శ్రీకృష్ణానందలహరి
>> Monday, March 21, 2011
కృష్ణానందలహరి
శంకర భగవత్పాదుల సౌందర్యలహరి గురించి తెలియనివారుండరు. అయితే శంభోర్మూర్తియైన శంకరులు జగత్తుకు అనుగ్రహించిన దివ్య కవితాధార 'ప్రబోధ సుధాకరమ్'. శ్రీకృష్ణానందలహరిగా భక్తులను రంజింపజేస్తుంది ప్రబోధసుధాకరమ్. పరమాత్మ తానొక్కడుగా, తనను అనేక రకాల జీవాత్మలుగా పరిచ్ఛిన్నం చేసుకుని, జీవుడుగా అనేక సాధనా మార్గాలను ఆశ్రయించి, చివరకు సర్వమూ తానేనన్న భావనలో అందంగా ఒదిగించే, పూర్ణద్వైత బోధ, ఈ ప్రబోధ సుధాకరం.
సౌందర్యలహరితో పాటు శివానందలహరి, ఆనందలహరి ప్రపంచానికి పరిచయమే. కృష్ణాత్మకమైన ఈ దివ్య ప్రబోధం శంకర హృదయగీతిక. ఆహ్లాద పరిమళం. 257 శ్లోకాలలో 18 సోపానాలుగా సాగే ఈ ఆధ్యాత్మిక భావగీతం, మధురం, మోహనం, మనోజ్ఞం, మనోహరం. పరమాత్మ ఒక్కడే నాయకుడు. జీవులన్నీ నాయికలే. జీవాత్మ, పరమాత్మల సంగమానందలీలను, శంకరులు సభగయ్యతో, కుశల శైలితో, సమృద్ధ భాషా వైదుష్యంతో, సమర్థంగా ఆత్మానుసంధాన విధానంగా సాగిస్తారు.
ఆనంద మార్గాలు
భక్తి, జ్ఞానాలు రెండూ బ్రహ్మానందం అందుకోవడానికి దివ్యమార్గాలు. నిజానికి అవి రెండుగా కనిపిస్తున్నా, స్థూలంగా ఒకటే. మనసు-హృదయాల స్థితుల వలె! తల్లీబిడ్డల వలె! సూర్యుడు, సూర్యకిరణాల వలె! చంద్రుడూ, చంద్ర కిరణాల వలె! శరీరం - దాని పరిమితి, ఇంద్రియాలు - వాటి చర్యలు, మనసు - దాని స్థితి, ఇంద్రియనిగ్రహం - మనో నియంత్రణం, నిర్మోహత్వం, ఆత్మ - దాని ఉనికి, మాయ - దాని అస్తిత్వం, సూక్ష్మకారణ శరీరాల నిర్వచనం, అద్వైతం - దాని నిరూపణ, కర్తృత్వం - దాని అనుభవం, ఆత్మ - దాని స్వయంప్రకాశ స్థితి, ధ్యాన - ధారణలలో సూక్ష్మ మనసు, మనస్సును మలగించడం, ఆత్మజ్ఞాన ప్రకాశం, భక్తి భావం, ధ్యానరీతి, ఏకత్వం, దివ్యానుగ్రహం... ఇవన్నీ సాధనాసోపానాలు. ఇవన్నీ ఆధునిక మానవుడికి అక్కరకొచ్చే విషయాలు.
ఏదీ కోరని స్థితి!
రోగాలు పోగొట్టుకోవడానికి, ప్రాపంచిక సుఖాలు జారిపోకుండా నిలబెట్టుకోవడానికి పడేయాతన, తాపత్రయం, వ్యామోహం కారణంగా అధ్యాత్మను ఆశ్రయించరాదు. అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. అదొక జీవనవిధానం. పూర్ణకుంభమది. మనిషి, తాను ఈ భూమిపై సంచరించినంత కాలం ఆనందంగా జీవించగలగాలి. ఆ ఆనందం ఆత్మవిద్యలో నుంచి మాత్రమే సాధించుకోవాలి. ప్రేమను పొందాలి, ప్రేమను పంచాలి. అమలిన ప్రేమ ఆనందరసానికి ఒక అభివ్యక్తి.
ఒక అభిజ్ఞ అంటే గురు. ప్రేమ, ఆనందం కలిస్తేనే భక్తి. భక్తి అంటే దేనినీ కోరని సమర్పణ. కోరికలు తీర్చుకోవడం కోసం ఎవరినో ఆశ్రయించడం భక్తి కాదు. భక్తి పారవశ్యమూ కాదు. పరాత్పరుడికి, అంటే ఆత్మకు వశం కావడమే భక్తి. భక్తి, వివేకాన్ని, విచక్షణను కలిగించాలి. అవి కలిగితే ఆ స్థితి పేరు జ్ఞానం! తెలియవలసిన దాన్ని తెలుసుకునే ప్రయత్నమంతా విజ్ఞానమే. విచారణ, విశ్లేషణ, ఆచరణ, సంచారణ ఇవన్నీ సాధనాస్థితులే! జ్ఞానమంటే ఏమీ అక్కరలేని స్థితి! భక్తి అంటే ఏదీ అక్కరలేదని చెప్పే స్థితి!
ఈ రెండు స్థితులను మానవుడికి అధ్యాత్మ ప్రబోధం చేస్తున్నారు శంకరులు. శ్రీకృష్ణపరంగా శంకరులు ప్రసాదించిన ఈ దివ్యబోధ, ఒక అనాహతనాదం, సానంద, సుమధుర, సాదర, సుందర గీతం. జ్ఞానామృత జలధిలో, శ్రీకృష్ణానందలహరిపై ప్రయాణం, మహానందయానం! ఆత్మానుభవం కోసం మనమూ ప్రారంభించాలి.
ం వి.ఎస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
0 వ్యాఖ్యలు:
Post a Comment