శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మరణమంటే భయమా?

>> Saturday, March 5, 2011


- చిమ్మపూడి శ్రీరామమూర్తి
మానవజీవితంలో జనన మరణాలు అత్యంత సహజమైనవి. జననం కోరుకున్నా వచ్చేది కాదు. మరణం కోరుకోకున్నా వచ్చేది. జననం ప్రారంభం కాదు. మరణం అంతమూ కాదు. సృష్టిలోని ఒక అధ్యాయానికి జననం మొదటి వాక్యం, మరణం చివరి వాక్యం- అంటాడో ఆంగ్ల రచయిత. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం- అన్ని దశల్లోనూ సుఖాలను వెతుక్కుంటూ, అనుభూతులు పొందుతాం. మరణం కచ్చితమని తెలిసినా, దాని గురించే భయపడతాం. గీతాకారుడే చెప్పాడు- పుట్టిన ప్రతిప్రాణీ గిట్టక మానదు. గిట్టిన ప్రాణి పుట్టకామానదు. ఇటువంటి అనివార్య ఘటన గురించి శోకించతగదు-' అని. మృత్యువుకంతా సమానులే. బతికున్నంత కాలమే తేడాలు, జగడాలు. ప్రపంచంలో అత్యంతాశ్చర్యకరమైనది ఏమిటని ధర్మరాజును యక్షుడు ప్రశ్నిస్తే- తోటివారు మరణించటం చూస్తూ కూడా మానవుడు తాను శాశ్వతుడనుకోవడమని చెబుతాడు ధర్మజుడు. మన భౌతిక శరీరంలో ఎక్కడో ఓ మూల ప్రాణం ఉంటుంది. ఆత్మశరీరానికీ, ప్రాణశరీరానికీ మధ్య అతి సున్నితమైన దారమే ఆధారం. అది తెగిపోతే ఆత్మ ప్రాణాన్ని విడిచి వెళ్లిపోతుంది. మనమెంత భయపడినా బాధపడినా మృత్యువు నుంచి తప్పించుకోలేం కదా? అది తెలిసీ, దాన్ని గురించి మధనపడుతూ అమూల్య సమయాన్ని వ్యర్థం చేసుకోవడం అవివేకం. విజ్ఞులు, ముముక్షువులు ఈ చింతను దైవచింతనగా మార్చుకుంటారు. ఈ బాధను జిజ్ఞాసగా మార్చుకుని సత్యాన్వేషణ సాగిస్తారు. మన పూర్వులెంతో దూరదర్శిత్వం కలవారు. చనిపోయినవారి శరీరాలను కాల్చి వారి పాపాలూ ఆ అగ్నిలో దగ్ధమైనట్టు భావించేవారు. ఇంకా ఏమయినా పాపం మిగిలి వుందేమోనని, వారి అస్థికల్ని పవిత్రమైన నదుల్లో కలిపి మృతులకు పుణ్యగతులు సంప్రాప్తం కావాలని కోరుకునేవారు. వారు మృతులకోసం విలపించేవారు కాదు. వారికోసం ఆత్మహత్యలు చేసుకునేవారు కాదు. రెండు కన్నీటిబొట్లు విడిచి మృతుని సంబంధీకుల్ని ఓదార్చేవారు. కాలమే విస్మృతి కలిగిస్తుంది. ఇది సృష్టి రహస్యం. అయితే కోరి మృత్యువును ఆహ్వానించడం పిరికితనమే కాదు, దైవద్రోహంకూడా. ఈ జన్మ మనకు దైవమిచ్చిన వరం. దీనికి విఘాతం కలిగించే హక్కు మనకు లేదు. అందుకే 'ఆత్మహత్య మహా పాపం' అన్నారు. 'జీవితం' చాలా పెద్దది, దాన్ని మనలో ఇముడ్చుకోవాలన్న మహాకవి ఇంకో మాటా అన్నాడు- జీవితం చాలా చిన్నది, అందులో మనం ఇమిడిపోవాలని. ఇందులోని అక్షర సత్యాన్ని గ్రహిస్తే మనం మరణం గురించి విచారించం సమయ సంపదను సద్వినియోగం చేసేవాడు సదా సత్కార్యాలే చేస్తాడు. రేపటికని వాయిదా వేయడు.

సచ్ఛీలురైన ఇద్దరన్నదమ్ములు కాశీకి వెళ్లారు. అక్కడో పేద బ్రాహ్మణుడింట్లో బస చేశారు. ఆ రాత్రి బ్రాహ్మణుడి హీనస్థితిని గమనించి తమ్ముడు తనవద్ద గల తినుబండారాలిచ్చి బ్రాహ్మణ దంపతుల ఆకలిని పోగొట్టాడు. అన్న తన వద్ద గల ధనాన్ని మరుసటి రోజున వారికిచ్చి సాయపడవచ్చుననుకున్నాడు. ఇద్దరూ నిద్రించారు. అకస్మాత్తుగా నిద్రలోనే కన్నుమూశారు. వారికి స్వర్గ ప్రవేశార్హత లభించింది. అన్నకన్నా కొన్ని క్షణాలు ముందుగానే తమ్ముడికి స్వర్గంలో ప్రవేశం లభించింది. కారణం అడిగాడు అన్న అక్కడి దేవదూతల్ని. 'నీ తమ్ముడు తాను చేయదలచుకున్న మంచిపనిని వెంటనే చేసి తోటివాణ్ని ఆదుకున్నాడు. నీవు మరునాటికి వాయిదా వేశావు' అని చెప్పారు దేవదూతలు. అందుకే చేయదలచిన సత్కార్యాన్ని వాయిదా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. నిత్య శంకితుడు ఎల్లప్పుడూ మరణిస్తూనే ఉంటాడు. ఇతరులకు ఉపయోగపడనివాడు జీవన్మృతుడు. మానవ సేవలో మాధవుణ్ని చూడలేనివాడు జీవచ్ఛవం. దైవస్మృతి లేనివాడు మృతుడితో సమానుడు. సుఖాలకు దూరమవుతున్నానన్న పిరికివాడే మరణానికి భయపడతాడు. పరచింతన కలవాడికి ఆచింతే ఉండదు. నచికేతుడు, మార్కండేయుడు లాంటి పరమభక్తులు మృత్యుంజయులని పురాణ కథనం. అంతటి తపస్సు చేయలేకపోయినా జీవించినంతకాలం దైవచింతన, పరోపకార పారాయణ చేయగలిగితే మానవుడు మరణించినా మృత్యుంజయుడే. మృత్యుంజయుడైన పరమశివుని ఉపాసించినవాడూ మృత్యుంజయుడే. కైవల్యసిద్ధికి భగవంతుడిచ్చిన వరం ఈ శరీరం, ఈ ప్రాణం.

మరణానికి భయపడనివాడు అమృతుడు. జితేంద్రియుడు. ధన్యజీవి. మరణమెప్పుడో తెలుసుకోలేనివాడే, దాని గురించి ఆలోచన లేనివాడే ధైర్యశాలి. అతడే ఏమైనా సత్కార్యాలు చేయగలడు. మరణభీతి గలవాడికి ఆత్మన్యూనతాభావం విషవృక్షంలా పెరిగి కుంగదీస్తుంది. మరణానికి వెరపు చెందక, భగవన్నిర్దేశిత ధర్మ కార్యాచరణ చేసేవాడే మహాత్ముడు.

1 వ్యాఖ్యలు:

lakshman March 7, 2011 at 7:51 AM  

One more great post from you sir!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP