శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రసయోగి జీవిత గమనంలో మార్పు : [రసయోగి _ 10 ]

>> Saturday, August 28, 2010

24. రసయోగి జీవిత గమనంలో మార్పు : [రసయోగి _ 10 ]

రాధికాప్రసాద్ మహారాజ్ గారు శ్రీకాకుళంలో పనిచేస్తూ, ఆ సమయంలో తీవ్రమైన భక్తి శ్రద్ధలతో రాధాకృష్ణుల ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆ ధ్యాన సమయంలో అనేక అనుభూతులకు లోనయ్యేవారు. వారి జీవితమంతటినీ తారుమారు చేసిన ఒక దివ్య అనుభూతి.

ఒక రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అనేక అలంకారములతో కూడుకొని మేలి ముసుగు దరించిన 7 , 8 సంవత్సరముల వయస్సు గల ఒక దివ్యబాలిక వారి వద్దకు వచ్చెను. ఆ దేవత యొక్క దివ్య శరీర కాంతి వల్ల ఆయనకు మెలుకువ వచ్చెను. ఆ బాలికను చూచి శ్రీ రాధికాప్రసాద్ గారు _ " ఎవరు తల్లీ నీవు ? " అని ప్రశ్నించిరి. ఆమె గంభీర వాక్కులతో ఇట్లు పల్కెను _ " ఈ ఉద్యోగము ఎంత కాలము చేస్తావు ? నా వద్దకు ఎప్పుడు వస్తావు ? అని ప్రశ్నించి అంతర్ధానమయ్యెను. ఆ దివ్య దర్శనము తర్వాత వారి హృదయము వారి వశము తప్పిపోయినట్లునిపించెను. అప్పుడు వారు _ " ఏనాడో నేను విడిచి పెట్టిన ఎవరో ఒక ఇష్టదేవత నన్ను మేలుకొల్పింది. ఇప్పుడునేను ధన్యుడనైనాను. ఆమెను విడిచి నేను ఒక ఉద్యోగము చేయజాలను" అని తలంచెను.అప్పుడు బ్యాంకులో వారికి డబ్బు లేదు. పైగా ఏడు, ఎనిమిదిమంది అతిథులు వారిపై ఆధారపడి ఉన్నారు. అప్పటికి వారు రెండు మాసములు ఇంటి అద్దె కూడా బాకీ ఉన్నారు. ఇల్లు, ఉద్యోగం, ధన, ధాన్యాదులు అన్నీ విడిచి పెట్టి పరమేశ్వరి సేవను ఈ జగత్తు నందు ప్రారంభించే సమయం వచ్చిందని గ్రహించారు. ఉద్యోగము, ధన సంపాదనల యందు పూర్ణ విరక్తి కల్గినది. " అమ్మయే నాకు దారి చూపిస్తుంది. అమ్మయే నాకు జీవయాత్ర నిర్ణయం చేస్తుంది." అని భావించి సపరివారంగా బయటకు వచ్చిరి. ఎక్కడకు పోవలయునో, వారికి తెలియదు. ఆ స్థితిలో వారు 8 ,9 మైళ్ళ దూరంలో ఉన్న "ఆముదాలవలస " అను రైల్వేస్టేషన్ చేరారు. ఒక వైపు విశాఖపట్టణం, మరొకవైపు "బరంపురం" వీటిలో ఏ దిక్కుకు పోవలయునో నిర్ణయించుకోలేని స్థితి. ఏదో దైవశక్తి తనను నడుపుచున్నట్లు భావించిరి. ఏ బండి ముందు వస్తే అటు వెళ్ళమనే హృదయ ప్రేరణ కల్గెను. "బరంపురం" బండి ముందుగా వచ్చెను. ఆ బండి ఎక్కి "బరంపురం" స్టేషన్ లో తన పరివారంతో దిగిరి. అక్కడ వారికి తెలిసిన వారు ఎవరూ లేరు. ఏమి చేయాలో, ఎవరింటికి వెళ్ళవలెనో తెలియని స్థితి. ఆ స్థితిలోనే గుర్రపుబండిలో కూర్చుండెను. అంత బండి వారు _" స్వామీ ! ఎక్కడికి వెళ్ళాలి" అని ప్రశ్నించగా మనసు ప్రేరణ వల్ల " ఈ పురము నందు రాధాకృష్ణ మందిరము ఎక్కడ్ ఉన్నదో అక్కడికి పోనిమ్మని బండివానిని ఆదేశించెను. బండి వాడు కూడా కొత్తవాడు కావటంవల్ల వాడికి రాధాకృష్ణ మందిరము ఎక్కడ ఉన్నదో తెలియదు. ఎన్ని వీధులు తిరిగిననూ, ఎచటకు పోయిననూ రాధాకృష్ణ మందిరము ఎక్కడ ఉన్నదని ఎవరూ వారికి చెప్పలేదు. ఊరు అవతలకు పోయినప్పుదు ఒక బాటసారి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారిని చూచి _ " అదిగో ఆ వీధిలో రాధాకృష్ణ మందిరము నిర్మించుటకై ఒక షావుకారు పని చేయుచున్నారు. అని