మూకం కరోతి వాచాలం......
>> Friday, September 19, 2008
మూకం కరోతి వాచాలం ......
అని శ్లోకంలో మూగవాడు సహితం నీ అనుగ్రహం ఉంటే వాచాలునిలా మాట్లాడ గలుగుతాడని అర్ధాన్ని చదువుకున్నాను. కాని దాని అర్ధాన్ని నేనే ఒకసారి ప్రత్యక్షముగా అనుభవించేట్లు చేసాడు స్వామి. ౨౦౦౧ లో సికిందరాబాద్ స్వరాజ్య ప్రెస్ లో హనుమాన్ కోటి చాలీసా మహా యజ్ఞ్జం జరిగింది. పూజ్య అన్నదానం చిదంబర శాస్త్రి గారు సంవత్సర కాలం శ్రమించి రాష్ట్రం పర్యటించి అనేకమంది భక్తులచేత కోటి చాలీసా పారాయణాలు చేయించి కార్యక్రమాన్ని రూపొందించారు. దానికోసం ఎక్కడెక్కడ నుండో భక్తులు పారాయణములు చేసిన సంఖ్యతోగూడిన కార్డులను కట్టలుగా కట్టి తీసుకుని రాజధానికి చేరారు. ముందుగా ఈ కార్యక్రమం తాడిబందు ఆంజనేయస్వామి ఆలయంలో అనిచెప్పారు. కానీ అక్కడ కుదరక స్వరాజ్య ప్రెస్ కు మార్చారు. అందరితో పాటు మాకు కూడా ఆహ్వానాలు అందాయి. మూడురోజుల కార్యక్రమం. మొదటిరోజు నేను వెళ్ళలేకపోయాను. మా తరపున వెళ్ళిన జన్నాభట్ల ఉగ్రనరసింహ శాస్త్రి , శ్రీరామనేని హనుమంతరావు, అంజయ్య ,సుద్దపల్లి ఆంజనేయులు అనే భక్తులు ముందురోజు కార్యక్రమానికి అందుకున్నారు. అయితే అక్కడ నిర్వాహక భాద్యత చేపట్టిన పెద్దలు ఈ కార్యక్రమాన్ని తమ పలుకుబడిని పెంచుకునేందుకు ఉపయోగించుకుని, శాస్త్రిగారిని వాడుకుంటున్నారని తెలిసింది. వేలాదిగా తరలివచ్చే భక్తులచేత కార్యక్రమాలను చేయించేటందుకు అవసరమయినంత మంది కార్యకర్తలు కూడా లేరు.అప్పటి గవర్నర్ రంగరాజన్ భార్య ,ఎంతోమంది పెద్దలు పండితులు ఆహ్వానించబడ్డారు. మొదటిరోజు రాత్రికి నేను చేరుకున్నాను. మావాళ్ళు నాకు అన్ని వివరంగా చెప్పారు. శాస్త్రిగారు ,దుర్గేశ్వరరావు గారూ మీరొస్తారని చూస్తున్నాను. ఆలస్యంచేసారు. అన్నారు. ఈ కార్యక్రమము శాస్త్రిగారి సాధనకు ప్రతీక కనుక ఎలాగయినా దీనిని విజయవంతంగా నడపాలని నిర్ణయించుకున్నాము. మరుసటిరోజు కార్యక్రమము మొదలయినది
ఆరోజు హనుమద్ వ్రతాలు చేయించాలి.
ముందుగానే ఆకార్యక్రమములో పాల్గొనటానికి తమ పేర్లను నమోదుచేసిన భక్తులు వందలాదిగా తరలివచ్చారు. వారిలో పామరుల వద్దనుండి మహాపండితుల వరకున్నారు. అందరిని వరుసలలో కూర్చోబెట్టి వారికి పూజాద్రవ్యాలు అందజేస్తున్నారు మావాళ్ళు అంతటా తామై . మైకు నాచేతికిచ్చి అందరికి సూచనలిస్తూ నడపమని చెప్పారు శాస్త్రిగారు. వేలాదిమందివచ్చిన ఆ కార్యక్రమం లో వందలాది జంటలు కూర్చునివున్నారు. నేనేమి బ్రాహ్మణ జన్మనెత్తి వ్రతాలు గట్రా చేయించిన వాడిని కాను. భక్తి మార్గంలో పయనిస్తున్న వాడినేకాని ఇంతమంది పెద్దల ముందు అది శాస్త్రరీతులను ఔ పోసనపట్టిన మహాను భావులముండు నేను నోరుతెరవటమే తప్పు. దానికి తోడూ వారికే సూచనలిచ్చి కథ నడపటం అంత సులువుకాదు. ఏమాత్రం మాట తేడావచ్చినా అభాసపాలవుతాను. ఏమిటితండ్రి! ఈ పరీక్ష! అని మనసులో హనుమంతుని తలచుకుని ఆయనను మనసులోన కాహ్వానించుకున్నాను. మనోజవం మారుత తుల్యవేగం మారుతతుల్యవేగం ...అంటూ ,బుద్దిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా ..అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్వరణాద్భవేత్ . అంటూ స్మరించుకుని కళ్లు తెరిచాను ఎక్కడ లేని దైర్యం వచ్చింది.అంతే నోటినుంచి ప్రవాహంలా స్వామివారి మహిమలను వర్ణిస్తూ ప్రసంగము సాగిపోతున్నది దాదాపు మూడుగంటలు కార్యక్రమం విసుగుపుట్టకుండా జరిగింది. పూర్తయ్యాక శాస్త్రి గారూ మరికొందరు పెద్దలువచ్చి నన్ను చాలా చక్కగా నిర్వహించారని అభినందిస్తుంటే ,అసాధ్యాలను సుసాధ్యం చేసే స్వామి వుండగా కానిదేమున్నది అని నమస్కరించాను. నిజంగా ఇప్పటికి అనుమానమే అంత కార్యక్రమాన్ని అటువంటి సన్నివేశాన్ని కల్పించి నాబోటి అల్పునిచేత కూడా చేయించాడంటే, పై శ్లోకానికి ఇంతకన్నా నిదర్శనం అక్కరలేదని.
2 వ్యాఖ్యలు:
అంజనీ పుత్రుని అపారమైన కరుణను పొందిన మీరు ధన్యులు.
dhanya jeevulu,
Post a Comment