలు దైవ కారకాలే కాని దైవం కాదట! అసలు భగవంత తత్వం సాకారమైనదో నిరాకారమైనదో తెలియదాయె. మూర్తిగా మార్చుకొని భక్తిగానం చేద్దామంటే దైవానికి రూపమే లేదని ఉపనిషత్తులంటున్నాయి. ఇంద్రియాలకు కనిపించడు. చింతించటానికి కూడా అలవి కాదు. చలించనిదే దైవం... మరైతే ఎల్లెడలా ఎలా వ్యాప్తి చెందగలడో అర్థం కాదు.
వ్యాసభాగవతంలో చెప్పినట్లు దశావతారాల మూలమైన విష్ణువే దైవం అనుకొంటే శివుడెవరు? ఏకం (ఒక్కడే) నిరంజనుడనుకొందామంటే త్రి(ముగ్గురు) మూర్తులెవరు? దైవస్థానం వైకుంఠమా, కైలాసమా, బ్రహ్మలోకమా? అమృత బిందూపనిషత్తులో అన్నమే పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. కాని, అన్నం మానవ కృషితో ఉద్భవించినది కదా? ఎన్నెన్ని ప్రశ్నలు, ఎన్నో శోధనలు, మరెన్నో సాధనలు... అవేవీ కూడా పరమాత్మజ్ఞానాన్ని కల్పించడం లేదు. అంధులకు సూర్యుడు కనిపించనట్లు మానవులెవరూ నిరంజనుని తెలియలేకున్నారు. ఆది అంతం లేనివాడని కఠోపనిషత్తు అంటోంది. అంతం లేనిది ఉండొచ్చు కాని ఆది లేకుండా ఎలాగో... అర్థం కాని అద్భుతం! రుద్రులు సూర్యులు వసువులు విశ్వదేవతలు అశ్వినీదేవతలు దైవం కాదని మహర్షులన్నారు. గంధర్వుడివా యక్షుడివా సిద్ధుడివా? కాదు కదా! వారంతా నీవు సృజించినవారే. మరి కాలానివా? అలానైనా భావించాలనుకొంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతుడవని పరాశరుడన్నాడు. మృత్యువువా? అది కూడా కాదని తెలుస్తోంది. దేహంలోని ఆత్మకు జనన మరణాలు లేవట! విష్ణు సహస్రనామాలు స్మరించి దైవాన్ని తెలుసుకొందామనుకొంటే శివసహస్ర నామాలు దైవ రూపాలంటున్నారు. పరమాత్మకన్నా ఆదిపరాశక్తి గొప్పదని కొందరు బోధిస్తున్నారు.
తెలియదగినవాడే దైవం అంటారే.... మరి ఎవరివని తెలుసుకోవాలి. దైవం రూపమేమిటి? స్థానమేది? ఆధారం ఎక్కడ? ఏదీ తెలియదాయె. వేదరూపివా? వేదాలను సృజించిన బ్రహ్మ నీ నాభి నుంచి ఉద్భవించాడు మరి! అనురాగదేవతవా? రాగానురాగాలకు అతీతుడవట! ఈ ఆలోచనలకూ ఇన్ని సంశయాలకూ, శోధనలకూ సాధకులకూ అతీతుడవైన ఆదిదేవా! మరి మానవాళి ఎలా తెలుసుకోవాలి? ఎలా చేరాలి? దైవజ్ఞానం పొందడమే దైవసాన్నిధ్యం కలగడమని శంకరాచార్యుల వారన్నారు. ఆలోచనలు అనుమానాలు ప్రశ్నలు విడిచి సర్వభూతదయ కలిగి ఉండాలనీ, దైవకార్యాలను ఆచరించాలనీ సూచించాడు. దైవమే ప్రాప్తిగా చేసుకొని మంచి కార్యాలు చేయాలి. దేహంలోని దేహం బయట ఉన్న శత్రువర్గాలను విడచి పెట్టగలగాలి. సుఖ దుఃఖాల్లో స్థితప్రజ్ఞుడై ఉండాలి. ఈ సాధనల వల్ల దైవం ఎవరు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
0 వ్యాఖ్యలు:
Post a Comment