శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కొవ్వొత్తిలా కరుగుతూ ................

>> Thursday, September 4, 2008



సెప్టెంబర్ 5. సమాజ నిర్మాణానికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులకు నీరాజనం అర్పించే సుదినం టీచర్స్ డే. భారత్‌లో ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఈ గురుపూజా దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు మరో సందర్భంలో కూడా ఓ విశిష్టమైన దినంగా వెలుగొందుతోంది.

భారత దేశం గర్వించదగిన మహోపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సెప్టెంబర్ 5. విద్యతో మాత్రమే ఒక సమాజం దృఢంగా నిర్మించబడుతుందని త్రికరణశుద్ధిగా నమ్మినవారు రాధాకృష్ణన్. భారతీయ దౌత్యవేత్తగా, స్కాలర్‌గా, దేశాధ్యక్షుడిగా అన్నిటికంటే మించి బోధకుడిగా జీవితలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులు రాధాకృష్ణన్.

టీచర్స్ డే ఎలా పుట్టింది?

రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా కొంతమంది విద్యార్థులు, స్నేహితులు కలిసి సెప్టెంబర్ 5న తన పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరిపేందుకు బదులుగా ఆరోజును ఉపాధ్యాయదినంగా జరుపుకుంటే తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఆయన సూచించారు. ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అప్పటినుంచి ప్రతిఏటా సెప్టెంబర్ 5ను భారత్‌లో గురుపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఒక వ్యక్తి పుట్టిన రోజును దేశంలోని ఉపాధ్యాయులందరినీ స్మరించుకునే ఉత్సవంగా జాతి నిర్వహించుకోవడానికి గల కారణాలు ఏమిటి అంటే... తాత్వికంగా, ఆధ్యాత్మికపరంగా, విద్యాపరంగా, సామాజిక, సాంస్కృతిక పరంగా ఆధునిక భారత్‌లోని విశిష్టమైన రచయితలలో రాధాకృష్ణన్ ఒకరు. తన కాలంలో పేరు గాంచిన అన్ని పత్రికలలోనూ ఆయన రచనలు చేశారు. ఆ రచనలోని గాఢత, నైశిత్యం, అర్థవంతమైన వ్యక్తీకరణలకు పలువురు పాఠకులు దాసోహమయ్యారంటే ఆశ్చర్యపడవలసింది లేదు.



ఉపాధ్యాయులు జాతి పథ నిర్దేశకులు :

తాము ప్రభావితం చేసే శిష్యుల, విద్యార్థుల జీవితాలను తీర్చిదద్దగల శక్తి సమాజంలో ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ఎందుకంటే గురుముఖంలో నేర్చుకున్న పాఠాలు, విలువలు విద్యార్థుల జీవిత పర్యంతం నిలిచి ఉంటాయి. అందుకే మన ఉపాధ్యాయులను మనం ఎల్లప్పుడు గౌరవించాలి. అలాగే విద్యార్థుల ఉన్నతి పట్ల గురువులు చూపుతున్న శ్రద్ధాసక్తులకు గాను సమాజం, కమ్యూనిటీ కూడా వారిని ప్రోత్సహించాలి.

ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాలు తాము పాఠాలు నేర్చుకున్నందుకు కృతజ్ఞతా భావంతో విద్యార్థులు ఈ రోజు తమకు విద్య నేర్పిన గురువులను, అధ్యాపకులను స్కూళ్లలో, కళాశాలల్లో లేదా వారి ఇళ్లలో కలిసి నమస్కరించే వేళ యావత్ జాతి గురుపీఠానికి నీరాజనం పడుతున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో పైచదువులకో, ఉద్యోగాలకో, పరిశోధనలకో వెళుతూ చివరిసారిగా ఉపాధ్యాయులను కలిసి అభివందనాలను అర్పించే సమయంలో గురుశిష్య సంగమాన్ని చూసినపుడు లేదా అనుభూతి చెందినప్పడు కలిగే భావోద్వేగాలు అనిర్వచనీయాలు..

పాఠాలు నేర్చుకునే దశ దాటి భవిష్యత్తులో బోధనా వృత్తిలో అడుగుపెట్టాలని కలలు గనే భావి ఉపాధ్యాయులు, తమ గురువుల్లాగా తాము ఎంతమంది రేపటి విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపగలమో ఊహించుకుని పరవశించిపోయే విద్యార్థులు, అలాగే తాము విద్యార్థి దశలో ఉన్నప్పుడు కేరింతల జీవితంతో గడిపిన క్షణాలను తలచుకుని ఆనందించే గురువులు.. ఇలా గురుశిష్య పరంపరకు నిండైన అర్థం చెప్పే గురుపూజా దినోత్సవాన్ని మనసారా జరుపుకుందాం..

అలాగే ఒక చిన్న పట్టణంలో అల్లరి పిల్లాడిగా జీవితం ప్రారంభించి భారతీయ విద్యావైభవాన్ని ఆపోసన పట్టి ప్రజాస్వామిక భారత చరిత్రలో అత్యంత గౌరవనీయ వ్యక్తిగా మన్ననలందుకొంటూ జాతి జనుల హృదయాల్లో నిలిచిపోయిన డాక్టర్ రాధాకృష్ణన్ చిరస్మృతిని కూడా ఈ టీచర్స్ డే సందర్భంగా గుర్చుంచుకుందాం..

తాము చెప్పిందే వేదంలా తలకెక్కించడం కాకుండా విషయాలను సూచించేవారే నిజమైన గురువులు...

మంచి టీచర్ అంటే తాను కొవ్వొత్తిలా వెలిగేవాడు... ఇతరులకు మార్గ నిర్దేశం చూపేందుకు తనను తాను కరిగించుకునేవాడు.

అందుకే...
గురుదేవోభవః
ఆచార్యదేవోభవః

1 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ September 4, 2008 at 4:11 PM  

గురుపూజోత్సవసందర్భంగా శుభాకాంక్షలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP