సహనమే శ్రీరామరక్ష
>> Friday, August 5, 2011
- డాక్టర్ ఎం.మధుబాబు
మన జీవితంలో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు సహన గుణాన్ని కోల్పోయి తదనుభవం చవి చూసినవారమే. సహనం పాటించడం అంటే ఆత్మస్త్థెర్యం కోల్పోవడం కాదు. గాంధీజీని ఓ ఆంగ్లేయుడు కోపంతో చెంపపై కొట్టగా సహనానికి మారుపేరైన ఆయన మరో చెంప చూపించారట. ఒక వ్యక్తి సహనాన్ని కోల్పోయి కోపావేశంతో ఆకాశంపైకి రాళ్లురువ్వితే ఏమవుతుంది? ఆకాశం సహనగుణాన్ని కోల్పోదు. అది వెంటనే పిడుగుల్ని కురిపించదు! ఆ రాళ్లు తిరిగి విసిరినవారిపైనే పడతాయి. ఒక వ్యక్తి కోపావేశంతో పరుష వ్యాఖ్యలతో, వాక్యాలతో నిందించినా ఎదుటి వ్యక్తి సహనాన్ని కోల్పోకూడదు. మనసుకు తగిలే మాటల తూటాలతో మానవీయ సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. అందుకే ఎటువంటి ఆవేశంలోనైనా ఆచితూచి మాట్లాడాలి. సహనత్వంతో పాటు మితభాషిత్వం అలవరచుకోవాలి. శ్రీరాముడు మితభాషిగా, సహనమూర్తిగా కీర్తి గడించాడు. యుద్ధంలో నిరాయుధుడైన శత్రువును చూసి 'రావణా! ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని సీతను నాకప్పగించు, తిరిగి లంకను పరిపాలించు' అన్నాడంటే ఆ శ్రీరాముడి ఔదార్యం ఎంత గొప్పదో కదా! శక్తిమంతులమని, ధనికులమని అధికార బలగర్వంతో సహనం కోల్పోయి, పరుష వాక్కులతో, దారుణమైన ఆలోచనలతో ఎదుటివారిని మోసగిస్తూ ఉండేవాళ్లు సత్యం, ధర్మం, న్యాయం ముందు పరాభవం చెందక తప్పదు. ఎదుటి వ్యక్తి మోసగించాడని మోసపోయిన వ్యక్తి సహనం కోల్పోకూడదు. మన సహనానికి తప్పకుండా మంచి ఫలితమే కలుగుతుంది.
జీవితంలో జయాపజయాలు గాలి తెమ్మెరలుగా వస్తూపోతుంటాయి. జయం కలిగినా, అపజయమే కలిగినా మనం సహనం కోల్పోరాదు. జీవించినంతకాలం సహనం కావాలి. ఒకేలా సాగిపోని ఈ జీవన గమనంలో ఆకాశంలోని మబ్బులుగా అనేక సమస్యలు వస్తూపోతూ ఉంటాయి. ఈ జగతికి వెలుగులనిచ్చే సూర్యచంద్రులను ఏ మబ్బులూ ఆపలేవు సరికదా- ఆ మబ్బులు కూడా వాటి కాంతులతో కరిగిపోతున్నాయి. అందుకే ధీరులైన వారు కష్టనష్టాలను తొలగించుకుంటూ ఉత్సాహం, ధైర్యం ఇంకా పెంచుకుంటూ ముందుకు వెళతారే తప్ప... నిరాశ చెందరు. అపజయం కలిగిందనో, అనుకున్నది సాధించలేదనో జీవితాన్ని చాలించరు.
మన జీవితాలను ఆనందమయం చేసుకోవడానికే దేవుడు సృష్టిలో ప్రతిచోటా అందంగా మలిచాడు. ప్రతిక్షణం సంతోషంతో జీవిస్తూ ఫలితమేదైనా స్వీకరించమనే ఉద్బోధించాడు. సహనం కోల్పోయి ఎవరికి వారు అఘాయిత్యాలు చేసుకోవడం, ఎదుటివారిని గాయపరచడం సరికాదు. మాతృగర్భంలోని శిశువుతో పాటు తల్లీ నవమాసాలు సహనం పాటించినట్లే- ఈ జీవితం పండుటాకై రాలిపోయేంతవరకు కష్టమైనా, సుఖమైనా... కడగండ్లయినా, ఆనందసాగరమైనా ఓపిక పట్టాలి. 'సహనం' కోల్పోకుండా మనగలిగితేనే మనకు జీవన సాఫల్యం చేకూరుతుంది.
0 వ్యాఖ్యలు:
Post a Comment