దారి చూపించెను. అక్కడికి వెళ్ళి చూడగా _ ఆ ఇంటిలో ఒకే గది, ఒకే వరండా తయారైనవి. గర్భాలయము తయారగుచున్నది. గర్భాలయము ప్రక్కన రెండో అంతస్థుకు దారి చూపు కొన్ని మెట్లున్నవి. అదే సమయంలో ఒక షావుకారు మా వద్దకు వచ్చి _ "అయ్యా ! మీరు మహిమాన్వితులని, దీర్ఘరోగములను హస్తస్పర్శ మాత్రముననే పోగొట్టుదురని విన్నాము. నా భార్య కొన్ని సంవత్సరముల నుండి మూర్ఛ రోగముతో బాధపడుచున్నది. నాకు ఏ దిక్కు తోచలేదు. అన్ని వైద్య సహాయములనూ నిష్పలమయ్యెను. దయ ఉంచి నా భార్యను కాపాడుము" అని ప్రార్హించెను. ఆ క్రొత్త ప్రదేశంలో అప్పుడే ఆ ఇంటిలో ప్రవేశించినాము. అప్పుడే మేము వైద్యము చేయగలమను విషయము ఎవరు8 బయటపెట్టినారో శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారికి అర్థం కాలేదు. ఏదో విచిత్రమైన దేవతామాయ అని భావించిరి. షావుకారు తన భార్యను బండి నుండి క్రిందకు దింపెను. ఏమి చేయవలెనో దిక్కు తోచని స్థితి. క్రొత్త ప్రదేశం, క్రొత్త వ్యక్తులతో సంబంధము, రోగిని తీసుకువచ్చి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి ఎదుట కూర్చుండబెట్టిరి. అంత:ప్రేరణవలన శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు " ఆ రోగిని రెండవ అంతస్థుకొరకై వేయబడిన మెట్లను ఎక్కమని" పల్కిరి. తీవ్రమైన నరముల దుర్బల స్థితిలో వున్న ఆమె, ఒకటి ఒకటిగా మెట్లన్నియూ ఎక్కినది. ఎవరి సహాయము లేకుండా మెట్లెక్కుట ఆమె భర్త చూచునాడు. మితిమీరిన ఆశ్చర్యముతో రాధికా ప్రసాద్ మహారాజ్ గారి పాదములపై బడి _ " నాయనా ! నీవు తప్ప నా భార్యకు స్వస్థత చేకూర్చు వారు మరెవరునూ లేరని నేను తెలుసుకున్నాను. మిమ్ములను గూర్చి నేను విన్న మాట సత్యము" అని పలికి నమస్కరించెను. ఇది జరిగిన గంటలో ఒక గుర్రపు బండి నిండా భోజన పదార్థములు వచ్చాయి. వాటిని చూపుతూ ఆ షావుకారు _ " స్వామీ ! ఇందులో మీకు కావలసిన వస్తువులన్నియు ఉన్నవి. పాపం మీరు ఎప్పుడు భోజనం చేశారో , వెంటనే కాఫీ, ఫలహారములు చేయించుకొని తినుడని" చెప్పినాడు. చేతిలో చిల్లిగవ్వ లేకున్ననూ మహాదేవి అన్నియూ సమకూర్చుచున్నది. ఈ ఇంద్రజాలమునకు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆశ్చర్యపడిరి. మరునాడు ఒక వ్యక్తి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ కడకు వచ్చి _ " స్వామీ ! మా అన్నగారు డిప్యూటీ కలెక్టరుగా ఉండి బదిలీ అయిపోయినారు. ఆయన కాపురం ఉన్న మేడ ఖాళీగా మా ఆధీనములోనే ఉన్నది. మీరు అక్కడకు వచ్చినచో ఊరంతటికి మంచి కేంద్రముగా ఉంటుంది" అని పల్కి సామానులన్నింటిని ఆ మేడ పైకి చేర్పించెను. రాధికాప్రసాద్ మహారాజ్ గారు అక్కడ ఒక మాసం పైగా ఉన్నారు. వందలాది ప్రజలు వారిని చుట్టుముట్టిరి. ఒక ప్రక్క భగవన్నామము, ఒక వైపు అన్నదానము లో వీటితో అంతా కోలాహలమే. అక్కడ నుండి కటక్ పురమునకు వెళ్ళుటకు ఏర్పాటు పూర్తి అయినది. ఊరిలోని పెద్ద పెద్ద కుటుంబములకు చెందిన మహిళలందరూ, శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారితాఓ, శ్రీ రాధామహాలక్ష్మమ్మ గారితో కలిసి ఒక ఫోటో కూడా తీయించుకొనిరి. ఆ ఫొటో ఈనాటికీ గుంటూరులోని రాధాకృష్ణ మందిరమందున పదిలపర్చబడి ఉన్నది.

( 25. గుంటూరులో రాధాకృష్ణమందిర ఆవిర్భావం 1957 ) :

రాసేశ్వరి రాధారాణి ఆదేశం మేరకు వారిరువురూ గుంటూరులో " రాధాకృష్ణ మందిర" నిర్మించాలని తలపెట్టారు. కాని దానికి కావలసిన ధనం లేదు. విగ్రహములు ఏ జైపూర్ నుండో తెప్పించాలి. కొన్ని వేల రూపాయలు ఖర్చు. అయినా సర్వేశ్వరుని అనుగ్రహం వల్ల అవన్నీ సమకూరినవి. దైవీ ప్రేరణచే ఒక మంత్రివర్యుడు విగ్రహములకయ్యే ఖర్చు తానే భరిస్తానని ముందుకు వచ్చి కొన్ని వేల రూపాయలు భక్తితో సమర్పించారు. దాని ఫలితముగా అందమైన పాలరాతివిగ్రహములు ఉత్తర హిందూ స్థానము జైపూర్ నుండి గర్తపుర వీధులకు దిగి వచ్చినవి. ఈ విధముగా వారి దివ్య సంకల్ప బలం వల్ల గుంటూరులో అరండల్ పేట ఐదవలైనులో "రాధాకృష్ణమందిర్" ఆవిర్భావం జరిగింది. ఆ సమయంలోనే వీరు ( రాధికాప్రసాద్, రాధామహాలక్ష్మీ ) " వేణుగానం" అనే పత్రికా నిర్వహణ కూడా చేశారు. ఆ వేణుగానమనే పేరుటో చాలా సంవత్సరములు మనోహరమైన ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రచురించిజ్ జిజ్ఞాసువుల హృదయాలలో దివ్యభక్తి చంద్రికలను వెదజల్లి సాంస్కృతిక స్పురణ ఎంతగానో కలిగించారు. శ్రీ రాధికాప్రసాద్ గారి నేతృత్వంలో ఈ పత్రిక లండన్, దక్షిణ ఆఫ్రికా, బర్మా మొదలగు విదేశాలకు కూడా వెళ్ళి అక్కడి భక్తులను ఆనందపరుస్తూ ఉండేది. యేర్పేడులోని మళయాలస్వామి, హృషీకేశ్ లోని శ్రీ శివానంద సరస్వతీ మహారాజ్ మొదలైన మహాపురుషులెందరో ఈ పత్రికను పోషించి అభిమానించారు. ఇందులో వెలువడిన అమూల్య రచనలు సాధకులకు, భక్తులకు ఎంతగానో ఉపకరించినవి.

మానవసేవ చేస్తే మాధవుడు సంతోషిస్తాడని ఆర్యోక్తి. అందులకే ఆర్తులను, అనాధులను ఆదరించే మందిరముగా రాధాకృష్ణమందిరం ఖ్యాతిని గడించింది. పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారు,రాధామహాలక్ష్మీ గారు ఇరువురూ, వ్యాధిగ్రస్తులై అలమటించు వారిని, దుష్టగ్రహ పీడచే సతమతమగువారిని చేరదీసి వారికి స్వస్థత కూర్చేవారు. అలా వారి నుండి మేలు పొందిన వారు, వారి దివ్య ప్రేమ జీవన స్రవంతిలో మజ్జనమాడినవారు ఆసేతు శీతాచలంలో వేలకు వేలున్నారంటే అది అతిశయోక్తి కాదు. అందులో కొన్ని సంఘటనలను మటుకు ఇక్కడ పేర్కొనటం సందర్భోచితంగా ఉంటుందని భావిస్తున్నాను.

బందరులో ఆంధ్ర బ్యాంకులో మొండ్రేటి వెంకటేశ్వరరావు అనే ఉద్యోగి ఉండేవారు. అతనికి తీవ్రతరమైన ఉన్మాదం కలిగింది. అతని వల్ల కలిగే న్యూసెన్సు భరించలేక ఇరుగు పొరుగు వారు పోలీసు రిపోర్టు ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇండ్ల మధ్య ఇంత గోల ఉండరాదని ఎక్కడికైనా వెళ్ళమని ఆజ్ఞాపించారు. బ్యాంకు అధికారులు ఉద్యోగం తొలగిస్తామని నోటీసులు పంపించారు. ఆ స్థితిలో కాళ్ళు చేతులు గొలుసులతో కట్టి రాధికాప్రసాద్ గారి వద్దకు తెచ్చారు. తల్లిదండ్రులకు అతను ఒక్కడే కొడుకు. ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన వర్ణనాతీతం ఆ ఉన్మత్తుణ్ణి బాగు చేయటానికి రాధికాప్రసాద్ గారు నిశ్చయించుకొని ఒక తేదీ సూచించి ఆ తేదీ కల్లా అతనికి ఆరోగ్యం కలుగుతుందని, ఉద్యోగ విషయంలో భయపడవలసిన పని లేదనిహామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ఇచ్చిన తేదీఇ శ్రీ వెంకటేశ్వరరావు స్వస్థుడైనాడు. అతను ఇప్పుడు ఉన్నత ఉద్యోగంలో కులాసాగా ఉన్నారు.

నెల్లూరు జిల్లా కావలి వద్ద సిద్ధన గొండూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వర్ధనేని రంగప్పనాయుడు సుసంపన్న గృహస్థు. అతని భార్య మస్తానమ్మ అతి తీవ్రమైన ఉదరశూలతో బాధపడుతూ ఉండేది. మద్రాస్ లోని సుప్రసిద్ధ సర్జన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ ఆమెకు ఆపరేషన్ చేసి, ఇంక మళ్ళీ బాధ వస్తే చేయగలిగిందేమీ లేదని చెప్పి పంపారు. స్వగ్రామానికి వచ్చిన కొద్ది మాసాలకే నొప్పి తిరగబెట్టింది. తుది ప్రయత్నంగా మళ్ళీ మద్రాస్ బయలుదేరారు. కావలి స్టేషన్ లో వీరి బంధువొకడు మద్రాసుకు బయలుదేరుతున్న వీరిని చూచాడు. అతడికి రాధికా ప్రసాద్ గారి గురించి తెలుసు. ఆ సమయంలో రాధికా ప్రసాద్ గారు కావలిలో ప్రసిద్ధుడు శ్రీ శేషాచలంసెట్టి యొక్క బృందావమనే పేరు గల ఆరామ భవనంలో విడిది చేసి యుండి తీర్థ ప్రసాదములతో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. వారిని ఆశ్రయిస్తే ఆమె బ్రతుకుతుందని ఆ బంధువు వాళ్ళను ప్రోద్భలపరిచి ఆ రాత్రి 9 గంటలకు బృందావనం దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ వ్యాధి మూలాన్ని దివ్య దృష్టివల్ల తెలుసుకొని కుదురుస్తానని వాగ్దానం చేశారు వారు. మర్నాటి కల్లా శూల బాధ తగ్గింది. కొద్ది రోజుల్లో వ్యాధి మొత్తం సమూలంగా తొలగిపోయింది. శ్రీ రంగప్పనాయుడు వారిని తన గ్రామం సగౌరవంగా తీసుకెళ్ళి పెద్ద ఉత్సవాలు చేశాడు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఇంటింటా వారి ఫొటోలు పూజా స్థానంలో చూడవచ్చు.

రాధికా ప్రసాద్ గారు, రాధామహాలక్ష్మీ గారు ఇరువురూ మూగజీవులపట్ల ఎంతో ప్రేమ కల్గి యుండేవారు. ఆశ్రమంలోని ఆ మూగజీవాలకు కూడా వాళ్ళంటే ఎంతో ప్రేమ.

ఈ విధంగా ఇటు మానవసేవ _ మాధవసేవ చేస్తూ తమ జీవితాలని చరితార్ధం చేసుకుంటున్న తరుణంలో రాధామహాలక్ష్మి గారికి "గర్భకోశ వ్యాధి" వచ్చెను. అది పెరిగి రాయవెల్లూరు తీసుకెళ్ళినా ప్రయోజనం లేని స్థితికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు పదహారు సంవత్సరాల క్రిందట వచ్చిన అనుభూతి మళ్ళి మరింత తీవ్రతరంగా రావటం మొదలుపెట్టింది. తన నిజ ధామం ఏ దేవతాభూములలోనో ఉన్నట్లు, అనారోగ్య పీడితమైన యీ దేహం వదలి త్వరలోనే తన స్వస్వరూపాన్ని పొందే సమయం సమీపించినట్లు తోచటంప్రారంభమైనది. తన లౌకిక బాధ్యతలన్నీ శ్రీ రాధికా ప్రసాద్ గారికి అప్పగించి చేయవలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఆవిడను ఇంకా సమర్ధులైన డాక్టర్లకు చూపించాలని చుట్టూ ఉన్న జనం తాపత్రయపడుతూనే ఉన్నారు. 19_4_1973 వ తేదీన రాధామహాలక్ష్మి గారిని తీసుకొని వెళ్ళి హైదరాబాద్ లోని నర్సింగ్ హోమ్ లో చేర్చారు. డాక్టర్లు వచ్చి పరీక్ష చేయడం ప్రారంభించారు. మొదలుపెట్టిన కొద్ది క్షణాల్లోనే రాధామహాలక్ష్మి గారి ప్రాణాలు అనంతాకాశంలోకి వెళ్ళి పోయినవి. ఆవిడ తను చేరుకోవలసిన రసధామాన్ని చేరుకొంది.

రాధామహాలక్ష్మి గారు ఆశ్రమంలోని మూగజీవాలకు స్వయంగా మేత వేసేది. లాలించేది. ఆశ్రమంలో ఒక ఆవు ఉండేది. రాధామహాలక్ష్మి గారు ఆవుకు తనపేరే పెట్టారు. ఆవిడకు ఆ ఆవు అంటే ప్రాణం. ఆ ఆవు కూడా ప్రతిరోజు రాధామహాలక్ష్మి రాకకై ఎదురుచూస్తూ ఉండేది. దానికి ఒక దూడ. రాధామహాలక్ష్మి దానికి మాధవుడు అని పేరు పెట్టారు. రాధికాప్రసాద్ గారు కూడా ఈ ఆవును యెంతో ప్రేమతో చూసేవారు. రాధామహాలక్ష్మి గారు నిత్యలీలలో ప్రవేశించిన తర్వాత ఈ ఆవు ఎందుకనో తెలియదు కాని మూడు రోజుల పాటు గడ్డి కాని, నీరు కాని, ముట్టనైనా ముట్టలేదు. బహుశా దానికి తెలిసి ఉంటుంది,ఇన్నాళ్ళు తనను ఆదరంతో సాకిన కరుణామయి రాధామహాలక్ష్మి నిత్యకుంజలో ప్రవేశించిందని. "మూగజీవానికి సైతం హృదయం ఇచ్చిన భగవంతుడు ఎంత కరుణామయుడో కదా !" ఆవు దాణా వేసినా ముట్టడం లేదు. నీరు సైతం త్రాగటం లేదు" అని ఎవరో చెప్పగా రాధికాప్రసాద్ గారు ఆ గోమాత వద్దకు చేరి, తన చేతుల్తో దానిని నిమిరి ఆహారం తినిపించి " అమ్మా ! రేపు వస్తానమ్మా !" యని పల్కెను. ఆవు ఏదో అర్ధమైనట్లు తల ఊపెను. కాని మరునాడు పనుల ఒత్తిడి వల్ల రాధికాప్రసాద్ గారు దాని వద్దకు వెళ్ళుటకు కుదరలేదు. అది ఆ రోజున రాధికాప్రసాద్ గారి దర్శనము కొరకు ఎంతగానో నిరీక్షించింది. మధ్యాహ్నం 12 గంటలకు విషయం గుర్తుకు వచ్చిన రాధికాప్రసాద్ గారు హుటాహుటిన ఆవు దగ్గరకు చేరారు. అది రాధికాప్రసాద్ గారిని అలాగే చూస్తూ కన్ను మూసింది. పూజ్యులు రాధికాప్రసాద్ గారు దానిని మాత రాధామహాలక్ష్మిని పూడ్చిన స్థలముననే పూడ్చిరి. మరుసటి రోజు స్వప్నంలో ఆ ఆవు ఒక సుందర బాలిక రూపం ధరించి రాధికాప్రసాద్ గారితో " ఇన్నాఅళ్ళూ మీ వద్దనే యుండి, మీ సాంగత్యంవల్ల, ప్రేమ వల్ల నాకు సద్గతి ప్రాప్తించింది" అని పలికి అదృశ్యమయ్యెను.

