నవగ్రహదేవతల మంత్రవివరాలు
>> Saturday, January 16, 2010
నవగ్రహదేవతల మంత్రవివరాలు
ఎస్.విజయలక్ష్మి |
నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ! గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:!! అనే మంత్రం చాలామందికి తెలిసిందే. సాధార ణంగా నవగ్రహ దేవస్థానాలలో 'ఆదిత్యాయ చ సోమాయ అనే మంత్రాన్ని చూస్తూ ఉంటాం. నమస్సూర్యాయ అనే మంత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. 'నమస్సూర్యాయ మంత్రాన్ని తమిళనాడు ప్రజలు ఎక్కువగా చెబుతుం టారు. ఇందులో ఒక వేద రహస్యం ఉన్నది. వేదం ఉపదేశించిన సూర్య ద్వాదశాక్షరిలో సూర్య అనే పదం కనిపిస్తుంది. సూర్యుడు: 'సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ. చరాచర జగత్తుకు సూర్యుడే ఆత్మ. ఆ సూర్యుడే పరబ్రహ్మ లేదా పరబ్రహ్మే సూర్యుడు - అనేది వేదం ఉపదేశించిన రహస్యం. ప్రజలను కర్మలో ప్రేరేపిస్తాడు కనుక ఆయనకు సూర్యుడు అని పేరు. ఈయన ఒక సంవత్సర కాలంలో నెలకొక రాశి చొప్పున సంచరిస్తాడు. సూర్యుడు పితృ, ఆత్మ, శక్తుల కారకుడు. సూర్య ఆరాధనతో హృదయ రోగాలు తగ్గిపోతాయి. సూర్యశాంతికై ఆదిత్యహృదయాన్ని పఠించాలి. ఈ స్తోత్రం ఆరోగ్యాన్నీ, జయాన్నీ కూడా అనుగ్రహిస్తుంది. సింహరాశి సూర్యుడి స్వస్థానం కనుక ఈ రాశివారు సూర్యారాధన చేయాలి. సూర్యుడి రత్నం కెంపు. సూర్యుడి ప్రీతికై హోమంలో వాడవలసిన సమిధ జిల్లేడు. చంద్రుడు: మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కనుక చంద్రుడు అని పేరు. ఈయన అత్రి పుత్రుడు కనుక దత్తభక్తులకు దగ్గరివాడు. మనశ్శాంతిని ఇచ్చే వాడు. పరమాత్మ మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు కనుక మనశ్శాంతికై ఆయనను ప్రార్థించాలి. చంద్రుడి స్వక్షేత్రం కర్కాటకం. ఆ రాశివారు చంద్రుడిని అర్చించాలి. చంద్రుడి రత్నం ముత్యం. ఈయనకు శివుడు తన శిరస్సుపై స్థానాన్ని ఇచ్చాడు కనుక చంద్రశాంతికై శివప్రార్థన చెయ్యాలి. చంద్రడు కాశీక్షేత్రంలో తపస్సుచేసి శివానుగ్రహాన్ని పొందాడు. మోదుగ సమిధను చంద్రప్రీతికై హోమంలో వినియోగించాలి. చంద్రుడిని ధ్యానిస్తే మన:పీడలు పరిహారమవు తాయి. మంగళుడు : సుఖాన్ని ఇస్తాడు కనుక ఆయనకు మంగళుడని పేరు. మంగళుడు భూమి పుత్రుడు. మండుతున్న బొగ్గులాగా ఉంటాడు కనుక ఈయనకు అంగారకుడని కూడా పేరు. ఈయన రత్నం పగడం. మేషరాశివారు, వృశ్చికరాశివారు అంగారకుడిని ఆరాధించాలి. చండ్ర సమిధను అంగారక గ్రహ శాంతికై చేసే హోమంలో వేయాలి. ఆరాధనతో రోగపీడలు తొలగిపోతాయి. బుధుడు: అన్నిటినీ తెలుసుకొనేవాడు, తెలిపేవాడు కనుక ఆయనకు బుధుడని పేరు. కన్య, మిథునరాశులకు బుధుడు అధిపతి. ఆ రాశుల వారు బుధుడిని అర్చించాలి. ఈయన చంద్రుడి పుత్రుడు. అందుకే బుధుడిని సౌమ్యుడని కూడా పిలుస్తారు. వృక్షసంపదను రక్షించేవారిని బుధుడు రక్షిస్తాడు. బుధానుగ్రహానికి ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించాలి. పచ్చ బుధుడి రత్నం. అపామార్గం బుధుడి సమిధ. బుద్ధిపీడా పరిహారానికై బుధుడిని అర్చించాలి. గురుడు: అన్ని అర్థాలనూ తెలిపేవాడు కనుక గురువు. బృహస్పతి దేవతల గురువు కనుక ఆయనకు గురువని పేరు. ధనుర్మీనరాశులకు గురువు అధిపతి. ఆ రాశివారు గురుధ్యానం చేయాలి. అనేక సంకటాల నుండి దేవతలను రక్షించినట్టుగా ఈయన మానవులను కూడా రక్షిస్తూ ఉంటాడు. పుష్యరాగం గురుడి రత్నం. అశ్వత్థం (రావి) ఈయనకు సంబంధించిన సమిధ. గురుధ్యానంతో పుత్రపీడల నుంచి ముక్తి కలుగుతుంది. శుక్రుడు: తెల్లని రంగులో మెరిసిపోతూ ఉంటాడు కనుక ఈయనకు శుక్రుడని పేరు. ఒకానొక సందర్భంలో రుద్రుడి రేతస్సు నుండి జన్మించాడు కనుక యానకు ఆపేరు వచ్చింది. దేవతలకు దు:ఖాన్ని కలిగించేవాడు కనుక శుక్రుడంటారని వ్యాఖ్యానించారు. తుల,వృషభరాశులకు ఈయన అధిపతి. ఆ రాశి జాతకులు శుక్రుడిని స్మరించాలి. శుక్రుడిని శాంతపరచటానికి ధరించవలసిన రత్నం వజ్రం. దత్తుడికి ప్రియమైన ఔదంబరం శుక్రుడి సమిధ. పత్నీపీడ తొలగాలంటే శుక్రుడిని ప్రార్థించాలి. శని: రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటూ, మెల్లగా సంచరిస్తాడు కనుక ఆయనకు శని అని పేరు. కుంభ, మకర రాశులకు శని నాయకుడు. ఆ రాశివారు శనైశ్చరుడిని స్మరిస్తే మంచిది. ఈయనకు సంబంధించిన రత్నం నీలం. నలుపు, నీలం వస్త్రాలను ఈయన ఇష్టపడ తాడు. అంగవైకల్యం ఉన్నవారికి సేవ చేస్తే శని సంతోషిస్తాడు. జమ్మి సమిధలు శనికి సంబంధిం చినవి. శనైశ్చరుడు ప్రాణపీడా పరిహారకుడు. రాహువు: సూర్యుడిని, చంద్రుడిని కబళించి విడిచిపెడతాడు కనుక ఆయనకు రాహువని పేరు. ఈయన అర్థకాయుడు. అఒంటే తల పాముగానూ, మొండెం మనిషిగానూ కలవాడని అర్థం. రాహుప్రీతికై అమ్మవారిని ధ్యానించాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. రాహుశాంతికై గోమేధికాన్ని ధరించాలి. దూర్వలతో హోమం చేయాలి. కంటికి సంబంధించిన రోగాలు రాహుపూజతో ఉపశమిస్తాయి. కేతువు: ఈయన వల్ల అన్నీ తెలుస్తాయి కనుక ఈయనకు కేతువని పేరు. కేతువంటే ధ్వజమనే అర్థం కూడా వుంది. అందరికీ విజయాన్ని ఇచ్చేవాడు కేతువు. వైడూర్యం కేతుగ్రహానికి అనుకూలించే రత్నం. కేతుశాంతికై దర్భలతో హోమం చెయ్యాలి. కేతు ధ్యానంతో జ్ఞానపీడ పరిహరించబడుతుంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తోంది కనుక, అన్ని ఫలాలు భక్తులకు ఏకకాలంలో లభించాలంటే పై మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాల్సి ఉంటుంది. vaaratha daily news paper numdi samgrahimchabadinadi |
1 వ్యాఖ్యలు:
ఛాలా గొప్ప సమాచరం సేకరించి అందించినందుకు ధన్యవాదములు.
Post a Comment