మహేశ్వరునికి మహాప్రీతినికలిగించే మాసశివరాత్రి వ్రతం
>> Tuesday, July 1, 2008
పరమేశ్వరుడు భక్తసులభుడు. తలపై కొద్దిగ గంగనుపోసి విభూది రాస్తేచాలు పరవశుడై అడకనే వరాలు గుప్పించే బోలా శంకరుడు. ఆస్వామిని కొలచి యక్ష,కిన్నెర ,గంధర్వ ,దేవగణాలేకాదు రాక్షసులు సహితము శుభాలను పొందారు. ఇక మానవులకు ఆయన కరుణ లభించడము అత్యంతసులువు. ఆయన అర్చనలు నిరుపేదలు కూడా నిరభ్యంతరముగా చేసుకొనగలిగేలా తాను భక్త సులభుడయినాడు. ఆయన అర్చనకు మరేమీ అధికముగా కషపడి సమకూర్చుకోవలసిన వస్తువులుకావు. కాసిని నీళ్ళు, నాలుగు మాఱేడు దళాలు, ఏ రకమయిన పిచ్చిపూలు తెచ్చినా మురిసిపోతాడా వెఱ్రితండ్రి.
ప్రతినెలలోనూ అమావాస్య ముందువచ్చే చతుర్ధశి నాడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమయినరోజు. దానినే మాస శివరాత్రి అంటారు. మాఘమాసములో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రి అనిపిలుస్తారు. ప్రతినెలలో ఆరోజు పగటిపూట వుపవాసము వుండి సాయంత్రము మట్టితో శివలింగాన్ని చేసుకుని గాని ,లేక మీకు అందుబాటులో వున్న శివ లింగము నుగాని పూజగదిలో ఒక పల్లెములో వుంచి. స్వామికి ఆవాహన పలికి ,తండ్రీ నాపూజలందుకొమ్మని పిలచి. ,ఆర్ఘ్య పాద్యాదులను సమర్పించి తరువాత అభిషేకము చేయాలి .ఈ అభిషేకము శక్తి వున్నవాళ్ళు ఋత్విక్కులను నియమించుకుని ఆశక్తిలేనివాళ్ళు తామే నమశ్శివాయ అనుకుంటూ స్వామిని మన త్రుప్తితీరా నీళ్ళతో పాలతోనూ అభిషేకించుకోవాలి. తరువాత వస్త్రము సమర్పించి, గంధము, కుంకుమలతో అలంకరించి పూలతో మారేడు దళములతో పూజించాలి. చదవగలిగితే అష్టోత్తరాలు లే కుంటే ఓమ్ నమశ్శివాయ అనే పంచాక్షరిని జపిస్తూ పూజ చేయవచ్చు. తరువాత ధూపము దీపము చూపి మనశక్తికొలది నైవేద్యము సమర్పించి హారతి ఇవ్వాలి. తరువాత అంజలి ఘటించి పూలు మంత్రపుష్పముగా భావించి సమర్పించండి చాలు. ఆతరువాత మీకు వచ్చిన కీర్తనలతో స్వామిని సంతోషుని గావించి మనసులో తలచుకుని ధ్యానించండి. పరవశమయిన ఆతండ్రి మనసు వుర్రూత లూగి అక్కడివాతావరణము ఎంతో ప్రశాంతముగా మారటము మీకు అనుభవ మవుతుంది . మరుసటిరోజు పూజలో వుపయోగించిన ద్రవ్యాలను నదిలోకాని, లేక ఎవరూ తొక్కని చోటకానీ పడవేయాలి. శివమాలిన్యాన్ని తొక్కడము మహాపాపము అంతేకాదు ,మహా కష్టాలను తెస్తుంది.
ఈవిధముగా భక్తిశ్రధ్ధలతో స్వామిని పూజించి చూడండి మీకోరికలు సత్వరమే నెరవేరుతాయి. సకలదోషాలూ పరిహరింపబడతాయి.
శ్రీ వేంకటేస్వర జగన్మాత పీఠములో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మాస శివరాత్రి రోజున జరిగే అర్చనలో మీ గోత్రనామాలతో పూజ జరపాలను కుంటే మైల్చెయ్యండీ durgeswara@gmail..com ఇది లోకళ్యాణము కొరకు పీఠము చేస్తున్న సేవ . దగ్గరలో వున్న ఆలయములో నైనా శక్తి వుంటే రుద్రాభిషేకము చేపించుకోవచ్చు. పరమేస్వరుని కరుణ మీపై కలగాలని కోరుకుంటున్నాను
0 వ్యాఖ్యలు:
Post a Comment