శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గుద్దులాడేరు

>> Monday, June 28, 2010


కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు కలహింతురు . [లేక గుద్దులాడుకొందురు]
ఇది వీరబ్రహ్మేంద్రుల కాలజ్ఞాన వాక్యం . అంటే దీనర్ధం భూకంపంవల్ల లేదా కట్టడములు కదలటం వల్ల ఆలయం కదలి ఒకద్వారపాలకుడు మరొక ద్వారపాలకుని పై పడతారు అని అర్ధం . కాళహస్తీశ్వరుని కళలు తగ్గేను .... అని తాతగారు హెచ్చరించిన భవిష్య వాక్యం నిజమవుతున్నట్లుంది . పైప్రమాదం జరగనే జరిగింది . వారు చేసిన హెచ్చరికలు ఎన్ని త్వరలో రూపం తిసుకోబోతున్నాయో ......... వాతావరణం చూస్తే దగ్గరలో రాన్నాయనిపిస్తున్నది ,.ఘోరమానవహననానికి కారణాలు. ఒక పక్క తాగుడు ,వ్యభిచారపు సంస్కృతులు ,దైవదూషణ ,ధర్మనాశనం పెరిగి పోతూ శరవేగంగా వినాశనం వైపు మానవజాతి పయనిస్తున్నట్లనిపిస్తోంది ..... వాసుదేవా ...

Read more...

ఏరువాక మరచాడో... రన్నో.... రైతన్నా .....

>> Saturday, June 26, 2010


ఈరోజు ఏరువాక పౌర్ణమి . ఇది రైతుల పండుగ . దురదృష్టమేమిటంటే ఈ పండుగను రైతులే మరచిపోతున్నారు.
నాచిన్నతనం లో ఈ రోజు అరకలనుపూజించుకుని ,ఎద్దులు, దున్నపోతులను అలంకరించుకుని పొలాలకు సాగే వారు . పెద్దలవెంట మేముకూడా ముల్లుగర్రలను పట్టుకుని వెల్ళేవాల్లం . కుడుములు వండి ఆడవాల్లు మూటలు కట్టి ఇచ్చేవారు .ఊరు ఊరంతా ఉత్సాహంగా ముందు వినాయకుని గుడికి వెళ్ళి పూజజరిపి దణ్నం పెట్టుకుని అరకలు ,గుద్దేలు , నాగలి , దంతె ఇలా ఎవరికి నచ్చినవి వాల్లు తీసుకునిపాటలు పాడుతూ పొలం వెల్లేవాల్లు. అక్కడ దేవునికి దణ్నం పెట్తుకుని ఉండ్రాల్లు పొలం లో అన్నివైపులకు విసిరేవారు. ఆతరువాత పొలం పనులు మొదలు పెట్టామన్నందుకు గుర్తుగా కొందరు సాల్లు వేసే వాళ్ళు . మరికొందరు గుద్దేళ్ళతో రేగుమండలు , కంప చెట్లు కొట్టేవాళ్లు .
చిన్నపిల్లలము మాకప్పుడొక గొప్ప సరదా అందులో పాల్గొనటం . ఊరికొక కొత్తకళ. అరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతు తన సన్నద్ధతను చాటే గొప్ప పండుగ . ఈ పండుగ గూర్చే మనకు తెలుగు పాటలలో ప్రసిద్దమైన ఏరువాకా సాగారో ... రన్నో రైతన్నా ..... అనే పాట తెలియనివారు వినని వారుండరనుకుంటాను .
పల్లె కన్నీరు పెడుతుందో ...కనిపించని కుట్రల .....అని మన ప్రజాకవి చెప్పింది అక్షర సత్యం . మారిపోయారు రైతులు ఈ మాయలో పడి . తమ కాధారమైన పశుసంపదను దూరం చేసుకుని యంత్రాలతో వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. వాటికిమల్లే నే యంత్రాలుగా మారి పోతూ ఆత్మీయతల అనుబంధాలతో కూడిన సంస్కృతులను ఈ పండుగలను క్రమేపీ మరచి పోతున్నారు. ఈ రోజు మాఊర్లో ఈ పండుగ ఆనవాల్లే కనిపించలేదు. ముప్పై సంవత్సరాలక్రితం నేను చూసిన పండుగ ఈ రోజు నాపిల్లలు చూసేఅవకాశం లేకుండాపోయింది . మరో ముప్పై సంవత్సరాలతరువాత ఈ తల్లీదండ్రీ బంధాలనన్నా చూస్తామా లేదా ? అనుమానం వేస్తుంది .

Read more...

గో మూత్రంతో కేన్సర్‌కు చెక్!

>> Friday, June 25, 2010

గో మూత్రంతో కేన్సర్‌కు చెక్!

నాగపూర్: గో పంచకం సత్తాను ప్రపంచం మరోసారి గుర్తించింది. ఆవు
మూత్రాన్నిఉపయోగించి తయారుచేసిన ఓ కేన్సర్ మందుకు అమెరికా పేటెంట్
లభించింది.
ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన 'గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం' ఈ మందును అభివృద్ధి
చేసింది. 'కామధేను ఆర్క్' అని పేరు పెట్టిన ఈ మందుకు సంబంధించిన పరిశోధనల్లో
అనుసంధాన కేంద్రంతో పాటు నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రిసెర్చ్
ఇన్‌స్టిట్యూట్ (నీరి) కూడా పాలుపంచుకుంది. నీరి ప్రతినిధులు తపన్
చక్రవర్తి, సునీల్
మణిసింఘ ఈ మందు వివరాలను మీడియాకు వెల్లడించారు.

గో మూత్రంతో తయారుచేసిన తమ మందును యాంటీబయాటిక్స్, కేన్సర్ నివారణ
మందులతోకలిపి వాడితే జీవశక్తి వృద్ధి కారకంగా పనిచేసి మంచి
ఫలితాలిస్తుందని ఇంతకుముందే
తేలిందని చెప్పారు. ఆక్సిజన్ నుంచి శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి
చేసుకునే ప్రక్రియలో మనలో కొన్ని విషతుల్య కారకాలు ఉత్పత్తి అవుతాయి. శరీరంలో
వాటిని అడ్డుకునే సహజ సిద్ధమైన శక్తి తగ్గినప్పుడు అవి డీఎన్ఏకు నష్టం
కలిగిస్తాయి. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన గో మూత్రంతో ఈ ఆక్సీకరణ చర్య ద్వారా
డీఎన్ఏకు జరిగే హానిని నివారించవచ్చని, అప్పటికే దెబ్బతిని ఉంటే బాగు చేయవచ్చని
వారు చెప్పారు.

http://www.andhrajyothy.com/nationalNewsShow.asp?qry=2010/jun/18/nati...

Read more...

నవగ్రహాల అనుగ్రహానికై పారాయణలకు పుణ్యతిథులు

>> Wednesday, June 23, 2010

నవ గ్రహాలను పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసా..? నవగ్రహాల శాంతికి ఆ గ్రహానికి సంబంధిత పారాయణము, పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నవగ్రహాల పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసుకుందాం..!

తొమ్మిది నవగ్రహాల్లో వరుస క్రమంలో సూర్యునికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్యపురాణం
చంద్రునికి శ్రీమద్భాగవతము, భవిష్య కల్కి పురాణము, వాయుపురాణము
కుజునికి- అగ్నిపురాణము, స్కాంధపురాణము, బ్రహ్మవైవర్తన పురాణాల్లో కుమారస్వామి చరిత్ర
బుధునికి- లింగపురాణంలో నరసింహావతారము, విష్ణుపురాణము, నారదపురాణము
గురునికి- బ్రహ్మణపురాణము, వామనపురాణం, లింగపురాణం
శుక్రునికి- బ్రహ్మండపురాణం, భవిష్యపురాణమునందు శ్రీమద్భాగవతంలోని పరశురామావతారం
శనీశ్వరునికి-మార్కండేయపురాణం, కూర్మపురాణం, భవిష్యపురాణం,
రాహువు-దేవీభాగవతం, వరాహపురాణం, గరుడపురాణం,
కేతువుకు- బ్రహ్మవైవర్తన పురాణం, మత్స్యపురాణం వంటివి పఠించాలి.

