శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

>> Friday, March 4, 2011

నొప్పించక చేసేదే అసలైన దానం

ప్రజాహితాన్ని, సమాజ శ్రేయాన్ని పట్టించుకోకుండా ఎన్ని సత్కార్యాలు చేసినా, వాటి వల్ల ఆశించిన ఫలితం లభించదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మనసునూ నొప్పించకుండా సమాజ సంక్షేమం కోసం ప్రయత్నించడమే నిజమైన సత్కార్యం, పుణ్యకార్యమూనూ.
ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, మానవుల సాఫల్య వైఫల్యాలు వారి విశ్వాసం, ఆచరణలపై ఆధారపడి ఉంటాయి. సత్కార్యాలు ఆచరిస్తే సత్ఫలితం, దుష్కార్యాలకు పాల్పడితే దుష్ఫలితం. సమాజానికి, ప్రజలకు మేలు చేకూరే ప్రతి పనీ సత్కార్యమే అంటోంది ఇస్లాం. అదేవిధంగా మొహమాటానికి ఇతరులకు సహాయం చేయడం, మనకు పనికిరాని వస్తువుల్ని ఇతరులకు దానం చేసి సత్కార్యాలని ఫీలవ్వడం సరికాదని హితవు చెబుతోంది. 'మీరు మీ ముఖాలను తూర్పుకో, పడమరకో తిప్పుకోవడం సత్కార్యం కాదు.

దైవాన్ని, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను మనస్ఫూర్తిగా విశ్వసించి, దైవం మీది ప్రేమాభిమానాలతో, మీకు అత్యంత ప్రియమైన ధన సంపదను బంధువుల కోసం, బాటసారుల కోసం, అనాథల కోసం, నిరుపేదల కోసం, సహాయార్థుల కోసం, ఖైదీల(బానిసల) విముక్తి కోసం ఖర్చు చేయాలి. ప్రార్థనా వ్యవస్థ (నమాజు)ను నెలకొల్పాలి. పేదల ఆర్థిక హక్కు అయిన జకాత్ చెల్లించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కష్టకాలంలో సహనం వహించాలి. ఇవీ సత్కార్యాలు, ఇలాంటి సత్కార్యాలు చేసేవారే సన్మార్గగాములు. దేవుని యందు భయభక్తులుకలిగినవారు' (పవిత్ర ఖురాన్ 2-177)

నచ్చినదాన్నే ఇవ్వాలి
సత్కార్యాలు ఆచరించడమంటే దైవారాధన చేయడం ఒక్కటే కాదు. మనకు పనికిరాని చిరిగిన చొక్కాను దానం చేయడం కాదు. మనం తిన్న తరువాత మిగిలింది అన్నార్తికి విదిల్చడం కాదు. మనకు నచ్చింది, మనం మెచ్చిందాన్నే అవసరార్థులకు ఇచ్చి ఆదుకోవడం నిజమైన సత్కార్యం.

అందుకే మీకు అత్యంత ప్రియమైన సంపదను ఫలానా ఫలానా పద్దుల్లో వ్యయపరచండి అని దైవం స్పష్టంగా చెబుతున్నాడు. ఈవిధంగా దైవం కోసం దైవ ప్రసన్నత కోసం కనుక ఖర్చు చేసే వారికి గొప్ప శుభవార్తనిస్తోంది పవిత్ర ఖురాన్. 'దైవ ప్రసన్నత కోసం, దైవ మార్గంలో సంపద ఖర్చుచేసేవారి (ఖర్చు) పోలిక, ఒక విత్తనం నాటగా, అది ఏడు వెన్నులు ఈని, ప్రతి వెన్నులో వందేసి గింజలున్నట్లు ఉంటుంది. ఇదేవిధంగా అల్లాహ్ తాను తలచుకున్నవారి కర్మ ఫలాన్ని అనేక రెట్లు పెంచుతాడు. ఆయన ఎంతో ఉదార స్వభావుడు. సర్వం తెలిసిన వాడు' (2.261).

చులకన తగదు
గ్రహీతల పట్ల చిన్నచూపు, చులకన భావం ఉండకూడదు. దైవమార్గంలో ధనాన్ని ఖర్చు చేయడంతో పాటు, చేసిన మేలు గుర్తుచేసి, దాన గ్రహీతల మనసు నొప్పించని వారికోసం ప్రతిఫలం ప్రభువు వద్ద సిద్ధంగా ఉంది. పరలోకంలో వారికి ఎలాంటి భయం కానీ, దుఃఖం కానీ ఉండదు. దానధర్మాలు చేసి, గ్రహీతల మనసు నొప్పించే కన్నా, మృదువుగా మాట్లాడటం, క్షమాగుణం కలిగివుండటం ఎంతో శ్రేష్ఠమైన పని. అందుకే దైవం ఇలా అంటున్నాడు.. 'విశ్వాసులారా! లోకుల మెప్పు కోసం ప్రదర్శనా బుద్ధితో దాన ధర్మాలు చేసేవారిలా, మీరు మీ దానధర్మాలను ఎత్తిపొడుపుల ద్వారా, గ్రహీత మనసు నొప్పించి వృథా చేసుకోకండి.

వారికి దేవుని మీద, పరలోకం మీద నమ్మకమే ఉండదు. అలాంటివారు చేసే దానధర్మాలు, భారీ వర్షం కురవగానే పైనున్న పల్చటి మట్టి పొర కాస్తా కొట్టుకుపోయి, నున్నగా మిగిలిపోయే రాతి (ప్రదేశం)తో సమానం. అలాంటివారు సత్కార్యాలుచేసి ఎలాంటి పుణ్యఫలం పొందలేరు. దీనికి భిన్నంగా కేవలం దైవ ప్రసన్నత కోసం చిత్తశుద్ధితో తమ సంపదను ఖర్చు చేసేవారు మెరక ప్రాంతంలో ఉండే తోట లాంటివారు. ఆ తోట వర్షాలు బాగా ఉంటే రెండింతలు ఫలసాయాన్నిస్తుంది. అంతగా వర్షాలు లేక సన్నని జల్లులు పడినా అదే దానికి సరిపోతుంది. మీరు చేసే పనులన్నీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు'(2.265).

కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, ఏ పని చేసినా దైవం కోసం, దైవ ప్రసన్నత కోసం చిత్తశుద్ధితో చేయాలి. ప్రజల శ్రేయాన్ని, సమాజ సంక్షేమాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజాహితాన్ని, సమాజ శ్రేయాన్ని పట్టించుకోకుండా ఎన్ని సత్కార్యాలు చేసినా, వాటి వల్ల ఆశించిన ఫలితం లభించదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మనసునూ నొప్పించకుండా సమాజ సంక్షేమం కోసం ప్రయత్నించడమే నిజమైన సత్కార్యం, పుణ్యకార్యమూనూ.

- యం.డి. ఉస్మాన్‌ఖాన్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP