శ్రీవారి చుబుకానికి కర్పూరం అద్దటం ఎందుకు ? స్వామివారిని పలుగుతో కొట్టిన భక్తుడెవ్వడు
>> Monday, December 28, 2009
అదో వైష్ణవగోష్ఠి .సభ గంభీరముద్రదాల్చి యున్నది . ఆదిశేషాంశ సంభూతులైన శ్రీ రామానుజచార్యులవారి అనుగ్రహ భాషణం జరుగుతోంది.ఆయనడుగుచున్నారు ." శ్రీనివాసుని దివ్యవిహారస్థలం ,వేంకటాచలం. ఈ వేంకటాద్రి భగవన్ముఖోల్లాస హేతువు ,పరాత్పరుడైన శ్రీవారికి పుష్పకైంకర్యమత్యంతప్రియకరము. పుష్పసమృద్దికి హేతువైనదీకొండ. అనవథిక సౌశీల్యగుణ ప్రథగల,దివ్యసౌందర్యశాలి ,ప్రాప్తస్వామి[అన్నివిధముల తగినట్టి] పరాత్పరుడు అగునీ వేంకటేశ్వరుడు అవస్యమారాధనీయుడు ,పుష్పకైంకర్యముచే పూజింపదగినవాడని శాస్త్రములనుచున్నవి. కనుక శ్రీ మద్వేంకటానాథుని ముఖోల్లాసముకై ఒక నందనవనమును ఏర్పరచి అనుదినము అతిసురభికుసుమ,తులసిమాలలు సమర్పించెడి కైంకర్యము సలుపగలవాడెవ్వరున్నారు ఈ గోష్ఠిలో అని అడిగారు.
అచ్చటి శీతబాధ తలచుకుని ,రక్తం గడ్డం కట్టించేంత ఆచలిలో ఈ సేవను జరుపగలందులకు భీతులైన శిష్యులెవరూ నోరు మెదపటం లేదు. భగవద్రామనుజులు శిష్యుల ముఖాలను పరిశీలిస్తున్నారు .వీరి గురుభక్తి ఇంతేనా ? అని.
వారిలో నున్న అనంతార్యుల వారికి బాధకలిగింది. అహో ! భగవద్దాసుడు ఇట్టిశీతభీతికా వణకవలెను? పరలోక హాని భయముగాని,గుర్వాజ్ఞను ధిక్కరించిన కలుగు అనర్ధములు తెలియలేకున్నారే ! గురువు ఆజ్ఝయే శిష్యునకు శిరోధార్యము ,ఆచరణీయము ఎంతదుష్కరకర్మమైనా సరే గుర్వాజ్ఞైనచో తప్పక ఆచరించవలసినదే .అని నిర్ణయించుకుని
గురుదేవా ! ఇదిగో నేను వేంకటనాథుని పుష్పకైంకర్యమునకు సన్నధ్ధుడనై ఉన్నాను అని ఎలుగెత్తి పలికెను .
ఆ అనంతార్యుని చూచి మిగులసంతసించిన ఆయోగిపుంగవుడు ! అనంతార్యా నీవుగదా పరిపూర్ణాత్మగుణ విశిష్ఠుడవు .ఆచార్యుల శాసనమును తలదాల్చిన నీవే మా నిజమైన శిష్యుడవు అని గౌరవించి ఆయనను వేంకటాచలమునకు పంపెను.
గురుపదములను తలచుకుంటూ అనంతార్యులవారు పత్నీ సమేతుడై వేంకటాచలము చేరాడు. భగవంతునికి మొక్కుతూ ఒక విశాలమైన పూలతోటను ,పెద్దతటాకమును ,ఆపూలతోటయందొక బావిని నిర్మించి ,నీరు పారించుటకొక మార్గమును ఏర్పాటుచేసుకుని స్వామి సేవ చేస్తుండేవారు. వాటన్నింటికీ తమగురునిపేరే పెట్టుకున్నాడు. అలాగే పూలమాలలు గట్టెడి మండపమును నిర్మింపజేసాడు . వనమునందు పూలు గొనితెచ్చి ఆమండపమందు కూర్చుని పూలమాలలు కట్టి బుట్టలోనుంచి ,ముక్కుకు నోటికి గుడ్డనడ్డము పెట్టుకుని,పరమభక్తితో తలనిడుకుని స్వామివారి ఆలయమునకు ప్రదక్షిణము చేసి భగవదారాధన సమయమున భగవత్సన్నిధికి ప్రతిదినము కొనిపోవుచుండెడివాడు .
ఈ అనంతార్యుడు ఈ సేవకొరకు శ్రీరామానుజ తటాకమును తవ్వుచుండగా ,మట్టిని భార్యమోస్తున్నది. పాపమా ఇల్లాలు పూర్ణగర్భిణి .కాని ఆదంపతులు స్వామి సేవే ముఖ్యమనుకొని తమ భౌతికి బాధలను లెక్కచేయక అలా శ్రమిస్తూనే ఉన్నారు. ఆతల్లి నిండుగర్భిణిగా ఇలా మట్టితట్టలు మోయటం శ్రీవారు చూడలేకపోతున్నాడు . ఒక వటువు వేషములో వచ్చాడు . అమ్మా ఆతట్టను ఇటుతే . నేను మోస్తాను .అని అడిగాడు. దానికి ఆదంపతులు వద్దుబాబూ ! ఇది మాగురుదేవులు మాకప్పగించిన సేవాభాగ్యం మేమే చేయాలి అని ఆపిల్లవాన్ని నివారించారు. అయినా మరలా వచ్చి అడుగుతున్నాడా పిల్లవాడు .దానికి వాల్లు కోప్పడుతున్నారు ,అదలించారు .అయినా సరే ఆపిల్లవాడు మరలమరలా అడ్డుతగులుతూ మట్టి మోసుకెళ్ళు ఆతల్లి చేతులలో మట్టితట్టను బలవంతంగా లాక్కుని మోసుకెళుతున్నాడు మధ్యలో వచ్చి.ఇలా పలుమార్లు చెప్పినా వినని ఆపిల్లవానిపై మట్టితవ్వుతున్న అనంతార్యులవారికి బహుకోపం వచ్చినది .తవ్వుతున్న పలుగు తీసుకుని వెంటపడ్డాడు . పిల్లవాడు ఉడికిస్తూ వెనక్కెళ్లుతున్నాడు . కోపం పట్టలేక ఆయన గడ్డపారను విసరగా అది పిల్లవాని గడ్డమునకు తగిలి ధారగా రక్తం కారటం మొదలెట్టింది . ఆపిల్లవాడు పరుగిడుతూ పోయి తన ఆనందనిలయములో ప్రవేశించాడు .అతనిని తరుముకొస్తున్న అనంతార్యులవారు గర్భగుడిలో స్వామి వారిని చూసి అదిరిపడ్డాడు. స్వామి వారి మూర్తి చుబుకం నుండి రక్తం ధారగా కారుతున్నది. విషయం అర్ధమైనది. స్వామి .కరుణాంతరంగుడు .తన భార్య శ్రమను చూచి ఓర్వలేక తానే ఆశ్రమను భరించటానికి సిద్దమై చివరకు తనచేతిలో దెబ్బతిన్నాడు .ఎంత అపచారం జరిగినది .స్వామి వారి పాదాలపైబడి వలవలా ఏడ్చాడు .తన తప్పిదం క్షమించమని వేడుకున్నాడు. ఆరక్తం ఆగుటకై పుప్పొడిని అద్దాడు. నిరంతరం కన్నీరుకారుస్తూ స్వామినివేడుకుంటూ ఉన్న ఆయనకు కోటివీణలు మ్రోగినట్లు ఆస్వామివారి లాలింపుమాటలు వినవచ్చాయి ఇలా.
అనంతార్యా ! ఇది నాలీల ,నీచే చేయబడిన గాయముకూడా శ్రీవత్స చిహ్నము వలె నాకొక అలంకారము కాగలదు. భక్తుని మహిమను వెళ్లడించుకొనుటకై నేనే కల్పించిన లీల ఇది. అది అందరికీ తెలియపరచేందుకై చుబుక స్థానమున పరిమళకర్పూర చూర్ణమును ధరిస్తాను ఇకపై .అలాగే నన్ను గాయపరచిన గడ్డపారను సర్వజనులకు సందర్శనయోగ్యముగా ఉంచాలి. అది నాభక్తపరాధీనతను తెలియపరస్తుంది . అని స్వామివారు అనంతార్యులవారిని ఊరడించారు . నాటినుండి స్వామికి చుబుకానికి కప్పురం అద్దటం మోహనరూపుడైన ఆయన కొక కొత్త అలంకారంగా శోభిస్తున్నది . ఆనాటి పలుగును కూడా మనం ఆలయం పైన దర్శించవచ్చు ఇప్పటికీ .
ఆశ్రయించినవారి నెన్నంటి ఉండడం స్వామికెంతో ఇష్టం .
5 వ్యాఖ్యలు:
స్వామి వారు అనంతాళ్వార్లు వెంటపడుతున్నప్పుడు అడ్డదిడ్డంగా పరుగెత్తారు కదా. అందుకనే ఈనాటికీ ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవంలో శ్రీవారి పల్లకీని అడ్డదిడ్డంగా మోస్తూ అంటే ముందుకు,వెనుకకు,పక్కలకు ఇష్టం వచ్చినట్లు తీసుకొని గుడిలోనికి కూడా పరుగెత్తుతూనే వెళ్ళిపోతారు.
అలానే అనంతాళ్వార్లు త్రవ్విన కోనేరు వైకుంఠం "క్యూ" కాంప్లెక్స్ పక్కన మనం వెళ్తుంటే కనిపిస్తుంది.
కర్పూరం ఎందుకు పెడుతారని చాలామందిని అడీగాను. ఈరోజు మీపుణ్యమాని దానికి జవాబు దొరికింది. ధన్యవాదాలు
ప్రాయః ప్రపన్నజనతా ప్రథమావగాహ్యౌ
మాతుస్స్తనావివ శిశోరమృతాయమానౌ।
ప్రాప్తౌ పరస్పరతులావతులాన్తరౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే।।
సురేశ్.చైతన్య.రాఘవులకు నెనరులు
చాలా మంచి విషయం తెలిపారు. మొన్న ఇటీవల గుడి కి వెళ్ళినప్పుదు మొదటి సారి పలుగు ని చూసి ఇక్కడ ఎందుకు ఉందా అని చాలా మందిని అదిగినా తెలియలేదు. ఈనాటికి మీ పుణ్యమా అని తెలిసింది.
మీకు క్రుతఘ్నతలు.
Post a Comment