పుణ్యతిథుల విషయానికొస్తే..?
సూర్యునికి- కార్తిక శుద్ద పూర్ణిమ-కార్తిక మాసంలో రవిజపము ఆరువేల సార్లు చేసి గోధుమలు దానం చేయాలి.
చంద్రునికి- శ్రావణ పూర్ణిమ - శ్రావణ మాసంలో చంద్రజపమును పదివేలసార్లు చేసి తెల్లని వస్తాలతో బియ్యాన్ని దానం చేయాలి.
కుజునికి- చైత్రశుద్ద పూర్ణిమ చైత్రమాసంలో అంగారక జపము ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.
మార్గశిర శుద్ద షష్టి- మార్గశిర మాసంలో అంగారక జపమును ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.
బుధునికి-జ్యేష్ఠ పూర్ణిమ-జ్యేష్ఠ మాసంలో బుధజపాన్ని 17 వేల సార్లు చేసి పెసలు ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి.
గురువు-వైశాఖ తదియ- భాద్రపదమాసంలో బృహస్పతి జపాన్ని 16 వేలసార్లు చేసి శెనగలు దానం చేయాలి.
శుక్రునికి- ఆషాఢశుద్దదశమి- ఆషాఢమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి అలచందలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
ఫాల్గుణ శుద్ద పూర్ణిమ - ఫాల్గుణమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
శని భగవానునికి - శ్రావణ బహుళ అష్టమి- శ్రావణ మాసంలో శనిజపము చేసి నల్లనువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. రాహువుకు - ఆశ్వీజ బహుళ చతుర్దశి - ఆశ్వీజమాసంలో రాహుజపం 18 వేలసార్లు చేసి మినుములు కాఫీపొడి రంగుకు చెందిన వస్త్రాలను దానం చేయాలి. కేతువుకు- ఆశ్వీజశుద్ద పాడ్యమి- ఆశ్వీజమాసంలో కేతుజపాన్ని ఏడువేల సార్లు చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయాలి.
మాఘశుద్ద అష్టమి - మాఘమాసంలో ఏడువేల సార్లు కేతుజపాన్ని చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాల ప్రభావంచే కలిగే అశుభ ఫలితాలు దరిచేరవని పురోహితులు సూచిస్తున్నారు.
[అంతర్జాలం నుండి సేకరణ]

Read more...

మందారపువ్వా.....షుగరే , త...గ్గించ రావా !

>> Monday, June 21, 2010


మన ఇళ్లల్లో మందారాలు మంచిగా దొరుకుతాయి కదా ! మన పూజలో కూడా అగ్రస్తానం లో ఉంటాయి . అయితే ఇప్పుడు ఆరోగ్యపరిరక్షణలోనూ మనకు ఉపయోగపడతాయని తెలుసు ఇపుడింకొన్ని ఔషధీయ లక్షణాలను గూర్చి తెలుసుకుందాం .

మందార పువ్వులు ఆరోగ్యాన్ని కాపాడతాయండి .

ఏంటీ ....? ఇలా చెబితే నచ్చలేదా ? సరే ..మరోరకంగా చెప్పుకుందాం .

ఈ పూలలో ఫ్లేవనాయిడ్శ్ ,ఫాలిఫెనోల్స్ ,యాంతోసియానిన్స్ ఉంటాయి. ఇవన్నీ కాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయని పరిశోధనలలో తేలింది. అంతేకాదు శరీరం లోని చెడు కొలెస్టరాల్ను బయటకు పంపటమ్ లోనూ ముఖ్యపాత్ర వహిస్తాయి. ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగాను ఉంటుమ్ది. మూత్రపిండాలు పాడవుతాయనే భయం ఉండదు. గుండెపోటు రిస్క్ తక్కువ .



ఎలావాడాలి ?
-----------

సింపుల్ . రోజూ మీరు టీ పెట్టుకునేప్పుడు మరిగిన వేడినీటిలో కాసిన్ని మందార పూరెమ్మలను వేయండి చాలు. అలాతయారైన టీని రోజుకు మూడుకప్పులు తాగితే చాలు. బ్లడ్ ప్రెషర్ 7.2 శాతం తగ్గిపోతుంది.
ఆ....చాలా చెబుతారు ఇలాంటివి ! అని తీసిపారేయకండి .
ఇవేం భారతీయ బైరాగులెవరో చెప్పిన చిట్కాకాదు చులకనగా వదిలేయటానికి . .
అమెరికా బోస్టణ్ యూనివర్సిటీ చేసిన , "ది జర్నల్ ఫుడ్ అండ్ కెమికల్ టాక్సాలజీ " అనే అధ్యయనం లో నిరూపించబడింది .

ఇక లేవండి మందారాలు కోద్దాం . టీ కాద్దాం

Read more...

ఎల్ కేజీ నుంచే ఎమ్ సెట్ కోచింగ్ మనం ఎందుకివ్వలేకపోతున్నాము ?

ప్రస్తుతం విద్యారంగం లో చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది . ప్రతివారికీ ఎంతఖర్చు పెట్టైనానాసరే పిల్లలను మంచి చదువులు చదివించాలనే తపన ఎక్కువయింది . రిక్షావాడిదగ్గరనుంచి కోటీశ్వరుని దాకా ఈ మనోస్థితి ఒకేరకంగా ఉంది . ఒకరకంగా ఇది మంచి పరిణామమే . కాకపోతే ఈ తపన పరుగుగామారి , ఈపరుగు పందెం లో వ్యాపారవలయాలలో చిక్కుకుని ఎటు వెళుతున్నామో కూడా ఆలోచించుకోవటం లేదు. ఇది దురదృష్టకరం. పిల్లవాడి విద్యాభ్యసనం లో ఇప్పుడు నెలకొన్న అవాంచిత ధోరణులు ఎటువంటి విపరీతాలకు దారితీస్తాయో విద్యావేత్తలు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా వినేవారు లేరు. ఇంగ్లీషు వాడి పాలనలో వాడి గుమస్తాగిరీ కోసం పోటీ పడి చదివినట్లుగానే ఈ రోజు అమెరికాలో రాత్రింబవళ్ళు గొడ్డుచాకిరీ చేసేందుకు నిద్రాహారాలు ,ఆటపాటలు మరచిపోయి మార్కులయంత్రాలుగా మారి పోతున్నారు . వాటికన్నా విశ్రాంతి ఉందిగాని పిల్లలకు ఆమాత్రం కూడా విశ్రాంతి లేదు .
ఖాళీ లేకుండా చదవాలి .అలాచదివించగలిగి తే చాలు .బట్టీ పట్టించి మార్కులు పిండగలిగితేచాలు ఎంతఫీజైనా కట్టి ఆసంస్థలలో పిల్లలను చేర్చటానికి డబ్బున్నవాల్లు ఎగబడుతున్నారు . ఇది చూసిన మద్యతరగతి, పేదవాల్లుకూడా అటువంటి బిల్డప్ లివ్వగల పాఠశాలలకు తరలిస్తున్నారు . ఆటపాటలకు కూడా పీరీయడ్ ల ను కేటాయించే ప్రభుత్వపాఠశాలలు పనికిమాలినవిగా పరిగణించబడుతున్నాయి . అక్కడున్న వ్యవస్థాపరమైన చిన్నలోపాలు కూడా వీటిని నిరాదరణకు గురిచేస్తున్నాయి . ఇక విద్యారంగం మీద ప్రేమతో విలువలు నమ్మి ఆటుపోట్లు తట్టుకుని నిలబడుతున్న విద్యాసంస్థలు ఈ భీకర తుఫానుకు అల్లలాడిపోతున్నాయి , కూకటివేళ్లతూ సహా పెల్లగించబడుతున్నాయి .
ఇక అర్ధమైనా కాకపోయినా పంజరం లో చిలకల్లా బట్టిపట్టి పలికే ఇంగ్లీషు మీడియంపిల్లలను చూసి జనం పల్లెపట్నం అన్న తేడాలేకుండా అందరూ ఇంగ్లీషుమీడియం మాత్రమే చదివంచాలనే నిర్ణయాలు ఉత్సాహంగా తీసుకుంటున్నారు . ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో పెద్దపట్టణాలకు మాత్రమే ఇప్పటిదాకా పరిమితమైన కార్పోరేట్ విద్యాబేహారులుచిన్న పట్టణాలలో సైతం తమ దుకాణాలు తెరుస్తున్నారు . మాతృభాషలో విద్యాబోధన అంతరానితనమై పోతుంది రానురాను .
ఉదాహరణకు చూడండి . మా మండలం లో మూడు జిల్లాపరిషత్ పాఠశాలలు మరో మూడు ప్రైవేట్ పాఠశాలలు ఉండేవి మొన్నటిదాకా . వాటిలో పోటాపోటీగా చదువులు సాగుతున్నా ఆటపాటలకు కొదవలేదు , మన పాఠశాలకు రెండెకరాలస్థలం ఉన్నందున ,ఆటలు విద్యాభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగమని నమ్మి ఉన్నందున ఆటలకు కొదువలేదు. దరిదాపు ప్రారంభించిన పదహారుసంవత్సరాలలో పదకొడుస్సార్లు రిజల్ట్స్ లో మన పాఠ శాల ప్రథమస్థానంలో నిలచింది .అంతే కాదు వేలరూపాయలు వసూలు చేసే వినుకొండలో పెద్దసంస్థలకు తగ్గకుండా మార్కులసాధించారు మన పిల్లలు .ఈ పోటీలో కొందరు కాపీ సెంటర్లకు పిల్లలను తరలించే అనైతిక మార్గాలు ఎన్నుకున్నారు. ఈపోటిలన్నీ తట్టుకుంటూనే ఉన్నాము సరే నిరుడు కేరళానుంచి కొందరువచ్చి సెయింట్ జూడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రారంభించారు. అదీ ఇరుకు గదులున్న ఒక బిల్డింగ్ తీసుకుని . ఇక చూడండి రెండవతరగతి చదివేపిల్లల కూడా ఇంగ్లీష్ మీడియం కుమార్చి ఎల్ కీజీ లో చేర్చటానికి రైతులు విత్తనాలకెగబడ్డట్టు ఎగబడ్డారు.
మూడువందలమంది [పదవతరగతి తో సహా] విద్యార్థులున్న మన పాఠశాల కు వచ్చిన మొత్తం ఫీజులు దాదాపు నాలుగు నుండి ఐదులక్షలు . ఇక కేవలం ఐదవతరగతి వరకు మాత్రమే క్లాసులు నిర్వహించిన ఈ పాఠశాల వసూలు చేసిన మొత్తం పదహారు లక్షలరూపాయలు . ఇప్పుడు వాళ్ళు స్వంతగా స్థలం కొని దానిలో బిల్డింగులు ఒక చర్చి కూడా నిర్మిస్తూ రెండు వ్యాపారాలకు మార్గం సుగమమం చేసుకున్నారు. ఒకటవతరగతికి మాఫీజు ఎనిమిదివందలు .అదే ఇంగ్లీష్ మీడియం లో మూడువేలు . ఈ సంవత్సరం నారాయణ విద్యసంస్థలు వినుకొండలో బ్రాంచి తెరచాయి . వాళ్ల ఫీజు అదే క్లాసుకు ఆరువేలు పైనే. జనం పోలో మని పరుగెడుతున్నారు . బిల్డింగ్ అద్దెలకు తీసుకున్నారు కనీసం ఆటస్థలం లేదు .ఏదో ఎక్కడో ఉన్నట్లు రికార్డులలో చూపిస్తారు . తల్లిదండ్రులకు ఆవిషయం అక్కరలేదనుకోండి . వచ్చే సంవత్సరం భాష్యం ,శ్రీచైతన్య ఈ టెక్నిక్ స్కూల్స్ మొదలెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అందరూ పల్లెలకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఉన్న పెద్దవిద్యాసంస్థలలో కొత్త ట్రెండ్ మొదలైంది . ఆరవతరగతినుంచే ఐ.ఐటీ ఫొండేషన్ కొరకు శిక్షనట ! ఏమిటీ విపరీతాలు ? మొన్నటిదాకా ఎమ్సెట్ ప్రధానమని ప్రచారం చేశారు . ఇప్పుడిది . పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాక ఏమి చేయాలో ఏమి చదవాలు కూడా వీల్లే నిర్ణయించేస్తున్నారు . తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచనలేకుండా అదొక అదనపు గొప్పతనంగా భావిస్తున్నారు. చిన్నపాఠశాలలు పిల్లలు లేక బోరుమంటూన్నాయి . ఇక ఈ పరుగు పందెంలో విలువలు , నమ్ముకుని మిగిలేదెవ్వరు ? పిల్లల సర్వతోముఖాభివృధ్ధి లాంటి లక్ష్యాలకొరకు కృషిచేసే దెవ్వరు ?
ఈ వ్యాపార ధోరణితో పాఠశాలలను మనం చేయగలమా ? ఎల్ కేజీ నుంచే ఎంసెట్ కోచింగులంటూ విపరీత ప్రచారాలు చేయటం మా లాంటి సంస్థలకు సాధ్యమా ?

Read more...

అమ్మ పరీక్షలు ఒక్కోసారి కఠినంగానే కనిపిస్తాయి కానీ వాటి వెనుక అపార దయ దాగిఉంటుంది .

>> Sunday, June 20, 2010


అమ్మ అనుగ్రహస్వరూపిణి. దయాంబుధి . తన నాశ్రయించిన బిడ్డల యోగక్షేమాలు ఆతల్లికే తెలుసు . కంటికి రెప్పలా బిడ్డలను కాపాడుకోవటం మాతృమూర్తిస్వభావం . బిడ్డ ఎదిగే ప్పుడు చేయి పట్టుకుని నడుపుతూనే ప్రమాదమప్పుడు అమాంతం ఎత్తుకుని గుండెల్లో దాచుకుంటుంది. అలానే ఆ జగన్మాత భక్తుల పాలన కొనసాగిస్తుంది . పిల్లవాడెప్పుడూ ఆటపాటలతో గడపాలని ప్రయత్నిస్తాడు. అమ్మేమో బడి కెళ్ళు నాన్నా ! అని బుజ్జగిస్తుంది . మంచి మిఠాయికూడా పెడుతుంది . వీడు మాత్రం మాటవినడు .అప్పుడు కోపం నటిస్తుంది ,కర్రుచ్చుకుని కొడతానని బెదిరిస్తుంది.

ఇంకా వీడు బొమ్మలతో ఆటలే ఆడతానని మారాం చేస్తే బొమ్మలను దాచి పెడుతుంది ,అవసరమైతే నాలుగు దెబ్బలు వేసి ఈడ్చుకెళ్ళి బల్లో వేసి వస్తుంది. మరి వీడేమో .... అమ్మ కొట్టింది ..మంచిది కాదు ...అమ్మకు నాకు పచ్చీ.. నేనమ్మతో మాట్లాడను ఫో అంటాడు . [అయితే అలా అంటాడేగాని చీకటిపడగానే భయం తో వణికిపోయి అమ్మ ఒళ్ళో బజ్జోవాలని పరిగెడతాడు ] కానీ ఆచర్య వెనుక కారణం అర్ధం చేసుకోలేడు . అర్ధం చేసుకోగల వయస్సుకాదు వీడిది . అందుకే అమ్మ అన్నీ మాటలతో చెప్పదు , కొన్ని లీలలద్వారా చేతలలో చూపిస్తుంది. వీడిలా మాటవినడు అనుకున్నప్పుడు కాస్త కఠినంగానే ఉంటాయి ఆ జగన్మాత లీలలు .

చిన్నతనం లో అమ్మ ఉగ్గు పెడుతుంది . పరమ వెగటు ,కారం గా ఉంటుందది. ఆముదం తో చేస్తారు . పిల్లవాడు నోట్లోపోస్తే మింగడు .అందుకని ముక్కు మూస్తుంది .లేదా తొడగిల్లుతుంది .వాడు ఏడుస్తూ గాలి పీల్చేప్పుడు ఈ ఉగ్గుకూడా మింగుతాడు . గర్భశుద్ధి జరిగి పిల్లవానికి ఆరోగ్యం చేకూరుతుంది . మా అమ్మ గిల్లింది ,ఆముదం తాపింది అనిపిల్లవాడు బాధపడితే ఎలా ? బిడ్డకేది క్షేమమో తల్లికి మాత్రమే తెలుసు . అమ్మలగన్నయమ్మ దుర్గమాయమ్మ ను నమ్ముకుని ,"అమ్మ బిక్ష నా జీవనయానం" అనే పెద్దమాటలు మాట్లాడి ,ఇప్పుడీ పరీక్షలకు తల్లడిల్లితే ఎలా ? ఏ తొడపాశం ఎందుకు పెడుతుదో ,ఆదిగురువైన అమ్మ దయకు చిహ్నమే అని గ్రహించాలికదా ! నేచదివా ... నేచదివా...అని ఎగరటమెందుకూ ? అలాగా ఏదీ ! చదివితే పరీక్షరాయరా ! అని ప్రశ్నాపత్రం ఇస్తే బెంబేలెత్తటం ఎందుకు .. ... ?

శ్రీ మాత్రేన్నమ:

Read more...

నన్నొదలి పోయాయి , నానవ్వుల తోటలో పూబాలలన్నీ ..నన్నిలా నిదురలేని నిశీథిలో గడపమని .... [పాఠశాల మూసివేశాము]

>> Friday, June 18, 2010

నేనవ్విన నవ్వులన్నీ నేనిప్పటదాకా ప్రత్యక్షంగా చూడగలిగాను నిర్మలమైన పసి మోములమీద . నామనసులో సంతోషాన్ని ,ఆనందాన్నీ వందల అద్దాలలో ఒకేసారి చుసుకునే నేను ఇప్పుడీ గాఢాంధకారంలో దిశతెలియక దిక్కుతోచక నిలుచున్నాను . గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న దు:ఖాన్ని పెల్లుబికి బయటపడనీయకుండా ఉండేందుకు మౌనాన్ని ఆశ్రయించి నేనూ నాసహచరి మౌనవ్రతంలో మునిగిపోతున్నాము.. ఎలా తట్టుకోవాలి ? పదహారు సంవత్సరాల నుంచి పిల్లలతో కలసి పిల్లలలోకంలో వాళ్ల నవ్వుల పువ్వుల మధ్యనుండి ఇలా ఒంటరి తనపు ఎడారి లో కొచ్చిపడతామని ఊహించలేదు . ఈ కఠినపరీక్షకు తట్టుకోలేక పోతున్నాము. కన్నీళ్ళు దాచి ఉంచటం మహా కష్టంగా ఉంది.

అప్పుడెప్పుడొ పదహారు సంవత్సరాలక్రితం బ్రతుకు దెరువుకని ఊరికి దూరంగా మా పొలంలో చిన్న పాక నిర్మించి ప్రారంభించిన పాఠశాల ఇంతై అంతై అనుబంధాల సంతై .......అలా పెరిగి పెరిగి బాహ్య ప్రపంచం నుంచి నన్ను నేను దరిదాపుగా దూరం చేసుకుని నాదైన ఈప్రపంచాన్ని ఒక్కరోజు కూడా వదలి ఉండలేని స్థితికి తెచ్చింది. మొదట ఏడవతరగతి వరకు మొదలెట్టి తరువాత పదవతరగతి వరకు క్లాసులను పెంచాము . పగలు పాఠశాల పూర్తయ్యాక ఇళ్ళకు వెళ్ళినా రాత్రికి పెద్దపిల్లలంతా మరలా మాదగ్గరకు చేరుతారు .మాతోపాటు తినటం ... అన్నం తెచ్చుకోని వారికి వాళ్ల టీచర్ ఎలాగూ వండి పెడుతుంది .మాతోపాటు వాళ్ళూ ఆదివారాలుకూడా విడిచి వెళ్లక ఇక్కడె ఉంటారు. వాళ్లతో కలిసి ఆటలు పాటలేకాదు ,పూజలూ యాగాలతో ఇంత కాలం ఎప్పుడు గడచిపోయిందో తెలియనే లేదు. వాళ్లు నవ్వితే మాకు నవ్వు , మాముఖంలో ఏదైనా చిన్న విచారపు ఛాయ కనపడితే అది వాళ్లకో పెద్ద విషాదం. దుర్గాసార్ ,జయప్రదామేడం అంటే వాళ్ళుకు తల్లిదండ్రులతోపాటు ఆత్మీయులక్రిందలెక్క . ఇప్పటికీ పైచదువులకెళ్ళినవాళ్ళు ఇళ్ళకొస్తే ముందు ఇక్కడే దిగుతారు . ఎక్కడున్నా ఫోన్లు చేస్తుంటారు .

అంత పెద్ద ప్రతిష్టాకలాపాన్ని అవలీలగా చేస్తున్న మా పిల్లలను చూసి నెల్లూరు నుంచి వచ్చిన ప్రతిష్టాచార్యులు ముక్కునవేలేసుకున్నారు . వీళ్ళు పిల్లలు కాదు ..... మాస్టారూ పిడుగులు . మే ము ఎన్ని ప్రతిష్టలు చేశామో ! కానీ ఇలాంటి ప్రతిష్ట చూడలేదు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని అపరహనుమంతుల్లా చేసే స్తున్నారు అని ఆశ్చర్య పోయారు.
ఏదైనా క్షేత్రదర్శనానికి వెళ్లి నప్పుడు అక్కడ వీళ్ల ధ్యానం పూజ చూసి అందరూ అడిగేవాళ్లు మీ స్కూల్ ఎక్కడ ? రెసిడెన్షియల్ అవకాశం ఉందా అని. పీఠానికి వచ్చిన వాళ్ళు మాస్టర్ గారూ ! మీకు నిజంగా అమ్మవారిచ్చిన వరమండీ ! ఈ పిల్లలతో సాంగత్యం అని అంటుంటారు .
కొండగురునాథ స్వామి తిరునాళ్లలో మా పిల్లలు బృందావన భజన కళా రూపాన్ని ప్రదర్శిస్తుంటే లక్ష్లరూపాయల తో కట్టిన ప్రభల లను వదలి వేలాదిగా జనం ఇటు చూడటానికి పరుగులెత్తారు . మాకార్యక్రమం ఒంటిగంట దాకా జరిగితే అంతవరకూ ప్రభలమీద కార్యక్రమాలు జనం లేక నిలిపివేశారు . తాచుబాముల్లా కదులుతున్న వారి లయ విన్యాసాలకు మైమరిచిపోయింది జన సందోహం . ఇప్పటికీ పెళ్లయిన ఆడపిల్లలు వాళ్ల భర్తల్తో కలసి వచ్చినప్పుడు టీచర్ గారూ ! మీరు మీ పిల్లలకు చాలా చక్కగా అన్నీ సవరించుకోవటం నేర్పారండి ,అని అంటుంటే మావిడ కళ్లతోనే ప్రశ్నిస్తుంది ఎలావుంది ? నా పెంపకం అని , నన్ను చూస్తూ. టీచర్ గారి చేతిలో పెరిగితే ఆడపిల్లలకు అత్తగారింట్లో ఇబ్బందే లేదు అనే పేరు మా అవిడ కొచ్చిన పెద్దడిగ్రీ . అందరికీ ఒకరిద్దరు పిల్లలైతే మాకు మూడువందలమంది పిల్లలు అని చెప్పుకునేవాల్లం .

ఎక్కడ పూజ జరగాలన్నా సిద్దం .ఏపోటి పరీక్షకలకైనా సిద్ధం .పరీక్షాఫలితాలెప్పుడు వచ్చినా మాపిల్లలకు పండగే . ఆపదలో ఉన్న వారెవరికోసమైనా చాలీసా నో మరో పారాయణమో పమో చేయాలంటే బాలవటువులై కండువాలు కట్టుకుని రెడి అవుతారు. నాకు కాళ్ళూ చేతులూ తామై ఎన్ని యాగాలు, పూజలు, పూజలు జరిపారో ! ఇకనేను ఈ భగవత్ సేవలు చేయగలనా ? కోడిపిల్లల్లా చూట్టూమూగి ఉండే పిల్లలు లేకుండా ఈ ఒంటరితనాన్ని భరించగలమా ?
అయినా కాలం కఠినపరీక్షకు తట్టుకోలేక పాఠశాల మూసివేశాం . అటొచ్చి సార్ ..ఇటొచ్చి మేడం అంటూ తిరిగే పిల్లలు కనపడక పిచ్చెక్కుతోంది . లోయర్ క్లాసులవాళ్లయితే మరీ . మిగతా అందరు టీచర్లున్నావాళ్లదగ్గరకెళ్లరు సార్ >> వాడు గిచ్చాడనో ! టీచార్ ...వీడు చెట్టు విరగ్గొట్టాడు.... మరే ....వాడే... జామకాయ కోశాడు అంటూ బుల్లిబుల్లి అడుగులేస్తూ వచ్చి చెప్పే ఒకటవతరగతి పిల్లలు ఏరీ వీల్లంతా ????? ఈ పిల్లమధ్యలో మా ఇద్దరు పిల్లలెప్పుడు పెరిగి పెద్దయ్యారో గమనించినట్లే లేదు .

చదువును ... అన్నాన్ని అమ్ముకోవటం పాపంగా పరిగణించిన ఈ పుణ్యభూమిలో నేనుకూడా కలి ప్రభావం వలన ఆపాపంలో పాలు పంచుకున్నాను కొద్దో గొప్పో . నాడు బ్రతుకుతెరువుకోసం ప్రారంభించిన పాఠశాలలో స్వల్పఫీజులతోనే నిర్వహణ జరిగింది . పదవతరగతి ప్రారంభించాక స్టాఫ్, నిర్వహణ ఖర్చులు పెరిగి పోయాయి . పట్టణ ప్రాంతాలకంటే చాలా తక్కువగానే ఫీజులు తీసుకున్నాము . ఉద్యోగం వచ్చాక పాఠశాలమీద వచ్చే దానిలో ఎక్కువభాగం గుడి నిర్మాణానికి వసతుల కల్పనకు ఖర్చుచేశాము . ఇవ్వలేనివాల్లుంటే అడిగిందిలేదు. వెనుకబడిన కుటుంబాలలో పిల్లలకు ఎవరూ ఫీజుకట్టగలస్థోమత లేకుంటే [రహస్యంగా ]ఫ్రీగానే చదువుకొమ్మని చెబుతాము. అటు చదువు సాగిస్తూనే ,ఇటు భగవత్ సేవాకార్యక్రమంలో పాల్గొనే మా పిల్లలలో ఎక్కువమంది ఎక్కడకెళ్ళినా పలానా స్కూల్ పిల్లలా,,,,..వెరీగుడ్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది కాలేజీల వాల్లు ప్రలోభపెట్టినా నేనెప్పుడు పలానాకాలేజీలో చేరు అని చెప్పను .అలాంటి వ్యాపారాలు మా సార్ చేయడు అని మాపిల్లలు వెళ్ళిన చోట చెబుతుంటారు.
ఇప్పుడిక విద్యారంగంలో రాబందుల ప్రవేశం ఎక్కువయింది .వాటి రెక్కలు మా వినుకొండ లాంటిచిన్నపట్టణాలమీదకుకూడా విస్తరిస్తున్నాయి. కోట్ల పెట్టుబడి పెట్టి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి . జీతాలు ఎక్కువిచ్చి టీచర్లనందరినీ లాక్కుంటున్నారు.ఊర్లకు బస్సులు నడుపుతున్నారు. చిన్నపాఠశాలలు కూడా కాపీసెంటర్లకు తరలించి పిల్లలను పర్రీక్షలు రాపించైనా తమ మనుగడ కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.వ్యవస్తంతా గందరగోళంగా ఉంది చక్కగా కుటీరాలు వేసుకుని పాఠశాలలు నడిపే మాకు కష్టాలు మొదలయ్యాయి .ఈ రాబందులు ప్రభుత్వం వెనుకనుండి వ్యూహం అమలుచేస్తున్నారు చిన్న పాఠశాలలన్నింటినీ తొక్కెయ్యాలని...అన్ని పాఠశాలలకు గుర్తింపు కావాలన్నారు . సరే అని మా స్తోమతకు మించి లక్షరూపాయలదాకా ఫీజులవీ ఖర్చుపెట్టాము. ఇంకా అనుమతులు వాటికి లక్షరూపాయలదాకా అయ్యేలా ఉంది . ఇప్పుడు బిల్డింగులు కావాలంటున్నారు . పూరిపాకలు ఉండకూడదంటున్నారు ,అక్కడ రక్షణ కు ఎటువంటీ ఇబ్బంది లేకపోయినా కూడా.
ఇవిగాక బస్సులు . ఇక డబ్బు కాస్త ఎక్కువవుతున్నకొద్దీ జనంలో మార్పులొస్తున్నాయి . ఇంగ్లీష్ మీడియం పిచ్చి ముదిరిపోయింది . పాతవిలువలపట్ల కొత్తతరానికి ఆసక్తి తగ్గుతున్నది .
ఇప్పుడు లక్షలరూపాయలు వెచ్చించి ఆ అప్పు తీరడానికి పక్కా వ్యాపారంగా నేను విద్యాసంస్థను నడపలేను. అవతల ఎక్కువ జీతాలొస్తుంటే ఎంతకాలమని మీదగ్గర తక్కువకు చేయగలం అని నమ్మకమైన ,చక్కని వ్యక్తిత్వంగల నా సిబ్బంది అడిగితే వారిని ఎలా ఒప్పించగలను ? వారి అవసరాలు వారికుంటాయి కదా ?

సమర్ధతలేని సిబ్బందితో కాలం గడిపి పిల్లల భవిష్యత్ కు అన్యాయం చేయలేను . ఎక్కువగా నదగ్గర ఎస్సీ,ఎస్టీ ,మిగతా పేదరైతుల పిల్లలుంటారు . వీళ్లందరినీ పీడించి వసూల్లు చేయటం నావల్లకాదు. ఇంకా రెండు సంవత్సరాల ఫీజులివ్వాల్సినవాల్లు కూడా ఉన్నారు. ఏవో ఇబ్బందులవల్ల వాల్లు కట్టలేక పోతున్నారు. ఇలాఉంటున్న నా పరిస్థితి, వ్యవసాయం జూదంగా మారిన రైతుల పరిస్థితి ఆలోచించి మనసు చిక్కబట్టుకుని గుండెల్లో దు:ఖాన్ని అదిమిపెట్టుకుని మొన్న ప్రకటించాము పాఠశాల మూసివేస్తున్నాము అని.



ఎనాటికైనా ఇక్కడే పూర్వ గురుకుల పాఠశాలల వలె ఉచితంగా నివాసం ,ఆధునిక విద్యావిధానం తో మేళవించి పూర్వ విలువలను కాపాడుకుంటూ , హైందవతేజో యశస్సులను ప్రజ్వరిల్లజేయగల విద్యార్థులను తయారు చేయాలనుకున్న నా కోరిక కార్యరూపం దాల్చకముందే ఇలా ముగుస్తుందనుకోలేదు ..

పిల్లల తోడులేక .. ఒంటరిగా ఆలోచనలు తట్టుకోలేక గుండెలో బాధ దించుకోవటానికై ఇలా కీబోర్డుపై వేల్లు కదిలిస్తున్నాను .

Read more...

మకావ్ లో మన వ౦టలు మేటి అరుణ ఝా





భారతదేశ౦లోని డెహ్రడూన్లో జన్మి౦చిన అరుణ ఝా వృత్తి రీత్యా కథక్ నర్తకి. ప్రఖ్యాత కథక్ నాట్యాచార్యులు గురు నటరాజ్ శ౦కర్ దేవ్ ఝా కుమార్తె. "కల్చరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మకావ్ గవర్నమె౦ట్" ఆహ్వాన౦ మేరకు తొలుత అ క్కడ కథక్ నృత్యప్రదర్శనలు ఇవ్వడ౦, మూడు నెలలపాటు అక్కడ యువతులకు కథక్ నృత్య౦ నేర్పే౦దుకు వెళ్ళారు. ఆమె వద్ద 250 మ౦ది శిక్శితులయ్యారు. అ౦దులో మకావ్ కాసినో కి౦గ్ స్టాన్లీ హో నాలుగవ భార్య ఏ౦జలా లియా౦గ్ ఒకరు. మకావ్లో అరుణకు ఎనలేని ఆదరణ దక్కి౦ది. అక్కడ వాతావరణ౦, స౦స్కృతి, ఆత్మీయత ఆమెను మకావ్లో ఉ౦డేటట్లు కట్టిపడేసి౦ది. రుచికరమయిన భారతీయ వ౦టలు చేయడ౦లో చేయితిరిగిన అరుణను మకావ్లో సుప్రసిద్ధ హాయత్ హోటల్ జనరల్ మేనేజర్ ఒకరు తమ హోటల్లో భారతీయ వ౦టలు చేయమని ప్రోత్సాహి౦చారు. ఆ విధ౦గా 1983 లో హయత్ హోటల్ రెస్టారె౦ట్ లో భారతీయ వ౦టకాలు అరుణఝూ ప్రవేశపెట్టి౦ది. అరుణ చేసే వ౦టకాలకు "అరుణాస్ ఇ౦డియన్ కర్రీ" పేరున ప్రమోట్ చేసి౦ది. పోర్చుగీసు, చైనా స౦ప్రదాయ వ౦టలనే ఆరగి౦చే అక్కడి కస్టమర్లు అరుణ చేతి భారతీయవ౦టలు రుచి చూసి, వాటి కోస౦ క్యూ కట్టేవార౦ట. అలా "అరుణాస్ ఇ౦డియన్ కర్రీ" మకావ్లో పాపులర్ అయ్యి౦ది. 1997 అరుణఝా తానే సొ౦త౦గా రెస్టారె౦ట్ ప్రార౦భి౦చారు. మకావ్లో తొలిభారతీయ రెస్టాఅరె౦ట్ ఇది. నిత్య౦ కస్టమర్లతో రద్దీగా ఉ౦డేది.
2006 స౦వత్సర౦లో మకావ్లోని తైపే ప్రా౦త౦లో మరోరెస్టారె౦ట్ ప్రార౦భి౦చిన అరుణ, కొ౦దరు మిత్రులసహకార౦తో గత ఏడాది 2.7 మిలియన్ హా౦గ్కా౦గ్ డాలర్ల పెట్టుబడితో "అరుణాస్ మహారాజ ఇ౦డియన్ కర్రీ పేరుతో లోటస్ స్క్వేర్ సమీప౦లో ఆధునిక రెస్టారె౦ట్ ప్రార౦భి౦చి విజయవ౦త౦గా నడిపిస్తున్నారు. ఇ౦టర్నేషనల్ ఇ౦డియన్ ఫిల్మ్ అకాడమీ [ఐఐఎఫ్ఎ] ఉత్సవాలకు విచ్చేసిన ప్రముఖులు అరుణ రెస్టారె౦టలో భారతీయ వ౦టలు రుచిచూసి ఎ౦తగానో మెచ్చుకున్నారు. అ౦దులో బిగ్బీ అమితాబ్ ఒకరు.

ఐకె గుజ్రాల్ ను౦చి అమితాబ్ వరకు
అరుణ వ౦టలు రుచిచూడ౦దే మకావ్ పర్యటన పూర్తికాదనట౦లో అతిశయోక్తి కాదు. మకావ్ వెళ్ళిన ప్రతి భారతీయుడు ఏదో ఒకపూట అరుణాస్ మహారాజ రెస్టారె౦ట్లో అరుణఝూ చేతి వ౦ట రుచి చూస్తారు. తాను మకావ్ కు వచ్చిన తొలినాళ్ళలో భారతీయులు కనిపి౦చడమే అరుదుకాగా, ప్రస్తుతము భారత పర్యాటకులు మకావ్ కు ఎక్కువగా వస్తున్నారన్నారు. వీర౦దదిరినీ చూస్తు౦టే భారతదేశ౦లో ఉన్నట్లే ఉ౦టు౦ద౦టారు.
అరుణ రెస్టరె౦ట్ కు వెళ్ళి వ౦టలు ఆరగి౦చి "ఆహా ఏమి రుచి" అని మెచ్చుకున్న భారతీయుల్లో మాజీ ప్రధానమ౦త్రి ఐ.కె.గుజ్రాల్ ద౦పతులు, బాలీవుడ్ బాద్షా, బిగ్బీ అమితాబ్ బచ్చన్ మొదలుకొని కే౦ద్ర మ౦త్రి అళగిరి, ఎ౦దరో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులున్నారు..విదేశీ ప్రముఖుల్లో హా౦కా౦గ్ చివరి గవర్నర్ లార్డ్ క్రిస్ పాటెన్, హా౦కా౦గ్ తొలి సిఇఓ తు౦గ్ చీ హా, మకావ్ కాసినో కి౦గ్ స్టాన్లీ హో తదితరులు ఉన్నారు. ఇ౦డియాలో ఉన్నప్పుడు తన సేవాకార్యక్రమాల ద్వారా మథర్థెరిస్సా మన్ననలు కూడా అ౦దుకున్నారు అరుణ ఝా.

భగవ౦తుడిచ్చిన వర౦
మకావ్ లో ఇక్కడివారికేగాక, ఈ ప్రా౦తానికి వచ్చే భారతీయ పర్యాటకులకు భారతీయ భోజనాన్ని అ౦ది౦చగలగడ౦ తనకు భగవ౦తుడిచ్చిన భహుమతిగా అరుణ ఝూ చెప్పారు. ఇటీవల మకావ్ ను స౦దర్శి౦చిన "వార్త" బృ౦ద౦ అరుణ చేతి వ౦ట రుచి చూసి౦ది. జైన్, హలాల్, వెజిటేరియన్, నాన్ వెజ్ వ౦టకాలతోపాటు తాజాగా దక్సిణాది వ౦టకాలైన సా౦బారు, రస౦, పకోడీ కూడా తన రెస్టారె౦ట్లో కస్టమర్లకు రుచి చూపిస్తున్నారు. ఆరురోజుల విదేశీ ప్రయాణ౦లో అచ్చమైన భారతీయ భోజన౦ చేసి౦ది అరుణాస్ రెస్టారె౦ట్లోనే అ౦టే అతిశయోక్తి కాదు.

కస్టమర్లు స౦తృప్తిగా భోజన౦ చేయడమే తనకు స౦తోశ౦ కలిగిస్తో౦ద౦టారు అరుణ. ఐదు పదుల వయసులోనూ ఆమె రోజుకు పద్దెనిమిది గ౦టలకు పైగా కస్టపడతారు. తమ వ౦టలకున్న డిమా౦డ్ నేపథ్య౦లో భారతదేశ౦ ను౦చి చెఫ్ లను తీసుకురావాల౦టే మకావ్ చట్టాల ప్రకార౦ ఇబ్బ౦ది ఉ౦డడ౦తో, తన వద్ద ఉన్న కొద్ది పాటి సిబ౦దితోపాటు తాను నిత్య౦ శ్రమిస్తు౦టాన౦టారు. ప్రతి ఏటా నవ౦బరు నెలలో మకావ్ లో జరిగే ఫుడ్ ఫెస్టివల్ లో అరుణ ఝూ తన వ౦టకాల రుచి చూపి౦చి అనేక అవార్డులు అ౦దుకున్నానని, ద అసోసియేశన్ ఆఫ్ ఫుడ్ అ౦డ్ బేకరీ ఎ౦ప్లాయిస్ ఆఫ్ మకావ్ వారు "క్వీన్ ఆఫ్ ఇ౦డియన్ కుకి౦గ్ బిరుదుతో సత్కరి౦చినట్లు ఆమె తెలిపారు.

[ మా చిన్న తమ్ముడు గతనెలలో వార్త దినపత్రిక తరపున మకావ్ పర్యటనకెళ్ళివచ్చి వ్రాసిన వ్యాసం ]

Read more...

హిందువుల మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రతి నికృష్టుడు వాడే అస్త్రం " కుల విబేధం"

>> Thursday, June 10, 2010

హిందువుల మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రతి నికృష్టుడు వాడే అస్త్రం " కుల విబేధం"

హిందువుల ఐక్యతను దెబ్బతీయటానికి, ఆదినుంచి ఈదేశాన్ని బలహీనపరచటనికి ప్రతి నికృష్టుడు వాడిన ,ఇప్పటికీ వాడుతున్న అస్త్రం కులాలమధ్య కుంపు పెట్టడం . సాధ్యమైనన్ని మార్గాలలో వివిధకులాల మధ్య ఉన్న చిన్న అపోహలను పెద్దవిగా చూపటం , లేని విబేధాలను ఉన్నట్లుగా చూపటం ఒక వ్యూహం . ఈవ్యూహం తో మనసులలో విష బీజాలను నాటటం అవి పెరిగి పెద్దవయితే మరిన్ని చితుకులువేసి మంటను పెద్దది చేయటం . ఈ వ్యూహాన్ని ఏ మార్పులు లేకుండా వరుసగా ప్రయోగిస్తూనే ఉన్నారు .ఫలితం బాగానే ఉంటున్నది కనుక మరలా మరలా ప్రయోగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సమాచారాన్ని పదిమందికి చేర్చగల అన్ని రంగాలలో ఏమాత్రం వెరవకుండా దీనిని వాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్


మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా ............ అని ప్రతి వారూ ఈ పుణ్యభూమిలో భావిస్తుంటారు. సంకరబుద్ధులు,వంకరబుద్ధులు తప్ప . ఆదిశంకరులెంత పూజ్యులో అవధూత మాల పిచ్చమ్మ కూడా జాతికంత ఆరాధనీయులే. గొలగమూడి వెంకయ్యస్వామి,కాశిరెడ్డినాయన ల కులాలు చూసికాదు గుణాలుచూసి గురువులుగా గౌరవించేజాతి మనది. జాతికి బలం ,బలహీనత రెండు ఈ కులమనే పదమే . శ్రమ విభజనతో ఏర్పడ్దకులాలతో జాతిని బలపరచేపని చేయాలేగాని దురభిమానాలతో బలహీనపరచే కుట్రలలో భాగస్వాములవ్వవద్దని మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాము .

Read more...

హనుమత్ రక్షాయగం పూర్ణాహుతి

>> Tuesday, June 8, 2010


భక్తజనపాలకుడు, భవిష్యద్రహ్మ హనుమంతులవారిని భక్తజన రక్షణ చేయాలని కోరుతూ నలభై రొజులపాటు సాగిన హనుమ రక్షాయాగం పూర్ణాహుతి తో ముగిసింది . హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం నుంచి రుద్రసూక్త ప్రకారంగా అభిషేకములు, అర్చనలు నిర్వహించారు దీక్షాధారులు . ఆ తరువాత భక్తులందరి తరపున హోమము నిర్వహించటం జరిగింది . గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున ఆహుతులివ్వటం జరిగింది. చెన్నైనుంచి హోమంలో పాల్గొనేందుకువచ్చిన మన బ్లాగ్ లోక మితృలు నాగప్రసాద్ ,సునీల్ వైద్యభూషణ్ లు ప్రధాన భూమిక వహిస్తూ యాగ నిర్వహణలో పాల్గొన్నారు. నలభైరోజులపాటు దీక్షలో ఉన్న బాల బ్రహ్మ చారులు తమ తల్లిదండ్రులతో కలసి యాగమ్ లో పాల్గొని స్వామిని అర్చించారు.

Read more...

పూర్ణాహుతికి ఆహ్వానం .....రండి మరచి పోకండి .

>> Sunday, June 6, 2010

నలభై రోజులుగా జరుగుతున్న హనుమత్ రక్షాయగం పూర్ణాహుతి కార్యక్రమం హనుమజ్జయంతి 7-6-2010 సోమవారం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం లో పారాయణం చేస్తూ పాల్గొంటున్న అందరి తరపున ఆహుతులుిచ్చి , వారి తరపున ముడుపు కట్టిఉన్న నారికేళములను పూర్ణాహుతిలో సమర్పిస్తారు. ఈ కార్యక్రమం లో పాల్గొని స్వామి వారి రక్షలు ప్రసాదం స్వీకరించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈసందర్భంగా భక్తులందరికీ పెండేల వెంకట రామాంజనేయ సూర్యనారయణ గారు [అమెరికా] అన్నప్రసాదవితరణ గావిస్తున్నారు. రేపు ఉదయం పదిగంటల కల్లా పూర్ణాహుతి కార్య క్రమం ముగుస్తున్నందున రాత్రికే మీరు పీఠానికి చేరుకోవాలని కోరిక . హైదరాబాద్ నుంచి బయలుదేరేవారు రాత్రికి బయలుదేరినా తెల్లవారు ఝాముకు వినుకొండ వచ్చి మొదటి బస్ కే పీఠానికి చేరుకోవచ్చు .మీకు నేను ఫోన్ లో అందుబాటులో ఉంటానుకనుక నన్ను సంప్రదిస్తుంటే రూట్ చెబుతుంటాను. జై శ్రీరామ్ .
[పీఠానికి రావటానికి వీలుకాని వారు దగ్గరలో గల హనుమంతుని ఆలయానికెళ్ళి ఒక కొబ్బరికాయను సమర్పించాలి]

Read more...

చెడుకర్మ ప్రబలంగా ఉన్నప్పుడు మనిషిని భగవంతుని ఆశ్రయించ నివ్వదని మరో మారు ఋజువయ్యింది .

>> Friday, June 4, 2010

ఇక్కడ రాముడు పాలెం తండాలో అంజయ్య నాయక్ అనే నా పాత శిష్యుడున్నాడు .వాడిప్పుడు బీఈడీ చేసి నాతో పాటు మామండలం లోనే టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చాలారోజులుగా వానిని హనుమద్దీక్షతీసుకోమని చెబుతున్నాను . ఈ మధ్య కాలం లో వాడు చెప్పే సూచనలను అనుసరించి ఎందుకో ఏదో కష్టం రాబోతున్నదనిపించి పాఠశాలల ముగింపుకు ముందు వాడు కనపడ్డప్పుడు ఈసంవత్సరం పరిస్థితులంతగా బాగాలేవుకనుక ఈసంవత్సరం దీక్ష తీసుకో సర్వత్రా రక్షణ అని చెప్పాను . నాకు మాల వేసుకోవాలని చాలా కోరికగా ఉంది సార్ . కాకపోతే ఇంటికాడ సరిగా కుదరదనిపిస్తుంది. నేను మాలవేసుకుంటే అందరిలాకాదు కరెక్ట్ గాచేయాలి ..........అని ఏదో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. చూడు అంజీ ! ఎవరుసరిగా చేయటం లేదని అనుకుంటున్నావు ? ఎవరైనా ప్రయత్నం మొదలెడితే కదా ఆ పని సక్రమంగ చేస్తున్నారా లేదా అని తెలిసేది. ముందు ముచ్చట్లాపి దీక్ష మొదలెట్టు . ఎప్పుడో చేయాలనే బద్దకం ఇలాంటి ముచ్చట్లు తెప్పిస్తుంది . అలా అలసత్వం మొదలైతే సంకల్పాలు మరుగునపడిపోతాయి అని హెచ్చరించాను . లేదుసార్ ఈసారి చూడాల్సిందే అంటూ వెళ్ళిపోయాడు. సరే వాడి చెడుకర్మ వానిని భగవంతుని వైపు నడవనివ్వటం లేదు అనుకుని మిన్నకున్నాను.

మొన్న ఉదయం వచ్చాడు . ఇప్పుడు హనుమత్ రక్షాయాగం లో దీక్షలో ఉన్న, వాళ్ళ చుట్టాలబ్బాయి శివాజీనాయక్
గురించి మాట్లాడాలని వచ్చాడు. సార్ ! పూర్ణాహుతి కి మావాడు ఏమి తెచ్చుకోవాలో వాళ్ల నాన్న అడిగిరమ్మని పంపాడు అన్నాడు . ఆలాగే మా చుట్టాలంతా వస్తారు అని మిగతా విషయాలు అవి ఇవి అడిగాడు . మరలా నేను మాలవేసుకోవాలంటే ......అంటూ పాత పాట పాడాడు. ఆసమయం లో మేమంతా ఉపాహారం స్వీకరిస్తున్నాము . సరే ప్రసాదం తీసుకుని వెళ్ళుస్వామీ ! అని చెప్పినా కాదు స్వామీ నాకోసం రోడ్డుమీద మనుషులు నిలబడి ఉన్నారు అంటూ హడావుడిగా వెళ్ళాడు . ఏమి తొందరైందిరా వీనికి అనుకున్నాను.

ఈ తండా వాసులంతా పరదాపట్టలు[పంట నూర్పిడులకు వాడేవి] తయారు చేసుకుని రాష్ట్రంలోను,కర్ణాటకలోనూ పలుప్రాంతాలలో అద్దెలకిస్తూ సీజన్లలో తిరుగుతుంటారు. ఆ సాయంత్రానికి తెలిసిన ఘోరమైన విషయం పరదాలు తీసుకుని వెళుతున్న అంజయ్యనాయక్ వాళ్ల అమ్మా నాన్న ఉన్న ఆటోను దేవరకొండ దగ్గర ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొని ప్రమాదం సంభవించింది అని తెలిసింది. వాళ్ల అమ్మా నాన్నలకు తీవ్రగాయాలయ్యాయట .క్షత గాత్రులను హైదరాబాదుకు తరలించారు అని. వెంటనే ఇక్కడనుండి జనం బయలుదేరి వెళ్లారు . విషయం తెలిసి నేను ఫోన్ చేసి ప్రయాణం లో ఉన్న అంజయ్యనాయక్ కు ధైర్యం చెప్పాను . వాడు ఏడుస్తూ మా అమ్మకు ప్రమాదంగా ఉందట సార్ . మా అమ్మకు ఏమీ జరగకూడదని ప్రార్ధించండి సార్ . మా అమ్మ క్షేమంగా ఉంటే నేను వెంటనే స్వామి దీక్ష తీసుకుంటాను సార్ .అని దు:ఖ పడుతున్నాడు . ఏమీ కాదు > స్వామిని ప్రార్ధించు ,ఆయన అండగా ఉండగా దు:ఖాలు రావు అని ఓదార్చాను . ఆరాత్రి వారి ఆదంపతులకు ఏ ప్రమాదం రాకూడదని చాలీసా పారాయణం చేశారు దీక్షాధారులంతా . ఉదయం ఫోన్ చేయగా మా నాన్నకు పరవాలేదు సార్ . అమ్మకు కాలు విరిగింది .మెదడులో రక్తం గడ్డకట్టి చిన్న చుక్క ఏర్పడింది .అది పెరగకపోతే ఇబ్బందిలేదు అంటున్నారు డాక్టర్లు . అని చెప్పాడు , ప్రమాదం తప్పినందుకు సంతోషించాము .

ఇక్కడ ఈ పిల్లవాని భావనకు నాకు నవ్వు వస్తుంది . మనం దీక్షనో ,పూజో ,యాగమో చేస్తే సంతోషిస్తాడు . అనుకుని చేయకపోతే కోపగిస్తాడనే అపోహ వీళ్ళ మనసులో గూడుకట్టుకుంది .వాస్తవానికి చెడు కర్మ ప్రబలంగా ఉన్నప్పుడు అది మనకు మానసికంగానో, భౌతికంగానో ఘాతాలు కలుగ జేస్తుంది. మనం చేసిన మంచికర్మల ఫలితాలు ఈసమయంలో అండగా ఉండి భగవంతునిని ఆశ్రయించమని ప్రేరేపిస్తుంది. ఏదో ఒక రూపేణా మనకు సందేశం అందుతుంది . కానీ చెడుకర్మ బలీయంగా పనిచేస్తే బుద్ధి సక్రమమైన నిర్ణయం చేయలేదు ,ప్రమాదం వచ్చి మీదపడ్డాకకాని మనకు విషయం అర్ధంకాదు. ..
అలాకాక మనం ప్రయత్నం చేత భగవంతుని ఆశ్రయిస్తే ఆయన రక్షణలో ఈ వచ్చే చెడుఫలితాలు దాటగలుగుతాము.

Read more...

అసలే పిల్ల కోతులు ..... ఆపై ఆంజనేయస్వామి దీక్ష

>> Wednesday, June 2, 2010



బాల్యానాం శతమర్కట: అన్నారు పెద్దలు . ఒక్కో పిల్లకుంక వందకోతులు సమానం అని. అందువల్లే పిల్లలెక్కడుంటే అక్కడ సందడి . చైతన్యం వెల్లువెత్తే ఈ వయస్సులో ప్రతిదాన్నీ పరిశీలించాలని ,ప్రతి విషయం తెలుసుకోవాలనే ఉత్సాహం పెల్లుబికుతుంది వారిలో. సృష్టించడమెలా అని ఆలోచిస్తారు, ఆలోపల ఉన్నదాని రూపాన్ని మార్చాలనుకునే ఆలోచనలవల్ల అన్నింటినీ ధ్వంసం చేస్తుంటారు . వాళ్లను అదుపులో పెట్టాలంటే తలప్రాణం తోకలోకొస్తుంది మనకు.
ఇక హనుమంతుని దీక్షలో విపరీతమైన మనోవేగం ,ఉత్సాహం మనసులో ఉరకలు వేస్తుంటాయి . మరి ఆయన పవనసుతుడుకదా! .ఆయన ఉపాసకులకు కూడా ఇదేస్థితి అనుభవమవుతుంది . ఇప్పుడు మన పీఠం లో హనుమత్ రక్షాయాగం సందర్భంగా పదిహేనుమంది పిల్లకోతులు[బ్రహ్మచారులు] దీక్ష తీసుకున్నాయి .అందులో నాలుగు ఆడపిల్లకోతులు కూడా . మామూలుగానే వాల్లను గోలచేయకుండా ఆపటం కష్టం. అలాంటిది ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి మాల వేసుకున్నారు. అరవటానికుండదు ,రెండు దెబ్బలు వే్యటానికుండదు . ఈవిషయం వాల్లకు బాగ తెలుసు తెలుసు . ఇక చూసుకోండి నా తంటాలు .

ఉదయం నాలుగుగంటలకే లేస్తారు .లేచిన తరువాత పీఠం ఆవరణ వంతులవారీగా శుభ్రం చేసేవారు , పూజాసామాగ్రి శుభ్రం చేయటం , పూలుకోయటం , పరివార దేవతా మూర్తులకందరకు అభిషేకం చేసి అలంకరణలు చేసేవారు ఎవరి పని వాల్లు టకటకా చేస్తారు. ఆ తరువాత మేము అర్చనలు చేసుకుంటూ హనుమంతులవారి దగ్గరకొచ్చి ఆయనకు ప్రత్యేకంగా అభిషేకం అరచన చేస్తుంటే బిగ్గరగా గొంతెత్తి స్వామిని స్తుతిస్తుంటారు. ఆతరువాత అందరూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షనలు పదకొండుసార్లు హనుమాన్ చాలీసా పారాయణం సాగిస్తారు.ఈ సమయంలో చాలా ఏకాగ్రతగా బుద్ధిగా ఉంటారు .
ఆతరువాత యజ్ఞశాలకొచ్చి కూర్చున్న తరువాతనుంచి ఉంటుంది నాపని . చక్కగా యాగం సాగుతుంటే వెనుకవాడు ముందు వాడిని గిల్లుతాడు . వాడు గొడవ , మధ్యలో మాట్లాడకూడదన్నారుగాని గిచ్చుకోవచ్చు కదా అని వీడు వాడిని గిచ్చుతాడు . మధ్యలో ఇంకొకడు పెద్దరికం వహించి సర్దుబాటు చేస్తాడు.
ఇలా లాభం లేదని చెప్పి నేను పారాయణం చేసుకునేప్పుడ్డు,జపం చేసుకునేప్పుడు గొడవ చేయకుండా ఉంటారని ,స్వాములూ ! మీరు ధ్యానం చేయాలి అని చెప్పి కూర్చోబెడతాను . ,కానీ లోకాన్నంతా తిరిగిచూడాలనుకునే ఆకళ్ళు మూతలపెట్టిఉంచగలరా ? ఒకడు మెల్లగా ఒక కన్నెత్తి చూస్తాడు . మాస్టర్ గారు స్వామి చూడటం లేదు అని నిశ్చయించు కున్నాక అక్కడున్న ఏ పుల్లముక్కో తీసుకుని ముందువాడి ని గుచ్చుతాడు వాడు కెవ్వున కేకబెట్టి సార్ స్వామీ ! ఈస్వామి నన్ను గిచ్చుతున్నాడు అని ఫిర్యాదు . లేదా నేను మాట్లాడననుకుంటే వాళ్లటీచర్ దగ్గరకు పరిగెత్తు కెళ్ళి చెబుతారు. ఇలా కాదని దూరదూరంగా కూర్చో బెట్టినా మెల్లగా ఒక కన్నుతెరచి చూసి ఏదో దగ్గరలే ఉన్న ఒక మట్టి పెడ్ద ,రాయి నో అవతలివాని కి విసురుతాడింకొకడు.
ఇలా కాదు గాని నూట ఎనిమిది సార్లు చాలీసా సంకీర్తనగా చేయమన్నామనుకోండి పరిగెత్తు కెళ్ళి తాళాలు డోలక్ తెచ్చుకుని ఉత్సాహంగా భజన చేస్తారు . వాళ్లకిష్టమైన రీతులలో స్వామికి ఇష్టమయ్యేలాగా పాడుతారు . [రెండు డోలక్ లను చెడగొట్టారు] .
ఇక మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని పంపితే చెట్లు పట్టుని వేలాడి కొమ్మలిరగ్గొడతాడొకడు . సార్ స్వామీ ! అంటూ పరిగెత్తు కొచ్చి కంప్లైంట్ ఇంకొకడు. స్వాములూ ! బాగా ఎండగా ఉంది ఎవరూ ఎండలో తిరగొద్దు చెట్లక్రింద పనుకోండి అని చెప్పి మధ్యాహ్నం కొద్దిగా కన్ను మూస్తాము . అదిగమనించి బ్యాట్ లు బయటకు తీస్తారు. వాళ్ల ఫోర్లు,సిక్స్ ల అరుపులతో మెలుకువ వస్తుంది. ప్రచండ భానుడి తాకిడికూడా వాల్ల ఉత్సాహాన్ని ఆపలేదు.
వరుసలలో కూర్చో బెట్టి వడ్డన జరుపుతున్నా కుదురుగా కూర్చోనివ్వడు వాళ్లలో ఉన్న స్వామి . మీకు చెప్పకపోవటమేమిగాని్ స్వామి పూజ చేసేప్పుడు ఎంత ఏకాగ్రతో ...... అల్లరిచేయటం లోనూ అదే ఏకాగ్రతనుకోండి పిల్లస్వాములలో .!

ఇలా పిల్లస్వాములచేత దీక్షచేపించటం .నాకు స్వామి పెట్టిన పరిక్షేననుకోండి !. కోపం రాకూడదు .వచ్చినా వాల్లను ఏమీ అనకూడదు . మధ్యలో ఏప్రమాదం తెచ్చుసుకుంటారో అని సంకోచం మనసును పీకుతుంటుంది . ఆ ! అయినా స్వామే ! వారిలో తాండవిస్తుంటే మన జాగ్రత్తలేమిటి అనే అలోచనే సంతోషం. ఇంకా ఐదు రోజులే మిగిలి ఉంది దీక్షలో .అయినా వారికి స్వామి పట్ల కలిగిన అచంచల విశ్వాసం , ప్రేమ ,భక్తి ,శ్రద్ధ లలో నూరో వంతైనా నాకున్నాయా ? అని మాత్రం నాపైనాకనుమానం కలుగుతున్నది.
జై హనుమాన్ .

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP