. దుర్గా దేవిచే రాధామంత్రోపదేశం : [రసయోగి _ ౯]
>> Wednesday, August 25, 2010
రసయోగి _ 9
21. దుర్గా దేవిచే రాధామంత్రోపదేశం :
1949 _ 52 సంవత్సరముల సమయంలో వీరభద్రరావు గారు గుంటూరు నగరమందు డి.ఇ.ఓ కు పి.ఏ గా పని చేశారు. ఆ సమయంలో విజయవాడ కనకదుర్గ ఆయనకు స్వప్నములో కన్పడి _ " రాధషడక్షరి" మంత్రాన్ని ఇచ్చెను. ఆ దేవత ఆజ్ఞానుసారం ఆ మంత్ర దీక్ష తీసుకొని ఇంద్రకీలాద్రి పై నలుబది రోజులు తపస్సు చేసి మంత్ర సిద్ధిని పొందుట వారి జీవితంలో ప్రధాన ఘట్టమని చెప్పవచ్చును.
శ్రీ కనక దుర్గా దేవి 8 సం| | ల బాలికగా దర్శనమిచ్చి " రాధాషడాక్షరీ" మహా మంత్రాన్ని అనుగ్రహించి _ " నీవు 40 దినములు నా కొండపైన తదేక దీక్షతో ఈ మహా మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండు. క్రమముగా నీకు ఊర్ధ్వ లోకములను చూడగలుగు శక్తి కలుగుతుంది. అంతేకాదు ఒక చోట నుండి మరొక చోటుకు సూక్ష్మ దేహ ప్రయాణము కూడా నీవు చేయగలవు. ఆ సిద్ధుల వలన అనేక మంది జీవులను ఉద్ధరించ గల శక్తి కలుగుతుంది" అని పల్కెను. ఏనాడో చనిపోయిన తన బంధు జనులను కొందరిని సూక్ష్మ లోకములో చూడగల్గు స్థితి కూడా వారికి కల్గినది. పై లోకములో దిక్కూ మొక్కూ లేకుండా తిరుగుచుండిన కొందరు స్వామీజీలను కూడా వారు చూచిరి. సూక్ష్మ శరీరము దరించిన ఆ జీవులతో మాట్లాడే శక్తి కూడా రాధికా ప్రసాద్ గారికి కలిగెను.
22. సూక్ష్మలోక దర్శనము సంచారము :
శ్రీ దుర్గాదేవి ద్వారా లభించిన మహా మంత్రాన్ని తీవ్రంగా జపించి ఇంకనూ మహాదేవతలను దర్శించుకొనవలెనని తీవ్ర ఆకాంక్ష రాధికా ప్రసాద్ మహారాజ్ గారికి కల్గినది. మహా దుర్గాదేవి దర్శనము తనకు లభించినది, అదేవిధంగానే ఇంకనూ కొంతమంది దేవతల దర్శనము లభించగలదని విశ్వాసముతో తీవ్రముగా ప్రయత్నము చేయనారంభించిరి. వారి మాటలలో చెప్పవలెనన్న _ " నా తపస్సుకు మూడు లక్షణములు. మొదటిది అంతర్ముఖ ధ్యానం, రెండవది నామ రూపాతీతమైన భావ ధ్యానం, మూడవది ప్రాపంచిక సంబంధమైన కామ్యాదులకు వశపడక తీవ్రముగా ఆధ్యాత్మిక ప్రగతినే లక్ష్యమందుంచు కొనుట. కొలది కాలము ఇట్లు చేసిన పిదప నాకు అంతర్ముఖ స్థితిలో ఫాల భాగం వెనుక చంద్రకాంతి వంటి చల్లని తేజో దర్శనము జరిగినది. ఈ విధముగా ధ్యాన రూపమైన తపస్సును పట్టుదలగా కొంతకాలము చేసిన పిదపనేను తీసుకొనిన మంత్ర అధిష్టాన దేవతయగు శ్రీ రాధాదేవికి సంబంధించిన దేవతా దర్శనము ప్రారంభమైనది. నా మనస్సు ఇంకా తీవ్రముగా ఇదే ధ్యాన మార్గాన పోయిన పిదప సూక్ష్మ లోకానికి సంబంధించిన కొన్ని రూపములు దర్శనమైనవి. క్రమక్రమముగా పై ధామమునకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడే శక్తి కూడా నాకు కల్గినది. నా జీవితము ఒక క్రొత్త లోకమునందు ప్రవేశించినది. క్రమక్రమముగా కొంతమంది జీవులయొక్క గ్రహ బాధలు పోగిట్టగలిగితిని. ఆత్మలతో మాట్లాడుతూ, మహాభూతముల హస్తములలో పడి వారు పెట్టుచున్న హింసలకు బాధపడుచుండిన జీవులను అనేకమందిని బాధలనుండి విముక్తుల గావించి, నా మానవతా ధర్మమును నెరవేర్చు భాగ్యము నాకు కల్గినది ".
ఒకసారి గుంటూరు జిల్లాలో, జడ్జిగా పని చేయుచున్న శ్రీ రామానుజులు నాయుడు గారు ఒక ఖూనీ కేసును విచారించుచుండెను. ఖూనీ చేసిన వ్యక్తి సృష్టించిన దొంగ సాక్ష్యాల కారణంగా జడ్జిగారు ఆ ఖూనీ చేసిన వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసిరి. ఆ కేసు విచారణ సమయంలో ఖూనీ కాబడిన ఆ జీవుడు తన సూక్ష్మ దేహముతో ఆతృతతో కోర్టు హాలులో కేసు ఏమి అగునో అని తిరుగుచుండెను. జడ్జి గారు ఇచ్చిన తీర్పును బట్టి ఆ ద్రోహిని విడుదల చేసినప్పుడు వాని స్నేహితులందరూ బాండ్ మేళముతో ద్రోహిని గౌరవించిరి. పూలహారములతో నింపి వేసి కోర్టు హాలు నుండి క్రిందికి ఎంతో గౌరవముతో తీసుకెళ్ళిరి. హత్య చేయబడి ఆ హాలులో సూక్ష్మరూపమున తిరుగాడుచుండిన ఆ జీవుడు ద్రోహికి జరుగుచున్నగౌరవాదులు భరించలేక, ఆ జడ్జి ఇచ్చిన తీర్పు దీనికి కారణమని తలచి ఆ జడ్జి గారి తలపై బలంగా ఒక దెబ్బ కొట్టెను. జడ్జిగారు తన ఛాంబర్ లో విశ్రాంతి తీసుకొను సమయమున ఈ దెబ్బ తగులుట చేత ఆ గదిలోనే మూర్ఛపోయెను. ఒక్కసారి ఛాంబర్ లోని వారందరూ జడ్జి గారిని చుట్టుముట్టిరి. జనరల్ హాస్పటల్ నుండి గొప్ప గొప్ప డాక్టర్లందరూ వచ్చిరి. జడ్జి గారు అలా పడిపోవుటకు కారణం ఎవరికినీ అంతుపట్టలేదు. అట్టి స్థితిలో వీరభద్రరావు గారికి కబురు పెట్టగా ఆయన అవ్హటికెళ్ళి ధ్యాన స్థితిలో చూడగా విషయము అవగతమయెను. అంతట రాధికా ప్రసాద్ గారు తన మంత్ర శక్తితో సూక్ష్మ రూపమున తిరుగాడు జీవును దూరముగా పంపివేసిరి. జడ్జి గారికి తెలివి వచ్చింది.
అ ప్రేమశక్తి, కృష్ణ మ<త్రాధిదేవత రాధారాణి కృపవల్ల ఆయన గొప్ప సిద్ధ సాధకుడయ్యెను. స్పర్శ మాత్రమునే వ్యాధులను, వ్యధలను పోగొట్టు గొప్ప శక్తి వారికి లభించింది. ఈ విషయాన్ని ఉత్తర భారతదేశంలోని గోరక్ పూర్ వారి సుప్రసిద్ధ హిందీ "కళ్యాణ పత్రిక " 1968 ఆగస్టు సంచిక గొప్పగా ప్రచారము చేసింది. దానిలో "ప్రాణ చికిత్స" అనే వ్యాసం వ్రాస్తూ జి.యస్.రావ్ తాను ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచున్న కర్ణశూల వ్యాధి వీరభద్రరావు గారు ఒక్కసారి నిమిషము సేపు తన చేతిని చెవి దగ్గర ఉంచగానే తగ్గిపోయిందని వారి యోగశక్తిని, మహిమను కొనియాడారు. ఇది వారి శక్తికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
23. ప్రముఖ రాధా ఉపాసకురాలు శ్రీ రాధామహాలక్ష్మి గారి సాన్నిధ్యంలో :
ఇదే సమయమున వీరభద్రరావు గారికి గుంటూరు వాస్తవ్యులు రాధా మహాలక్ష్మిగా లోకము నందు పేరొందిన కృష్ణ భక్తురాలు శ్రీమతి చయనం హనుమాయమ్మ గారితో పరిచయం ఏర్పడింది. ఆవిడకు కూడా ఇంద్రకీలాద్రి పై వేంచేసిన కనకదుర్గ తొమ్మిది సంవత్సరముల బాలిక రూపంలో కన్పించి "రాధాషడక్షరీ" మహామంత్రోపదేశం చేసింది. ఆ విధంగా రాధా దేవి యొక్క దివ్య కారుణ్య లహరీ విలాసములకు పాత్రులై వారిద్దరూ మరింత దివ్య శక్తి సంపన్నులై మానవసేవా పరాయణులైరి. వారిరువురి పరిచయంకూడా ఒక దైవ ఘటనయే అని చెప్పవచ్చును. రాధా మహాలక్ష్మి గారు నిరంతర కృష్ణుని దివ్య మంగళ రూపాన్ని ధ్యానిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఆ దివ్యానుభవపారవశ్యంలో ఉండాలనే కాంక్ష తీవ్రముగా ఉండటంవల్ల ప్రాపంచిక విషయాలమీద దృష్టి ప్రసరించక పోవటం అటుంచి ఆ ఆవేదనలో, దు:ఖములో పరమేశ్వరానుభూతి కోసం పరితపిస్తూ మురళీధరుని కోసం ఆక్రందిస్తూ, మూర్ఛిల్లుతూ ఉండేవారు. తరచూ ఈ మూర్ఛలు రావటం వల్ల, ఆహార నిద్రలు సరిగా లేకపోవటం వల్ల శరీరం బాగా బలహీనమైనది. చుట్టూ ఉన్నవాళ్ళు ఇది "హిస్టీరియా" ఏమోయని భయపడి డాక్టర్లకు చూపించటం మొదలు పెట్టారు. గుంటూరు సుప్రసిద్ధులైన ఒక డాక్టర్ చేత ఆవిడ భర్త పరీక్ష చేయించగా _ " హిస్టీరియా సంబంధమైన మూర్ఛలు చాలా ఎక్కువగా వస్తుండటం వల్ల గుండె చాలా బలహీనమై పోయిందని ఎక్కువ కాలం బ్రతకదని" నిర్ధారించారు. దానితో అందరికీ గాభరా పుట్టింది. అందరూ దు:ఖ సాగరంలో మునిగియున్నారు. ఆ సమయంలో ఎవరో చెప్పారు బ్రాడీ పేటలో ఉన్న ప్రభుత్వోద్యోగి రాళ్ళబండి వీరభద్రరావు గారని ఒక గొప్ప వ్యక్తి ఎందరిరోగాలనో మంత్ర తీర్ధం వల్ల బాగు చేస్తున్నారని. వారిని అందరూ ఆ రోజుల్లో "తీర్ధాలస్వామి వారు " అని కూడా పిలిచేవారు. వాళ్ళు రాధామహాలక్ష్మి గారిని వీరభద్రరావు గారికి తీసుకువచ్చారు. వీరభద్రరావు గారు వ్యాధి దూరం చేయుదునని వారికి అభయమిచ్చిరి. చెఫ్ఫినట్లు మూడు నాలుగు రోజులలోనే మూర్చలు తగ్గి అందరూ భయపడుతున్న ప్రాణ భయం పోయింది. ఆమె ఆరోగ్యవంతురాలై మళ్ళీ మామూలు మనిషిగా అయినందుకు అందరూ సంతోషించారు. వ్యాధి అనే నిమిత్తం వల్ల వీరభద్రరావు గారితో ఆమెకు, ఆమె భర్తకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ( రాధామహాలక్ష్మీ గారు, వీరభద్రరావు గారు) సాధకులు, తపస్వులూ. ఒకే దివ్య శక్తి ప్రేరణ వల్లనే తాము జీవితాలు గడుపుతున్నట్లు, ఆ శక్తియే తమ ఇద్దరినీ సన్నిహితులను చేయటానికి యీ వ్యాధి అనే నెపాన్ని కల్పించినట్లు వాళ్ళకు విశదమైంది. వారిరువురికీ పురాణ ప్రసిద్ధురాలైన జగజ్జననిగా, ప్రేమదేవతగా, కృష్ణప్రియగా, ఆశ్రిత కల్పవల్లిగా బ్రహ్మాదుల చేత స్తుతించబడిన గోలోక నాయకి శ్రీ రాధాదేవి ఆరాధ్య దైవమైంది. రాధామహాలక్ష్మీ గారు, వీరభద్ర రావు గారిని కుమారునిగా భావించేది. ఆవిడ ఒక రోజు వీరభద్రరావు గారితో _" నాయనా! రాధారాణి కృపా కటాక్షం వల్ల నీవు నాకు లభించావు. నీవు నాకు ఆ గోలోక నాయిక "రాధ" ఇచ్చిన ప్రసాదానివి. కనుక ఈ రోజు నుండి నీవు "రాధికాప్రసాద్" గా పిలువబడుతూ విఖ్యాతినొందుతావు" అని దీవించింది. ఇద్దరూ ఒకే మార్గంలో ప్రయాణించడానికి దేవతా నిర్దేశం కలగటం వల్ల, కలసి ఆధ్యాత్మిక సాధనా మార్గం పయనిస్తూ, బాధాతప్త హృదయములను కాపాడుతూ, వారి వారి వ్యాధులను నివారిస్తూ రాధాకృష్ణ తత్వాన్ని వాడ వాడలా ప్రచారం చేయటం వారి జీవన స్రవంతిలో ఒక భాగమైనది.
రాధికాప్రసాద్ గారి జాతకరీత్యా 1953 సంవత్సరము ఆయనకు గడ్డుకాలము. నాడీ జాతకంలో కూడా ఆయనకు 53 సం లో మృత్యుగండం ఉందని వ్రాయబడి ఉంది. ఈ సమయంలో రాధికాప్రసాద్ గారు బందరులో ఉద్యోగము చేయుచుండిరి. ఆయనకు అనంతపురం బదిలీ అయింది. అప్పటికే వారికి రాధామహాలక్ష్మీ గారితో పరిచయం ఏర్పడింది. వారు ఉద్యోగ నిర్వహణ చేస్తూ తరచుగా గుంటూరు వస్తూ వెళ్తూ ఉండేవారు. సరిగ్గా సమయం ఆగష్టు 21, 1954 సం| | ము రాధికాప్రసాద్ గారికి యాబది మూడో సంవత్సరం నడుస్తున్నది. ఆ సమయంలో వారు బందరు నుండి అనంతపురం బదిలీ అయి రైలులో బందరు నుంచి అనంతపురం బయలుదేరారు. రైలు బండి గుంటూరు స్టేషన్ లో ఆగింది. రైలు గుంటూరు మీదుగా పోతుందని తెలసి వారిని చూచుటకు అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు. భక్తులు రైలు స్టేషన్ కు చేరిరి. రాధామహాలక్ష్మీ గారు కూడా రైల్వే స్టేషన్ కు వచ్చిరి. " బండి ఇక రెండు నిమిషములలో బయలుదేరునని ప్రకటన కూడా చేశారు. రాధామహాలక్ష్మీ గారు ఎందుకనో బిగ్గరగా ఏడ్వసాగెను. అది చూచిన రాధికాప్రసాద్ గారు ఏమమ్మా! నేను త్వరలో వచ్చెదను. బాధపడవలదు" అని పల్కెను. కాని ఆమె ప్రత్యుత్తరమియ్యక ఏడ్చుచునే యుండెను. ఏదో అదృశ్యదేవత ప్రేరణచే ఆమె ముఖత: పల్కెను _ " నీ ప్రయాణం ఆపుకొని ఇక్కడ దిగిపో" దానికి రాధికాప్రసాద్ గారు _ " లేదమ్మా ! వెళ్ళాలి. ఉద్యోగరిత్యా కొన్ని చిక్కులు ఉన్నాయి. వెళ్ళక తప్పదు" అని పల్కెను. దానికి _ " ఆవిడ వీల్లేదు నాయనా ! నీవు ఇప్పుడే రైలు దిగి నాతో మందిరానికి రావాలి. నీకు ఎన్ని పనులున్నా ఇప్పుడు మటుకు నీవు నాతో రావలసిందే" అని బలవంతంగా రాధికాప్రసాద్ గారిని క్రిందికి దింపి వేసెను. రాధికాప్రసాద్ గారు రాధామహాలక్ష్మీ గారితో కలసి మందిరానికి చేరిరి. సాయం సమయం రాధికాప్రసాద్ గారు అక్కడికి విచ్చేసిన భక్తబృందంతో ముచ్చటిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఎడమవైపు తీవ్రముగా "శిరోవేదన" కల్గెను. క్రమముగా శిరోవేదన తీవ్రమయ్యెను. సుమారు 11 గంటలకు జ్వరము కూడా వచ్చెను. 12 గంటలకు జ్వరము తీవ్రమయెను. రాధా మహాలక్ష్మీ గారు కూడా చాలా ఆందోళన చెందుచుండిరి. ఇంతలో ఎవరో ఒక దేవత దివ్య ప్రేరణచే రాధామహాలక్ష్మీ గారి యందు ఆవహించి _ " ఇది సాధారణ శరీర రుగ్మత కాదు, వైద్యుల చేత ఎట్టి చికిత్స చేయించకూడదు.వారి ఆయువు ఇంకా మూడు , నాలుగు గంటలు మాత్రమే ఉన్నది. అందువల్లనే దేవతలు వానిని బలవంతముగా గుంటూరులో ఇక్కడ నిలిపి వేసిరి" అని పల్కెను. జ్వరము ఇంకా తీవ్రమయ్యింది. భక్తజనం అంతా గిమిగూడారు. బంధువులు, స్నేహితులు అందరూ అక్కడకు వచ్చారు. వారిలో కొందరు కోపంగా _ " నాన్నగారు ఇంత అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళకుండా అలా కూర్చున్నారేమిటి? ఇదంతా ఇలా చూస్తూ ఏమీ చేతకానట్లు కూర్చోలేం. నాన్నగారు మీ ఒక్కరి సొత్తేమి కాదు. మా సొత్తు కూడా" యని పల్కిరి. అంతట రాధామహాలక్ష్మీ గారి భర్త శ్రీహరికోటినారాయణ గారు _ " తప్పు నాయనా ! దేవతలు శాసించిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రమాదం" అని పల్కిరి. ఇంతలో మరల రాధామహాలక్ష్మీ గారిని దేవత ఆవహించి _ " మీరు నిజంగా ఇతనిని (రాధికాప్రసాద్ గారిని) బ్రతికించుకోగోరిన మీలో యెవరైనా మన:స్పూర్తిగా మీ ఆయువును ఆయనకు సమర్పించిన ఆయన దీర్ఘకాలము జీవింతురు. అట్టివారు ముందుకు వచ్చిన నేను వారి ఆయువును రాధికాప్రసాద్ గారి ఆయువుతో ముడివేతును" అని పల్కెను. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడిరి. కొందరు అక్కడి నుండి జారుకొనిరి. కానీ రాధామహాలక్ష్మీ గారికి కోటినారాయణ గారికి రాధికాప్రసాద్ గారి పట్ల పుత్ర వాత్సల్యం ఉండేది. వారు మన:స్పూర్తిగా దేవతను _ " తల్లీ ! యుగానికొక్కడు మహాత్ముడు జన్మిస్తాడంటారు. అది నిజమో కాదో మాకు తెలియదు. కానీ ఈ బిడ్డడు ( రాధికాప్రసాద్) కారణ జన్ముడే. అదృష్టం కొద్దీ మాకు అమృతభాండం వలె లభించాడు. చూస్తూ చూస్తూ దాన్ని పారేసుకోలేము. మా ఆయుష్షు తీసుకొని ఇతనికి దీర్ఘాయువునివ్వు" యని ప్రార్ధించిరి. మరి ఆ పల్కులు దేవత విన్నదో లేదో తెలియదు కానీ తెల్లవారు జామున మూడు గంటలకు రాధికా ప్రసాద్ గారికి స్వస్థత చేకూరింది. జ్వరం, శిరోభారం తొలగింది. అందరికీ ఎంతో ఆనందం వేసింది. స్వస్థతతో , పరిపూర్ణ ఆరోగ్యంతో అందరినీ మాట్లాడిస్తున్న రాధికాప్రసాద్ గారిని చూచిన రాధామహాలక్ష్మీ, కోటినారాయణల ఆనందానికి అవధుల్లేవు. ఈ విధంగా రాధికాప్రసాద్ గారు తల్లి రాధామహాలక్ష్మీ కృపవల్ల మృత్యుగండం నుండి బయటపడ్డారు. మరునాడు తిరిగి అనంతపూర్ కి బయలుదేరి వెళ్ళారు. అటు తర్వాత కొంతకాలానికి పదవీవిరమణ చేసి గుంటూరులోనే రాధామహాలక్ష్మీతో కలసి రాధామాధవ సేవలో భాగస్వాములైనారు.
రాధామహాలక్ష్మి గారి సాంగత్యం ఏర్పడిన తర్వాత రాధికాప్రసాద్ గారిలో రోజు రోజుకీ భావోద్రేకం అధికమవ్వసాగెను. ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు వారు " రాధారాణి" చింతనలో ధ్యానమగ్నులై ఉండి పోయేవారు. పోనూ పోనూ వారి ధ్యానానికి ఉద్యోగం ఒక ఆటంకం గా అన్పించింది. పెద్ద ఉద్యోగం, దాని వల్ల కోరికున్నంత ధనం సంపాదించవచ్చు, దాని వల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టలు . అయినా రాధికాప్రసాద్ గారు చలించలేదు. భోగభాగ్యాలను, కీర్తికాంక్షలను ఆయన ఏనాడు ఆశించలేదు. చేస్తున్న ఉద్యోగానిక్ తిలోదకాలుసమర్పించి నిరంతర రాధారాణి చింతనలో మునిగిపోతలచెను వారిరువురి దారి ఒకటే. గమ్యం ఒకటే. వారి దృష్టి బృందావనేశ్వరి మీద ఉంది. హ్లాదినీశక్తి రాధారాణి నివాస ధామం బృందావనం. ఆ క్షేత్రంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకుంటూ కాలం గడుపుదామని వారి సంకల్పం. సుప్రఖ్యాతులైన ప్రభుదత్త బ్రహ్మచారి తన ఆశ్రమానికి చేరువలో వారికొక స్థలం చూసిపెట్టారు. అది కొని అక్కడ ఒక రాధాకృష్ణ మందిరం నిర్మించి అక్కడ నివాసం ఏర్పరుచుకోవాలని సంకల్పించారు. కానీ ఆ రాత్రి రాసేశ్వరి రాధారాణి వారికి దర్శనమిచ్చి "ఇక్కడ మందిర నిర్మాణానికి ఇంకా సమయం ఉందని, ఆ సమయం తానే సూచిస్తానని, అంత వరకు ప్రస్తుత నివాస స్థానం ( గుంటూరు )లోనే ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడే సేవ చేసుకుంటూ ఉండమనీ ఆజ్ఞాపించింది.
1 వ్యాఖ్యలు:
బాగుంది గురువు గారూ...
Post a Comment