26. శ్రీ రాధామహాలక్ష్మి గారి సందేశాలు :

శ్రీ రాధామహాలక్ష్మి గారు శరీరాన్ని వదలిన తర్వాత కూడా రసయోగి ఆహ్వానంపై అప్పుడప్పుడూ తపోభూముకల నుండి క్రిందకి దిగి వచ్చి తన అమృతమయ సందేశాన్ని అందిస్తూ ఉండేవారు. ఆమెను రసయోగి అంజనీమాత యందు ఆవాహన చేయించేవారు ఆవిడ ఊర్ధ్వలోకములనుండి క్రిందికి దిగి వచ్చి అంజనీమాత రూపమున తన సందేశమును ఇచ్చి తిరిగి వెళ్ళి పోయేది. ఆమె అలా రెండు సార్లు తపోభూమికలనుండి దిగివచ్చి తన సందేశములను ఇవ్వడం యువకుడు చూసెను. ఒక సందేశమును తనే స్వయంగా లిపిబద్ధముకావించెను. ఆ రెండు సందేశములను ఇక్కడ ప్రచురించుచున్నవారము.

శ్రీ రాధామహాలక్ష్మి అమ్మగారి అనుగ్రహ భాషణ

( తేదీ 15_1_1999 రాత్రి గం. 11 లకు )

గుంటూరు

నాజీవితమును ధామమునకు చెందిన వాడు కొన్ని కారణములచేత ఆ ఈ ధామములోకి ప్రవేశించటానికి అవకాశము కలిగినది. ఈ ధామము యొక్క బహుశక్తివంతమైన రసతత్వాన్ని ప్రచారము చేయుటకు కొందరి జీవులయొక్క కర్మశేషాలను నివారించటానికి, ఆ నివారణ వల్ల తానీ పుణ్యము కూర్చి ఇతరులకు శాంతిని చేకూర్చటానికి.....ఈ జీవంతులకు సహజములైన జీవులకుండు ఏ కర్మయు లేదు. వీరిని ఆశ్రయించిన జీవులయొక్క కర్మఫలములనే తాను పొంది అనుభవించుచూ, తన నిజస్వరూపమగు సఖిగా రాధారాణి పరివారములో చేరి, నిత్య నికుంజ సేవకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నారు. ఇహలోక సంబంధమైన వ్యవహార విషయంలో గాని ఏ సంబంధము లేదు. రసతత్వమే తన ఉపాసన. ఆ రసము యొక్క ఉపాసనయే సఖీ భావము. అనగా తానే సుఖమునూ అనుభవించక అమ్మ సుఖములకై తాను నిరంతరమును అహర్నిశలు పాటుపడుచున్నారు. ఇంకా కొంతకాలమే ఈ ధరణి పై ఉండి ఆ రాధారాణి యొక్క సఖీ పరివారములో సఖీగణములో చేరి ఆ అమ్మ నిత్య సేవలో నిత్య నికుంజ సేవానుభూతిని పొందే అవకాశమున్నది. ఆ సమయంలో గల ఈ జీవుల యొక్క కర్మవాసనలను తాను తెలుసుకొని అనుభవిస్తారు. ప్రారబ్దము తనది కాదు. జీవుల యొక్కది. నిత్యం జరిగే లీల అమ్మ యొక్క లీల. అమ్మ లీలలో తాను సఖియై నిత్య నికుంజములో గంధనానులేపనాల సేవ చేయుచూ అచటి అమ్మ యొక్క సేవామృతం పొందుట కొద్దికాలములో జరుగుచున్నది. ఇది గొప్ప కేంద్రము. కేవలం ఇచట విశ్రాంతి తీసుకొని, నిద్రించిన చాలు, కొన్ని వాసనలు తొలగిపోవును. అసలు ధామము బృందావన ధామము. ఇతని యొక్క ధ్యేయం నిరంతరం తన మనసు బృందావనము.....బృందావన రాధాకృష్ణ రసమే ఈయన జీవితము. రసమే ఈయన జీవితము. నిత్య నికుంజసేవలో కొంతకాలం.......ఈ జీవితం అమ్మ సేవా సుఖమే ఈయన జీవిత లక్ష్యం. జీవుని నిరంతర స్మృతియే ఈ ధామానికి సరియగు సోపానం. అదియే ధ్యేయం..........

నాన్నగారు : బిగ్గరగా చెప్పమ్మా

అమ్మ : పని పూర్తి యైనది. చెప్పలేను. ఈ శరీరం తట్టుకోలేదు. ఇక వెళ్ళొస్తాను

నాన్నగారు : బిగ్గరగా చెప్పమ్మా

అమ్మ : నేను ఇక విశ్రాంతి తీసుకుంటాను

శ్రీ రాధామహాలక్ష్మి అమ్మగారి అనుగ్రహ భాషణ

( తేదీ 14_1_1998 రాత్రి గం. 11 లు)

గుంటూరు

పవిత్రధామం ఈ ధామము. బృదావన ఆధ్యాత్మిక సంపద ఇక్కడ ఉన్నది. అద్భుత ఆధ్యాత్మిక చైతన్యం ఇక్కడ కదలాడుతున్నది. రాధికాప్రసాద్ మహారాజ్ రాధారాణి సఖీగణములో ఒకరు. మన పుణ్యము కొద్ది ఈ శరీరాన్ని దరించి ఆ సఖి వచ్చింది. ఎవరునూ వారిని విడువవద్దు. ఆయనను అంటి పెట్టుకొని ఉండటము వలన రాధారాణీని చేరు మార్గము సులభము అవుతుంది. ఈ ధామము మంచి ఆధ్యాత్మిక చింతన కలిగిన ధామంగా మరింత ప్రసిద్ధి గాంచనున్నది. రాధారాణి సఖీగణము పిలుపు మేరకు నేను ఆధామమునకు త్వరలో చేరనున్నాను.

శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ ఈ విధంగా అన్నారు :

అమ్మత్వరలో రాధారాణి సఖీగణములో చేరనున్నది. ఇకపై ఇచ్చటకు వచ్చుట కష్టము కావచ్చును. ఈ ధామమును వదిలి ఆ రాధాధామమునకు వెళ్ళుట కారణముగా ఇక్కడకు వచ్చుటకు రాధారాణి అనుజ్ఞ కావలసివచ్చును. అందువల్ల ఇక పై సంవత్సరము ఇప్పుడంత సులభముగా రాకపోవచ్చును.

పైన శ్రీ రాధామహాలక్ష్మి గారు ఇచ్చిన సందేశానుసారం పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారు శ్రీ రాధాజీ యొక్క ఇష్టసఖియని, జీవులకర్మ వాసనలును తొలగించి వారిని రసోమార్గమున పయనింపచేయుటకు రాధారాణియే స్వయంగా వారిని భూమికి పంపిందని, ఆయన జీవితము రసమయమని వారిని అంటి పెట్టుకొని యుండు సాధకునికి అతని గమ్యమార్గము సుగమము కాగలదని తెలియచున్నది. ఇది మన పూర్వజన్మ సుకృతమే అటు వంటి సిద్ధయోగులు, రసోపాసకులు మన మధ్య మన వానిగా తిరగటం. ఆ మహానీయుని బాటలో నడుద్దాం, ఆ మహానీయునిని కొలుద్దాం. ఇది మన కర్తవ్యం, బాధ్యత.

27. తిరుపతి వెంకన్న సన్నిధిలో రసయోగి

1971 _ 72 నాటి మాట. ఆనాటి కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య గారి భార్య శ్రీమతి లక్ష్మీరెడ్డి గారికి శునకములను పెంచే అలవాటు ఉంది. పాశ్చాత్య దేశముల నుండి కూడా శునకములను తెప్పించేవారు.కానీ ప్రతి వారమూ ఒక కుక్క చొప్పున కారణము లేకుండగనే తలతెగి క్రిందపడి చనిపోఉఎడిది. అప్పుడు డిల్లీలో ఉండే అనేకమంది జంతు వైద్యులును, మంత్రవేత్తలను పిలిపించి చూపించిరి. కానీ వారెవరికి విషయము అంతుబట్టకపోయినది. అప్పుడు దానం వెంకటరెడ్డి గారు తన మేనకోడలు ( క్రొత్తరఘురామయ్య గారి భార్య) తో రసయోగి విషయము తెలియబరిచిరి. అప్పుడు ఆమె గుంటూరు వచ్చి రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారిని కలసి విషయమును తెలియబరచెను. రసయోగి వారిని కొలది కాలము ఆశ్రమంలో ఉండమనెను. ధ్యానంలో వారి పరిస్థితి పూర్వాపరాలను గమనించిరి. ఫలితంగా వారికిఆ ప్రమాదం పూర్తిగా తొలగినది. ఆమె ఆనందంతో రసయోగికి ప్రణమిల్లెను. అటు పై ఆమె ఒకసారి రసయోగిని తన కారులో తిరుపతి తిరుమలకి తీసుకెళ్ళటం జరిగింది. తిరుమలలో మంత్రులు విడిది చేసే ప్రత్యేక మందిర ద్వారము నుండి వారిని స్వామి వారి గర్భాలయమునకు తీసుకొని వెళ్ళిరి. అక్కడ ఆలయ ప్రధాన పూజారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శయ్యాగారము నుండి ఒక ప్రత్యేక తాంబూలమును తీసుకొని వచ్చి రసయోగికి ఇచ్చెను. " ఇది ఒక అపురూప ప్రసాదము. ఎవరికినీ దీనిని ఇవ్వరు. కానీ మీకు ఇవ్వమని స్వామి ఆజ్ఞ" అని ప్రధాన పూజారి పల్కెను. ఆ మహాప్రసాదమును అక్కడే నోటిలో వేసుకొనిన రసయోగి " ఈ అపురూపమైన ప్రసాదమును ప్రధాన పూజారి సామాన్యముగా ఎవరికినీ ఇవ్వడు. అట్టి ప్రసాదమును ప్రధానపూజారి నన్ను ఆహ్వానించి, నాకు నమస్కరించి, ఆ ప్రసాదమును నా చేతిలో పెట్టెను. దీని వెనుక ఏదియో అంతరార్ధముండి ఇండవలెనను " ఆలోచనలో నుండగా ఆయన మనోఫలకమున ఒక భావము ఉదయించెను _ " స్వామి వారి శయ్యాగారములో నాకు ఏదో ఆధ్యాత్మిక సంబంధముండినది. అందువలనే ఆ విషయము గుర్తు చేయుటకై కలియుగ వైకుంఠమగు తిరుమల శ్రీనివాసుని శయ్యాగారములో తాంబూలము నాకు లభించినది. ఇది స్వామి సంకల్పమే. ఈ జన్మకు ఇది చాలు. స్వామి నా హృదయంలోనే ఉన్నాడు. ఇకపై నేను తిరుమలకు రావలసిన పని లేదు. స్వామి దివ్య దర్శనం అయింది " . ఎంతో ఆనందంతో ఆ మధురానుభూతిని హృదయఫలకం పై పదిలపరచుకొని రసయోగి వెను తిరిగెను. మరల మఖ్ఖీ తిరుపతికి వారు వెళ్ళలేదు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP