శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చేతులెత్తి మొక్కుతూ ":తెలుగుజాతికొక వేడికోలు"

>> Monday, December 14, 2009

శ్రీరామ
_______

తెలుగుజాతి కొక విన్నపము. ప్రస్తుతకాలము రాష్ట్రానికి కష్టకాలము. జనజీవితములో తీవ్ర ఆందోళనలు పెరిగి అంతటా అభద్రతా భావాలు పెచ్చురిల్లి అశాంతి రేకెత్తుతున్నది. రాష్ట్ర అవతరణమే "చిత్తా" నక్షత్రములో జరిగినది .ప్రస్తుతము ఆ నక్షత్ర రాశి యగు" కన్య"లో శని సంచారం వలన ఉత్పాతాలు పెచ్చురిల్లితున్నాయని పెద్దలు చెబుతున్నారు. అన్నదమ్ముల మధ్య పరస్పర అనుమానాలు , రేకెత్తి కత్తులు దూసుకునేస్థితి కొస్తున్నారు.అంతటా ఆవేశకావేశాలు పెరుగుతూ భయాందోళనలను కలిగిస్తున్నాయి.

ఈసంవత్సరము ప్రారంభం లోనే విరోధి నామ సంవత్సరం లో ఇటువంటి ఉత్పాతాలు జరగనున్నాయని హెచ్చరించి భక్తజన రక్షణార్ధం ఏబది నాలుగురోజులపాటు [ఉగాదిమొదలుగా ]" హనుమత్ రక్షాయాగం" నిర్వహించుట జరిగినది. ఇందు పాల్గొన్నవారికి వచ్చిన ఫలితాలు తెలుసుకుంటున్న కొద్దీ భగవంతుని కృపపైన మాకు అనన్యమైన శ్రద్దను పెంచినది .
ఆరోజు హెచ్చరించిన విషయాలు వరుసగా ఒక్కొక్కటి వాస్తవానికొస్తూ లోకానికి హానికారకంగా మారుతున్నాయి. రానున్న కాలంలో జరగబోయే అనర్ధాలనుండి జాగ్రత్తపడమని సూచించటానికై అపారకరుణతో మన మహర్షులు మనకు ప్రసాదించిన విజ్ఞానసంపద జ్యోతిష శాస్త్రము సహాయముతో ఈ హెచ్చరికలను పెద్దలు పంచాంగ కర్తలు తమ బాధ్యతగా లోకానికి తెలియజేశారు. అయితే జ్యోతిషశాస్త్రము హెచ్చరిస్తుంది . ప్రమాదం నుంచి తప్పించుకునే పురుషప్రయత్నము మానవుని బాధ్యతే. ఉన్న విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామో లేక అపహాస్యం చేసుకుని మన అవివేకాన్ని వంద సిద్దాంతాలతో కప్పిపుచ్చుకుంటామో మన ఇష్టం .

ఇక ప్రస్తుత తరుణం లో కలిపురుషుని ఇనుపగజ్జెల పదఘట్టనలతో పుడమి దద్దరిల్లుతున్నది. అనేకానేక ఉత్పాతాలు ,వివాదాలతో జనం పరస్పరం కలహించుకుంటూ తమ సంపదలను శాంతిని తామే ధ్వంసం చేసుకుంటున్నారు. అదితప్పో, ఒప్పో ఆలోచించుకోలేని ఓ ఉన్మాదస్థితి .కారణం యోచనాజ్ఞానాన్ని కప్పేసిన ఆవేశం. దానిని పెంచుతున్న కలిపురుషుని సైన్యం. పవిత్ర దైవస్థలాలలో మనం చేస్తున్న అపచారాలు కలగలసి ఈ అశాంతి కి కారణ మవుతున్నాయి. మనసులలో కలహప్రియత్వం పెరుగుతున్నది. దీనికి సైదోడుగా ఆసురీ శక్తులు రాజకీయరాక్షసక్రీడలాడుతున్నాయి , ఇందులో ఏప్రాంతం మినహాయింపు కాదు .

ఈసమయం లో భగవంతుని ఆశ్రయించటం వినా గత్యంతరం లేదు. ప్రస్తుతం రాష్ట్రప్రజలలో నెలకొన్న విబేధాలు సమసిపోవాలని . పరస్పరం ప్రేమభావాలతో తమందరికీ సరిపడే నిర్ణయాలను తీసుకోవాలంటే అందరిలోనూ ప్రేమ,సౌహార్ధభావాలు వెల్లి విరియాలి .అందుకు భగవన్నామమే సరయిన మందు . కనుకనే అందరి మనసులూ కలవాలని అందరికీ శాంతి సౌభాగ్యాలు కలగాలని ,అందరి ధర్మబద్ధమైన ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతూ భగవత్ అనుగ్రహం కొరకై ఒక శాంతిక్రతువును నలభైరోజుల పాటు నిర్వహించాలని సంకల్పం చేస్తున్నాము. ఇది ఒక్కరి సంకల్పంతో సాధ్యంకాదు. చినుకు ,చినుకు వాగులై వంకలై ,నదులై మహోన్నతోత్తుంగతరంగప్రవాహం గాసాగినట్లు మీ అందరి సంకల్పాలను ,సాధనలను అనుసంధానం చేస్తూ క్రతువు నిర్వహించాలని ప్రయత్నము . లోకకళ్యాణమునకై సంకల్పిస్తున్న ఈ యాగమునకు మీ అందరి సహాయ సహకారములను అందించాలని వేడుకుంటున్నాము. యాగవివరాలన్నింటినీ మీకు ఇక్కడ అందిస్తాము రేపు ఎల్లుండి లోపల. దయచేసి గమనించండి ఇది జాతికందరికీ ముఖ్యంగా తెలం"గాన"మైనా ఆంధ్రరాగమైనా అందరి క్షేమం కోసం సాగుతున్నందున రంధ్రాన్వేషణ చేయవద్దని చేతులెత్తి మొక్కుతున్నాము.

భక్తజనదాసదాసానుదాసుడు

దుర్గేశ్వర




8 వ్యాఖ్యలు:

Anonymous December 14, 2009 at 5:25 AM  
This comment has been removed by a blog administrator.
Bhãskar Rãmarãju December 14, 2009 at 5:59 AM  

మంచిమాట చెప్పారు మాష్టరూ...
ఇప్పటి ఈ జనం *ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ*లా ప్రవర్తిస్తున్నారు.

Anonymous December 14, 2009 at 6:01 AM  

Be open and don't remove comments just becoz they are against ur opinions!

malla December 14, 2009 at 6:13 AM  

మీ సత్సంకల్పానికి నా ధన్యవాదములు. భగవత్కృప, మానవ ప్రయత్నం తోడై మీ అభీష్టం సిద్దించాలని, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న అశాంతి నశించాలని ఆశిస్తున్నాను

Unknown December 14, 2009 at 6:16 AM  

దుర్గేశ్వరరావు గారు, ఎప్పటిలానే ధార్మిక బాధ్యతగా అందరి హితవు కోరి మరో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఏ రూపంలో నా సహకారం కావాలన్నా అందించగలను.

రవి December 14, 2009 at 6:37 AM  

లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు! ఈ ప్రయత్నం విజవంతవమవాలని ప్రార్థిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. December 14, 2009 at 9:14 AM  

అర్యా! దుర్గేశ్వరా! నమోనమః.
సరైన సమయంలో సరైన నిర్ణయం. అత్యంతావశ్యకమిది ప్రస్తుత పరిస్తితిలో. మీరు సంకల్పించాలే గాని ఆభగవంతుడు జరపకుండా ఉంటాడా. వాంఛితార్థ ఫలసిద్ధిని వాంఛిస్తున్నాను.
జై శ్రీరాం.

విశ్వ ప్రేమికుడు December 14, 2009 at 7:03 PM  

మంచి ప్రయత్నం చేస్తున్నారండీ.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP