తాను ఆడే ఆటలో ఆటంకాలు కల్పించేది తానే ....తొలగించేదీ తానే !!!
>> Monday, May 9, 2011
అమ్మ అప్పుడప్పుడు చిత్రమైన ఆట లాడుతుంటుంది . తాను నడిపే బొమ్మలతో ఆశ్చర్యకరమైన పనులను అవలీలగా చేపిస్తుంది. అహా ! నేనుకదా చేయగలిగానని ,ఈ బొమ్మలో కొద్దిగానైనా అహం మొలకెత్తుతుందన్న అనుమానం కలిగిందో కొండత ఆటంకాన్ని కన్నులెదురుగా కల్పించి బెంబేలెత్తేలా చేస్తుంది . నావల్లకాదు . నీవు తప్పదిక్కులేదు అని శరణాగతులమైన మరుక్షణం ముందున్న ఆటంకం మంచులా కరిగిపోతుంది . అలాగని ఎప్పుడుబడితేఅప్పుడు బిచ్చగాడిలా అడుక్కునే కేకలు వేయకూడదన్న మా గురుదేవులు రాధికా ప్రసాద్ మహరాజ్ వారి బోధన హెచ్చరిస్తూనే ఉంటుంది .అమ్మముందు బెగ్గర్లుగా కాదు ! బిడ్డలుగా బ్రతకండి అన్నది వారి బోధ.
ఇప్పుడు తాను వెన్నంటి ఉన్నానని ఈ మొద్దుబుర్రకు గుర్తుచేస్తూ అమ్మ నడిపిన ఇంకో లీలను మీతో పంచుకుంటాను.
ఇప్పుడు పీఠప్రధానమందిరం లో సామూహికంగా జరిపే పూజలకు ఇరుకుగా ఉంది. మందిరం ఎదురుగా ఉన్నయాగశాల తాటాకులతో కప్పువేయటం చెదలు పట్టి త్వరగా దెబ్బతినటం వలన యజ్ఞకార్యక్రమాలకు ఇబ్బంది. ఇక కపీఠంలో నిదురచెయ్యాలని వచ్చేవారికి , కార్తీకమాసాదులలో దీక్షాధారులు వచ్చి నిదురచేసి వెళ్లటాని వచ్చినప్పుడు వాళబాగా సమస్యగాఉంది. లోపల మందిరం హాలులోనే అమ్మవారికి పవ్వళింపు సేవచేసే ఊయల ఉంటుంది కనుక అక్కడ నిద్రించడానికి కుదరదని చెబుతాము . యాగశాల [పాక] లో నిద్రచేయటానికి పొలాలుకనుక కప్పులో ఎలుకలు వాటికోసం పాములుకూడాచేరుతుంటాయి కనుక పైనుంచి ఏమిపడుతుందో ? అన్నభయం . దీనికిపరిష్కారం ఏమిటంటే యాగశాలను తీసివేసి స్లాబు తో హాలు నిర్మించటమే. అందుకు కావలసిన డబ్బు నాదగ్గరలేదు.
హనుమత్ రక్షాయాగం మొదటి ఆవృత్తి పూర్తయ్యాక పూర్ణాహుతిలో పాల్గొన్న ఓ పెద్ద అధికారిగారికి ఉద్యోగోన్నతి లభిమ్చి దేశరాజధానికి వెళుతూ ఇచ్చిన మాటప్రకారం ఆయన సహకారం అడిగాను . దానికి చేద్దాం చేద్దామంటూ కాలంగడిచిపోతున్నది. వారికేమి ఇబ్బందులున్నయో తెలియదు గాని వారినుంచి స్పందన కరువైంది. ఇక పాఠశాలకూడా ఆపి ఉన్నాము కనుక డబ్బుకు ఇబ్బందే . కానీ మండపం అవసరం మాత్రం ఉంది.
