మానాయన పాండిత్యం కొంత .... నాపైత్యం కొంత.
>> Tuesday, November 17, 2009
అర్ధ జ్ఞానం తో పండితుడనని వాదనలు చేసే నాలాంటి ఓ తల తిక్క పంతులు గారిని మీలాంటి మహాను భావులెవరో అడిగారట ఎగతాళిగా . అబ్బా! మీరిన్నిన్ని విషయాలను ఎక్కడ నేర్చుకున్నారండి .ఎవరితోనైనా అడ్డగోలుగా వాదించగలుగుతున్నారు . దానికి ఉప్పొంగి ," మానాయన నేర్పిన పాండిత్యం కొంత ,నాపైత్యం కొంత కలగలిపి చెప్పేస్తున్ననోయ్ ... అని అసలు విషయం వెళ్ళబెట్టాడట .
అలాగే ,నేడు ఆథ్యాత్మిక విషయాలలో మిడిమిడి జ్ఞానంతో తాము నేర్చుకున్నరెండు ముక్కలే జ్ఞానమని ,తాను అనుసరిస్తున్న మార్గమే మొదటిదని ,ఇంతకుముందున్న జీవులంతా అజ్ఞానులనే వాదనలతో బోధనలు చేసేవారిని చూస్తుంటే ఈ సామెత గుర్తుకొస్తున్నది.
ఏదో పూర్వజన్మ సుకృతంగా ఈ పథాన అడుగులు నేర్చుకుంటూన్న నాకు ఇలాంటి సాధకులు[వారే ప్రకటించుకుంటారు] ఆథ్యాత్మిక బోధకులు అప్పుడప్పుడూ తగులుతుంటారు . వీళ్లవాదనలు ఎలావుంటాయంటే . సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనే విషయము వాస్తవమే కానీ అది మావూర్లో ప్రాగ్దిగ్భాగాన మాత్రమే ఉదయిస్తారంటారు .ఓరి మగడా ! మాఊర్లో కూడా తూర్పునే ఉదయిస్తాడయ్యా అంటే చత్..... అలా జరగదు మేము చెప్పినదే ..ప్రాగ్దిగ్భాగానమాత్రమే ఉదయిస్తాడు . నువ్వు నేర్చుకున్నది తప్పు అంటారు.
ఇలాంటి ఆథ్యాత్మిక సంస్థలు ,వాదనలు సిద్ధాంతాలు రోజు కొకటి పుట్టుకొస్తూ అసలు పెద్దలు చెప్పిన దివ్యపథాన్ని తెలియకుండా గందరగోళాలు సృష్టిస్తూ ఆథ్యాత్మిక మార్గం లో అడుగుపెట్టాలనుకునే వారిని చికాకు పరచి ,ఈమార్గమే సత్యం కాదన్న అపోహను కలిగిస్తున్నారు. తాతగారు బ్రహ్మం గారు నాడు చెప్పారు "ఉల్లిగడ్డకు కూడ ఉపదేశమిచ్చేటి కల్లగురువులు భువిని పుట్టేరయా " అని . అంతకుమునుపు భవిష్య.భాగవత పురాణాదులలో కలిలో ఆథ్యాత్మిక మోసాల లెలా ఉంటాయో భగవాన్ వ్యాసదేవులు వర్ణించి వున్నారు.
కలి పురుషుడు మహా మాయావి. తగవులంటే అత్యంత ప్రీతి . భగవన్మార్గాన పయనించే వారిని పలు రకాలుగా వంచించి పతనం గావించటం అతని లక్షణం . ఇవి కూడా భగవన్మార్గాలే అనేలాగనో లేక ఇవి మాత్రమే భగవన్మార్గములు అని వాదులాటకు తిరిగేలా వాటిని సృష్టిం చి నమ్మించి ఆమార్గాన గొర్రెల మందలా జనం నడిచేలా చేయగలడు.
మనిషి ఆలోచనాఅస్థితిని కోల్పోయి అత్యంత మమకారానికి లోనై తన లోపల దాగివున్న బలహీనతలను వ్యక్తపరచుకునే అవకాశం .అవి తప్పుకాద అనే సమర్ధన ఇచ్చే మార్గాలు నిజమని నమ్మి తాను పతనా వస్థకు చేరుతాడు. అంతటితో ఆగడు .తా చెడ్ద కోతి వన మెల్లా చెరిచిందని ఇతరులను కూడా ఈ మార్గం లోకి లాగటానికి తీవ్రంగా శ్రమిస్తాడు. తనతో భావసారూప్యత గల గుంపులను పెంచటమే ఆథ్యాత్మిక ప్రచారమని భగవంతునికిష్టమైన పనని మురిసి పోతుంటాడు .
మానవ జాతిని ముక్తి మార్గం వైపునడిపిన పూర్వులచే ఆచరించబడి ,సూచించబడిన మార్గాలు అన్నీ వ్యర్ధమనే అహంకారపూరిత వాదనలను చేస్తూ , అణువణువునా అహంకారాగ్నిని ప్రజ్వరిల్లజేసుకుంటూ చివరకు దానికే దగ్దమవుతాడు. దీనికీ కారణమున్నది .
ఉన్నది ఒకేసత్యం . కలిమాయనుంచి జీవులను రక్షించాలనే తపనతో మహాత్ములు, ఋషులు ,ముక్త జీవులు,దయార్థహృదయం తో ప్రయత్నాలు సాగిస్తారు . ఈమార్గాలకు ఆకర్షింపబడాలని జీవుల కొరకు స్థాయీ బేధాలననుసరించి వలసిన రకరకాల సిద్ధాంతాలను ప్రవేశ పెడతారు . నేరుగా వారినుంచి ఈ జ్ఞానాన్ని అందుకున్న మొదటి తరం శిష్యులకు సత్యం పట్ల తమ సద్గురువులు ఎటువంటి బేధం చూపించలేదనే గమనిక ఉంటుంది . తరువాత తరువాత వచ్చే వారి పైన కలి తన మాయా జాలాన్ని కప్పుతాడు . వారికి మాత్రం ఇక ఇదే సృష్టికి ప్రారంభం ,అంతం అనే పైత్యం బాగా ఎక్కుతుంది . ఎందుకంటే గుంపులచేర్చుకుని వారిచేత పొగిడింపజేసుకోవాలనే దుగ్ద ఎక్కువై .
ఈ సాధక మహానుభావులు తాము అనుసరించే మార్గం చెప్పినదాని లోతులకెళ్లరు . ఆమార్గం లో తీవ్రసాధన చేసి దాని అంత్యమైన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆసక్తి కలిగి యుండరు . అసలు వీళ్లకు నేర్చుకుందామనే ఆసక్తికంటే , నేర్పుదామన్న కుతి ఎక్కువ. అందుకనే వీళ్ళు మిగతా మార్గాలలో ఏమి చెప్పారనే విషయాన్ని పరిశీలించరు ,దానిని తాము నేర్చుకున్నదానితో సమన్వయమ్ చేసుకోరు . తాము విన్న నాలుగు ముక్కలను ఇతరులముందు భాషావిన్యాసాలతో ప్రదర్శించి గొప్పవారిలా ఆనంద పడిపోతుంటారు . తేనెటీగలా మనిషి పలువురు మహాత్ములపాదపద్మాలవద్దకు చేరి మకరందాన్ని గ్రహించాలి, అని సూచించిన పెద్దల మాట వినరు. అలాచేస్తే ఎల్ల ఎడలనిండి వున్న సత్యం అనుభవగోచరమవుతుంది . వాదబేధాలు నశించి వాస్తవ మైన భగవత్ పథాన పయనిస్తారు.
కొన్ని చిత్రాతి చిత్రమైన వాదనలకు సమయాన్ని ఇచ్చి వృధా చేసుకోలేక ఇక్కడ వ్రాస్తున్నాను.
ఇప్పుడు కొత్తగా ప్రాచుర్యం పొందుతున్న కొన్ని మతశాఖల అనయూయులు చేస్తున్న వాదనలువింటే మనకు వున్న మతి కూడ పోతుంది . కొత్త కాలానికి కొత్త జ్ఞానమట. జ్ఞానమనేది కొత్తా ,పాత అనేదిగా వుంటుందని పెద్దలు చెప్పగా నేనువినలేదు . తాము అనుసరించిన మార్గం లో పయనిస్తే మాత్రమే లోకం లో శ్రేష్టులుగా దివ్యత్వం కలిగినవారిగా మారతారట. జ్ఞానం లేనందునే మిగతావారు ఇంకా తమ స్థాయికి చేరు కోలేదట. పూర్వం మనం విన్న పురాణాదులు ,దైవగ్రంథాలు అన్నీ పుక్కిట పురాణాలట. వాడు వీడూ అని కూడా వాదనలో చరిత్రలో చెప్పిన మహాత్ముల గూర్చి మాట్లాడగల కుసంస్కారులు వీరు . మరి మన పూర్వ ఋషులు ,ఆధునిక కాలం లో రామకృష్ణులు,శ్రీ రమణులు ,అరవిందులు,షిరిడి సాి ,అక్కోల్ కోట్ స్వామి , తాజుద్దీన్బాబా , వంటి మహనీయులంతా వీరి మార్గాన్ని అనుసరించలేదు కాబట్టి తరించలేదని అర్ధమా? వీరిమార్గం వారు పుట్టేప్పటికి లేదుకదా ? మరెలా పాపం .
వీళ్లగూర్చి మరో చిత్రమైన విషయం నేను పరిశీలించినది చెబుతాను . వీళ్ళుమనమార్గం లో అంటే ఇప్పటిదాకా ఈ నేలమీద పెద్దలు సూచించిన దివ్య మార్గం లో వున్నంత కాలం ఏ నాడూ మన దివ్య గ్రంథాలను పరిశీలనాత్మకంగా చదివింది లేదు . ఆయా మార్గాల సు ముక్తులైన మహానుభావుల చరిత్రలు తెలుసుకున్నది లేదు . అవన్నీ మాకు తెలియదు , మేమనుసరించే మార్గం లో మాత్రమే మానవులు దివ్యులుగామారుతారు ,దేవీ దేవతలై ోతారనే వితండవాదం మాత్రం చేయగలరు . ఏసీ రూముల్లో ,ఫాన్ గాలి సుఖం లో గురువు కెదురుగా ఉన్నత స్థానాలలో కూర్చుని సాగించిన వీరి సాధన ఎంతమందిని దేవీ దేవతలుగా మార్చిందో మనకు తెలియదు. మాకు మనశ్శాంతిగా ఉంది . హాయిగా సాగుతుంది అనేమాటలు ప్రమాణం కాదు . దివ్యులుగా మారిన వ్యక్తులు తమకోసం కాదు సృష్టి కళ్యాణం కోసం జీవిస్తారు . అలా ఎంతమంది తయారవగలిగితే ఆ కల్ట్ అంత గొప్పది . ఈరోజు హిందుత్వం లో వున్న కూలి చేసుకునే వాడుకూడా సాటిజీవికోసం తనకున్నది పంచుతున్నాడంటే ఆ సంస్కారాలను ఇచ్చిన ఈ ఆథ్యాత్మిక మార్గం ఎంత దివ్యమైనదో ఆలోచించాలి .
కొత్త పథాన నడవటం తప్పుకాదు .నీ సంస్కారాన్ననుసరించి నీకు ఆమార్గము ,ఆగురుపరంపర చేరువయ్యాయి . నిజాయితీగా సాగి భగవంతుని చేరుకో . అంతేగాని ఇతరుల మార్గాలన్నీ తప్పు అనే మూర్ఖవాదనలు చేస్తే పతితులమై నరకాన పడతాము . అప్పుడు మానవునికంటె శ్రధ్ధాశక్తులతో ధ్యానించి భగవంతుని చేరిన జంతువులకంటె హీనమై పోతుంది మన జన్మ .నేనేదో గొప్ప సాధకుడనై ఇది వ్రాయటం లేదు . పెద్దల ద్వారా విన్న ఈ పాఠాన్ని బట్టీ పెట్టి మీకప్పగిస్తున్నానంతే.
సర్వే జనా సుఖినోభవంతు .
[ఈ వ్యాసంలో ఏదైన లోకానికి మేలు చేసే విషయాలన్నీ సద్గురు పరంపరవి. లోకానికి ,ఇతర్లకు బాధ కలిగించేవి వుంటే అవి ఖచ్చితంగా నా అజ్ఞానం నుంచి జనించినవి గా మన్నించి క్షమించగలరు ]
2 వ్యాఖ్యలు:
చాలా బాగా చేప్పారు గురువు గారు
మనల్ని మన వారే తక్కువ చేసుకుంటున్నారు అదే విచారం
కాస్తా విదేశి చదువులు చదివేటప్పటికి ఇక్కడి మన సంప్రదాయల మీద కారు కుతలు కుస్తారు
"ఈరోజు హిందుత్వం లో వున్న కూలి చేసుకునే వాడుకూడా సాటిజీవికోసం తనకున్నది పంచుతున్నాడంటే ఆ సంస్కారాలను ఇచ్చిన ఈ ఆథ్యాత్మిక మార్గం ఎంత దివ్యమైనదో ఆలోచించాలి ."
అధ్బుతం గా చెప్పారండీ!!
Post a Comment