నిన్ను నువ్వు తెలుసుకో!
>> Tuesday, May 10, 2011
- డాక్టర్ డి.చంద్రకళ 'జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగి ఉంటూ దానితోపాటు జీవించటమే ఆధ్యాత్మికత. అలాంటి జీవనం పట్ల ఆసక్తి మనిషిని సత్యమార్గంలోకి నడిపిస్తుంది. ఈ మార్గంలో జరుగుతున్న విషయాల్లో యథార్థతను తెలుసుకోగలుగుతాం' అని ఆయన విశదీకరించారు. తాడును పాము అనుకోకపోవడమే యథార్థత. 'ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి యథార్థతను గ్రహించుకోకుండా భ్రమలతో, భయాలతో, దుఃఖాలతో బతుకుతున్నాడు. వీటినుంచి బయటపడటానికి భద్రతను వెతుక్కుంటున్నాడు. ఆ భద్రత ఆస్తులు కూడబెట్టుకోవడంలోనూ, హోదా పెంచుకోవడంలోనూ లేదు. తనను తాను తెలుసుకుని, తనలో సంపూర్ణమైన మార్పు పొందినవాడే భద్రత సాధించగలడు' అని స్పష్టం చేశారు. మనిషి మానసిక స్థితినిబట్టి అతడి చర్యలుంటాయి. తన చేతనలోను, అంతః చేతనలోనూ, లోపలిపొరల్లో ఉండే తన స్థితిని తెలుసుకోగలిగితే తానెందుకు భయపడుతున్నాడో, ఎందుకు దుఃఖపడుతున్నాడో అర్థంచేసుకుంటాడు. అలా వాటినుంచి విముక్తి పొందగలడు. అదే 'స్వీయజ్ఞానం' అంటూ జిడ్డు కృష్ణమూర్తి బోధించారు. మనిషి భద్రతకోసం పడే ఆరాటంలో నుంచే కూడబెట్టుకోవడం, ఆర్జించుకోవడం అనే తత్వం వస్తుంది. కూడబెట్టుకునే కొద్దీ వాటి రక్షణకోసం మరింత భద్రత కోరుకుంటాడు. భద్రత కోరుకుంటున్నంతకాలం భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకే కూడబెట్టుకునే తత్వాన్ని స్వచ్ఛంగా వదిలేయమన్నారు. గాఢోద్రేకాలూ, అసూయ, దుర్బుద్ధి... ఇవన్నీ కూడా ఆర్జించుకునే మనస్తత్వంలో నుంచే పుడతాయి. వాటినుంచి విడుదల కావాలంటే, తనలో జనించే ఆలోచనలను, వాటివల్ల శరీరంలో వచ్చే ప్రతిస్పందనలను అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ అవగాహనే మనిషికి సత్యమంటే ఏమిటో తెలుసుకునే గ్రహింపునిస్తుంది. జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా గ్రహించాలి. అంటే దానికి ఏ విధమైన ఊహలు, అపోహలు జోడించకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలిగితే- సత్యాన్ని తెలుసుకున్నట్టే అని ఆయన ఉద్బోధించారు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనసు ఎటువంటి భయాలూ లేకుండా ఉండాలి. ఎటువంటి కోరికల్లోనూ చిక్కుకోకూడదు. అలా మనసు అటూ ఇటూ తిరుగాడకుండా నిశ్చలత్వాన్ని పొందినప్పుడే సత్యాన్ని గ్రహించగలుగుతాం. అలా నిశ్చలమైన మనసును సాధించాలంటే మనసులో పుట్టే ప్రతి ఆలోచన పట్లా ఎరుక కలిగి ఉండాలి. వాటిని అవగాహన చేసుకోవాలి. ఆ నిశ్చలమైన మనసే అన్ని సంఘర్షణలనుంచి, దుఃఖాలనుంచి తప్పించగలుగుతుంది' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జీవితంలో ధ్యానం తప్పనిసరి. ధ్యానం లేనిదే జీవితమే లేదు. ధ్యానాన్ని అవగాహన చేసుకుని అందులో ఉండాలనుకునేవారు తమను తాము అర్థం చేసుకోవాలి. స్వీయజ్ఞానం లేకుండా తనను తాను అవగాహన చేసుకోలేరు. దానికి ధ్యానమే ఆరంభం. స్మృతులు పనిచేస్తున్నంతవరకు మనిషి యథార్థతను కనిపెట్టలేడు. అందుకే వాటినుంచి విముక్తి పొందాలి అని మనసు తనకు తానే చెప్పుకొంటుంది. మనసు తాలూకు చేతన, అంతఃచేతనా అన్నింటినీ అవగాహన చేసుకుని ఎటువంటి కదలికా లేకుండా నిలిచిపోతుంది. ఈ స్థితిలో ఒక బ్రహ్మాండమైన సజీవశక్తి, శాంతి అప్రమత్తతా ఉంటుంది. ఆ శాంతమైన మనసులో చురుకుతనం, విస్తృతమైన ఎరుక ఉంటాయి. అక్కడ కేవలం అనుభూతి చెందుతూ ఉన్న స్థితి ఉంటుంది. ఆ స్థితిలోనే యథార్థాన్ని చూడగలరు. సత్యాన్ని తెలుసుకోగలరు. ఇదంతా తెలుసుకోవాలంటే మనిషికి తనను గురించి తాను తెలుసుకోవటం ఎంతో అవసరమని చెప్పిన ఆ మహామనిషికి నీరాజనాలర్పిద్దాం. |
0 వ్యాఖ్యలు:
Post a Comment