ఒలెఒలె హాయి ! హుళక్కి హాయి ! చిచ్చే హాయి !
>> Thursday, July 10, 2008
84లక్షలజీవరాసులలో రకరకాలయోనులలో జన్మించిన జీవి ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్య ఫలములవల్ల ఒకసారి మానవ గర్భవాసాన పడతాడు. ఆతల్లి గర్భములో పెరుగుతూ అక్కడి పరిస్తితులకు తట్టుకోలేక అంటే వుమ్మునీరు నరకప్రాయమైన గర్భాశయములోపరిస్థితులలో పెరుగుతూ వేదనచెందుతుంటాడు. తాను ప్పటికి ఎన్నిజన్మలెత్తి చేసిన కర్మలవలన ఇటువంటి జనన మరణచక్రములో పరిభ్రమిస్తున్నాడో పూర్వజ్ఞానము కలిగి, దానికి చింతిస్తూ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ వుంటే ,ఆతల్లి మాత్రం నా బిడ్ద లోపల తిరుగుతూ ఆడుకుంటున్నదని మురిసి పోతుంటుంది. ఇక 9 నెలల గర్భవాసనరకం అనుభవించిన జీవి తల్లికి ప్రసవ సమయమురాగానే తొందరగా బయటకు రావాలని కదలుతూ బయటకు వస్తాడు. మళ్ళీ తాను ఇంకొక జన్మ ఎత్తానని పెద్దగా ఏడుస్తాడు. పుట్టగానే అది అమెరికా శిశువయినా ఆస్ట్రేలియా బిడ్డయినా, ఇండియా అయినా ఇండోనేషియా అయినా తాను క్వాక్వా, క్వా అని ఏడుస్తుంది. క్వా ,అంటే ప్రాకృతములో ఎక్కడ, అని అర్ధము. తాను ఈగర్భవాస,జనన మరణ బాధలనుంచి తప్పించుకుని పొందే శాంతి ఎక్కడ? ఎక్కడ? అని ఆజీవి ఆవేదనతో ప్రస్నించుకుని వేదనతో రోదన చేస్తున్నది. మనపూర్వ కాలపు ముసలమ్మలు, కేవలము సంసారాన్ని మోసే వాళ్ళేకాదు, సంస్కారబలాలను గుర్తెరిగిన తత్వవేత్తలు. అక్కడేవున్న వాళ్ళూ ఆబిడ్డను సముదాయిస్తూ ఒలె,ఒలె హాయి అంటే అయ్యో ఇక్కడ హాయిని వెదుకుతున్నావా ?హుళక్కిహాయి అంటే నిరంతర వేదనలతో సాగే ఈజన్మ ప్రక్రియలో మానవ జన్మ ఎత్తిననీకు ఇక్కడ, సంసారబంధం లో ఇరుక్కునే నీకు హాయి లేదు. చిచ్చేహాయి అంటే ఎప్పుడయితే నీవు ఈమానవ జన్మ చాలించినతరువాత తలకొరివి పెడతారో అప్పుడేరా వెర్రికన్నా నీకు హాయి అప్పటిదాకా నిరంతర పోరాటమే అని నీకుమిగిలేది అశాంతి మాత్రమేనని అర్ధంవచ్చేలా ఈపాట పాడుతూ శిశువు పై మాయనీళ్ళు చల్లగా అప్పటివరకు వున్న పూర్వజ్ఞానం నశించిన జీవి తన జీవితాన్ని ప్రారంభిస్తుంది.
5 వ్యాఖ్యలు:
బాగుంది
బాగుందండీ. ఇప్పటి వరకు నాకు తెలియదు ఆ మాటల అర్ధం...
చాలా బావుంది, నిజంగ మంచి సమాచారం కూడా అందించారు, మీ ఈ టపా చదివి ఓ క్షణం అలా ఉండి పోయా ... మీకు నా ధన్య వాదాలు
dhanyavaadamulu
chaalaa chaala baagundi
Post a Comment