శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కృతజ్ఞత - కృతఘ్నత

>> Sunday, May 15, 2011

కృతజ్ఞత - కృతఘ్నత
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
నం తరచుగా 'కృతజ్ఞత', కృతఘ్నత' అనే మాటలు వింటూంటాం. వినడానికి ఇవి సామాన్యపదాలుగా ఉన్నా- అద్భుతమైన మానవ జీవనరహస్యం వీటిలో నిక్షిప్తమై ఉంది. మానవుడికి ప్రధానంగా ఉండవలసిన సహజ లక్షణం 'కృతజ్ఞత'. ఉండకూడని ప్రధాన అవలక్షణం 'కృతఘ్నత'. ఈ రెండింటి వైశిష్ట్యం బాగా అవగాహన చేసుకుని తన జీవితంతో వీటిని సమన్వయం చేసుకుని జీవనయానం చేయగలిగేవాడు మహామనీషి!

చేసిన మేలును గుర్తుంచుకుని ఎదుటివారికి ప్రత్యుపకారం చేయడం 'కృతజ్ఞత'. చేసిన మేలును మరచిపోవడం మహాపాపం- అదే కృతఘ్నత. ఎన్నో ఎన్నో పాపాలకు పరిహారమూ, ప్రాయశ్చిత్తమూ ఉంటాయని రుషులు, విజ్ఞులు సూచించారు. కృతఘ్నతకు నిష్కృతే లేదన్నారు. కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా తినవని భారతంలో విదురనీతి చెప్పింది. శ్రీరాముడి సద్గుణ సంపదలో ప్రధానమైనది కృతజ్ఞతాలక్షణమని వాల్మీకి మహర్షి అభివర్ణిస్తాడు. ఇతరులు తనకు 'చిన్న' ఉపకారం చేసినా- రాముడు అపరిమితానందం వ్యక్తంచేసేవాడట. ఎవరైనా తనకు వంద అపకారాలు చేసినా, అది క్షణంలో మరిచిపోయేవాడట. సీతాపహరణ ఘట్టంలో రావణుడితో పోట్లాడి ప్రాణాలు కోల్పోతున్న జటాయువుపట్ల రాముడు చూపిన కృతజ్ఞత అపూర్వం. ఆ కృతజ్ఞతవల్లనే తన కారణంగా మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వర్తించాడు! తనను చేరదీసి అంగరాజ్యాభిక్తుణ్నిచేసి, నిజమైన మైత్రికి సాక్షీభూతుడిగా నిలిచిన సుయోధనుడికి ఆజన్మాంతం రుణపడి ఉన్నానన్న కర్ణుడు ప్రదర్శించిన కృతజ్ఞతాభావం అనన్యసామాన్యమైనది. లక్క ఇంటినుంచి బైటపడిన తమకు ఆశ్రయమిచ్చిన కుటుంబానికి ప్రత్యుపకారం చెయ్యాలన్న సత్సంకల్పంతో కుంతీదేవి బకాసురుడికి ఆహారంగా తన కుమారుడు భీమసేనుణ్ని పంపేందుకు సిద్ధపడింది. వాసుదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ తమకు అండగా ఉన్నాడు కనుకనే పాండవులు సర్వదా ఆయనకు విధేయులు, కృతజ్ఞులై సజ్జనులనిపించుకున్నారు. ద్రోణాచార్యుని పరోక్షగురువుగా భావించి విలువిద్యలో విశేష నైపుణ్యం సముపార్జించుకోగలగడం వల్లనే ఏకలవ్యుడు నిస్సంకోచంగా తన బొటనవేలిని కోసి గురుదక్షిణగా సమర్పించుకున్నాడు.

ఈ యుగంలో మానవుడు ఇతరులనుంచి పొందిన ఉపకారాన్ని ఇట్టే మరిచిపోతున్నాడు. అది ఘోరమైన పాపమన్న ఆలోచనే లేదు. పైగా ఉపకారం పొందికూడా అపకారమే చేస్తున్నాడు. మనం అసలు ఎవరికి ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి? మనం తింటున్న తిండి, కడుతున్న బట్ట, ఉంటున్న గూడు... మనం తయారుచేసుకున్నవి కావు. ఇవి సమకూర్చినవాళ్లకు మనం కృతజ్ఞులమై ఉండాలి. పంచభూతాల వల్ల ఈ దేహం ప్రాణంతో పెరుగుతోంది. కనుక వాటికి కృతజ్ఞత తెలుపుకోవాలి. సృష్టిలో ప్రత్యణువునుంచి, ప్రతి వస్తువునుంచి మనం ఉపకారమో, సుఖమో పొందుతున్నాం. ప్రతి వ్యక్తినుంచీ సమయం-సందర్భాలనుబట్టి ఎప్పుడో అప్పుడు ప్రయోజనం ఇంతోఅంతో పొందుతూనే ఉన్నాం. కనుక వీరంతా మన కృతజ్ఞతకు అర్హులే! శాస్త్ర పురాణాల నుంచి, వేదోపనిషత్తులనుంచి, సత్సంగాలనుంచి, తీర్థయాత్రలనుంచి ఎంతో 'మంచి'ని నేర్చుకోవచ్చు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, హితవు తెలిపి, పథం నిర్దేశించే ఆచార్యులకు, శ్రేయం చేకూర్చే స్నేహితులకు, కంటికి రెప్పలా మనల్ని చూసుకునే కుటుంబ సభ్యులకు, సమాజంలో మనల్ని ఆదరించి అభిమానించే సాటిమానవులకు మనం సర్వదా కృతజ్ఞులమై, విధేయులమై ఉండి తీరాల్సిందే! వీరందరికీ మనం ప్రేమతో, సేవతో, ప్రత్యుపకారంతో, గౌరవంతో, ఆత్మీయతతో రుణం తీర్చుకోవలసిందే. లేకపోతే ఈ మానవజన్మకు అర్థమూ-పరమార్థమూ అనేవే ఉండవు. చదువో, పదవో, ధనమో, బంగారమో సంపాదించినంత మాత్రాన మన అవసరాలు తీరవు. మనకు సుఖసంతోషాలు లభించవు. కృతజ్ఞత కోసం వీటిని వినియోగించినప్పుడే ఆనందం లభిస్తుంది. చివరికి అపకారం తలపెట్టినవాడికి సైతం ఉపకారమే చేసి పంపాలి. అదే మానవత్వం. అందుకే వేమన అంటాడు- 'చంపదగినయట్టి శత్రువు తనచేత-జిక్కెనేని కీడు చేయరాదు- పొసగి మేలుచేసి పొమ్మనుటే చాలు'. మానవ జీవన తాత్వికత అంతా ఈ నాలుగు మాటల్లోనే నిబిడీకృతమై ఉందనడం అత్యుక్తి ఎంతమాత్రం కాదు. మనం అనేక విధాలుగా భక్తి ప్రకటించుకుంటున్నాం. కృతజ్ఞతాభావమనేది ప్రధానంగా అంతర్లీనమై ఉండకపోతే ఆ భక్తి నిరుపయోగం, నిష్ఫలం. 'ఎదుటివారి ఉపకారాన్ని గ్రహించటమే బుద్ధిమంతుల లక్షణం. అందుకు ప్రత్యుపకారం చెయ్యడం మధ్యమమార్గం. పొందిన ఉపకారంకంటే ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేసి రుణవిముక్తులం కావటం సర్వోత్తమ లక్షణం- అని భారతం చెబుతున్నది. ఈ మహత్తర భారత సందేశాన్ని నిరంతరం గుర్తుంచుకుని, జీవనయాగ మంత్రబీజాక్షరాలుగా ఆహ్వానించడమే ఇప్పుడు మనం చేయవలసిన పని!



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP