మహాశివరాత్రి ఇలా జరుపుకోవాలి
>> Thursday, February 11, 2010
మహాశివరాత్రి ఇలా జరుపుకోవాలి
=======================================
మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, పూజామందిరం, గృహాన్ని శుభ్రం చేసి.. పసుపు కుంకుమలు, రంగవల్లికలు. తోరణాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.
ఇక ఉపవాసం సంగతికొస్తే.. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది. ఇక జాగారం ఎలా చేయాలంటే..? శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది.
జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.
ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే...? లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని, ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్లపూలమాల.. నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి.
జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు.
ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి.
----------------------------------------------------------------------------------
ముందుగా నందీశ్వరదర్శనం చేయాలట
==============================================
మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే భక్తులు ముందు నందీశ్వరుడిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. శివభగవానుడు జ్ఞానదేవుడు. జ్ఞానికి మాత్రమే పరుల దోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. విషరూపాలైన ఆ దోషాలను మనలో ప్రవేశించనీయకుండా కంఠంలోనే అదిమిపెట్టి బంధించగల పరమేశ్వరుడే.. ఆదిశంకరుడు.
అలాంటి మహిమాన్వితమైన మహాదేవుణ్ణి ఆలయాల్లో దర్శించుకునేవారు ముందు నందీశ్వరునికి ప్రణమిల్లి నమస్కరించాలని పురోహితులు అంటున్నారు. శివమందిరములో ప్రవేశిస్తుండగా, శివుని వాహనమైన నంది భగవానుడితో తమ కోరికలను వృషభుడి చెవిలో చెప్పుకుంటే.. శుభప్రదంగా పూర్తవుతాయని విశ్వాసం.
సాధారణంగా ఎద్దుకు బుద్ధి చాలా తక్కువగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. కానీ భగవంతుని లేదా భగవత్‌జ్ఞానాన్ని మస్కిష్కంపై మోసుకుని మానవుడు విశ్వంలో పురోగమించగలిగితే సామాన్య బుద్ధిగల ఎద్దు కూడా మహా మహా విద్వాంసులను కూడా ఓడించగలుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భగవత్ కార్యానికి వినియోగపడే వృషభం కూడా అర్చంచబడుతుందని పండితుల వాక్కు.
అందుచేత మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళే భక్తులు ముందు నందీశ్వరుడిని పూజించి, ఆయనకు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇంకా మహాశివరాత్రి నాడు నందీశ్వరుడికి, మహాదేవునికి జరిగే అభిషేకాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, శివసాయుజ్యము విశేష ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
ఇంకా శివదేవుని పైన సదా వ్రేలాడుతుండే అభిషేక పాత్ర నుండి జరిగే అభిషేకం లేదా ఆ పాత్ర నుంచి వెలువడే జలబిందువులు సాతత్యాన్ని సూచిస్తాయి. ఇలా భగవంతునిపై మన అభిషేకం నిరంతరం కొనసాగాలనే పరమార్థాన్ని ఈ అభిషేక పాత్ర సూచిస్తోంది. అందుచేత మహాశివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే అభిషేకం, పూజల్లో పాలుపంచుకుని ఆ హరహర మహాదేవుని అనుగ్రహాన్ని పొందుదుముగాక..!
-----------------------------------------------------------------------------
లింగోద్భవకాలంలో చేయవలసిన పూజ
==============================================
పండుగలన్నింటిలోనూ అనంత పుణ్యప్రదమైనది "మహాశివరాత్రి". ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇలా మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశికి "మహాశివరాత్రి" అని పేరు. అట్టి మహిమాన్వితమైన రోజునే జ్యోతిర్లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
శివపద మణిమాలలో 'శి' అనగా శివుడనియు, 'వ' అనగా శక్తి స్వరూపమని చెప్పబడి ఉంది. ఈ శివరాత్రినాడు విశేషమైన కాలం "లింగోద్భవకాలం" ఆ రాత్రి 11.30 నుండి 01.00 గంటల వరకు అని పురోహితులు అంటున్నారు. ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీని జపిస్తూ, ఉపవాస దీక్షతో "పార్థివ లింగానికి" పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోనూ, రెండో జాము నందు తేనెతోను అర్చిస్తే ఉమామహేశ్వరుల అనుగ్రహం పొందుతారని విశ్వాసం.
అలాగే మహాశివరాత్రి నాడు లక్షబిల్వార్చన ఆచరించిన వారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని, మొగలిపూవులతో శివారాధన చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతికొరకై స్వీకరించి వారికి వెయ్యి అశ్వమేధ యాగాలను చేసినంత ఫలం లభించి, శివసాయుజ్యము లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అందుచేత ఇంతటి విశిష్టమైన "మహాశివరాత్రి" పర్వదినాన సమీప శివక్షేత్రాల్లో విశేషార్చనలు జరిపించి మనమందరం పునీతులౌదాం..
---------------------------------------------------------------
జ్యోతిర్లింగ రూపమేలదాల్చె శివుడు
========================================
దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలేనని" శివపురాణంలో శంకర భగవానుడు విష్ణుదేవునితో అన్నారు. "నిర్గుణుడనైన నేను సృష్టి స్థితి లయక సత్వ, గుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలను ధరిస్తుంటాను. మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు. ఉన్నది ఒకే మట్టి.
అలాగే నురగలు, కెరటాలు, బుడగలు మొదలైన బుడగలన్నీ సముద్ర లక్షణాలు.. కానీ ఆ సముద్రం మాత్రం ఏకైకమైనదే.. ఇదే తరహాలో "వాస్తవానికి దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలే". నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న నా రుద్రమూర్తీ ఇవన్నీ ఏకస్వరూపాలే. వీటిలో ఏ బేధం లేదని" విష్ణువుతో పరమేశ్వరుడు తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి.
పూర్వం బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు.. ముగ్గురిలో ఎవరు గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి పోటీపడసాగారు. వారిని గమనిస్తున్న పరమశివుడు వారిలో పుట్టిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో పై విధంగా హితబోధ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
వీరి అహంను తొలగించే దిశగా మాఘమాసం చతుర్దశి నాడు వారి ఇరువురులకు మధ్యంగా జ్యోతిర్లంగంగా రూపుదాల్చారు. దీంతో జ్యోతిర్లింగ ఆది, అంతాలను తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్లగా, బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి, పరమేశ్వరుని శరణువేడుకుంటారు.
అప్పుడు ఆ పరమ శివుడు అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు పండితులు చెబుతున్నారు. దీంతో బ్రహ్మ, విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి, పరమాత్మను విశేష పూజలతో సేవించి కీర్తించినారు. ఆ పర్వదినమే "మహాశివరాత్రి" అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి.
అందుచేత సత్య, జ్ఞాన, అనంత స్వరూప గుణాతీతుడైన పరబ్రహ్మ.. శంకరదేవుణ్ణి మహాశిరాత్రి నాడు పూజిస్తే మోక్షమార్గం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన మహేశ్వరుడిని ప్రార్థించి.. ఆయన అనుగ్రహం పొందండి.
[భక్తులకోసం వెబ్ దునియా నుంచి సేకరించబడినది]
2 వ్యాఖ్యలు:
మహా శివరాత్రి శుభాకాంక్షలు ! మంచి విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు .
chaala chakkaga chepparu, andariki maha shiva rathri shubhakankshalu.
Post a Comment