శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గుణత్రయ సాంగత్యం

>> Sunday, November 22, 2009

సత్వరజస్తమోగుణాలు ఒకదానితో ఒకటి కలుస్తూఉంటాయి మరలా ఆశ్రయిస్తూ కూడా వుంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవలం వీటిలో ఏదో ఒక్కగుణమే ఎక్కడా వుండదు.ఎప్పుడూకలిసేవుంటాయి .అన్యోన్యాశ్రయాలు.

జ్ఞాతమైన పనిపట్ల శ్రధ్ధ అనేది ఫలానుభూతి లభించేవరకు ఉంటేనే అదిపరిజ్ఞాతమవుతుంది..లేకపోతే నిష్ఫలం .ఏదైనా విన్నంతమాత్రాన్నే చూసినంతమాత్రానే పరిజ్ఞాతం కాదు ,అనుభూతం కావాలి. ఉదాహరణకు తీర్ధయాత్రలగూర్చి ఎవరో చెప్పగావిని రాజసమైన కోరికతో అతడు ఆతీర్ధాన్ని దర్శించి స్నాదాలు చేసి మహాదానాలు చేస్తాడు. ఇంకా కొద్దికాలం అక్కడ నివసిస్తాడు . ఆపైన తిరిగి ఇంటికివచ్చాక మళ్ళీ మామూలే . తన రాగద్వేష కామక్రోథాదులు అన్నీ యథాతథం .మరింకేమి మిగిలింది శ్రమతప్ప.? ఇతనికి విన్నది అనుభూతంకాలేదు. తీర్థసేవనకు ఫలం నిష్కల్మషత్వం .అలాంటి ఫలం లభించలేదు .ఇది రజోగుణం .రాగద్వేషాలను వదిలించుకోకుండా ఎన్ని తీర్ధయాత్రలు చేసినా నిష్కల్మషత్వం రాదు. రైతు నేలదున్నేదగ్గరునించిజాగ్రత్తలు తీసుకుని పంట చేతికొచ్చేసమయాని ఆదమరిస్తే పంటంతా పశుపక్ష్యాదులపాలవుతుంది.అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే సాధకునికి సత్వానుభూతి కలగదు.

శాస్త్రదర్శనాదులవల్ల సత్వగుణం వృద్దిచెంది వైరాగ్యభావం కలుగుతుంది ఐనా ,తమోరజోగుణాల సాంగత్యం తో నిత్యమూ పరాభవాలను అనుభవిస్తుంది . నిరంతరం ఘర్షణే .కనుక సత్వగుణానిన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి.అదిపెరిగినప్పుడు వైరాగ్యం తమోరజగుణాలను జయించి బుద్ధిధర్మమార్గాన్ని అనుసరిస్తుంది. బాహ్యార్థాలనువాంచించకయజ్ఞయాగాదులపట్ల ఆసక్తమై యథాలాభ సంతుష్టి ఏర్పడుతుంది.
ఇలాముందుగా రజోగుణాన్ని నియంత్రించి తమోగుణాన్ని అంతం చేయాలి. అప్పుడుగాని సత్వం నిలవదు. అలాకాక రజోగుణం పెరిగిఒనదనుకో ,అధర్మాలలో శ్రద్ధకలిగి సనాతన ధర్మాన్ని వదిలేయాలనిపిస్తుంది .ఇక తమోగుణం వృద్దయితే వేదశాస్త్రాలపట్ల విశ్వాసం నశిస్తుంది .దుష్కర్మలతో అక్రమమార్గాన్నయినా ధనం సంపాదించాలనే ఆరాటం మొదలవుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వగుణలక్షణాలు కనుమరుగై కామ చోరభావాలు రాజ్యమేలుతాయి..

అయితే ఈ గుణాలు ఒంటరిగా వుండవు ఒకప్పుడు సత్వరజస్సులు, మరొకప్పుడురజస్తమస్సులు, మరోకప్పుడు సత్వతమోగుణాలు జంటలవుతాయి .మూడవదానిని అణగదొక్కుతాయి. బుద్ధిస్థానాలైన ఈజంటలు మిథునాలవుతాయి .పరస్పరం ప్రబోధించుకుంటూవుంటాయి.

నారదా ! ఈగుణ సాంగత్యం చాలాచిత్రంగాఉంటుందొకప్పుడు .కేవలం సత్వం తనంత తానుగా ఒక్కటిగావుండదు అలాగే రజస్తమస్సులకు ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సవతికి సేవచెస్తుందా? నిర్మలంగా వున్ననైజ గుణాన్ని రజస్తమస్సులు మురికి చేస్తాయి. వాటిమురికిని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోగలిగితే సత్వం ప్రవేశిస్తుంది. అప్పుడు మిగతావి కుళ్ళుకుంటాయి . సవతులు ఏడ్చినట్లుగా .భార్యసేవలకు భర్త సంతోషిస్తే సవతులు ఏడుస్తారు. రాజభటులను చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు.వానకురిసి రైతు సంతోషిస్తుంటే ఇంటిపైకప్పులేనివాడు తిట్టుకుంటాడు.. స్వభావస్థమైన గుణాలు అవస్థా బేధాలనుబట్టి ఇలా సుఖదు"ఖాలను కలిగిస్తుంటాయి.

నారదా ! ఈ గుణాలను పోల్చుకోవటానికి గుర్తులు చెబుతాను విను. దేనినైనా సరే తేలికగా చూడటం ,తేలిగ్గాలేవడం తేలిగ్గాపోవడం ,మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉండటం ఇవి సత్వగుణసమృద్దికి నిదర్శనాలు. శరీరం లో జృంభాస్తంభ,తంద్రాచంచలత్వాలుకనిపిస్తే అవి రజో గుణానికి కొండగుర్తులు. కలిని వెతుక్కుంటూ వెళ్లడం ,చిత్తచాంచల్యం ,దుష్టులతో స్నేహం ,బరువుపెరగటం వివాదాలకు కాలుదువ్వడం ఇవి తమో గుణలక్షణాలు. ఇంద్రియాలు మనస్సు శూన్యమై పోతాయి నిద్రనుకోరడు.

ఇలా బ్రహ్మదేవుడు గుణలక్షణాలను విశదీకరించగా నారదుడు శ్రద్దగా విని లబ్దిపొందాడు. మరొక సందేహం పొటమరించింది.వినయంగా ప్రశ్నించాడు. తండ్రీ ! విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకేచోట ఎలా నిలుస్తున్నాయి? కలిసి ఎలాపనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పరం శత్రువులుకదా !

పుత్రా! ఈగుణాలు దీపాలవంటివి . పత్తి నూనె మంట ఇవి పరస్పర విరుద్దాలే అయినా దీపం వస్తుదర్శనం చెయ్యడం లేదూ ! తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుద్యమే .అలాగే అగ్నికి వత్తితో తైలంతో శతృత్వమే అలాగే మూడోదానికి కూడా ఐనా కలిసివుంటున్నాయి .వెలుగుతున్నాయి.పదార్ధాలను ప్రదర్శిస్తున్నాయి .ఇలాగే గుణాలు వాటి కలయికా ప్రకృతి సిద్దాలు .అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పగా నారదుడు వ్యాసునికి,వ్యాసుడు జనమేజయునికి చెబుతున్నాడు.

జనమేజయా ! ప్రకృతి సిద్దాలైన ఈ మూడు గుణాలే విశ్వప్రాదుర్భావానికి కారణం .కనుక గుణలక్షణవిభాగం తెలుసుకోవటం ముఖ్యం .దీనికంతటికీ కారణమైన సర్వవ్యాపకతా లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించటం అన్నింటికన్నా ముఖ్యం .సగుణ నిర్గుణ కార్యబేధాలన్నీ శక్తి ప్రభావ సంజాతలే .నిరూహుడు ,పూర్ణుడు.పరముడు,అవ్యయుడు అగు పురుషుడు అకర్త.సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది ........................................

{ దేవీ భాగవతం నుండి }

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP