సైన్యం లో నా ప్రవేశానికి సైంధవుడు ,ఆ మిలటరీ డాక్టర్ ..
>> Tuesday, February 9, 2010
చిన్నప్పటినుంచి నాకు మిలటరీ వాళ్ళంటే విపరీతమైన అభిమానం . చదువు చెప్పిన ఉపాధ్యాయులు ,కావచ్చు,చదివిన కథలు కావచ్చు.చూసిన సినిమాలలో సైనికుని పాత్రలు కావచ్చు. మిలటరీ వాళ్లను చూస్తే నా అభిమాన హీరోని చూసినంత ఆనందం. ఎప్పటికైనా నేను కూడా ఆలివ్గ్రీన్ రంగు డ్రస్ లో మెషిన్ గన్ లు చేతబట్టి మంచు పర్వతాల్లో మాతృభూమి రక్షణకై పోరాడాలనే లక్ష్యం పెరిగిపెరిగి అలా పెద్దదైపోయింది . వైద్యం మీద ఉన్న ఇష్టం కూడా మిలటరీలో చేరితే మిలట్రీ డాక్టర్నవ్వచ్చన్న కోరిక కలిసి ఇంటర్ లో బైపీసీ తీసుకోవటానికి కారణమయ్యింది.
కోరిక గుర్రాలెక్కితే రాత గాడిదలు కాస్తుందని ,సరైన గైడెన్స్ లేక ,సమాచారం ఈరోజులలోలాగా అందుబాటులో లేక మొత్తానికి మరలా బిఏ లో చేరాల్సి వచ్చింది. మిలటరీ చేరాలనే కోరికమాత్రం వదలలేదు. డిగ్రీ చదువు తుండగానే వినుకొండలో నిర్వహించిన మిలటరీ సెలక్షన్ కాంప్ లో పాల్గొని చెక్కవాగు కాడనుంచి శివయ్యస్థూపందాకా రెండుమైళ్ళు పైగా డ్రాయర్లమీద పరిగెత్తించారేగాని పంచదార నోటపోసుకునే అవకాశం కలిగించలేదు.
పట్టువదలని విక్రమార్కునిలా గుంటూరు రిక్ర్యూట్ మెంట్ ఆఫీస్ కెళ్ళి అక్కడ బోర్డుమీదవున్న నమూనాలో మద్రాస్ ఆఫీస్ కు దరఖాస్తు పంపి ,వచ్చిన కాల్ లెటర్తో డిగ్రీ పూర్తవగానే మరోసారి గుంటూరులో సెలక్షన్ కెళ్లాను. పొద్దుటే లోనికి పిలచి వచ్చినవాళ్లందరినీ నాలుగు పెద్దలైన్లలో కూచోబెట్టారు అర్ధనగ్నంగా . పొద్దుటనుంచి మాకెదురుగా ఉన్న టేబుళ్లదగ్గర ఎవరెవరో ఆఫీసర్లు వస్తున్నారు పోతున్నారు . లోటాలు లోటాలు టీతాగుతున్నారేగాని మధ్యాహ్నం దాకా మంచినీళ్ళు తాగుతారేమోనని కూడా దయతలచి వదలలేదు. ఈ మాత్రం ఓపిక లేకుంటే రేపు బంకర్లలో రోజులతరబడి ఎలా పొంచి ఉండగలమనుకుని సర్ది చెప్పుకున్నాము .
తీరిగ్గా సర్టిఫికెట్ వెరిఫికేషన్లు అయ్యాక ఫిజికల్ చేస్తున్నారు . నాపక్కలైన్లో చూద్దునుకదా మవూరి .........రెడ్డి ఉన్నాడు . వాళ్ళు నరసరావుపేటలో ఉండేవారు అప్పట్లో . నన్నుచూసి ఏం బావా ! ఎప్పుడొచ్చావని పలకరించాడు. తాను ఇంతకు ముందు ఒకసారి సెలక్షన్ కు వచ్చానని ,కాని ఇక్కడా నిజాయితీగా జరగటం లేదని అందుకనే రాత్రి బ్రోకర్ ద్వారా ఎనిమిది వేలు చెల్లించామని చెప్పాడు . సరే కానివ్వు ఏంజరుగుతుందో అది జరుగుద్ది అని సర్ది చెప్పుకున్నాను .రాత్రి ఆరుగంటలకు ఓ పెద్దహాలులోఫిజికల్ టెస్ట్ లో సెలక్టయిన మా అందరినీ దిగంబరంగా నిలబెట్టి మిలటరీ డాక్టర్ గారు నఖశిఖ పర్యంతం పరీక్షిస్తున్నారు .ఆ ఆంకం కూడా ముగిశాక ఒక్కొక్కరిని డాక్టర్ గారి గదిలోకి పంపి కళ్లు ,ముక్కు చెవులు పరీక్షిస్తున్నారు. దాదాపు అన్ని టెస్టులయిపోయాయి గనుక మరుసటిరోజు ట్రైనెక్కించేసి ఇటునుండి ఇటే ట్రైనింగ్ కాంప్ కుపంపుతారని ఆనందం తో గాల్లో తేలిపోతున్నాను . అన్నీ పరిక్షించిన ఆడాక్టర్ చెవిలో మైక్రోస్కోప్ లాంటి పరికరం పెట్టి చూసి " చెవిలో గుబిలి ఉంది శుభ్రపరచుకుని మరొకసారి సెలక్షన్ కు రాపో " అని చెప్పాడు.
నా ఆశలసౌధం కూలిపోయింది .సార్ ..ఇప్పుడే శుభ్రం చేసుకుంటాను సార్ అని బతిమిలాడినా నిర్ధాక్ష్యణ్యంగా బయటకు పంపాడా దుర్మార్గుడు . ఎన్నిజన్మల నుంచి శతృత్వమోగాని ఇప్పుడు తీర్చుకున్నాడు ,అని తిట్టుకుంటూ ఈదేశం లో అవినీతి ,లంచగొండితనం నశించాలని మనస్సులో శపించుకుంటూ కళ్లవెంట నీళ్ళు కుక్కుకుంటూ వెనుక్కొచ్చాను.
ఆశచావక తరువాత మరోసారి రిక్రూట్మెంట్ ఆఫీస్ తలుపుతట్టాను. ఈసారి వాళ్లకు మరీదయగలిగింది కాబోలు యథాప్రకారం డ్రాయర్లమీద నాలుగింటిదాకా కూచోబెట్టి చావుకబురు చల్లగా చెప్పారు ,సెలక్షన్ వాయిదావెస్తున్నామని . మాలో ఉద్యమాలు నడిపిన విద్యార్ధి నాయకులున్నారు కాబోలు ఆవిషయం ఇందాకే చెప్పాలి.నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు వీళ్ళు అని మాటలతో మాలో అవేశాన్ని రగిలిస్తూ వాచ్ మెన్ లు బయటకు నెడుతుండగా గేట్ దాటి వచ్చాము . గేట్ లోపల వాళ్ళు బయటమేము . ఉద్యమస్పూర్తి బాగా తలకెక్కి సెలక్షణ్ లేదంటె పొద్దుటే చెప్పవచ్చుకదా ఇదేంటి ?మీఇష్టమేనా ? అని వాదనలు పెద్దగా అరుస్తున్నాము . ఈసందట్లో నేను గేట్ ముందుకు నెట్టబడ్డానని గాని లోపల అధికారులకు ఈగొడవకు నాయకత్వం వహిస్తున్నది నేనే ననే నమ్మకం ముదురుతున్నదని గ్రహించలేకపోయాను . ఇంతలో లోపలనుంచి ఈ పై అఫీసర్ నాకేసి చూపుతూ వాణ్ణి లోపలకు లాక్కురమ్మని వాళ్ల వాచ్ మెన్ కు హిందీలో ఆర్డర్ వెయ్యటం చూసి ఏంచేద్దామబ్బా అని వెనుదిరిగి చూద్దునుగదా !మన ఉద్యమనాయకులంతా పలాయనం చిత్తగిస్తున్నారు . వాడు రాగానే నాచొక్కాపట్తుకున్నాడు . లోపలకెళ్లామంటె ఎముకల్లో సున్నం కూడా మిగలదు. అది మిలటరీ కాంప్ కార్యాలయం కనుక పోలీసుల కేసుకూడా ఉండదు. బుద్ది శరవేగంతో పనిచేసింది .అతన్ని విదిలించికొట్టి వేగంగా వెనుక్కుతిరగగానే ఖచ్చితంగా అదేశమయంలో సిటీబస్ ఆ ఆఫీస్ ను ఆనుకునే మలుపులో కి రావటం ,నేను పరిగెత్తెళ్ళి వెళుతున్న బస్ లోకి జంప్ చేయటం ఆ సాహసం వీరత్వం,.తలచుకుంటే ఇప్పటికీ నవ్వాగదు.
అలా నా మిలటరీ ప్రవేశానికి సైంధవునిలా ఆరోజు ఆ డాక్టర్ అడ్డుపడ్డాడు.
{ ఏమో ! ఆజగన్మాత ఈ లీల జరిపిందేమో అనిపిస్తుందిప్పుడు}
1 వ్యాఖ్యలు:
నా కథా కొంచెం ఇలాంటిదే. నేనూ, నా ఫ్రెండు రెడ్డీ మిలటరీ అంటే పడి చచ్చేవాళ్ళం. రెడ్డి బలంగా, పొడుగ్గా ఉండేవాడు వాడు మిలిటరీ అని పాకులాడ్డంలో అర్థముంది. పీలగాణ్ణి, భూతద్దాలోణ్ణి నేను కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వెంపర్లాడేవాన్ని.
అయితే నాకు ఆ ముచ్చట తీరింది. రెండేళ్ళు డిఫెన్సు లో శాస్త్రవేత్త ఉద్యోగం వెలగబెట్టేను. మా రెడ్డి మాత్రం తన ఆశ తీరక ఒకానొక స్టేజులో డ్రగ్ అడిక్టు కూడా అయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పెళ్ళీ అదీ కూడా అయింది. ఇప్పుడెక్కడున్నాడో తెలీదు.
Post a Comment