శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మన కర్మలకు పద్దెనిమిదిమంది సాక్షులు

>> Tuesday, November 9, 2021

💐💐💐మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు.💐💐💐

చుట్టూ ఎవరూ లేనప్పుడు ....అనుకున్నప్పుడు...!

తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ.. ‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.
 
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.
 
అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.
 
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP