ఆషాఢ వైభవం
>> Saturday, July 2, 2011
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
ఆషాఢంలో ఆలుమగల విరహ సందేశాలను పరస్పరం అందించడానికి మేఘాలను పంపింది కవికుల గురువు కాళిదాసు. హేమమాలి అనే యక్షుడు కుబేరునిచే శాపగ్రస్తుడై ఆషాఢ మాసం తొలిరోజున చిత్రకూట పర్వతం మీద కొండచరియను కమ్ముకొని దంతాలతో కోరాడే ఏనుగువలె కనబడుతున్న మేఘాన్ని చూశాడని కాళిదాసు వర్ణన. సాధారణంగా మేఘ దర్శనం ప్రియురాలి సాంగత్యం కోసం కోరిక పుట్టిస్తుంది. గాలి అనుకూలంగా వీస్తుంటే చాతక పక్షులు, కొక్కెర పిట్టలు మధురంగా చెవులకు ఇంపుగా కూస్తుంటే అల్లనల్లన నల్లమబ్బులు అలముకునే మాసం ఆషాఢం. అయితే ఆషాఢ మేఘాలు అంతగా కురిసేవి కావు. దట్టంగా కమ్ముకొని హడావుడి చేసి మెల మెల్లగా చెదిరిపోతాయి. అందుకేనేమో నమ్మించి మోసం చేసేవాళ్లను, అతివినయం ఒలకబోసే వాళ్లను ఆషాఢభూతులంటారు. అబ్బూరి వారు 'తరలిరా ఆషాఢ లక్ష్మి మెరుపుతీగెలు తొలుకు రథమున మురిపెమున దిక్కాంతలలరగ తరలిరా మేఘముల పథమున...' అంటూ ఆషాఢ మేఘాలకు ఆహ్వానం పలికారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి 'ఆషాఢయోషామణీ కేశపాశాన అల్లుకున్నది తటిద్వల్లియో' అని ఆషాఢంలో మెరిసే మెరుపుతీగల్ని సంభావించారు.
పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఏదైతే వస్తుందో అప్పట్నుంచి ఆషాఢారంభం. ఇలా రెండు నక్షత్రాల ప్రత్యేకతగల నెల ఇది. ఆషాఢం అనే మాటకు బ్రహ్మచారుల చేతనుండే మోదుగుదండం, మలయపర్వతం అనే అర్థాలూ ఉన్నాయి. ఆషాఢం శూన్యమాసం. శుభకార్యాలను వాయిదా వేయించే మాసం. అయితేనేం సాంస్కృతిక వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. కొన్నిప్రాంతాల్లో ఆషాఢ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణ విశేష ఫలాలను ఇస్తాయని విశ్వాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశి శయనైకాదశి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధియందు శయనించే తొలి ఏకాదశిగా ఇది ప్రసిద్ధి. ఈరోజు నుంచే చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. ఆషాఢ శుద్ధ విదియనాడు జగన్నాథ రథయాత్ర. సుభద్ర బలభద్రులతో కూడిన జగన్నాథుడు రథం మీద ఊరేగింపుగా వెళ్ళడం ఆనవాయితీ. ఆర్షవాఞ్మయానికి మూలపురుషుడైన వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాసపూర్ణిమ. వ్యాసభగవానుని జగద్గురువుగా అర్చించే గురుపూర్ణిమ. ఆషాఢ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశి. పాపనాశిని. ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో పవిత్ర సందర్భాలకు నెలవు ఆషాఢం. ఒరిస్సాలో ఆషాఢ పంచమి హిరాపంచమిగా వ్యవహరిస్తారు. వివాహ వేడుకలకు ఆరంభ దినం ఇది. ఆషాఢంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణాయనం ఆరంభిస్తాడు.
0 వ్యాఖ్యలు:
Post a Comment