శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నా ఇష్ట కామేశ్వరి యాత్ర

>> Sunday, September 21, 2008


1995 లో శ్రీశైలం అరణ్యాలలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించితెలుసుకున్నాము. దట్టమయిన అరణ్యం మధ్యలో వున్న దేవీ స్థానమది. అక్కడ ఎవరో మహాపురుషులు తీవ్ర సాధన చేసి అమ్మను మెప్పించి ప్రతిష్టించారు. అక్కడ సాధకులకు మంచి యోగసిద్ధులు లభిస్తాయని ప్రతీతి. కనుకనే కొందరు యోగులు అక్కడికెళ్ళి సాధనలు చేస్తుంటారని విన్నాము. అంతేకాదు ప్రతిరోజూ అగస్త్యులవారు బ్రహ్మీముహూర్తములో అదృశ్యరూపములో అక్కడకొచ్చి వెళతారని అనుకుంటారు. ఆ అడవిలో గిరిజనులు ఆమెను కామాచ్చమ్మ ,కామేశ్వరమ్మ అని పిలుచుకుంటారు. ఈ వివరాలన్నీ తెలిసిన దగ్గరనుండి ఎలాగైనా ఒకసారి అమ్మ వారిని దర్శించాలనే కోరిక బలంగా మనసులో నాటుకున్నది. కాని అప్పటికి అక్కడకు వెళ్ళేందుకు అడవిలో కాలి బాట తప్ప మరి సరయిన దారిలేదు. అసలు ఆ ప్రదేశం ఎక్కడవున్నదో చూపించేవారు లేరు. మేము ఆసంవత్సరం భవానీ దీక్షలో వుండగా ఎలాగయినా అక్కడకు వెళ్ళాలని మనసులో తీవ్రమయిన సంకల్పం రావటం మొదలయినది .సరే ఇదేదో అమ్మ సంకల్పములా వున్నదని భావించి ప్రయాణం అయాము. నావెంట నామిత్రులు శ్రీరామనేని హనుమంతరావు, ఓబులాపురం సుబ్బారావు, తిరుపతిరావనే యువకుడు మొత్తం నలుగురము బయలు దేరాము. ప్రయాణానికి ముందు పీఠములో కూర్చొని అక్కడకు చేరేదెలా అని మాట్లాడుకుంటుంటే మావెంటవున్న సుబ్బారావుకు [కాస్త గట్టి సాధకుడులెండి] ఒక 14 సంవత్సరాల వయసుండే పిల్లవాడు మాకు తోడువస్తున్నట్లు ధ్యానములో గోచరమయినదని చెప్పాడు. మరీ మంచిదనుకుని బయలుదేరాము. వినుకొండ వెళ్ళి కావలసిన సరంజామా అంతా తీసుకుని ,ఇప్పటికే ఒకసారి అనుకోకుండా ఇష్టకామేశ్వరిని దర్శించుకుని వచ్చిన మామిత్రుడు చిత్రాలయ స్తుడియో అధినేత శంకర గుప్తా గారివద్దకు వెళ్ళి కలిశాము. ఆయన చాలా కష్టమండి ,దారి లేదు. మేము 50 మంది బృందంతో వెళ్ళీ ఆరాత్రి సరిగా దారిదొరకక చాలాదూరం వెళ్ళి వచ్చాము. అడవిలో దారితప్పితే ప్రమాదం. శిఖర దర్శనం నకు మూడు కిలో మీటర్లకు ఇవతల పాలుట్ల దారిలోదిగి అడవిలోకి నడచివెళ్ళాలి, షుమారుగా 18 కిలోమీటర్లు పైగా వుంటుంది. అక్కడనుండి అడవిలో కాలిబాటన మరికొంత లోపలికి వెళ్ళాలి. పగలెవరన్నా చెంచులు గాని మరెవరన్నా కనపడితే మాత్రమే ఆలయం వద్దకు చేరుకుంటారు. లేకుంటే ఇబ్బందే నని వివరించాడు. ఏమయినా సరేననే మొడిపట్టుదలతో శ్రీశైలం బయలుదేరాము.
శ్రీ శైలం చేరుకున్నాక స్వామివారిని ,అమ్మ వారిని దర్శించుకున్నాము. తరువాత శ్రీశైలములో చాలామందిని దారి ఎటుగా వెల్లాలో విచారించాము. కానీ ఎవరినుండీ సరయిన సమాధానం దొరకలేదు. సాయంత్రం సంధ్యా హారతి సమయానికి అమ్మవారి ఆలయములోకి వెల్లి దర్శనం చేసుకున్నాము. ఆలయ ప్రధానార్చకులు శ్రీరాములు గారు మానాన్నగారికి మిత్రుడు. వారిని అడిగాము. ఆయన తనకు తెలియదని, పక్కనున్న మరియొక అర్చకుని పిలిచి ఈయనకు తెలుసు అన్నారు. ఆయన కూడా వెళ్ళడం చాలా కష్టమని , సున్నిపెంట నుండి లోయలోకి దిగి ఎక్కితే వరుసగా కనిపించే విధ్యుత్ లైన్ స్థంభాల వెంటగా వెళితే 7 స్థంభాలు దాటాక పక్కకు దిగి వెల్లాలని అక్కడ ఒక వాగు వుంటుందని చెప్పారు. సమాచారం పూర్తిగా లేదు మేము మాట్లాడుకుంటూ గదికి వచ్చి భోజనాలు చేసి మాట్లడుతూ టైం చూసుకోలేదు, కొబ్బరికాయలూ పూజా సామాగ్రి కొందామనుకునేసరికి అప్పటికే రాత్రి 11 గంటలవటం తో కొట్లు మూసేసారు. అరే రేపటికి పూజా ద్రవ్యాలెలా బస్సులు తెల్లవారుఝామున 5 గంటలకే బయలుదేరతాయి అప్పటికి కొట్లు తెరవరు, ఏమిచెయ్యాలి అనుకున్నాము. పాలుట్లనుండి అమ్మవారిగుడి దూరమయినా కాలిబాటలాగానన్నా వుంటుంది, సున్నిపెంటనుంచి దారీ తెన్నూ లేకుండా వెళ్ళడం ఎలాగ? కనుక పొద్దుటనే పాలుట్ల దారిలోనే దిగుదాము అని నిర్ణయించుకుని నిద్రపోయాము. తెల్లవారుఝామున 4 గంటలకే లేచి స్నానాలు కానిచ్చుకుని బస్ ఎక్కి పాలుట్ల దారిదగ్గరదించమని కండక్టరుకుచెప్పాము. బస్ బయలు దేరాక పక్కనున్న అతనిని అడగగా ఎవరన్నా తెలిసిన వారినడగండి అన్నాడు. బస్ సున్నింపెంటకు చేరుకున్నాక, మాతో మాట్లాడినతను బస్ దిగి బస్స్టాండ్ లో నిలబడ్డ ఒక రైతుని అడిగాడు ,అతను మాదగ్గర కిటికీవద్దకు వచ్చి సామీ మీరు ఇక్కడేదిగి వెళ్ళడం మంచిది...దిగండి...దిగండి అన్నాడు. వెంటనే అక్కడే దిగాము. ఇంకా తెల్లవారలేదు. కొట్లుకూడా ఏవీ తెరవలేదు. అక్కడున్నవారినడిగి దారి కనుక్కుని వూర్లో నడక మెదలుపెట్టాము. దారిలో ఒక తల్లి పొద్దున్నే లేచి కల్లాపి చల్లుతున్నది. ఆవిడ ముందు ఒక కొట్టువుంటుంది పిలవండి లేస్తారు అన్నది. మేము వెళ్ళి వాల్లను లేపి కొబ్బరికాయలు,పసుపు కుంకుమ మొదలయినవి తీసుకుని అయ్యా మేమిలా వెళుతున్నాము, అమ్మవారికి పాలాభిషేకానికి పాలెమన్నా దొరుకుతాయా ? అని అడగగా, నాగమయ్య అనే అతనిఇంటిని చూపారు. మేము వెళ్ళేసరికి వాల్లు పాలుతీస్తున్నారు. 1 లీటరు ఆవుపాలు కొనుక్కుని వాల్లను కూడా దారిగురించి అడిగాము. వాల్లుకూడా ఇదేదారిలో ముందుకెలితే కొండ అంచుకు చేరుకుంటారు, అక్కడనుండి లోయలోకి దిగి పైకెక్కి వెళ్ళమన్నారు. వాళ్ళింటిలో వున్న పూలు కూడా సమృద్ధిగాకోసుకుని దారిచివరకు చేరుకున్నాము. అక్కడనుండి చూస్తే లోతయిన లోయ, దానవతల మరలా కొడలమీదుగా కరెంట్ లైన్. [విద్యుత్ వుత్పత్తి కేంద్రాన్నుండి వెలుతున్నది] సరే జారిపోయేట్లున్న ఆకొడలమీదుగా దిగి లోయలో వున్న వాగులో మల్లీ స్నానం చేసి తరువాత నిలువుగా వున్న కొండను ఎక్కాము కష్టపడి. అక్కడనుండి అడవిలో కాలినడక దారి. గుడిలొ పూజారి చెప్పినట్లు 7 స్తంభాలు దాటాము. ప్రతిరెండుస్థ0భాల మధ్య అరకిలో మీటరు దూరం పైగా వున్నది. అక్కడనుంది ఎటుపోవాలా అని చూస్తుంటె దూరం నుంచి కుక్కలను వెంటపెట్టుకుని 14 సంవత్సరాల పిల్లవాడు గొడ్దలిని బుజాన వేసుకుని ఓ స్వామీ ఎక్కడికి వెలుతున్నారు? అంటూ కేకవేసి పిలుస్తూ మాదగ్గరకొచ్చాడు. సుబ్బారావన్నావచ్చాడు నీకు ధ్యానములో కనిపించినోడు,అని నవ్వాను నేను. అతను చెంచుల పిల్లవాడు. స్వామీ నేనువచ్చి చూపిస్తాను రండి,7 కాదు 18 స్థంభాలుదాటాలి అని మమ్మల్ని వెంటబెట్టుకుని నడక సాగించాడు. చుట్టూవున్న అడవిని చూస్తూ వానితో మాట్లాడుతూ అమ్మ లీలలను చెప్పుకుంటూ అలుపు లేకుండా నడిచాము. 18 స్తంభాలు దాటాక దారి పక్కకు మల్లించి ఒక లోయలోకి దించాడు. అక్కడకు చేరుకోగానే మనోహరదృశ్యం. ఎత్తయిన చెట్లు, నీడపడదు. చిన్న ఆలయం. ఆలయం ముందు కొండవాగు. అక్కడ మామిడిచెట్లు ఎలావచ్చాయో మాకు అర్ధం కాలేదు. ఎంతో దివ్యమయిన ప్రదేశం. ప్రశాంతంగా వుంది. ఇలా దట్టమ మయిని అడవిలో ప్రశాంతతను చవిచూడటం ఇదే మొదటి సారి. నేల మాళిగలాగ వున్న ఆగుడిలో అమ్మవారి మూర్తి సజీవంగా వున్నట్లు అనిపిస్తున్నది అవయవాలన్నీ ఎంతో అద్భుతంగా మానవ శరీరమా అన్నట్లు వున్నవి, నుదుటన వేలు పెట్టి నొక్కితే బొట్టుపెట్టుకునే చోట మానవ శరీరాన్ని తాకినట్లుందిగాని రాతివిగ్రహాన్ని తాకినట్లుండదు. కరుణించి రప్పించుకున్నందుకు అమ్మకు మరీమరీ ప్రార్ధనలు చేస్తూ. చిన్నపిల్లలమయిపోయాము. ప్రకృతిమరియు స్ధలములో వున్న శక్తితరంగాలు మమ్మల్ని అలా ఆనంద ముగ్ధులను చేస్తున్నాయి.
ఆరోజు దత్తజయంతి. హనుమంతరావు వాల్లను అన్నం వండమని ,తిరుపతిరావును యజ్ఞకుండీ రాల్లతోనే నిర్మించమని, చెంచుపిల్లవాన్ని అక్కడున్న ఎండు మామిడి పుల్లలు తెగగొట్టమని చెప్పి నేను అభిషేకం చెయ్యాలని ప్రారంభించాను. లోపల ఒక్కరే పడతారు. పైగా అభిషేకం చేస్తే నీల్లు ఎటూపోవు. అందుకని అమ్మ వారినే బయటకు తెచ్చాము చిన్నపిల్లలా నాచేతులలో చిన్నారి మురిసిపోతూ వున్నట్లనిపించింది . సంకల్పం చెప్పి శ్రీసూక్తంప్రారంభించగానే నోరు పిడచకట్టినట్లు ఆగిపోయింది. మరలా ప్రారంభించాను, మరలా గొంతుపట్టుక పోయింది. మరలా ప్రయత్నించినా అంతే, ఆశ్చర్యపోయాను. నన్ను చూసి సహచరులు నవ్వుతున్నారు. ఏమిటి చెప్పలేకపోతున్నావు అని. కారణమేమిటా అని అనుమానం వచ్చి అప్పుడు పరిశీలనగా చూసాను ఆవరణలోను ఆలయం గోడలమీద వున్న రక్తపు మరకలను. ఇదేమిటని అడగగా గతవారం ఎవరో వచ్చి కోళ్ళు కోసి పూజచేసి వండుకుని తిని వెళ్ళారని. ఆపిల్లవాడు,చెప్పాడు. మరిచెప్పవేమినాయనా అమ్మకు చాలా అయిస్టంగా వుంది వాతవరణం అందుకే మనకు పాలు పూలు కూడా సిద్ధంచేసిపిలచినది అనిచెప్పి మిగతా పనులాపి, ముందు ఆవరణ అంతా శుబ్రం చేయటం ప్రారంభించాము. వాగులో నీల్లు తెచ్చి[మావెంట ప్లాస్టిక్ బుంగ తీసుకువెల్లాము లెండి] అంతా కొబ్బరిపీచుతో రుద్ది శుభ్రపరచాము.
తరువాత అభిషేకం ప్రారంభించాము. నిజంగా పాలతో అభిషేకంచేసేటప్పుడు దృశ్యం వర్ణించలేను. తళతల మెరుస్తూ తెల్లని కాంతి మాచుట్టూ ఆవరించుకుని వున్నట్లనిపించింది. మేము ఏలోకానున్నామో మాకే అర్ధం కాని పరిస్థితి. మనసు ఆనందతరంగాలలో తేలియాడుతున్నది. తరువాత పూజ చేసేసరికి సహచరులు అన్నం సిద్దపరచారు. ఇక యజ్ఞానికి కూర్చున్నాము. ఎంతో ఆనందంగా సాగింది యజ్జం. ఇంతలో కొందరు ఆడవిలోకొచ్చిన పోలీసులొచ్చారు. వాల్లు కూడా భక్తితో అమ్మవారిని దర్శించుకుని, యజ్ఞములో పాల్గొన్నారు. వారికి కూడా రక్షలనుఇచ్చి ప్రసాదాలిచ్చాము. చాలా సంతోశించారు. దత్తజయంతిరోజున అమ్మవారిదర్శనం లభించింది. తరువాత చెంచుపిల్లవానితో కలసి భోజనం చేసాము. పోలీసులు ఇచ్చిన డబ్బులు మరికొంత మావికూడా కలిపి చేర్చి ఆచెంచు పిల్లవానికిచ్చి అప్పుడప్పుడూ నూనెతెచ్చి దీపారాధన చేయమని చెప్పాము. 4 గంటలయింది. అమ్మకు మేము తెచ్చిన వస్త్రాలు కట్టి ఎత్తుకుంటె చిన్నపాప మారాం చేస్తున్నట్లు మాచేతులలో ఇమిడిపోయింది. అమ్మను మాచేతులలోనుండి ది0చలేక వదలి వెళ్ళలేక వెళ్ళలేక బయలు దేరాము. ఈసారి పాలుట్ల దారిలోకి ఎక్కాలని నడక ప్రారంభించాము. అడవిలో కొంతదూరం నడచి దారి చేరుకున్నాము. అక్కడనుండి తారురోడ్డుకు రావటానికి సుమారు 20 కిలోమీటర్లు వున్నట్లున్నది. చుట్టూదట్టంగా వెదురుపొదలు ఎత్తైన వృక్షాలు ఎంతనడచినా రోడ్ రాలేదు. చీకటిపడుతున్నది. ఇంతలో హనుమంతరావు కాలు సహకరించటమ్లేదు నడవలేనన్నాడు. దీక్షలో వుండటం వలన చెప్పులులేక అతని పాదాలు మెత్తబడ్డాయి. వెంటనే మా కండువలు చించి వాని పాదాలకు పాదరక్షల్లా చుట్టి, పక్కనుండి ఒక వెదురు బొంగు చేతికిచ్చి నడవమన్నాము. అలా నే చీకటిపడింది. దారిమొత్తం పలుకురాళ్ళతో నిండివుంది. అమ్మను తలుకుకుని మాట్లాడుతూ నడిచాము. విచిత్రంగా మాకు భయమన్నది రాలేదు. అమ్మ మావెంటవస్తున్నట్లే అనిపించింది. రాత్రి 8.30 కి తారురోడ్డుకు చేరుకున్నాము. అక్కడనిలబడి శ్రీశైలం నుండివస్తున్న లారీని చెయ్యెత్తి ఆపి ఎక్కాము. దోర్నాల చేరుకుని అక్కడనుండి బస్ ఎక్కి వినుకొండ చేరుకున్నాము.
నిజంగా అమ్మ అనుగ్రహంతో చేసిన ఈ యాత్ర నా జీవితములో మరపురానిది. మరలా రెండుసార్లు అక్కడకు వెల్లి వచ్చాను. ఇప్పటికి 7 సంవత్సరాలుగా వెళ్ళివద్దామని అనుకుంటున్నా కుదరటం లేదు. ప్రస్తుతం అక్కడికి వెల్లటానికి వాహన సౌకర్యం ఏర్పడిందని దేవస్థానం వారు ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేసారని విన్నాను. ఝాన్సీ గారని ఒక భక్తురాలు హైదరాబాద్ నుండి మరికొందరు మరికొన్ని చోట్లనుండికూడా వస్తామంటున్నారు. దసరా తరువాత ప్రయత్నం చేయాలి. అమ్మ పిలుపురావాలికదా !!

5 వ్యాఖ్యలు:

Unknown September 22, 2008 at 12:57 AM  

బాగుందండి. ఇష్టకామేశ్వరిని దర్శించి శ్రీశైలప్రభ అనే పత్రిక ద్వారా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిని నేను బాగా ఎరుగుదును. అమ్మను తొలినాళ్ళలో దర్శించిన వారిలో నేను ఒకడిని. ఎంతో ప్రయాసలకోర్చి చెంచు కుర్రాడొకడి సాయంతో శ్రీశైలం నుంచి నడిచివెళ్ళాం. అప్పుదు చేతిలో నాలుగు కెమెరాలు వున్నా అమ్మకు ఫోటో తీయలేకపోవడం ఒక మిష్టరీ. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మ పిలిస్తే తప్ప మనం వెళ్ళాలనుకుంటే సాధ్యపడదు. అదే ఆమె మహత్యం. రాకుండా కష్టాలు పెడుతోందని ఒకసారి అమ్మవారిని కష్టకామేశ్వరి అని మొండికేసి వెళ్ళినప్పుడు అడవి కందిరీగలు (భ్రమరాలు..??) తరిమికొట్టిన సంఘటన నాకిప్పటికీ గుర్తే. (అయినా దర్శించుకోని చెండీయాగం చేసామనుకోండి). మళ్ళా ఆ మధ్య చూడటానికి వెళ్తే అక్కడిదాకా జీపులు వెళ్ళటం, అక్కడ స్టిరపడ్డ కుటుంబాలు చూసి ఆవుపాలు డబ్బాపాలైపోయాయనుకున్నాం.

durgeswara September 22, 2008 at 6:31 AM  

మీరన్నది నిజం
అమ్మ అనుగ్రహం లేకుండా అక్కడికి చేరుకోలేము. మీరు కూడా అమ్మ భక్తులు కనుక నాకు బంధువర్గములోనివారె. మీ అడ్రెస్ మైల్ అడ్రెస్ తెలపండి కొంచెం టచ్ లో వుండండి. మిమ్మల్ని ఈరూపంలో అమ్మ నాకు కలిపింది.ధన్యవాదములు.

Anonymous September 22, 2008 at 9:04 AM  

మీ భక్తి ప్రపత్తులూ, అనుభవాలూ కదిలించే విధంగా ఉన్నాయి. ఈ అనుభవాన్ని అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

durgeswara September 22, 2008 at 9:46 AM  

naaga murali gaariki dhanyavaadamulu

తిలక్ April 10, 2009 at 9:40 AM  

dear sri durgeswara rao garu,

ishta kameswari yatra nu chadivi,

naku kuda amma darsanam cheyalani

korikaga undi .meeru gani yatra chesinatlu ayithe, naku kuda telupa prardhana....
jai ishta kaameswari devi...

tilak

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP