టీవీప్రకటనలలో అమ్మే దైవ సంబంధిత వస్తువులు మహిమ కలిగి వుంటాయా?
>> Wednesday, April 15, 2009
ఈమధ్య దూరదర్శన్ కార్యక్రమము కోసము కలిసి నప్పుడు బ్లాగ్ మిత్రులమధ్య చిన్న చర్చ జరిగినది. టివిలలో హనుమత్ యంత్రాలు,ఇత్యాదిగా దైవసంబంధిత వస్తువులు అమ్ముతామని వీటివలన అద్భుత ఫలితాలు వస్తాయని ,వాల్లకు వాళ్ళే గొప్ప సాధకులుగా కితాబులిచ్చు కోవటం వాటిపైన వేడి వేడిగా చర్చ జరిగినది. అటుతిరిగి ఇటుతిరిగి నా అభిప్రాయము కనుక్కోవాలనేవిధంగా విమర్శలు సాగినట్లనిపించినది.
మహామంత్రాలు గాని మహాసాధకులు గాని ఎవరూ మార్కెట్ లో వస్తువులుగా ప్రదర్శించి దిగజారాల్సిన అవసరము లేదు. బంగారము తాను బంగారాన్నని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ అలాచెప్పుకుంటున్నారంటే అది బంగారము కాదేమోనని అనుమానపడాల్సినదే.భగవత్ శక్తి నెవరూ విక్రయించటము ద్వారా అందజేయలేరు. మన చిల్లరడబ్బులకు లొంగేవాడు కాదు కదా భగవంతుడు. కనుక మేము అంత పంపిస్తే ఈయంత్రమిస్తాము ,ఇంత పంపిస్తే ఆ తాయెత్తులు పంపుతాము అనే వ్యాపారముపట్ల నేను పూర్తి వ్యతిరేకము కనుక అటువంటివారి పట్ల నాకు సదభిప్రాయము కూడా లేదు.ఇదే సమాధానాన్ని మనమిత్రులకు చెప్పాను.
ఇక ఇది కలికాలము .కనుక చిత్రాతి చిత్రములు జరుగుతుంటాయి.కాలజ్ఞానములో తాతగారు బ్రహ్మం గారు హెచ్చరించారు మనలను.ఉల్లిగడ్డకు కూడ ఉపదేశ మిచ్చేటి కల్లగురువులు భువిని పుట్టెరయా! అని అలాగే పుణ్యక్షేత్రాలన్నీ వ్యాపార క్షేత్రాలుగా మారుతాయని ,మహామంత్రాలు మాడలకు అమ్మబడతాయని చెప్పారాయన ఆనాడే. ఎప్పుడైతే డబ్బుకమ్మాలని చూస్తామో అప్పుడు మంత్రాలు,యంత్రాలు శక్తి హీనమవుతాయి.తీసుకున్నవారి నమ్మకాన్ని మనం విమర్శించటము కాదు గాని నిజం ఇది. భక్తి పూర్వకంగా భగవంతుని ఆశ్రయించి మెప్పించలేని అలసత్వంతోను,అత్యాసతోను కొండొకచోట అమాయకత్వము వలనను భగవద్భక్తులు కూడా ఈ వ్యాపారుల పాలిట పడుతుంటారు.వీరికి భగవంతుని ఆశ్రయించి ఆశక్తిని పొందగలిగే అవకాశమున్నప్పటికీ సాధనకు దిగరు .నాకు కూడా చిత్రమయిన వ్యక్తులు తటస్థిస్తుంటారు వారి సమస్యకు తగిన సలహా చెప్పి ఏ హనుమాన్ చాలీసా నో మరొకటొ ఇలా చేయండి.ఇలాఫలితమొస్తుందని ఉదాహరణలతోటి చూపించినా వారు వందలసమస్యలు చెబుతుంటారు .మాకు సమయము చాలదని,ఎక్కడండీ మాకు పనులవత్తిడి అని రకరకాల కారణాలతో తప్పుకోజూస్తుంటారు. మరికొందరు శ్రద్దగా చెప్పిన సూచనలను పాటించి ఇక్కడే ఈఅంతర్జాలములో పరిచయమయినవారే చాలమంది తమసమస్యలను పరిష్కరించుకున్నవారు ఉన్నారు.అది వారిశ్రద్ధకు భగవంతుడు చూపించిన కరుణకు నిదర్శనము. కొద్దిమంది సాధకులు లోకకల్యాణ కాంక్షతో ఇతరులకోసము తమసాధనధారపోసి కొద్దిగా మేలు చేయవచ్చు . కాని తరువాత రోగగ్రస్తుడైన రోగికిఅత్యవసరమయి ఎంత సేపు సెలైన్ ఎక్కించినా పూర్తి శక్తిని పొందాలంటే ఆహారం తీసుకోక తప్పదు గదా!కనుక ఎవరికి ఆకలైతే వారు అన్నంతినాలి. ఎవరోతింటే మనకు కడుపునిండదు. అందుకే ఇక్కడ ఏకార్యక్రమము చేపట్టినా పాల్గొనేవారు కూడా తప్పనిసరిగా పారాయణాదులు చేసినప్పుడే ఇక్కడచేసే కార్యక్రమాలతో అనుసంధానించబడి ఫలితాలను పొందుతారని ఖచ్చితముగా చేయాలని చెబుతాము. అది కొందరికి నచ్చినా నచ్చకున్నా!
ఇది నావ్యక్తిగతభావన.నేను నమ్మిన మార్గం. నాకు మహానుభావులగు గురుపరంపరద్వారా అందిన బోధన.నా స్వల్ప బుద్ధికి అందిన జ్ఞానము.నేనెవర్నీ కించపరచటము లేదు.పెద్దలమాటను ఉదహరించాను.ఆథ్యాత్మిక మాహాసాగరములో చిన్న ఇసుకరేణువునైన నేను అంతానాకు తెలుసని నాకు తెలిసినదే ప్రమాణమని వాదించే సాహసము చేయలేను. కాని నానమ్మకము నాకు సరయినదనే నిదర్శనాలను నాజీవితము లోను ఏదో ఉడతాభక్తిగా భక్తజనులకు నేనిచ్చేసలహాలతో వారి జీవితాలలోనూ ఆజగన్మాత లీలామాత్రంగా చూపిస్తూనే వున్నది.ఈజన్మ నెత్తినందుకు ఎవరికన్నా ఉపయోగపడితే చాలు కనుక నేనిలానే సాగుతుంటాను. మీ నమ్మకాలు మీఅనుభవాలు మీవి. ఏదైనా విమర్శించి చూసి పరిశీలించినమ్మటము ఉత్తమమని నాభావన. భగవద్భక్తులకు ప్రణామములు.
2 వ్యాఖ్యలు:
*ఎప్పుడైతే డబ్బుకమ్మాలని చూస్తామో అప్పుడు మంత్రాలు,యంత్రాలు శక్తి హీనమవుతాయి.తీసుకున్నవారి నమ్మకాన్ని మనం విమర్శించటము కాదు గాని నిజం ఇది.*
దుర్గేశ్వరా,
అందరు పాత రోజుల లో లా ఒక్క పైసా ఇవ్వకుండా ఉచితం గా దేవుడి యంత్రాలు ఇవ్వాలి అంటె కనీస అవసరాలకైనా దీనిని నమ్ముకున్న వారికి డబ్బు కావాలి కదా. పాత రొజుల లో ఎంతో కొంత ఇతరులు ఇటువంటి వారికి సహాయం చేశారు. ఇప్పుడు ఇటువంటి వారు ఎంత తొందరగా దివాల తీస్తె ఇల్లు, పొలము కొనుకోవచ్చు అని ఉన్నారు చుట్టుపక్కలి వాళ్ళు.
శ్రీనిధి
భక్తి ఒక వ్యాపారం కాకూడదు అన్న మాట చాలా నిజమండీ! ఏదైనా చదవమని ఎవరికైనా చెప్పినపుడు, తీరిక లేదని చెబుతూ ఉంటారు కొందరు. అప్పుడు వారికి నేను చెప్పేది ఒక్కటే. మనం రోజుకి ఒక అరగంట ఆ భగవంతుని కోసం కేటాయించలేనపుడు, ఆ దేవుడు మాత్రం సమయం కేటాయించి మనల్ని ఎందుకు కరుణిస్తాడు? మనం భగవంతునికి సమర్పించాల్సింది ధనమో, దక్షిణో కాదు. మనస్సు అనే మూలధనం. సర్వస్య శరణాగతి అనే సువర్ణ పుష్ప దక్షిణ. మనము వ్యాపారంగా కాక భక్తి మార్గాన సరిగ్గా ప్రయత్నించినట్లైతే, భగవంతుని సులభం గా మెప్పించగలం. ఏమీ చాతకాని వారు కూడా "రామ", "రామ" అని నామ జపం తో భగవంతుని కరుణ సంపాదించగలరు. భగవంతుని అమ్మకం గురించి అలోచించకుండా, భగవంతునిపై నమ్మకంతో ప్రయత్నిస్తే, అనీ సాధ్యమే.
Post a Comment