గురుపౌర్ణమి రోజు సత్సంగం లో గడపండి
>> Sunday, July 13, 2008
ఒకేకాలం లో జ్ఞానులైన గురువులెందరున్నా వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీనకాలం లో రాకపోవడమే ఆశ్చర్యం. ఒకానొక వుత్తమ సాంప్రదాయమే యిందుకుకారణం. తేనెటీగ వేరువేరు పువ్వులనుండి తేనెను గ్రహించినట్లు ,జ్ఞానప్రియుడైన శిష్యుడు గూడా అనేకమంది గురువులనుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతుంది. ప్రతిజ్ఞానీ తమ శిష్యులను ఇతర గురువులనుండి జ్ఞానమార్జించాలని ఆదేసించేవారు,. శ్రీకృష్ణుడు అర్జనుని భగవద్గీతలో అలానే ఆదేసించారు. రఘువంశానికి గురువైన వశిష్ఠుడు రామున్ని విశ్వామిత్రునితో పంపమని ఆదేశించారు . వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు వద్దకు పంపాడు. రాముడు అరణ్యం లో ఋషులందరినీ సేవించాడు. భాగవతం ఏకాదశ స్కందం లో అవధూత 24 మంది గురువుల నుండి జ్ఞానమార్జించినట్లు చెప్పుకున్నాడు. ఇందువలన వేరు వేరుగురువుల రూపాలు ,విధానాలు-వేరు వేరు జాతులపువ్వులులాగ స్థూల దృష్టికి భిన్నంగా కనిపించినా , వారందరిలోవున్న జ్ఞానమనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యులకు కలుగుతుంది. అప్పుడే సాంప్రదాయబేధాలు ,తగవులు వుండవు. "ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతః " వుత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కులనుండి లభించుగాక అన్నదే వేదఋషుల ప్రార్దన.
ఇలా అనేక మంది మహనీయులలను సేవించగలగాలంటే మొదట ఈ సూత్రమెంత ప్ర్శస్తమైనదో తెలిసి,దాని పట్ల అత్యంత శ్రద్ధ కలగాలి. తరువాత పూర్ణులైన మహనీయులెలా వుంటారో తెలుసుకోగలగాలి. లేకుంటే ఆధ్యాత్మ విద్యపై ఆశ తో మహనీయులమని చెప్పుకునే ప్రతివారిని నమ్మి ,సేవించి అన్ని విధాలా పక్కదారిపట్టే ప్రమాదముంది. అందుకే యిలాంటి సంస్కారం ధృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు భాగవతం లో అనేకమంది మహనీయుల చరిత్రలను పొందుపరచాడు . తమిళదేశం లో పెరియపురాణం లో అరవయి ముగ్గురు శైవ సిద్ధులను గురించి భక్తులు చదువుతారు. అలానే అళ్వారులు అను 12మంది మహాత్ముల చరిత్రలు పారాయణం చేస్తారు. మహనీయులు మరణానికి అతీతులు కనుక ,వారిచరిత్రలు భక్తితో పాఱాయణం చేసే వారికి వారి అనుగ్రహం గూడ నేటికి లభిస్తున్నది. ఇక ఏడు రోజులలో మరణించనున్న పరీక్షత్తుకు అందుకే అందుకే శుకయోగి వేరొక సాధన చెప్పక ,భాగవత శ్రవణం మాత్రమే చేయించాడు. విజయానందుడనే సన్యాసికి మరణించనున్న రోజులలో శిరిడి సాయిబాబా కూడాతరింపునకు భాగవత పారాయణాన్ని చేయించారు.
ఈవుత్తమమైన సత్యాన్ని గుర్తించకుంటే శుకుడు, సాయిబాబా లకంటే మనకే ఎక్కువతెలుసునని భ్రమించి ,అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణమనే సాటిలేని సాధనాన్ని మనం అలక్ష్యం చేస్తాము. మహాత్ముల చ్రిత్రలు మరియు బోధలు శ్రద్ధ తో పారాయణ చేయడం వారి ప్రత్యక్ష సాన్నిద్ధ్యంతో సమానము. శ్రీ రమణ మహర్షి గూడ చెప్పారు. వెంకయ్యస్వామికూడ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్రవంటివి చదవమని ఒక భక్తునితో చెప్పారు. వీరబ్రహ్మం గారుకూడా తాము దత్తావతారమని కాలజ్ఞానం లో వ్రాసారు. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి తమగురించి శ్రీ గురుచరిత్ర గ్రంథరూపములో తామే వుంటామని, అదిపారాయణ చేసినవారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము కలుగుతాయని ప్రమాణము చేసిచెప్పారు. ఇతరమతాలలో గూడా ఈ సాంప్రదాయ మే వున్నది. బైబిల్, ఖురాన్ లలో ఎక్కువభాగం ఆయా జాతులలో వెలసిన ప్రవక్తలు అనబడు మహనీయుల చరిత్రలుంటాయి .. అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు అందుకే రానున్న గురుపౌర్ణమికు అరమరికలు లేక అందరూ మహాత్ముల చరిత్రలు పారాయణం చేసుకోండి.
1 వ్యాఖ్యలు:
నెనర్లు
Post a Comment