నాస్తికుడు- ఆస్తికుడు
>> Sunday, June 26, 2011
'అస్తి'... అంటే ఉన్నది అనే నమ్మకాన్ని కలిగినవాడే 'ఆస్తికుడు'. ఓడినప్పుడు గెలుపుకోసం, గెలిచినప్పుడు ఆ గెలుపును నిలబెట్టుకోవడం కోసం, మళ్లీ మళ్లీ గెలవడం కోసం నిరంతరం పోరాటం చేసేవాడు; దేవుడి మీద మాత్రమే కాదు, తనమీద, తన తెలివితేటల మీద నమ్మకం ఉన్నవాడే ఆస్తికుడు! 'నా'తో మొదలై, 'నా'తోనే కొనసాగి, 'నా'తోనే అంతమైపొయ్యేవాడు, 'నా కోరికలు' 'నా సుఖం', 'నా దుఃఖం', 'నా లాభం', 'నా ఇష్టం', ఇలా... పుట్టిన దగ్గరనుంచి, చచ్చేదాకా 'నా' చుట్టూ ఎవడు పరిభ్రమిస్తాడో, 'నా ఇల్లు', 'నా వాకిలి', 'నా కుటుంబం' అంటూ ఎవడు బతుకుతాడో వాడే నాస్తికుడు! 'ఉన్నది' అని నమ్మేవాడు, ఉన్నదాని తోనే సంతృప్తి పొందేవాడు, ఉన్ననాడు, లేనినాడు ఒకేరకంగా ఉండగలిగేవాడు, తన కోసమే కాక, తన చుట్టూ ఉన్నవాళ్ళకోసం, ఇతరుల కోసం బతికేవాడు, మాటకు కట్టుబడేవాడు, మంచితనానికి పట్టుబడేవాడు, 'మనది', 'మనది' అని పలవరించేవాడు... వాడే నిజమైన ఆస్తికుడు! 'నా' చుట్టూ గిరి గీసుకుని బతికేవాడు అధముడు. 'నా'నుంచి 'మా' వరకు ఎదగగలినవాడు మధ్యముడు. 'మా'నుంచి 'మన'కు ఎదగగలినవాడు ఉత్తముడు. విచిత్రమేమిటంటే, ఇలా చూస్తే- ఆస్తికులు అనుకునేవాళ్ళలో ఎంతోమంది నాస్తికులు, నాస్తికులు అనుకునేవాళ్ళలో ఎంతోమంది ఆస్తికులు కనిపిస్తారు. వ్యక్తిత్వంలోనో, ఆధ్యాత్మిక సాధనలోనో, అనుభవంలోనో లేదా మంచితనంలోనో ఎత్తులకు ఎదిగిన కొద్దీ అంతరాలు తొలగిపోయే, అంతరంగం అందంగా వెలిగిపోయే మార్గం సుగమం అవుతుంది. అదే నిజమైన ఆస్తికత్వం! దాన్ని కలిగినవాడే నిజమైన ఆస్తికుడు! నాస్తికులుగా చలామణీ అయ్యే ఆస్తికులు, ఆస్తికులమని వంచించే నాస్తికులు ఉన్న ఈ ప్రపంచంలో అందరి మంచిని కోరేవాడు, అందరిలోనూ మంచిని చూసేవాడే అసలైన దేవుడు! నాలుగైదు ముఖాలు, డజన్లకొద్దీ కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళే దేవుళ్లు, దేవతలు అనుకోవడం అమాయకత్వం లేదా అజ్ఞానం! ఒక మహానుభావుడు చెప్పినట్లు (ఇతరుల గురించి చెడు మాట్లాడే విషయంలో మూగవాడు, పరాయివారి స్త్రీలను, ధనాన్ని, సుఖాన్ని చెడు చూపులతో చూసే విషయంలో అంధుడు, ఇతరుల రహస్యాల గురించి, బలహీనతల గురించి వినడంలో చెవిటివాడు, ఈ మూడు అంగ వైకల్యాలు ఉన్నవాడెవరో వాడే దేవుడు అని సారాంశం)- ఎన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేనివాడు, ఇతరుల ఆస్తినిగాని, ఆలినిగాని, ఆశతోనో అసూయతోనో చూడలేనివాడూ, పరనిందను హర్షించనివాడు, అంటే ఆత్మస్తుతిని కూడా చేసుకోనివాడూ ఈ భూమి మీద నడయాడే నిజమైన దేవుడన్నమాట! ఆ దేవుడిపట్ల ఆ లక్షణాల పట్ల విశ్వాసం, ప్రేమ, ఉన్నవాడే ఆస్తికుడు! ఎంతోమందిని ప్రభావితం చేసిన మూడు కోతుల కథలోని 'చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు' అనే నీతి ఇక్కడినుంచి పుట్టినదే! ఏది మంచి, ఏది చెడు అంటే, ఏది సర్వకాల సర్వావస్థల్లో అందరికీ ఆచరణ యోగ్యమో అదే మంచిది! ఏది ఏ ఒక్కరికీ కీడు తలపెట్టదో, దుఃఖాన్ని కలిగించదో, దేన్ని ఆచరించడంవల్ల ఎవరికీ, ఎప్పుడూ పశ్చాత్తాపం చెందవలసిన అవసరం రాదో, సకల ప్రాణులకూ ఏది సుఖాన్ని, శాంతినీ ఇస్తుందో- అదే మంచిది. అదే ఉచితమైనది. ఇంతకన్నా భిన్నమైనది ఏదైనా చెడ్డది, అనుచితమైనది. ఈ జ్ఞానాన్ని కలిగినవాడే దేవుడు. ఆ దేవుడిని ఆదరించేవాడే, అనుసరించేవాడే ఆస్తికుడు! ఈ జ్ఞానం లేనివాడే రాక్షసుడు! వాడిని ఆదరించేవాడే, అనుసరించేవాడే నాస్తికుడు!
- వనం వెంకట వరప్రసాదరావు
1 వ్యాఖ్యలు:
చక్కటి ఎనాలిసిస్.
Post a Comment