ఇక నావల్ల కాదు అనుకున్న సమయంలో కష్టాల్లో కూరుకున్న ఓ అధికారి ఇక్కడ అమ్మవారి పూజకోసం రావటం ఆయమ్మ అనుగ్రహం వలన ఆయన సమస్యలనుండి బయటపడటం తో ఓరోజు నేను ఊహించనివిధంగా ఆయన నుండి ఓసమాచారం వచ్చింది . తనతరపున ఓ యాభైవేలరూపాయలు పంపుతున్నానని అవి అక్కడ నిర్మాణాలకుపయోగించమని కోరాడాయన. ఇంతలో మరొకరు పాతికవేలరూపాయలిచ్చారు. ఉంది డెబ్బై ఐదు .కావలసినది మూడున్నర లక్షలకుపైగా . మరెలా? మాతమ్ముళ్ళు ముందు మొదలుపెడదాం తరువాత అమ్మే చూసుకుంటుంది అని ఉత్సాహంతో ఉన్నారు. వద్దు ఇప్పుడు మనం స్వంతంగా చేయగలిగే పరిస్థితిలేదు,అని నేను వారిస్తున్నా వినలేదు . ఈలోపల మాతమ్ముడి మితృడొకరు వందబస్తాల సిమెంట్ ఇస్తానని మాట ఇచ్చాడు. అవును మనం చేయగలం అనే మాట మనసులో మెదిలింది . అంతే ,ఏమిచేయగలవో చూపించమని పరీక్ష పెట్టిందమ్మ.
పిల్లర్స్ వేసి పౌండేషన్ కే డబ్బు చాల్లేదు . తాపీమేస్త్రీకి ఎనభైవేలు కట్టుబడి కూలీ మూడువిడతలుగా ఇవ్వాలి. మొదటి విదతకే డబ్బులేదు ఎలా ? ఎలా ? అనుకుంటున్నప్పుడు మనసు ప్రశ్నించింది నేను చేయగలననుకుంటివికదా ఇప్పుడు ఆలోచిస్తావేమిటీ ? అని . పొరపాటైంది . మేముచేయగలం అనుకోవటం ఎంతపొరపాటో అర్ధమైంది . చేపించేది అమ్మే అన్న గమనిక ఏక్షణం లో మరవకూడదు. కానీ సాధారణమానవునకుండే సహజమైన చాంచల్యం తో మరుపుకు వస్తుంది.
ఇలా మనసులో చింతనచేయగనే హైదరాబద్ లో వ్యాపారంచేస్తున్న పిచ్చిరెడ్డి అనే వ్యక్తిమావూరి తిరుణాళ్లకొచ్చి నేనడకుండానే నాతరపున ఏమిచేయమంటారని అడిగి మరీ ఇరవైవేలు పంపగా మేస్త్రీకి సర్దాము.
ఇక స్లాబు వేయాలంటే మల్లీ వెతుకులాట. స్లాబుకోసం ఇనుము కొనటానికి పైసాపైసా చూసుకోవాలి . ఓరోజు అనుకోకుండా చాట్ లో కలిసిన జనార్ధన శర్మగారు నేనేమైనా సహాయం చేయగలనా అని అడిగారు . వారి తరపున ఇన్ముకొనటానికి ఓ ఇరవైవేలు పంపారు. ముక్కెళ్లపాడులో ఓ యువవ్యాపారి సుందరరావు స్లాబ్ చెక్క కు ఆయ్యే అద్దెను నేను భరిస్తాను అని ముందుకొచ్చారు. స్లాబుకు ఏర్పాట్లు చేసుకునేసమయానికి సిమెంట్ ఇస్తానన్న వ్యక్తి ఇవ్వలేకపోయాడు . ఇక మళ్ళీపరీక్ష . ఈసారి మాత్రం రెండో మా లేదు. అన్యధా శరణం నాస్తి .....అని శరనాగతులమయ్యాం . సమయానికి సిమెంట్ తెప్పించగలిగాం . ఇక నిన్న స్లాబ్ వేస్తుండగా మధ్యలో మిల్లర్ మొరాయించింది. నివువినా దిక్కెవరు అంటూ విష్ణునామస్మరణ చేయగనే మిల్లర్ నిరాటంకంగా పనిచేసి పనిగట్టెంకించింది.
అలా నేను అనుకున్నప్పుడు కొండలా సమస్య ఎదురవుతూ , అమ్మనుతలచుకున్నప్పుడల్లా మంచుపొరలా కరుగుతూ ఇదొక ఆట అమ్మకు అనిపిస్తూ జరుగుతున్న అమ్మలీలావినోదం.............
0 వ్యాఖ్యలు:
Post a Comment