శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆలయ ధర్మాధికారి పదవి కావాలా?జాగ్రత్త....

>> Thursday, January 8, 2009


దేవాలయాలకు ధర్మ కర్తలుగా వుండటానికి అంగీకరించ కండి సాధ్యమైనంతవరకు. ఒకవేళ అంగీకరిస్తే చాలా జాగ్రత్తగా వుండాలి మరి.ఎందుకంటే ................

ధర్మరాజు గారు రాజ్యపాలనలో చాలా సమర్ధవంతముగాను,న్యాయపూరితంగా తన పరిపాలన వుండేలా జాగ్రత్తలు తీసుకునేవారు.
అన్నివేళలా ప్రజలకు అందుబాటులో వుంటూ న్యాయాన్ని చేయాలనే సంకల్పముతో ఆయన తన సభా మంటపానికి ముందు ఒక ధర్మ ఘంటను ఏర్పాటు చేశారు.ఎవరన్నా న్యాయాన్ని కోరుతూ ఫిర్యాదు చేయదలచుకుంటే ఆ ఘంటను దానికున్న తాడును లాగటం ద్వారా మోగించిన పక్షములో ఏసమయములోనైనా రాజు గారు వచ్చి ఆ న్యాయార్ధికి విచారణ జరిపి న్యాయం చేకూరుస్తారు. ఈవిధానంవలన ప్రజలకు చాలా మేలు జరుగుతూ వున్నది.

ఒఅక రొజు ఘంటారావం మోగుతూనే వున్నది. మామూలుగా ఒకటి రెండుసార్లు ఘంటను మోగించి రాజు గారు వచ్చినదాకా వేచివుంటారు ఫిర్యాదీ దారులు. కానీ ఆరోజు ఘంట ఆపకుండా మోగిస్తున్నారెవరో.దానితో రాజుగారు ఘంటను మోగిస్తున్నవారెవరో కనుగొని తనవద్ద ప్రవేశ పెట్టమని సేవకులను పంపారు. తీరా వాళ్లు వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఊరకుక్క ఘంటను లాగుతూ కనిపించింది వాళ్లకు. వాళ్ళు దానిని ఛాయ్..ఛయ్ అని అదిలించబోతే అది మానవ భాషలో నాకు న్యాయం కావాలి రాజుగారు వచ్చినదాకా ఆపను అన్నదట. దానితో చిత్రమనిపించిన భటులు వెళ్ళీ రాజుగారికి విన్నవించారు విషయాన్ని. ఆయన వెంటనే ఆకుక్కను వద్దకు వెళ్ళాడు. ఓ శునకమా! ఏమి నీ బాధ,ఎందుకిలా న్యాయఘంటను మ్రోగిస్తున్నావు?అనిప్రశ్నించాడు. మహా ప్రభూ నన్నొక ధూర్తుడు కొట్టి బాధించాడు అతనిని మీరు శిక్షించవలసినది అని ప్రార్దించినది.నీవేమి చేసితివి ఎందుకు నిన్ను కొట్టినారు అని అడిగాడాయన. అయ్యా! నేనెవరి జోలికెల్లలేదు. నాదారిన నేను నడచి వెళుతుంటే ఏ కారణము లేకుండానే చేతనున్న కర్రతో నన్ను కొట్టాడొక మనిషి సంత లో ఈరోజు అని ఫిర్యాదు చేసినది.నేనేమి చేయక పోయినా నన్ను కొట్టినందుకు అతనిని శిక్షించి తమ రాజ్యములో అన్ని జీవులకు న్యాయం జరుపుతున్నారని నిరూపించుకోవాలి తమరు అన్నది కుక్క.
పాపం అనవసరముగా దీన్ని కొ్ట్టినవారెవరు,వెళ్ళి విచారించి వానిని తీసుకు రమ్మని భటులను పంపారాయన. వాళ్ళు వెళ్ళి ఆ సంత జరిగే ప్రాంతములో విచారణ జరిపి కుక్కను కొట్టినాయనను తీసుకుని వచ్చారు.వచ్చిన వ్యక్తిని ఈకుక్కను నీవు కొట్టావా? అని అడిగారు రాజుగారు.
"కొట్టాను ప్రభూ"
ఎందుకు?
ఊరికినే!
వూరకెందుకు కొట్టావు?

వెళుతుంటే ఈకుక్క కనిపించింది.ఊరికినే నాదగ్గరున్న కర్రతో ఒకటిచ్చాను నడుముపై.కుక్క కనుక.

దేనికి?

దేనికేమున్నది మహారాజా ఇది కుక్క కనుక కొట్టాలనిపించింది. కొట్టాను.ఇది సాధారణమైన విషయమేగా? కుక్కను ఎవరైనా కారణము లేకున్నా తన్నటము ,కొట్టటము లోకములో సహజమేకదా?అతను తన వాదన వినిపించాడు.

రాజు గారికి ధర్మ సంకటము ఎదురైనది.

లోకములో కుక్కను ఏ కారణము లేకున్న అదిలించటము .కర్రతో కొట్టి తరమటము సహజముగా జరుగుతుంటాయి. దాన్నెవరూ పెద్దగా పట్టించుకోరు. పైగా ఇతను నిజముగా చేసినది ఒప్పుకున్నాడు. అందులో లోకసహజమైన విషయానికి తనపై విచారణ జరపటము బాగుండదు. కానీ దెబ్బలు తిని బాధపడుతున్న జీవి న్యాయ మడుగు తున్నది. ఎలా? .ఇలా విచారించుకుని ఆయన ఒక నిర్ణయాని కొచ్చాడు. ఓశునకమా! అతను తాను చేసినపని చెప్పాడు. మామానవ జీవనం లో ఇది పెద్దగా నేరము కాదు. మాకిలాంటి తీర్పు చెప్పవలసిన అవసరము మును పెన్నడు కలుగలేదు. ఒక వేళ నేను ఏతీర్పు చెప్పినా నన్ను మానవునివి గనుక జాతి పక్షపాతం తో తీర్పు చెప్పావని నీవారోపించవచ్చు.కనుక నీవే ఈదోషానికి తగిన శిక్ష ను సూచించు అని దానికే నిర్ణయాన్ని వదలి వేశాడు.

అయితే మహారాజా! ఇతనిని ఒక ఆలయానికి ధర్మాధికారిగా నియమించండి,అని అన్నది.

రాజు గారు, వెంటనున్నవారందరు,విస్తుపోయారు.ఇదేమి ఇలా కోరినదిది. కొట్టాడన్న కోపము ఉంటే అతనికి కఠినమైన దండన విధించమని కోరుకోవాలి కానీ ఈశిక్ష ఏమిటి విచిత్రముగా అని మాట్లాడుకుంటూన్నారు. రాజు గారికి అయోమయముగా వున్నది.
అదేమి? అట్లడిగితివి. ఇలాంటిది శిక్ష ఎలా అవుతుంది అని అడిగారాయన దానిని.
మీకు తెలియదు మహారాజా! ఇది పెద్ద శిక్ష అవుతుంది. దేవాలయ నిర్వహణ లో ఏమాత్రం అజాగ్రత్తగావున్నా చాలా దోషము.అదీకాక దేవును సొమ్ము ఎవరిద్వారానైనా దుర్వినియోగమైనదా,అది ఆబాధ్యులను,దుర్వినియోగము చేసినవారిని ,ఆడబ్బును తీసుకున్నవారిని చాలా కష్టాల పాల్జేస్తుంది.తీరని దు:ఖం అనుభవించేలా చేస్తుంది అన్నది ఆకుక్క.
దానికి ప్రమాణమేమున్నది? అని అడిగాడాయన ఆశ్చర్యంతో.

దానికి నేనే ప్రమాణము. పూర్వ జన్మలో ఒక ఆలయధర్మకర్తనై మొదటిలో జాగ్రత్తగానున్నాను. కాని తరువాత కొంత సొమ్ము దుర్విని యోగానికి కారనమై,మరికొంతదాచుకునే బుద్ధి,స్వార్ధపరత,మొదలైన దుర్గుణాలకు లోనై ఆదోషాల ఫలితంగా ఇదిగో ఇలా కుక్క జన్మ నెత్తాను. ఇలా ప్రతివారి చేతా కారణము లేకున్నా తన్నులు తింటున్నాను.మమ్మల్ని చూస్తే కారణము లేకున్న ఊరికినే మీకు కొట్టాలని తన్నాలని అనిపించటమ్ మా ఖర్మ ఫలితమే. కనుక వీనికి ఇదే సరయిన శిక్ష. ఆలయ ధర్మకర్తా వీడు తప్పులు చేసి నాలా జన్మనెత్తటం ఖాయం. ఇంతకంటే పెద్దశిక్షేమున్నది అని వివరించినది.

కనుక జాగ్రత్త.

4 వ్యాఖ్యలు:

కొత్త పాళీ January 8, 2009 at 1:06 PM  

ఏం పర్లేదు లేండి. అలాంటి పదవులు కావాలంటే ఏలిన్వారి బంఢు లేక స్వజనంలో వారమై ఉండాలి. మనలాంటి వాళ్ళకెవరూ ఈ పదవులివ్వరు కాబట్టి మనకి ఢోకాలేదు

durgeswara January 9, 2009 at 9:28 AM  

మన బాధ కూడా తరువాత వాళ్ళు పదబోయే బాధలగురించిన ఆలోచనే.అదన్నా గమనించి వాళ్ళు సవ్యంగా తమ విధులను నిర్వహించాల్సిన బాధ్యత గమనిస్తారనే.

Anonymous January 9, 2009 at 11:21 PM  

కొంచం అసందర్భం అయినా, ఆడుగుతున్నాను. ఛండీ యాగం అంటే ఏమిటి? ఏవరు ఛేయాలి? ఎంత సమయం పడుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? వివరల్లు చెప్పగలరా?

ధన్యవాదాలు
శ్యాం

durgeswara January 10, 2009 at 6:13 AM  

శ్యాం గారూ

ఇది భగవత్ భక్తులకు సేవచేయాలనే తలంపుతో ప్రారంభమయిన బ్లాగు.ఇక్కడ మీరెక్కడయినా మీ అనుమానాలను ప్రస్థావించవచ్చు.
అమ్మ అనుగ్రహం తో మీమనసులో ఆతల్లి లీలా విభూతులను తెలుసుకోవాలని సంకల్పం కలిగినది.
అమ్మ వారి విభవాన్ని మార్కండేయపురాణమ్ లో చాలా విస్తృతంగా వర్ణించారు.ఏడువందల మంత్రాలతో. దానినే దేవీ సప్తశతి అని వ్యవహరిస్తారు. ఆ సప్తశతిని పారాయణము చేసి ఆ మంత్రాలతో హోమము జరుపుతారు.దానినే చండీయాగము అని అంటారు. అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమవుతుంది కనుక ఆమె అనుగ్రహం కోసము చండీ యాగము చేస్తారు. ఆతల్లి కరుణవల్ల సమస్త దుష్కర్మలు నశించి,జయము సంపదలు,శుభాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా శతృంజయముగా భావిస్తారు. ఈయాగానికి దేవీ వుపాసకులు వుండి చేస్తే ఆమంత్రాలకు బలం ఎక్కువ. ఒక్కరోజు,మూడు రోజులు,తొమ్మిది రోజులుగా చేస్తారు ఈయాగాన్ని.దీనికి అనుబంధంగా గణపతి హోమము,నవగ్రహ హోమములాంటి యాగాలు అనుసంధిస్తారు. యాగ సమయం లో అమ్మకు ప్రీతి పాత్రంగా పూజలు నివేదనులు జరుపుతారు.మీకు దగ్గర పుస్తకాల షాపులో సప్తశతి దొరుకుతుంది,అర్ధసహితంగా చూడండి. ఇక భక్తి పూరితముగా చెస్తేనే ఏ భగవద్ పూజకైనా ఫలితం వుంటుంది.అది గమనించండి.ఖర్చంటారా ఐదువేల నుంచి ఐదు లక్షలదాకా కూడా పడుతుంది పెట్టు కోవాలనుకుంటే.చేసే విధిని బట్టి . అయితే అమ్మ భక్తానుగ్రహ కాతారాం అన్న పేరుగలది. బిడ్ద ఎంతఖర్చుపెట్టాడని కాదు,ఎంత భక్తిగా చేశాడని చూస్తుంది.

