అద్భుతాల ధామం
>> Saturday, July 2, 2011
- సామవేదం షణ్ముఖశర్మ విశిష్టమైన ఉత్కళ కళలకీ, జీవనరీతికీ ఆధారంగా ఉన్నదైవం పురీ జగన్నాథుడు. యుగయుగాలుగా విభిన్నరీతుల్లో విష్ణువు పూజలందుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 'కాశీగంగ, బృందావన మృత్తిక, జగన్నాథ ప్రసాదం- ఈ మూడూ సాక్షాత్తు గోవిందరూపాలు' అని శ్రీరామకృష్ణ పరమహంస పలికేవారు. ఇది శాస్త్ర వచనం కూడా. అందుకే పురీ ప్రసాదానికి ప్రత్యేకత ఉంది. మహాలక్ష్మి అధ్యక్షతన వండే దివ్య ప్రసాదమిది- అని ధార్మిక గ్రంథాలమాట. ఈ ప్రసాదాన్ని జాతిభేదాలు లేకుండా ప్రతివారూ స్వీకరిస్తారు. దీనితో పితృశ్రాద్ధాదికాలూ ఆచరించి ధన్యత పొందవచ్చునని పురాణ వచనం. ఏ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఇక్కడి అన్నప్రసాదానికి ఉంది. 'ఇందులో ప్రతి మెతుకూ గోవిందుడే' అన్నారు పరమహంస. సర్వం శ్రీ జగన్నాథం... ఈ నానుడి ప్రసిద్ధం. విభేదాలకీ, తారతమ్యాలకీ తావీయకూడని నియమం ఉన్న ఈ పావనభూమి ఎన్నో ఆలయాలతో, తీర్థాలతో విరాజిల్లుతోంది. 'కేవలం జగన్నాథస్మరణతో అన్నీ పవిత్రమవుతాయి' అనే సద్భావన ఇక్కడి సత్సంప్రదాయాలకు ప్రాణం పోస్తోంది. రథయాత్ర సమయంలో లక్షలాది జనవాహిని సమక్షంలో, రాజుసైతం చీపురుతో రథాన్ని శుభ్రపరచడం- 'భగవంతుని ముందు రాజైనా సేవకుడే' అనే భావాన్ని ప్రకటిస్తుంది. విశ్వరథాన్ని నడిపే పరమాత్ముని దర్శించడానికి ప్రతీకగా జరిగే రథోత్సవం ఒక మహద్విశేషం. 'నందిఘోష'రథంపై జగన్నాథుడు, 'తాళధ్వజ'రథాన బలభద్రుడు, 'దర్పదళన'మనే రథంలో సుభద్రాదేవి విశాలరాజమార్గాన దివ్యశోభలతో సాగుతూ జనసముద్రాన్ని కృపాసముద్రంతో ముంచెత్తుతారు. 'చలన ధర్మం కలది' కనుక రథం. ఈ అర్థం అటు జగతికీ, ఇటు శరీరానికీ అన్వయిస్తుంది. 'కదిలేది' ఒకటున్నదీ అంటే, 'కదిలించేది' మరి ఒకటున్నదని స్పష్టం. ఆ కదిలించే విశ్వచైతన్యమే విష్ణువు. జగతిరథాన్ని కదిలించే జగన్నాథుని దర్శించడమే ఈ యాత్రలోని ఆంతర్యం. రథానికున్న అశ్వశిల్పాలు, ధ్వజాలు, అలంకారాలు... అన్నీ శాస్త్రబద్ధంగా మలచారు. ఆగమశాస్త్రాల ప్రకారంగా విశ్వాన్ని నడిపే బహుదేవతాశక్తులు, మంత్రమూర్తులు వీటిలో ఉన్నారని ప్రమాణవాక్యాలున్నాయి. 'ఒకప్పుడు రాధాదేవిని కలిసిన రుక్మిణీ సత్యభామాదులు బృందావనంలోని బాలకృష్ణలీలలను చెప్పమని కోరారట. రాధారాణి ఆ లీలలను పరవశంతో వర్ణిస్తుంటే, తన్మయులై వింటున్నారు ద్వారకారాణులు. అదే సమయంలో ఆ భవనంవైపు చెల్లెలు సుభద్రతో, అన్న బలరామునితో అటు వస్తున్న వాసుదేవుడు ద్వారం వద్దనే నిలబడి రాధాప్రసంగాన్ని విన్నాడు. వింటూనే ఆ ముగ్గురూ తాదాత్మ్యంతో శిల్పాలవలే నిలబడ్డారు. ఆ దృశ్యాన్ని చూసిన నారదుడు ఈ ముగ్గురు మూర్తులు నిరంతరం భక్తులను అనుగ్రహించేలా ఆరాధ్యదేవతలై కలకాలం ఉండాలని కోరాడట. ఆ ముచ్చట తీర్చడానికై స్వామి అవతారానంతరం ఈ క్షేత్రాన వెలశా'డని ఒక పురాణోక్తి. ఎన్నోవిధాలుగా పురాణాలు బోలెడు కథలు చెప్పినా, వాటన్నింటి సారంగా ఉన్న సమన్వయం సూత్రం ఒకటే: 'పరిపూర్ణుడైన వాసుదేవ బ్రహ్మం జగన్నాథుడు. విష్ణ్వంశరూపుడు సంకర్షణుడు బలభద్రుడు. వైష్ణవీమాయాశక్తి సుభద్ర. వీరితోపాటు జ్ఞానజ్వాలామూర్తిగా ఉన్న సుదర్శనుడు' ఈ నాలుగు రూపాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉంటూ, జగతిని రక్షించే భగవన్మూర్తులుగా ఈ క్షేత్రంలో భాసిస్తున్నాయని మహర్షులమాట. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో, ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఒక ప్రముఖ క్షేత్రతీర్థస్థలం ఈ ప్రాచీన విష్ణుధామం. |
0 వ్యాఖ్యలు:
Post a Comment