మనిషికెలా వచ్చింది వందసంవత్సరాల ఆయువు?
>> Monday, June 30, 2008
మానవునికి వందసంవత్సరాల ఆయుష్షు రావటానికి ఒక కథ చెబుతారు. సృష్టి జరిపేటప్పుడు, బ్రహ్మదేవుడు మనిషిని, ఎద్దును, కుక్కను,గుడ్లగూబను ఒకేసారి సృష్టించి తలా 40సంవత్సరాలు ఆయువును ప్రసాదించాడు. ఎవరి విధులేమిటో వారికి తెలియజేశాడు. అప్పుడు ఎద్దు ముందుకొచ్చి నమస్కరించి తండ్రీ ! నాజీవితమంతా మనిషికి వ్యవసాయములో సహాయం చేస్తూ గడపమన్నావు,. ఎంతకాలం ఈచాకిరీ చేసినా విశ్రాంతిలేకుండా గానుగెద్దు జీవితము గడిపినా ఎవరికీ జాలి వుండదు. వాళ్ళు వేసే గడ్డీగాదమే దక్కేది. మరలాంటప్పుడు నేను ఏసంతోషము లేని ఈ జీవితాన్ని అంతకాలం లాగలేను. దయచేసి 20సంవత్సరాలు మాత్రమే నాకు ఇచ్చి మిగతాది ఎవరికన్నా ఇవ్వండి అన్నది. బ్రహ్మ గారికి జాలికలిగింది. ఈలోపల ముందుకొచ్చిన మనిషి ప్రభూ! ఆమిగతా ఆయువు నాకివ్వండిఅన్నాడు .బ్రహ్మ సరేఅన్నాడు.
వెంటనే ముందుకొచ్చిన కుక్క స్వామీ! నాజీవితము మరీ కష్టముగా సృష్టించావు నాజీవితాంతము మనిషికి వాని ఇంటికి కాపలా కాయటంతో గడచిపోతుంది. ఇంతచేసినా నన్ను సంబోధిస్తూ నీచభావంతో కుక్కా ....కుక్కా అని తిడతారు. వాల్లేసే ఎంగిలి మెతుకులు తిని బ్రతకాలి .ఎందుకు నాకీ నీఛ జన్మ. నాకుకూడా ఆయువు 20సంవత్సరాలకు కుదించండి అని వేడుకున్నది. ఆయన సరేలే అన్నాడు. మనిషికి ఆశ పెరిగి స్వామీ ఆ మిగతాదికూడా నాకు ప్రసాదించండి అని అడిగాడు. ఆయన నవ్వుకుని, అలాగే కానీ అన్నాడు. గుడ్లగూబ తానుకూడా విచారంగా బ్రహ్మతో తండ్రీ! నా రూపమే వికృతముగా వుంటుంది. నన్ను చూడగానే అసహ్యించుకుంటారు. నాముఖం చూడటమే దోషమని భావిస్తారు. ఎప్పుడో చీకటిలో ఆహారం వెదుక్కోవాలి . ఇలాంటి బ్రతుకుకు 40సంవత్సరాలెందుకు నాకు కూడా 20 సంవత్సరాలు చాలు అని బ్రతిమిలాడుకుండి. ఆయనకు కూడా జాలి కలిగింది. అప్పటికి ఆశ ఆకాశమంత పెరిగిన మనిషిమాత్రం అనర్ధాలు ఆలో చించుకోకుండా స్వామీ ఆకొద్దిగా కూడా నాకు ప్రసాదించమని వేడుకున్నాడు. బ్రహ్మ దేవుడు సహితం తాను సృష్టించిన మనిషికి కలిగిన అత్యాశకు విస్తుపోయి వీని అజ్ణ్ణానానికి నవ్వుకుని తధాస్తు అన్నాడు. మనిషికి చాలా సంతోషం కలిగింది. 100సంవత్సరాల ఆయుర్ధాయం పొందగలిగినందుకు.
ఇక జన్మ తీసుకున్న మనిషి తన 40 సంవత్సరా లు తనదైన జీవితాన్ని ఆనందం సంతోషం తో తన కోసం బ్రతుకుతాడు. వివాహమయి భార్య తో సుఖంగా గడుపుతాడు. 40 సంవత్సరాలు పూర్తయ్యేసరికి పిల్లలు పెరుగుతుంటారు . వాళ్ళచదువులు ,ఏదోఒక వుద్యోగము లేక వృత్తి లలో వాళ్ళను స్తిరపరచాలి ,పెళ్ళిల్లు చేయాలి పేరంటాలు చూడాలి వాళ్ళకోసం సంపాదించి ఇవ్వాలనే ఆశ ,వీటిని నెరవేర్చడానికి తాను నిరంతరం శ్రమిస్తుంటాడు. దానికొరకు తనసుఖాన్ని సంతోషాన్ని పట్టించుకోకుండా నిరంతరం శ్రమ ..శ్రమ .. ఇలా ఎద్దు లా కష్టపడుతూ 20 సంవత్సరాలకాలం గడచిపోతుంది. ఆతరువాత 60 వచ్చేసరికి పిల్లలచేతికి పెత్తనము వస్తుంది. వాళ్ళతంటాలేవో వాళ్ళు పడుతున్నా ఎక్కడ పాడు చేసుకుంటా రోనన్న భయంతో ప్రతిదానిలో అడగక పోయినా సలహాలనివ్వడం మొదలుపెడతాడు . మొదట్లో వాళ్ళుకూడా మేము చూస్తాములే అని మర్యాదగా చెప్పినా తరువాత తరువాత మన సలహాలు వాళ్ళకు విసుగు కలిగించటము,కోడళ్ళు అబ్బా ఈ ముసలివాళ్ళ నస మనం భరాయించలేమండీ అంటూ ఎక్క చెప్పటం మొదలయ్యాక మనపై గౌరవ ము తగ్గుతుంది అయినా మన మమకారం తగ్గదు సరికద పెద్దదయి అదికాదురా పెద్దోడా! ఇలాచెయ్యాలిరా చిన్నోడా! అసలేమిటి ఇలా తయారయ్యారు అంటూ మాసలహాలు ఎక్కువయిపోతాయి దాంతో వాళ్ళకు మండుద్ది. ఎందుకలా వూరికె ! కుక్కలాగా అరుస్తుంటావ్. ఒకముద్దతిని మూలన కూర్చోలేవా ? అని కసురుకోవడం మొదలవుతుంది. అప్పటికీ మన మనసు మరలక వాళ్ళ తప్పొప్పులు ఎన్నడం వాళ్ళచేత కుక్కా.. కుక్కా .. అనిపించుకూంటూ వాళ్ళు మిగిల్చినది తింటూ, వాళ్ళు సరదాలకి తిరుగుతుంటే ఇంటికి కాపలా కాస్తూ తీసుకున్న కుక్క జన్మ 20 సంవత్సరాలు కూడా గడచిపోతుంది.
ఇక అప్పటికి మనవళ్ల పెత్తనం మొదలవుతుంది .ఇంటికి కొత్త కోడళ్ళు వచ్చి వుంటారు . వీళ్ళకు తిండి పెట్టడమే దండగ అనేభావన వుంటుంది వారిలో. అప్పటి 80 సంవత్సరాల వయస్సులో అవీ ఇవీ తిందామని కోరిక . అడిగితే పెట్టే ఒక్క ముద్దకూడా పెట్టరేమోనని భయం . వాళ్ళు ఏమేమి చేసుకుని తింటున్నారు? మనకు కూడా పెడతారో లేదోనని గుడ్లగూబలాగా కళ్ళు మిటకరించుకుని చూస్తూ మిగతా20 సంవత్సరాల వయస్సు కూడా గడచిపోతుంది మనిషికి.
4 వ్యాఖ్యలు:
బాగుంది సర్. మీ బ్లాగ్ డిజైన్ చూస్తెనే ొక భక్తి భావం కలుగుతుంది. మీ లాంటి వారు ఉండి హిందూ ధర్మాన్ని, దానిలోని పవిత్రతను చాటి చెప్పడం వలననే హిందుత్వం సజీవంగా, బలంగా ఉండగలుగుతుంది. ధన్యవాదాలు సర్ మీరు ఇంకా ఇలాంటి పొస్టులు ఎన్నొ వేయాలని కోరుకుంటున్నాను ..... వర్మ.
త్రేతా, ద్వాపర యుగాల్లో మానవులు ఎక్కువ కాలం జీవించేవారు అంటారే. మీరు చెప్పిన కథ కలియుగానికి మాత్రమేనేమో. -రఘు
కథ బావుంది. -రఘు
ఇది మానవ జీవితములో వివిధ దశలలో అతని పరిస్థిని తెలియ జేయటానికి సత్సంగములలో చెప్పే కథ. దీని ప్రామాణికతకన్నా ఇందులో నిజాలు మనజీవితములో పరిశీలించుకోవాలి.ధన్యవాదములు
Post a Comment