ఈ యాగ మహిమ మీరు నమ్మినా నమ్మకున్నా ఒకటి ఇటీవలే జరిగినది చెబుతాను వినండి.
తెలాంగాణా అంశముతో రాజకీయ పోరాటము చేస్తున్న కేసీఆర్ ,మొదట సభలు సమావేశాలు పెట్టి తరువాత అతని పరిస్తితి ఏమిచేయాలో తెలియని స్థితి కెళ్ళినది.కార్యకర్తలకు కూడా వుత్సాహము తగ్గినది.అప్పుడే అతని కాలు కూడా దెబ్బతగిలి నడవలేని స్థితి. రాజకీయంగా శూన్యంగావున్నది భవిష్యత్తు. అప్పుడెవరు సలహా ఇచ్చారో గాని అతను చండీయాగం చేశాడు.నిలబడలేక కుర్చీలో కూర్చునే యాగం లో పాల్గొంటున్న ఫోటోలు మీరు చూసే వుంటారు.యాగం చేసి తెలంగానా తెస్తాడట ! అని వ్యంగంగా పత్రికలలో కార్టూన్లు కూడావచ్చాయి అతనిపై.మామిత్రులు కొందరు పిచ్చాపాటి మాట్లాడుతూ రెచ్చగొట్టెవరకు రెచ్చగొట్టాడు జనాన్ని,ఇకఏమి చేయాలో తెలియటం లేదు.ఇప్పుడిక ఎన్ని యాగాలు చేసినా ఇతనిని జనం నమ్మరు. అని వ్యంగంగనే మాట్లాడారు. నేను వారిని వారించి మీకు తెలియదు.అతని కెవరో పెద్దవారు సాధకుడూ కరక్టయన మార్గాన్ని చూపుతున్నారు. చండీ యాగము మహిమ మీకు తెలియదు ,చూస్తూవుండండి ఏమి జరుగుతుండో అని చెప్పాను.
ఆ యాగమయి పోయిన తరువాత విచిత్రం......
వూరుకున్న వాడు వూరుకోక ఎమ్మెస్ సత్యన్నారాయణ నోరుదూలతో కెసిఆర్ కు చేవలేదు దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రమ్మని సవాల్ విసరటమ్,అమ్మదయతో కలసివచ్చిన అవకాశాన్ని అందుకుని కేసీఆర్ రాజీనామాచెసి బరిలోకి దిగటం,కాంగ్రేస్ వాళ్లకు చావుకొచ్చినంతపనై ఉపఎన్నికలలో తమ సర్వశక్తులను ఒడ్డి పోరాడవలసి రావట,వాళ్ల్ ప్రతిచర్య మహామాయ అనుగ్రహాన ఇతనికి ప్రజలో విపరీత సానుభూతి పెంచి కరీంనగర్ స్థానం లో రెండులక్షల మెజారిటీతో విజయం సాధించటం సినిమాలా జరిగిపోయినది.తెలంగాణాలో తిరుగులేని నాయకునిగా తనస్థానం పెంచుకున్నాడు.
ఇదీ చండీయాగ మహిమ అని వివరిస్తే మావాళ్లంతా అవును మాష్తారూ నమ్మలేని విధంగా జరిగినదిదని ఆశ్చర్యపోయారు.
ఇంకా ఏదన్నా సందేహముంటే నన్ను మైల్ లేదా చాట్ లో సంప్రదించండి.నాకు చేతయినంతవరకు వివరిస్తాను,పెద్దలెవరినన్నా సంప్రదిస్తాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP