నమో నారసింహా!
>> Monday, May 16, 2011
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్
ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుల గాథలతో ముడివడిన ప్రసిద్ధ క్షేత్రాలు మనరాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనివే అహోబలం, యాదగిరి. ఈ క్షేత్రాల్లో ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. పురాణాలు, సంహితల ప్రకారం నారసింహాకృతుల్ని నానా విధాలుగా వర్ణించి చెబుతారు. ఆ రూపాలే పలు ఆలయాల్లో నిత్య పూజలందుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పర్వత పంక్తుల మధ్య నెలకొన్న అహోబిల క్షేత్రం నవ నారసింహ సన్నిధానంగా విఖ్యాతి గాంచింది. ఉగ్ర, ప్రహ్లాద వరద, మాలోల, జ్వాల, భార్గవ, ఛత్రవట, యోగానంద, కారంజ, వరాహ నరసింహస్వామి రూపులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఒకే పరిధిలో నవ నారసింహధామాలు విరాజిల్లడం అహోబిలం ప్రత్యేకతగా చెబుతారు. హిరణ్యకశిపుని సంహరణ కోసం విష్ణువు నరసింహుడిగా వ్యక్తమైన సందర్భంలో ఉగ్రమూర్తిగా స్వామి గోచరించాడంటారు. ఆ రూపం ఎగువ అహోబిలంలో ఉంటుంది. రాక్షసవధ తరవాత స్వామి తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించి, ప్రహ్లాద వరద నరసింహుడిగా దర్శనమిచ్చాడని చెబుతారు. ఈ నరసింహమూర్తిని దిగువ అహోబిలంలో భక్తులు తిలకించి పులకిస్తారు. విశిష్టాద్వైత సంప్రదాయరీతిలో ఈ క్షేత్రంలో నిత్యార్చనలు, ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతాయి.
హిరణ్యకశిపుని కడతేర్చాక ప్రహ్లాదుడికి సుప్రసన్న మూర్తిగా స్వామి తన దర్శనాన్ని అనుగ్రహించిన దివ్యసన్నిధే యాదగిరిగుట్ట క్షేత్రమని చెబుతారు. రుష్యశృంగుడి పుత్రుడైన యాదర్షి తపః ఫలితంగా స్వామి అర్చామూర్తిగా యాదగిరిపై కొలువుతీరాడంటారు. ఏకశిలా శిఖరంపైన స్వామి పంచ రూపాల్లో ఇక్కడ వ్యక్తమయ్యాడు. జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర, లక్ష్మీనరసింహ అనే నామధేయాలతో నారసింహుడు వర్ధిల్లుతున్నాడు. అందుకే ఇది పంచ నారసింహ క్షేత్రంగా విలసిల్లుతోంది. పాంచరాత్ర ఆగమోక్తంగా పదకొండు రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీనారసింహుల తిరుకల్యాణాన్ని ఈ నెల 23వ తేదీన నయన మనోహరంగా జరిపించనున్నారు.
దుష్టశిక్షణ, శిష్టరక్షణ ప్రధాన హేతువుగా ఉద్భవించిన నరసింహుని ఆశ్రయించడం సకలభయ నివారకం, సచ్చిదానంద దాయకం, సన్మంగళ కారకం.
0 వ్యాఖ్యలు:
Post a Comment