మావూరి దేవుడు ...కొండాగురునాథుడు.
>> Sunday, January 4, 2009
మావూరిలో నున్న ప్రసిద్ద కొండగురునాథ క్షేత్రాన్ని మీకు పరిచయం చేయ బోతున్నాను. మావూరి సమీపములో తాబేలు ఆకారం లో కూర్మగిరి అనే కొండవున్నది. ఆ కొండపైన వెలసిన దేవుని కొండ గురునాథుడు అంటారు. ఆయన దత్తత్రేయునిగా దక్షిణామూర్తిగా కొలవ బడుతున్నాడు.ఎమ్తో ప్రశాంతమైన వాతావరణములో నెలకొన్న ఆక్షేత్రాన్ని చేరుకోగానే ఎవరికైనా మనసు ఈ ప్రపంచ బంధాలనుండి విడివడి ఆధ్యాత్మిక లోకాలలోకి పయనిస్తుంది. అది గురుస్థానమవటమువలన ఇక్కడకు వచ్చిన వారికి ఏ ప్రయత్నం లేకుండానే మనసు ప్రశాంతస్థితి కొస్తుందని గొప్పసాధకులు చెపుతుంటారు. విశేషమేమిటంటే ఇక్కడ మూలవిరాట్ స్థానంలో మూడు వేపమొద్దులు స్థాపించబడి వున్నాయి.
పూర్వం వృక్షాన్ని ఆశ్రయించి తపోదీక్షలో స్వామివారున్నారని తెలియని మేకపాడు గ్రామానికి చెందిన కరణం గారు ఈ వేపచెట్టు పెద్దదిగా వున్నదని తమ కొట్టం నిర్మించటానికి వాసాలు కలపగా సరి పోతుందని భావించి మనుషుల చేత కొట్టించారట. కొట్టె టప్పుడు వృక్షాన్నుంచి పాలు, రక్తం కారినా అవి పెద్దగా పట్టించుకోక కలపను తెచ్చి కొష్టం నిర్మాణం గావించి కప్పు వేసి కూలీలు క్రిందకు దిగగానే ఒక్కసారిగా గప్పున మంటలెగసి మొత్తం కాలి బూడిదైనదట. హాహాకారాలు చేస్తూ వున్న జనం లో ఒకనికి దైవావేశము వచ్చి స్వామి వారు అందులో వున్నవిషయాన్ని గమనించక దోషము చేశారని చెప్పారట. ఆ గ్రామ ప్రజలు కాళ్ళమీదపడి క్షమాపణ వేడుకొనగా దోషపరిహారార్ధం అక్కడమిగిలిన బూడిదలో మూడు మొద్దులు కాలకుండా మిగిలాయని వాటిని తీసుకు వెళ్ళీ చెట్టు కొట్టిన కొండ మీదనే ప్రతిష్టించమని ఆనతినిచ్చారట. వాళ్ళు ఆవిధంగానే ప్రతిష్ట జరిపారట. వేల సంవత్సరాలుగా ఆదారుశిలలు అలా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూనే పూజలందుకుంటున్నాయి. ఈమధ్యకాలం లో మంటపనిర్మాణం చేపట్టినప్పుడు కూడా స్వామి వారి ఆదేశమువలన మూర్తుల తలపై భాగములో ఖాళీ వదలి స్లాబ్ వేయవలసి వచ్చినది.
ఇది చాలా సిద్దక్షేత్రమవటము వలన చాలామంది సాధకులు వచ్చి తమ సాధనలను చేసుకుని వెళుతుంటారు. ఇక్కడ పూజారులుగా కుమ్మర్లు బాధ్యతనిర్వహిస్తుంటారు. మాఘమాసం పౌర్ణమి రోజున తిరుణాళ్ళ వుత్సవం జరుగుతుంది. ఈప్రాంతం లో కోటప్పకొండ తరువాత అంత పెద్ద తిరుణాళ్ల ఇదే. ఆరోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. మనరాష్టంనుంచేకాక కర్ణాటక ప్రాంతమునుండి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. ఈస్వామి పేరు పెట్టుకున్న వారు చాలాచోట్ల గురునాథ,గుర్నాథం, గుర్నాధరావులాంటి పేర్లతో కనపడతారు. ఈ సంవత్స్రరం ఫిబ్రవరి 9 న తిరుణాల్ల జరుగుతుంది. కనుక స్వామి వారిని దర్శించటానికి రావచ్చు. వచ్చే భక్తులు మనపీఠంవద్ద విడిది చేయవచ్చు. పౌర్ణమి రోజున ధ్యానాదులు చేసుకునేవారికి విశిష్ఠమయిన స్థలం.వినుకొండవచ్చి బస్సులో ఇక్కడకు చేరుకోవచ్చు.
2 వ్యాఖ్యలు:
photoes pedite bagundedigada
phOtO video remDoo peTtaanu choodamdi
Post a Comment