కామము
>> Tuesday, March 2, 2010
జి. గోపాల చంద్రమోహన్‌రావ్ |
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య మ్ములు మనలో నుండు శత్రువులు. వీటి నుండి మనలను కాపాడుకొనే ప్రయత్నం చేయాలి. అందులో మొదటిది కామము. దీని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. కామము అంటే తెలుగు నిఘంటువు ఏం చెబుతుంది. 1. రేతస్సు 2. కోరిక. 3. మోహము. కోరికలు దుఃఖానికి హేతువులు. ఆకలిని అణచటానికి తీసుకొనే ముద్ద నుండి మోక్షం వరకు కోరికలే అవుతాయి. ఈ కోరికలు తీర్చుకొనుటకు ప్రయత్నిస్తుంటే అవి పెరుగుతుంటాయి. కాని తరగవు. ఇంద్రియ గోచరములగు విషయములను వినినను, స్మరించినను, అనుభవించినను కలుగు సుఖము నందలి కోరికయే కామము. జగద్గురువు శ్రీ శంకరాచార్యులు వారు ఈ విషయం ఇంకా వివరంగా చెప్పారు. ''కామము, క్రోధం, లోభం నీ దేహములో ఉండి నీలోని జ్ఞానమనే రత్నంను దొంగిలించుటకు సదాసిద్ధంగా ఉన్నవి. అందుకే వాటి నుండి జాగ్రత్తగా ఉండు అని హెచ్చ రించాడు.అర్జునుడు భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం-36లో ఇలా అడుగుతాడు ''మానవుడు తనకు తెలియ కుండానే పాపములు ఎందుకు చేస్తున్నాడు. దానికి సమాధానంగా కృష్ణుడు ఇలా వివరిస్తాడు. కామము జ్ఞానికి నిత్య శత్రువు. ఇది అగ్ని వలె నిండి పరానిది. పొగ చేత నిప్పు, మురికి చేత అద్దం, మాలిచేత గర్భమున నుండు శిశువు కప్పబడు మాదిరి కామము చేత వివేకబుద్ధి కప్పబడి ఉంటుంది. అగ్నిలో నెయ్యి ఎంత వేసినను ఇంకా కావాలని ఎంత ఉంటుందో అలాగే కోరికలు తీరుస్తున్న కొద్ది పెరుగుతుంటాయి. ఉదా. మొదట ఇల్లు కావాలనుకుంటాడు. తరువాత ఇల్లాలు, హోదా, పలుకుబడి, ఇలా కోరికలు అంతులేకుండా ఊరుతుంటాయి. దీనిని తీర్చు కొనుటకు మొదట న్యాయబద్ధంగా ప్రవర్తించినా తరువాత అన్యా యంగా ఆర్జించాలనిపిస్తుంది. కామభోగమే పరమ పురుషార్థం అని భావిస్తారు. కామ, క్రోధముల నుండి పుట్టిన వికారములను ఎవడు జీవిత కాలమంతా సహింప కలుగుతాడో అతడే నిజమైన యోగి. అతడే ఆనందమయుడగు పురుషుడు. కామ, క్రోధ, లోభములను వదిలిం చుకొనే ప్రయత్నం చేయాలి. బుద్ధిచేత మనస్సును స్థిరపరచుకొని దుర్జయమగు కామమును శత్రువును జయించుకోవాలి. కామమును వైరాగ్యముతోను, క్రోధమును శాంతముతోను, లోభమును దాన ముతో అరికట్టే ప్రయత్నం చేద్దాం. [వార్త దినపత్రిక నుండి] |
0 వ్యాఖ్యలు:
Post a Comment