శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్యాగధన సంసిద్ధులు ,దృఢగాత్రులైన యువకులు కావాలి

>> Sunday, July 26, 2009

స్థలం : బేలూరు మఠం
కాలం : ౧౯౦౧

ఈమధ్య స్వామీజీ మఠం లోనే వుంటున్నారు.ఆరోగ్యం అంతగా బాలేదు. కాని ఉదయం సాయంత్రం వాహ్యాళికి వెళ్ళివస్తున్నారు.
శిష్యుడు : స్వామీజీ మీ ఆరోగ్యం ఎలావున్నది ?
స్వామీజీ : ఈశరీరం దైన్యస్థితి లో వున్నది .కానీ నాఉద్యమం లో తోడ్పడటానికి మీరెవ్వరు ముందుకు రావటం లేదు .ఒంటరిగా నేనేం చేయగలను ? ఈసారి ఈశరీరం వంగభూమి లోపుట్టింది . కాబట్టి అదెక్కువ శ్రమకుఓర్చలేదు .మీరు నాకు సహాయకారులు కాకుంటె నేనేం చేస్తాను ?

శిష్యుడు : స్వామీ ! సర్వసంగపరిత్యాగులైన ఈ బ్రహ్మచారులకు సన్యాసులు మీకు అండగావుండగా మీ వెనుక ని్లచివున్నారు . మీ ఉద్యమాని కి వారిలో ప్రతిఒక్కరు తమజీవితాన్ని అర్పించటానికి సిధ్ధంగాఉన్నారు. అయినా మీరిలా మాట్లాడుతున్నారే ?
స్వామి : నాకు బెంగాల్ యువకులు ఒక జట్టు కావాలి .వారే ఈదేశానికి ఆశ. భవిష్యత్తు లో నా ఆశంతా శీలవంతులైన యువకులపైనే ఆధారపడిఉంది. .వారు బుధ్ధి కుశలురు .తమ సర్వస్వాన్ని యితరుల సేవకై త్యాగం చేసేవాల్లై యుండాలి .నాఉద్దేశ్యాన్ని కార్యరూపం లోకి తేవటానికి తమ జీవితాలను త్యాగం చేసి దానివల్ల తమకు దేశానికి సౌభాగ్యం చేకూర్చేది ఈయువకులే .ఇప్పుడు సామాన్యులైన యువకులు గుంపులుగుంపులుగా వస్తున్నారు .ఇకముందుకూడా వస్తారు. వీళ్ల ముఖాలు మొద్దుబారిఉన్నాయి .వీళ్ళ గుండెల్లో ఉత్సాహం లేదు. దుర్భలమైన వీళ్ళ శరీరాలు పనిచేయటానికి నిరుపయోగం .,. ఇక వీళ్లమనసుల్లో ధైర్యం శూన్యం .ఇటువంటివారిద్వారా ఏంపని జరుగుతుంది .? నచికేతునివంటిఉత్సాహంకలవారు పదిమంది దొరికితేచాలు ఈదేశప్రజల ఆలోచనలను ,విధానాల్ని కొత్తపుంత తొక్కించగలను.

శిష్యుడు : స్వామీ మీదగ్గరకు యెందరో యువకులు వస్తున్నారు కదా ! వారిలో అటువంటి స్వభావం కలవాడు ఒక్కడైనా మీకు కన్పించలేదా ?

స్వామీజీ : వాళ్లలో బుద్ధికుశలురైన వారున్నా వారు వివాహబంధం లో కట్టుబడి పోయారు .ప్రాపంచికమైన పేరు ప్రతిష్థలు లేదా డబ్బు సంపాదించటానికి కొందరు అమ్ముడుపోయినారు.ఇంకకొంతమంది దుర్భలశరీరులు .మిగిలిన బహుసంఖ్యాకులు ఉన్నత భావాలనుగ్రహించలేరు . నావున్నత భావాలను గ్రహించేశక్తి నీకున్నమాట నిజమే కానీ నీభావాలను ఆచరణలో పెట్టలేవు. ఈకారణాలవల్ల నామనస్సు ఒక్కోసారి తీవ్రమైన వేదనకు గురవుతున్నది. మానవ శరీరాన్ని ధరించికూడా దురదృష్టం చేత ఏ పని ఎక్కువ చేయలేకపోయానే అని బాధపడుతున్నాను. అయినా పూర్తి ఆశవదలి పెట్టలేను . ఎందుకంటే భగవంతుని దయవలన ఈ యువకుల్లో నుండే సకాలం లో కార్య ధురీణులు ,పారమార్ధికబలసంపన్నులైన వారు నాభావాలను ఆచరణలో పెట్టటానికి బయటకు వస్తారేమో !

శిష్యుడు : విశాలమైన మీ ఉదారాశయాలు ఏదో ఒకరోజు సార్వజనీంగాకారన్ని పొందుతాయని నా దృఢవిశ్వాసమ్ .
కారణం ఆభావాలు సర్వతో ముఖాలు ,ప్రతి కార్యరంగం లోనూ ,ప్రతి ఆలోచనావిధానం లోనూ ౌత్తేజాన్ని కల్గించేవి కాబట్టి .ఈదేశ ప్రజలు మీభావాలను బహిరంగం గాగాని ,రహస్యం గాగాని ఆమోదించి వాటిని ప్రజలకు బోధిస్తున్నారు.


స్వామీజీ : వాళ్ళు ఆభావాలు నావి అని చెబితే ఏమి? చెప్పకపోతే ఏమి? నాభావాలు అంగీకరిస్తే చాలు. సాధువులలో నూటికి తొంభై తొమ్మిది మంది కామినీ కాంచనాదులను త్యాగం చేసికూడా ,పేరు ప్రతిష్థలమీద కాంక్షతో కట్టుబడి పోతున్నారు. "ఉదారమైన మనస్సు కలవాడికి కూడా కీర్తి అనేది చిట్టచివరి బలహీనత " అని నీవు చదవలేదా ? ఫలాపేక్ష పూర్తిగా వదలి మనం పనిచేసి తీరాలి . ప్రజలు మనలను మంచివాల్లనవచ్చు.లేదా చెడ్డవాల్లనవచ్చు. కానీ ఆదర్శాన్ని ముందుంచుకుని "నీతినిపుణులు భూషించినా ,ధూషించినా " లెక్కచేయకుండా సింహాలలాగా మనం పనిచెయాలి.

శిష్యుడు : ఇప్పుడు మనం ఏ ఆదర్శాన్ని అనుసరించాలి ?

స్వామీజీ : హనుమన్మహావీరుడే మనకిప్పుడు ఆదర్శపురుషుడు .రామాజ్ఞతో అతడు సాగరాన్ని ఎలా లంఘించాడో చూడు. అతనికి భీతి మృత్యుభయం లేదు.అతడు జితేంద్రియ చక్రవర్తి .అత్యద్భుత వివేక మహిమాన్వితుడు . మనం ప్రస్తుతమున్న దాస్యభావ నిర్మూలనం కోసం హనుమంతుని జీవితాదర్శంగాఎన్నుకోవాలి. దానివల్ల మిగతా ఆదర్శాలన్నీ జీవితం లో క్రమంగా అభివ్యక్తమౌతాయి. ఎదురు చెప్పకుందా గుర్వాజ్ఞను పాటించటం ,కఠోర బ్రహ్మ చర్యపాలన _యివే జయం పొందటానికి కీలకాలు. హనుమంతుడు ఒకవైపు దాస్య భావానికి ఆదర్శమూర్తి .మరో వైపు లోకాన్ని హాహాకారాలెత్తించే సింహసదృశ బలాన్వితుడు .రామకార్యార్ధమై తనజీవితాన్ని త్యాగంచేయటానికి ఏమాత్రం వెనుకాడడు .రామసేవ తప్ప హరిహర బ్రహ్మాదుల పదవినైనా ఆశించడు . అతనిది అటువంటి పరిపూర్ణ నిర్లిప్తత .శ్రీరామునికి హితం కూర్చటమే ఒక్కటే అతని జీవిత లక్ష్యం . అటువంటి పరిపూర్ణ భక్తికి కావలసిఉంది. ఖోల్ వాయిస్తూ కరతాళ ధ్వనులు చేస్తూ సంకీర్తన పిచ్చిలో గంతులు వేయటం తో జాతి యావత్తూ దిగజారి పోయింది .ప్రప్రథమంగా వాళ్ళు అజీర్తి వ్యాధిగ్రస్తమైనజాతికి చెందినవాళ్ళు. దానికి తోడు ఈవిధంగా గంతులువేస్తూ ఎగురుతుంటే శ్రమను ఎలా ఓర్వగలరు? పరిపూర్ణమైన పారిశుధ్ధ్యం ఉత్తమ సాధనకు ఎంతో ఆవశ్యకం .కానీ ఆఉత్తమసాధనను అనుసరించటానికి ప్రయత్నించటం లో వాళ్ళు గాఢ తమస్సులో కూరుకపోయారు.నీవే జిల్లాకు పోయినా ,ఏగ్రామానికిన్పోయినా ఈఖొలే,కరతాళ ధ్వనులే వినిపిస్తాయి. ఈదేశం లో భేరీలు తయారు కావటం లేదా? బాకాలు ఢంకాలు యీ దేశం లో దొరకతం లేదా ? ఈవాద్యాలనుండి వచ్చే గంభీరధ్వనులను మనపిల్లలను విననీయండి . చిన్నప్పటినుండే ఈఆడంగి సంగీతాలు,సంకీర్తనలను విని విని ఈదేశం స్త్రీమయమైపోయింది .అంటే పురుషులలో పుంసత్వం చచ్చిందన్నమాట .అంగాంగ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ స్త్రీలు విశ్రుంఖలంగా ,సిగ్గులేకుండా చౌక బారు ప్రదర్శనలిస్తుంటె పురుషులు పతితులుగాక మరేమవుతారు ?
ఈచిత్రాన్ని చిత్రించటానికి కవి హృదయం కూడా చాలదు. ఢమరులు వాయించాలి . కొమ్ములు ఊదాలి. భేరీలు మ్రోగించాలి .గంభీర యుద్ధనినాదాలు చెలరేగి మహావీర ! మహావీర ! అంటూ "హరహర" "హరహర" ఓం ఓం ... అని అరుస్తూ దిక్కులు పిక్కటిల్లజేయాలి. మానవునిలో సున్నితభావాలను ను రేకెత్తించే సంగీతాన్ని ఇప్పుడు కొంతకాలం ఆపాలి . ఖేయాల్ టప్పా మొదలైన లలిత స్వరాలను కొంతకాలం ఆపివేసి ప్రజలు ద్రుపద సంగీతాన్ని వినేట్లు అలవాటు చేయాలి . గంభీరమైన వేదవాక్కుల మేఘ గర్జనతో దేశానికి ప్రాణం పోయాలి .ప్రతి విషయం లోనూ వీరోచితమైన పురుషత్వాన్ని పునరుజ్జీవింపజేయాలి. అటువంటి ఆదర్శం తో మీశీలాన్ని నిర్మించుకోగలిగినతరువాతే వేయిమంది మిమ్మల్ని అనుకరిస్తారు.
కాని ఆదర్శం నుండి ఒక్క అంగుళమైనా తొలగిపోకుండా జాగ్రత్త తీసుకో .అధైర్యపడవద్దు .ఆహారవ్యవహారాల్లో గానిదుస్తులవిషయాల్లోగాని ,నిద్రలోగాని ఆటల్లోగాని పాటల్లోగాని,భోగం లోగానీ ,రోగం లోగానీ ఎల్లప్పుడూ ఉత్తమమైన నైతిక బలాన్ని ప్రదర్శించు . అప్పుడే దివ్యజనని మహశక్తి అనుగ్రహం లభిస్తుంది.

శిష్యుడు : స్వామీ ! ఒక్కొక్కసారి నాకు నిరుత్సాహం కలుగుతుంది. ఎందుకోతెలియటం లేదు .

స్వామీజీ : అలా నిరుత్సాహం కలిగినప్పుడు ఈవిధంగా తలచుకో " నేనెవరి శిష్యుడిని ? అలాంటివారి సాహచర్యం లోవున్న నాకిటువంటి మనోదౌర్భల్యం కలగటమా? అలాంటి మానసిక దౌర్భల్యాన్ని అణగదొక్కి ఈవిధంగా చెబుతూ లేచి నిలబడు " నేను ధీరుణ్ణి ,మేధావంతుణ్ణి నేను బ్రహ్మ జ్ఞానిని ,ప్రజ్ఞాసంహితుణ్ణి ,కామినీ కాంచనాలనుజయించిన శ్రీరామకృష్ణుని జీవిత సహచరుడైన ఫలానావారి శిష్యుణ్ణి " అనే విషయం జ్ఞాపకముంచుకుని నీగొప్పతనాన్ని పూర్తిగా గుర్తుంచుకో .ఇది గొప్పఫలితాన్నిస్తుంది. ఇటువంటి భావన లేనివాడిలో బ్రహ్మం జాగృతం కాదు . నీవు రామప్రసాదుపాట వినలేదా ? :ఏదివ్యజనని ఏ లోకానికి పాకురాలో ఆ లోకం లో జీవిస్తున్న నేను ఎవరిని చూచి భయపడాలి ? ఎల్లప్పుడూ అలాంటీ స్వాతిశయం నీమనస్సులో మేల్కొని ఉండనీ .అప్పుడు మనోదౌర్భల్యం హృదయదౌర్భల్యం నీదరి చేరలేవు. నీమనస్సెప్పుడూ దౌర్భల్యానికి వశం కానీవద్దు. మహావీరుడైన హనుమంతుని జ్ఞప్తికి తెచ్చుకో ! దివ్యజనని గుర్తుంచుకో ! బలహీనత పిరికితనం తక్షణమే పూర్తిగా మటుమాయం .

[ శ్రీ వివేకానందులు -శిష్య సంభాషణలు నుండి]


మొన్న శుక్రవారం ఒక సత్కార్యవిషయమై మధనపడుతూ అనాలోచితంగా చేతిలోకి తీసుకున్న పుస్తకం తెరవగనే కనపడిన ప్రబోధమిది . దీని గుర్వాజ్ఞగా శిరస్సువంచి స్వీకరిస్తున్నాను .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP