మూడుకోట్లదేవతలు దేవదేవుని దర్శనానికై వస్తారు రేపు. మనం వెళదాం రండి
>> Sunday, December 27, 2009
తిరుపతి, భద్రాచలం వంటి వైష్ణవ దేవాలయ ఉత్తర ద్వారాలను మామూలు రోజుల్లో మూసే ఉంచుతారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. అందుచేత ఆ రోజున భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి విష్ణుపూజ చేయాలి.
ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఉత్తర ద్వారం ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని, దైవదర్శనం చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశిన ఇలా... ఉత్తరద్వార ప్రదక్షిణలు చేసుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే... "పుత్రద" ఏకాదశి అని పిలువబడే ముక్కోటి ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం శుభప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. పూర్వం "సుకేతుడు"-"భద్రావతి" అనే రాజదంపతులకు ఏకాదశీ వ్రతం ఆచరించడం ద్వారానే పుత్రసంతానం కలిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత ఆ రోజున శుచిగా, నిష్ఠనియమాలతో వ్రతమాచరించి విష్ణుమార్తిని కొలిచే వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం.
ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వేయికనులతో వీక్షించి, శ్రీహరిని సేవించి తరించాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే రోజే వైకుంఠ ఏకాదశిగా పరిగణించబడుతోంది. ఈ వైకుంఠ ఏకాదశి శనివారంలో వస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు, వెంకన్న దేవాలయములకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని విష్ణు అష్టోత్తరమును పఠించడం మంచిది. అదే రోజున సత్యనారాయణ వ్రతమును ఆచరించి విష్ణుమూర్తిని నిష్ఠతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఆ రాత్రి నిద్రపోకుండా విష్ణు నిత్యపూజ, విష్ణు స్తోత్రమాల, విష్ణు సహస్రనామ స్తోత్రములతో పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయం శుచిగా స్నానమాచరించి శ్రీహరిని పూజించి సన్నిహితులకు శుభాకాంక్షలు తెలయజేయడం శుభప్రదం.
విష్ణు సహస్ర నామ సోత్రమ్, విష్ణు పురాణం, సత్యనారాయణ స్వామి వ్రతము వంటి పుస్తకాలను ఫల, పుష్ప, తాంబూలాలతో స్త్రీలకు దానం చేయడం మంచిది. అదేవిధంగా ఏకాదశిన దేవాలయాల్లో విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ చేయించేవారికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
అందుచేత వైకుంఠ ఏకాదశి dec28 రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.
విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.
ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. రెండు ఎర్రటి ప్రమిదలను తీసుకుని, తామర వత్తులతో పంచముఖ దీపారాధన చేయడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. పూజ చేసే సమయంలో తూర్పుదిక్కున తిరిగి విష్ణుమూర్తిని పూజించాలి. దీపారాధనకు కొబ్బరినూనెగానీ, ఆవునేతిని గానీ ఉపయోగించడం ద్వారా మోక్షఫలము సిద్ధిస్తుంది.
నుదుట తిరునామము, మెడలో తులసి మాల ధరించి, "ఓం నమోనారాయణాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. జపమునకు తులసిమాల వాడటం మంచిది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణుమూర్తికి పంచామృతములతో అభిషేకం చేయించే వారికి పుణ్యఫలములు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్ర నామము, శ్రీమన్నారాయణ స్తోత్రములతో విష్ణుమూర్తిని పారాయణ చేయడం శుభప్రదం. అదేవిధంగా విష్ణుపురాణములోని దశావతార అధ్యాయములను పఠించడం మంచిది. విష్ణు ధ్యానములు, విష్ణు సహస్రనామ పూజలు చేసి, విష్ణు, శ్రీ వేంకటేశ్వర ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం
సకృదుచ్చరితం యేన హరిదిత్యక్షరద్వయం బద్ధ: పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి"
ఎవరైతే హరి అనే రెండక్షరాలను నిత్యం స్మరిస్తుంటారో వారు మోక్షానికి వెళ్ళేందుకు ప్రయాణ సన్నద్ధులై ఉంటారు.
[ఈసమాచారాన్ని అంతర్జాలం నుంచి webdunia numdi గ్రహించాను .వారికి ధన్యవాదములు
2 వ్యాఖ్యలు:
మంచి విషయం చెప్పారు.
ఓం నమో నారాయణాయః
caala manchi vishayalau maaku teliya
chesinandhuku ananathakoti danya vadhamulu.
Post a Comment