శివోహం... శివోహం!
>> Monday, August 1, 2011
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
మనిషి తాను శరీరమనే భావనతో గట్టిగా ముడివడి ఉంటాడు. దాన్ని వదిలించుకోలేక జీవితమంతా అనేక అవస్థలు పడుతుంటాడు. శరీర భావన వల్లనే మనిషి స్వార్థం, ద్వేషం, లోభం, మోహ, మద, మాత్సర్యాల వంటి దుర్లక్షణాలతో సతమతమవుతుంటాడు. కొందరికి ఇష్టుడిగా, మరికొందరికి శత్రువుగా మారతాడు.
మనిషి తనకు తానుగా వైద్యం చేసుకోగలిగితే, ప్రపంచంలో వైద్యుడి అవసరం ఉండదు. తనంతతానుగా ఆధ్యాత్మిక జ్ఞాని కాగలిగితే గురువుల అవసరమే ఉండదు. తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే భగవంతుడి అవసరమూ కలగదు.
ఇవేమీ ఆచరణ సాధ్యం కావు. మనలో లేనివి ఇతరుల సహాయంతో పొందక తప్పదు. ఇతరుల సహాయం పొందాలంటే మనం వారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అందుకు సాత్వికత అవసరం.
సత్వం కలిగించేదే సాత్వికత.
ఈ సత్వం శరీరానిక్కాదు, ఆత్మభావనలకు. సుఖదుఃఖాల పట్ల ఉదాసీనత సత్వగుణం. ఆశల వెంట పరుగులు తీయకపోవటం, అతిస్వార్థంతో వ్యవహరించక, సంతృప్తి కలిగి ఉండటం సత్వతత్వం. అభ్యాసంతో గురుకృపతో ఇది సాధ్యపడుతుంది.
ప్రపంచంలో ఏదీ తనకంటే భిన్నం కాదు. 'ఆత్మవత్ సర్వభూతాని' అనుకున్నప్పుడు అవలక్షణాలేవీ మనల్ని వేధించి బాధించవు. అన్నింటిపట్ల సమభావన కలుగుతుంది. కులమతాల విభేదాలకూ ఆస్కారం ఉండదు.
శివగీతలో శంకర భగవానుడు శ్రీరాముడితో సృష్టిలోని అణువణువూ లింగ స్వరూపమేనంటాడు. జీవులందరూ లింగస్వరూపులేనంటాడు. ఎవరు తనలోని అంతర్యామినే శివస్వరూపమని గుర్తిస్తారో వారే జ్ఞానులని, మోక్షార్హులని శివగీత చెబుతోంది. పంచభూతాలను శివుని పంచ ముఖాలంటారు. అందుకు సాదృశంగా శివలింగాలు పూజలందుకుంటున్నాయి. గోకర్ణశివుడు ఆత్మలింగస్వరూపుడు. కాళహస్తిలో వాయులింగం. చిదంబరం ఆకాశలింగం... ఇలా శివస్వరూపం ప్రకృతిలో, దేహంలో సైతం ప్రతిష్ఠితమై ఉంది.
ఇక శివం కానిది సృష్టిలో ఏముంది?
నేనుగా చెప్పుకొనేది శివుడనే జ్ఞానమే 'శివోహ' మంత్రం. నేనే కాదు, సృష్టిసమస్తం శివస్వరూపం అనుకోవడమే అసలైన ఆధ్యాత్మిక భావన.
1 వ్యాఖ్యలు:
చాలా..చక్కని విషయం ని.. పరిచయం చేసారు.ధన్యవాదములు..దుర్గేశ్వర గారు.
Post a Comment