శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జ్ఞానదానం

>> Tuesday, July 19, 2011

నమస్కారం
సువర్ణపురాన్ని హేమంతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ఆ రాజ్య ప్రజలు ఏ కష్టం లేకుండా ఆనందముగా గడిపేవారు. అయితే ఆ రాజు కొంచెం అహంకారి. ఒకసారి ఆ రాజు తన జన్మదినం సందర్భముగా నిరుపేద యువకులకు డబ్బు దానంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ప్రతి ఊరి నుంచి పేద యువకుల పేర్లను సేకరించి పంపమని ఉత్తర్వులు పంపాడు. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది యువకుల వివరాలు రాజసౌధానికి చేరాయి. వాటిని రాజు స్వయముగా పరిశీలించి అందరికీ సమానముగా అందేలా ధనాన్ని పంపించాడు. కొన్నిరోజుల తరువాత కోసంగి అనే గ్రామానికి చెందిన గ్రామ పెద్ధ, విశ్వంభరుడనే యువకుడి గురించి వివరాలు తెలియజేస్తూ, "అతను కడుపేదవాడు, అనాథ. అయితే దానం తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాడు" అని రాసి పంపాడు. దానిని చదవగానే ముందు రాజుకు కోపం వచ్చింది. వెంటనే విశ్వంభరుడనే వ్యక్తిని తన ఆస్థానానికి తీసుకు రావలసిందిగా ఆదేశాలను జారీచేశాడు. ఆ మరుసటి రోజుకల్లా భటులు విశ్వంభరుడిని రాజు ముందు ప్రవేశపెట్టారు. "ఎంత అహంకారం నీకు, మేమిచ్చే దానాన్ని తిరస్కరిస్తావా ?" అని కోపముగా అడిగాడు రాజు. "ప్రభువుల వారు నన్ను క్షమించాలి. మీరిస్తున్న దానం తాత్కాలికమైనది. అందుకే అది నాకు అక్కరలేదు" అని వినయంగా చెప్పాడు విశ్వంభరుడు. ఆ సమాధానముతో ఆలోచనలో పడ్డాడు ఆ రాజు. "మహా ప్రభూ! మీరిచ్చిన ధనంతో నేను ఆరునెలల పాటు ఏ ఇబ్భందీ లేకుండా జీవనం గడుపుతానేమో........ మరి ఆ తరువాత నా పరిస్థితి యథావిధిగా మారిపోతుంది. అందుకే మీరు నాకు జీవితమంతా పనికొచ్చే శాశ్వతమైన దానం ఇవ్వండి" అని అడిగాడు. ఆ మాటలకు రాజు "అలాంటి దానం కూడా ఉంటుందా?" అని ఆశ్చర్యంగా అడిగాడు. అపుడు విశ్వంభరుడు "జ్ఞానదానం ప్రభూ! లోకములోనున్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే దానం. ఎంతో మంది మాయామోహాలకు లోనై జనన-మరణం అనే జీవిత చక్రాల మధ్య ఊగిసలాడుతున్నారు. వీటికి పరిష్కారం ఒక్కటే అది జ్ఞానదానం. దయచేసి మాకు జ్ఞానదానం ప్రసాదించండి" అని అభ్యర్థించాడు. అప్పుడు రాజు సంశయంలో పడ్డాడు. అందరూ ఏమవుతుందో అని ఆత్రుతతో చూస్తున్నారు. ఏమయింది ప్రభూ! అలా దిగులుగా వున్నారు అని అప్పుడే వచ్చిన తన ఆస్థానపండితులలో ఒకరు అడిగారు. అపుడు రాజు జరిగినది చెప్పి, నా దగ్గర ఇవ్వడానికి ధనం మాత్రమే వున్నది కాని ధనం వలన జ్ఞాన దానం చేయలేము కదా అని, ఏదయినా ఉపాయం చెప్పమన్నారు. అప్పుడు ఆ పండితుడు, "ప్రభూ! జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఆ 33 కోట్ల దేవతలకు కూడా లేదు, చివరకు మీకు మాకు కూడా లేదు. మేము శాస్త్రపాండిత్యం మాత్రమే చెప్పగలము కాని జ్ఞానాన్ని బోధించాలంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఒక్క సిద్ధ మహా గురువుకు మాత్రమే సాధ్యం. మేము పుస్తక జ్ఞానాన్ని మాత్రమే చెప్పగలము కాని సిద్ధ గురువులు పుస్తక జ్ఞానముతో పాటు సొంత అనుభవమును (Practical Experience) జోడించి చెప్పగలరు. జీవుడిని సిద్ధుడిని చేయగల శక్తి ఒక్క సిద్ధ గురువులకు మాత్రమే వున్నది. " కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ధనముతో లోకకళ్యాణం కోసం ఒక సిద్ధ గురువును ఆశ్రయించి జ్ఞానదానం చేయండి ప్రభూ అని విన్నవించుకున్నారు. అదియే శాశ్వత దానం ప్రభూ!........ అప్పుడు రాజు చాలా సంతోషముతో వారిరువురిని మెచ్చుకుని లోకకళ్యాణం కోసం శ్రీకారం చుట్టారు.
బత్తుల సురేష్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP