ఇది మతవిద్యకాదు ! ధార్మికవిద్య .ధర్మమంటే ఏమిటో తెలిపేవిద్య
>> Monday, August 3, 2009
పసితనం నుంచి పిల్లలకు మతవిద్య అవసరం లేదు అనే వాదనపై కొద్దిగా పరిశీలన జరుపుదాము.
ముందుగా మతమంటే ఏమిటి అనేది నిర్ధారించుకుందాము. మతమంటే ఒక మార్గము, ఒక అభిప్రాయము ,లేదా ఒక సిద్దాంతము కూడా కావచ్చు .కొద్దిమంది లేక పెద్దసమూహం యొక్క నమ్మకం కావచ్చు .అది సత్యమైనా కావచ్చు కాకపోవచ్చు. ఒక్కోసారి మనం అంటుంటాము వాడిమతం వేరురా వాడు ఎవరు చెప్పినా వినడు అని . కాబట్టి ఈరీతి లోచూస్తే మన పుణ్యభూమి యగు భరతఖండములో వున్నది మతమా ? కాదు అనిచెప్పవచ్చు .ఎంతోమంది మహాత్ములు చూపిన బాటలు ఎన్నోవున్నాయి .ద్వైతం ,అద్వైతం ఇలా చాలా . అవి సత్యాన్వేషకులైన మహాత్ములు మానవాళికి చూపిన బాటలు .ఆయామార్గాలను ఆచరించే కోట్లాదిమంది మాత్రం వీటన్నిటినీ ఒకేదృష్టితో చూస్తున్నారు. అంటే ఇక్కడ ఈమతప్రవక్తలు లేక సిద్దాంతకరతలు చెప్పినది ఏదో అదిమాత్రం ఒక్కటే .అది సత్యము సత్యము సత్యము.
దానినే ధర్మం అంటాము. మతాలు మారినా ధర్మం మాత్రం మారదు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేది ప్రకృతి ధర్మం .అది ఎంతమంది ఎన్నిరకాలుగా ఎన్నిభాషలలో చెప్పినా మార్పులేని ఒకేధర్మం . కాబట్టి మనం వారసత్వంగా పొందుతూ వస్తున్నది మతం కాదు .ధర్మాన్ని . కనుక మనది హిందూమతం కాదు ,హిందూధర్మం . కనుకనే ఇది ధర్మ భూమి అయినది. పరమాత్మ వాదనలకు అందని నిత్యసత్యధర్మం . దానిని మనం తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఆయన సత్యం . కనుక ఆసత్యాన్ని నమ్మిన మహర్షులు ,జగద్గురువులు ఈపుణ్యభూమిపైనే అవతరించి మానవాళికి సత్యమైన మార్గాన్ని ధర్మయుక్తమైన జీవితమార్గాన్ని పలురకాలుగా బోధించి శాసించి నిర్దేశించారు .ఇది మానవాళి సంపూర్ణవికాశానికి ,మానవ శరీరం లోవున్న ఆత్మ ,అవ్యక్తంగావుండే ఆ పరమాత్మను చేరుకుని పరిపూర్ణత పొందటానికి .
కనుక మనది హిందూధర్మము . ఇందులో మానవుడు తల్లి గర్భం లో పడ్డప్పటినుండి పెరిగేదశలలోనూ ఉడిగేదశలలోనూ చివరకు కాటికి ఒరిగేదశలోనూ .ప్రతి దశలోనూ ధర్మానికనుగుణంగా ను దైవం పట్ల విశ్వాసం తో మమేకమై జీవన యానం సాగిస్తాడు. చిన్నప్పడు తల్లికడుపున పడటానికి కారణమైన సన్నివేశాన్నుంచి సీమంతము .జాతకర్మ .నామకరణం ,అక్షరాభ్యాసం ,ఒడుగు చేయటం ,వివాహం ,షష్టిపూర్తి ,మరణసమయాన తులసితీర్థసేవనం ,దశదినకర్మకాండలనుండి పిండప్రదానాలదాకా ప్రతిదశ అథ్యాత్మిక మేళవింపుతో .ప్రకృతి ధర్మాలకు,దైవన్యాయానికి అనుగుణంగా పుట్టి ,జీవించి మరణించటం మన ప్రత్యేకత .ఇతరులలాగా మనకు దేవుడు ,వేరు జీవితం వేరుకాదు ,దైవంతోనే జీవితం .ధర్మం తోనే జీవనయానం సాగుతుంది.
మనజీవితం లో దైవానికి ఏ ప్రాధాన్యత నిస్తామో .ధర్మానికి అదే స్థాయి లోవిలువనిస్తాము. అసలు మనకు ధర్మమే దైవమని మనవిద్యనేర్పుతుంది. కనుక మానవునిగాపుట్టుటం కేవలం తిని ఆనందించి భౌతిక సుఖాల సంపాదనలో పరుగులిడటమే మన విద్యాలక్ష్యం కాదు కనుక .సాటి జీవరాశికి మేలు చెకూర్చతమే అసలు విద్యగా విద్యయొక్క లక్ష్యం గాచెప్పబడుతున్నది. కాబట్టి చదువు విజ్ఞానాన్ని పెంచటానికి అని గట్టినమ్మకం .అది భౌతిక వనరులను పెంచే నేటి విజ్ఞానమని చెప్పబడుతున్నదికాదు .అంతకంటె వున్నతమైనది . అత్యున్నత స్తాయి మానవత్వాన్ని నేర్పగలది ఆవిజ్ఞానాన్ని పొందటమే మన అసలు లక్ష్యం . కనుక అది ప్రసాదించే పరమాత్మకు సన్నిహితంగా వుండే భావాలతోనే మనవిద్యావిధానం సాగేది గతం లో .
ఈలక్షణాలను లక్ష్యాలను కలిగివున్న మానవుడు సాటి జీవరాశి కి శత్రువుగామారక విశ్వమునకు మితృడుగా మార్తాడు. కనుకనే ఒకవరుసలో జీవిత విధానం నేర్పారు మనవాల్లు .ధర్మార్ధ కామ మోక్షాలు అని. అంటే ముందు నేర్చుకోవలసినది ధర్మం అదితెలిసినవాడు అర్ధాన్ని[డబ్బుని] కూడా ఆదారిలోనే సాధించ యత్నిస్తాడు. అలాసాధించిన డబ్బుతో కామాన్ని అంటె కోరికలను తృప్తిపరచి మోక్షాన్ని గూర్చి సాగుతాడు తరువాత దశలో..
కాబట్టి ఈసోపాన మార్గం లో సాగేప్పుడు మొదటి దశ విద్యార్ధి గా ముందు ధర్మాన్ని నేర్చుకుంతాడు.ధర్మమంటె ఏమిటి ? అది దైవంతో సమానము . మరిదైవమంటె తెలియకుంటే ధర్మము యొక్క ఔన్నత్యం తెలియదు కదా ! కనుక దైవాన్ని గూర్చిన విజ్ఞానం మనకు పురాణాలద్వార కథలద్వారా .పలువురు సమాజానికి బోధించేవారు. ఆదైవభక్తి చిన్నతనాన్నే నేర్చుకున్నవాడు సమాజానికి హితుడుగా తనను తాను మలచుకుంటాడు. మహోన్నతమైన విలువలు అలవర్చుకుంటాడు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటం టే మిగతా మతాల లో భగవ్ంతుడు వేరని ధర్మం వేరని చెప్పబడితే ఇక్కడ మాత్రం ధర్మమే దైవమని చెప్పబడుతుంది. ధర్మాచరణలో అవసరమైతే దైవాన్నెదిరించినా ఆదైవానికి అది సంతోషమేనని బోధింపబడుతుంది. కనుకనే ఈవిద్యావ్యవస్థ లోపెరగగలిగిన పిల్లలు ధర్మానికి హానికలిగితే సహించరు. ఒకదైవం పేరుతో హింసకు ,ఇతరుల మనసు నొప్పించటానికి సాహసించరు. అది ఇక్కడవిద్యలో గొప్పతనం .
ఎక్కడో పిల్లలకు మతవిద్యనిచ్చి యుక్తాయుక్తవిచక్షణను లేకుండా మతమౌఢ్యులుగా మార్చుతున్నారేమో తెలియదు. కాని ఈపుణ్యభూమి లో ధర్మం నేర్పబడుతుంది .భగవంతునిఅవతారమైన రాముని గూర్చి చెప్పినప్పుడు ,పెద్దలమాటమీద గౌరవం చూపటం .అన్నదమ్ములమధ్య ఆప్యాతలు ,ఉన్నతమైన పాతివ్రత్య లక్షణాలు ఇలా ఉన్నతమైన విలువలు నేర్పబడతాయి . తల్లిదండ్రులను కావడి లో మోసి సాకిన శ్రావణకుమారుని కథలు పిల్లలలోమానవీయ విలువలను మహోన్నతంగా పెంచుతాయి . తప్పుచేస్తే ఎంతటి దుర్గతి పొందుతారో అనేక ఉదాహరణలను పిల్లలు ఇక్కడ పురాణాదుల ద్వారా సంతోషంగా కథాశ్రవణ పద్దతి లో నేర్చుకుంటారు.
సత్యమార్గ ప్రవర్తకులుగా భావితరాలను తయారు చేయటం ఈవిధానంద్వారా సులభం. దీన్ని తిరస్కరించి న నేటి మనవిద్యావిధానం వలననే దానవకృత్యాలు చేస్తున్న మనవిద్యార్ధులు కొందరిిగూర్చి మనం నిత్యం పేపర్లలో చదువుతున్నాము.చివరకు వారిని దిశానిర్దేశం లేని ఆందోళనాపూరితమనస్కులుగా తయారు చేస్తున్నాము.ఈవిద్యనివ్వగలగటం వలననే నాడు ప్రహ్లాద ,ధృవులు వీరాభిమన్యులు శివాజీ లు సుఖదేవ్ లు ,రాణాప్రతాపులు ,వివేకానందులు ,భగత సింగ్ లు, గాంధీజీలు అల్లూరి లాంటి దేశభక్తులు త్యాగపురుషులు మదర్ థెరిస్సాలవంటి సేవానిరతులు పుట్టి సమాజ శ్రేయస్సుకు తమ తనుమానప్రాణాలను ఆనందంగా అర్పించారు. ఈవిద్య లోపించటం వలననే నేడు ప్రేమ పేరుతో రాక్షసకృత్యాలకు పాలపడి ఆయేషాలంటి పసిబిడ్దల ప్రాణాలు హరిస్తున్నా మనోహర్ లాంటి మృగాలు ,ర్యాంగింగ్ పేరుతో ఇతరులను హింసించి ఆనందపడే మానసిక రోగులు ,స్వల్ప కారణాలకె ఆత్మహత్యలు చేసుకునే బలహీన మనస్కులు తయారవుతున్నారు.తాగుడు ,వ్యభిచారాది దుర్గుణాలు పెరిగి , స్వార్ధమే పరమావధిగా లోకాన్నించి దోచుకుని పోగేసుకోవాలనే మనస్తత్వంపెరిగి సమాజం అల్లకల్లోలమవుతున్నది ఈవిద్యను సక్రమమైన రీతిలో అందించకపోవటము వలననే
ఇలాంటి విద్య ఈదేశం లో ఏమూలకూడా మిగిలి వుండకూడదనే వుద్దేశ్యం తో ఎన్నో ధర్మవ్యతిరేకశక్తులు చేస్తున్న కుట్రల ఫలితంగా మనపిల్లలకు పాఠశాలలో ఎలాగూ ఈధర్మ విద్య దూరమవుతున్నది. ఇంకా బయటకూడా దీని ఆనవాలు లేకుండా చేయాలని" కలి " పురుషుని సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నది.
ఇది ధర్మ భూమి .ఇక్కడ నేర్చుకుంటూన్నది ధార్మిక విద్య . కనుక ఎక్కడో పాశ్చాత్యదేశాలలో పలికిన అక్కడివాతావరణానికి సరిపోయిన ఈవాదనలను చిలకపలుకుల్లా వల్లించే వారు అక్కడకు పోయి చెప్పమనండి ప్రయోజనముంటూంది . ఇక్కడ వారికాశ్రమ అక్కరలేదు .ఇది మతవిద్యకాదు ధార్మిక విద్య అని చెప్పండి




0 వ్యాఖ్యలు:
Post a Comment