ఇలా బర్త్ డే చేస్తే భలేగుంటదీ !
>> Thursday, April 2, 2009
ఇలా బర్త్ డే చేస్తే భలేగుంటదీ !
ఎప్పుడూ నోటితే వెలిగే దీపాలను ఆర్పే పద్దతిలో పుట్టిన రోజు పండగను చేసేవారు ,మనపద్దతి లో శాస్త్రీయంగా ఇలా జరుపుకోండి.ఎంత అద్భుతంగా వుంటుందో పండుగ.పుట్టినరోజే కాదు పెళ్ళిరోజు కూడా ఇలానే జరుపుకోవచ్చు.
పుట్టిన రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానము చేయాలి .[తలకు నువ్వుల నూనె పెట్టుకొని స్నానము చేయాలి.]స్నానానంతరము కొత్తవస్త్రములు ధరించి దేవుని పూజ చేసుకోవాలి.తరువాత స్నేహితులను బంధువులను అందరినీ ఒక నిర్ణీత సమయానికి పిలుచుకుని ఆసమయములో క్రిందివిధముగా కార్యక్రమము చేసుకోవాలి.
హాలుకు మధ్యగా ఒక బల్లవేసి దానిపై దీపపు కుందిని గాని లేక ప్రమిదలు గాని వత్తులు వేసి ఆవునేయి లేక నూనె వేసి వెలిగించటానికి సిద్దంగా వుంచుకోవాలి.ఎన్నవ పుట్టిన రోజు జరుపుకుంటుంటే అన్ని వత్తులు ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి.దాని పక్కన సుమారు పావుకిలో కు తగ్గకుండా పాలకోవా ముద్దగాని,కలాకాన్ గాని హల్వాగాని లేక అటువంటి మెత్తని ముద్దలావుండే స్వీట్ గాని ఏదైనా సరే వెడల్పుగా,గుండ్రముగా పూరీ ఆకారములో మందముగా చేసి వుంచుకోవాలి అందరూ రాగానే ఈక్రింది మంత్రము చదువుతూ దీపము వెలిగిస్తాడు.ఒకవేళ మరీ చదవలేనివారైతే వాళ్లతరపున తల్లి లేకతండ్రి గాని చదవవచ్చు.మంత్రము చదవలేనివారు తాత్పర్యము చదవవచ్చు.రెండూ చదివినచో చాలామంచిది.చదివేప్పుడు చక్కగా,స్పష్టముగా అతిథులంతా కూడా వినునట్లు చదవవలెను.
మం// ఉద్దీప్యస్య జాతవేదో అపఘ్నన్నిర్ ఋతింమమ
పశూగ్ శ్చమహ్యమావహ జీవనంచ దిశోదిశ //
[ఓజాతవేదుడవైన అగ్నిదేవా!చక్కగా ప్రకాశవంతముగా వెలిగి మాయందున్న పాపమను చీకటిని పోగొట్టుము.చక్కని ఇంద్రియములను ,సుఖమైన జీవనమును,మంచిదృష్టి ఇమ్ము]
ఈ మంత్రము చదివినతరువాత పాలలో తేనె కలిపి దీపముదగ్గరవుంచవలెను.తేనె లేనిచో పంచదార వాడవలెను.దీపమునకు నమస్కరించి ఈక్రింది మంత్రమును చదవవలెను.
మహా మృత్యుంజయమంత్రము
------------------
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివబంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్
అని మూడుసార్లు స్పష్టముగా నెమ్మదిగా చదవవలెను. చిన్నపిల్లలైనచో పెద్దవారిచేచెప్పించవచ్చును.
[పుష్టిని వృద్ధిచేయునట్టి,మంచి సువాసన కలుగజేయునట్టి మూర్తియగు త్రినేత్రుని మేము ఆరాధించుచున్నాము.ఆయన పండినదోసపండు తొడిమనుండి వేరుచేసినట్లు మమ్ము మృత్యువునుండి వేరుచేసి అమృతత్వమునకు చేర్చుగాక!]
పాలుతేనె కలిపిన ఈపానీయమును తాను కొద్దిగా తీర్ధముగా తీసుకుని తరువాత చేతులు కడుగుకుని అందరికీ తీర్ధములా ఇవ్వవలెను.
ఆతరువాత తరువాత పూరి వలె సిద్దముగా వుంచిన స్వీటు మీద ఈక్రింది పద్దతిలో చాకుతో గాని లేక సూదితోగాని ఈక్రింది విధముగా గీయాలి.
ఆ ఆకారము ఎంతస్పష్టముగా గీసిన అంతశుభకరము.దానికి నమస్కరించవలెను
ముందు స్వీటు మీద నిలువుగా అడ్డముగా గీతలు గీయాలి [+] ఆకారములో. ఇప్పుడు ప్లస్ యొక్క నాలుగు చివర్లను సరళరేఖలతో కలపవలెను.అంటే ప్లస్ చుట్టూ చతురస్రము అమర్చినట్లుంటుంది. తరువాత ఒకవృత్తము ఈఆకారము చుట్టూ గీయాలి .అంటే చతురస్రము యొక్క నాలుగు మూలలూ తగులుతూ వృత్తం వుంటుంది.
అట్లు గీస్తున్నప్పుడుఈ క్రింది మంత్రము చదవాలి.
మం// సన్త్వాసిఞ్చామి యజుషా ప్రజామాయుర్ధనఞ్చ .ఓం శాంతి:శాంతి:శాంతి:
[ మాకు ఆయుష్షు,సంతతి మున్నగునవి సమృద్దిగా కలుగుగాక!]
ఇట్లు కోసినతరువాత వచ్చిన అతిథులను బట్తి ఆస్వీటును కావలసినన్ని చిన్న ముక్కలుగా కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క ఇచ్చుచూ ఈక్రింది మంత్రము చదవవలెను.
మం// సహనావవతు/సహనౌభునక్తు/సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ...ఓంశ్శాన్తి శ్శాన్తి శ్శాన్తి:
[ మేము రక్షింపబడుదుముగాక.కలసి భుజింతుముగాక. కలసి సామర్ధ్యము పొందుదుము గాక. తేజశ్శ్వంతులమవుదుముగాక.విరోధము పొందకుందుముగాక .మా మధ్య ద్వేషము కలుగకుండుగాక.]
అప్పుడు అచ్చటనున్నవారిలో పెద్దవారు పుట్టినరోజు జరుపుకుంటున్నవారిని దీపము దగ్గర కుర్చీపై కూర్చోబెట్టి ఈక్రింది మంత్రమును మూడుసార్లు చదువుతూ ఆవ్యక్తిపై అక్షతలు వేయవలెను. మిగిలిన వారు కూడా అక్షతలు వేయాలి. ఆ వ్యక్తికన్న వయస్సులో చిన్నవారు పూలు మాత్రమే వేయవలెను.
మం//శతమానం భవతి...శతాయు:పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతితిష్టతి.
అటుతరువాత వచ్చిన వారందరికీ తామివ్వదలచుకున్న ఉపాహారములను లేక విందును ఇవ్వవచ్చును.
[పూజ్య ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు తమశిష్యులకు బోధించి ఆచరింపజేసిన శుభకరమయిన విధానమిది]ఇలా మన సాంప్రదాయ పద్దతి లో శుభకార్యాలను జరుపుకుందాము.
4 వ్యాఖ్యలు:
చాలా బాగుంది.ఇలా చేయడమైతే తెలియదు కానీ నేను ఎవరిపుట్టినరోజుకు వెళ్ళినాగానీ దీపాలు అదే క్యాండిల్స్ ఆర్పవద్దు దీపాలు వెలిగించండి అని చెబుతూవుంటా
ఇలా జరుపుకొనే విధానము అత్యద్భుతముగా ఉంది. విధానము తెలియజేసినందుకు ధన్యవాదములు.
చాల బాగుందండీ, మంచి సమాచారం ఇచ్చారు.
చాలా చక్కని వివరణతో ఇచ్చారు. త్వరలో మా పాపకి ఇలా చేస్తాను పుట్టినరోజు పండుగ. నిజానికి మా నాన్న గారు ఎప్పుడూ, దీపారాధన చేయించి, దీవించి క్రొత్త బట్టలు కట్టించటమే కానీ ఆధునిక రీతిలో ఆ వేడుకలు జరుపలేదు. ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఎదురీదలేని స్థితిలో వున్నట్లు ఇప్పటికి మాత్రం పిల్లల్ని నొప్పించలేక,కొన్ని వాళ్ళకి నచ్చిన పద్దతిలో కొన్ని మనం అనునయించి వొప్పించి చేసే రీతిలో సాగిస్తున్నాను.
మం// సహనావవతు/సహనౌభునక్తు/సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ...ఓంశ్శాన్తి శ్శాన్తి శ్శాన్తి:
ఈ మంత్రాన్ని నాన్న గారు రోజు 108 సార్లు జపించేవారు. ఇప్పటి మా సుఖజీవనానికి, కష్ట స్థితిలో సత్వరమే నివారణ లభించటానికి ఆయన చలవ కూడా కొంత కారణం, ఆ పై మా మా ఆధ్యత్మిక చింతన కొంత తోడ్పడుతుంది. ఇలా ఆచార, వ్యవహారాలు వివరంగా తెలుపుతున్నందుకు మరో సారి ధన్యవాదాలు. సమయాభావం వలన వ్యాఖ్య పెట్టలేకున్నా, తీరిక చిక్కగానే వచ్చి తొంగి చూసి పోతుంటాను మీ బ్లాగుని.
Post a Comment