శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇద్దరూ ఉద్యోగం చేయకూడదా ???????

>> Wednesday, January 6, 2021

🙏🕉️🇮🇳🚩



మూలాలకు తరలి వెళదాం*
××××××××××××××××××××

*"నాన్నగారు! చదువుకున్నా, నేను ఉద్యోగం చెయ్యకూడదా?* అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు.          పెద్దవదినని కూడా ఉద్యోగం మాన్పించారు...                *ఎందుకని నాన్నాగారు... " నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది*, వైష్ణవి.

"బంగారూ..." కూతుర్ని ప్రేమగా అలానే పిలుస్తారు చంద్రశేఖరం గారు...

*"ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే పాతికేళ్ల కిందట మీ అమ్మకు, నాలుగేళ్ళ కిందట మీ పెద్ద వదినకు వచ్చింది.* 
కానీ నా పెద్దరికానికి విలువనిస్తూ, మీ అన్నయ్యతో సహా అందరూ ఎదురు ప్రశ్నించలేదు.
 *ఇప్పుడు అందరికీ ఒకేసారి వివరంగా చెప్తాను*... ఇలా వచ్చి కూర్చోండి." అన్నారు చంద్రశేఖరం గారు.

*విషయం గంభీరమైనదిగా అనిపించి* కొడుకులు ఇద్దరూ గోపాల కృష్ణ, వంశీకృష్ణ చేస్తున్న పని అక్కడికి ఆపుజేసి, వచ్చి తండ్రి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. భార్య శైలజ, పెద్దకోడలు సుహాసిని ఎదురుగా చాప పరుచుకుని కూర్చున్నారు. వైష్ణవి నాన్న కూచి. తండ్రి వడిలో తలపెట్టి కూర్చున్నది. కూతురి తల నిమురుతూ చెప్పడం ప్రారంభించారు చంద్రశేఖరం గారు.

"మా నాన్నగారు నాకు 16, మీ అమ్మకు 12 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేశారు. అప్పటికి బాల్యవివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ వృద్ధులైన మా తాతా బామ్మల కోర్కె తీర్చడానికి మాకు పెళ్లి చేసేశారు. 
అయితే నా చదువు పూర్తయి, ఉద్యోగం సంపాదించేవరకు , మీ అమ్మ వాళ్ళింట్లోనే ఉండటానికి, తనకు కూడా నచ్చినట్లు చదువుకోవడానికి , ఆతర్వాతనే కాపురానికి పంపడానికి రెండువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నా అదృష్టమో, దైవబలమో 23 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. ఉన్న ఊళ్ళోనే ఉండే అవకాశం కలిగింది. అప్పటికి మీ అమ్మ ఇంకా డిగ్రీ చదువులోనే ఉంది. ఇంకా చదువుకుంటానని ఆశ పడింది. సరే అన్నాను. ఒక పి.జి. పూర్తిచేసింది. ఈలోగా గోపాలకృష్ణ, వంశీకృష్ణ పుట్టేరు.  పిల్లల ఆలనపాలనలో చదువు సాగలేదు. ఇంతలో బంగారుతల్లి పుట్టింది. వీళ్ళు ముగ్గురు చదువుల్లో పడేసరికి మళ్ళీ మీ అమ్మకు చదువుపై ధ్యాస మళ్లింది. వొద్దనలేదు నేను. మరొక పి.జి. చేసింది. *అప్పుడు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన నాకు చెప్పింది.* మన కుటుంబ పోషణకు నా జీతం సరిపోతోంది. *నువ్వు ఉద్యోగం చేస్తే,* ఇంట్లో నేను ఎంత సహాయం చేసినా కూడా, ఒత్తిడితో సతమతమౌతావు. అంతే కాక, 
నీవు చేసే ఉద్యోగం నీకు కాలక్షేపం మాత్రమే... 
మన చదువు విజ్ఞానాన్ని ఇవ్వాలి, విధ్యా జ్ఞాన సముపార్జనకే కానీ, 
*మరొకరి భవిష్యత్తును* కాలరాసేదిగా ఉండకూడదు, *మరొకరి జీవనోపాధిని మనం అడ్డుకోకూడదు* అని చెప్పేను.

మీ అందరికి గుర్తుండే ఉంటుంది... *మీ అమ్మ ఇంట్లో ఉండి, మీకు బోధించిన జ్ఞానం వలన*
మీ చదువుల్లో మీకు వచ్చిన బహుమతులు, స్కాలర్షిప్పులు ... మీరు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నారని అందరూ అడగడం... మా అమ్మ దగ్గర అని మీరందరు గర్వంగా చెప్పడం..."

కాసేపు చెప్పడం ఆపి పిల్లల వైపు చూసారు. అందరూ తల ఊచారు.

"విధ్యా జ్ఞాన సముపార్జనకే కానీ, ఉద్యోగం చేయడానికి కాదు. మన ఇంట్లో ఉన్న అందరూ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు కదా... *ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు.* అవసరానికి మించి ధన సంపాదన చేయాల్సిన పని లేదు"

"నాన్నా! మీ మాటలకు అడ్డువస్తున్నాను అనుకోకండి. *స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ లేకుండా కట్టడి చేయడం కాదా ఇది?"* ప్రశ్నించింది వైష్ణవి.

"శైలజా, నీకు మీ పుట్టింటివారు ఇచ్చిన నగలు, ధనం, నాకు కట్నం పేరుతో ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

" నా దగ్గర బీరువాలో కొన్ని, లాకర్ లోకొన్ని నగలు, బాంక్ లో డబ్బు, మీకు ఇచ్చిన కట్నం డబ్బులు కూడా నా పేరునే వేశారు కదా... మా నాన్న ఇచ్చిన భూమి కూడా నా పేరునే ఉంది" అన్నది శైలజ.

"అమ్మా సుహాసిని, నీ సంగతి?"

"నా డబ్బు, నగలు అన్ని నా దగ్గరే ఉన్నాయి మామగారు"

"వైష్ణవి, నీకు చేయించిన నగలు, నీకు మీ అన్నలు, అమ్మ, నేను ఇస్తున్న డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

"నా దగ్గరే, బాంక్ లో డబ్బులు ఉన్నాయి"

*"మీకెవరికైనా భావ వ్యక్తీకరణ లో కానీ, చదువు సంధ్యలలో కానీ, ఏ పని చేయడానికైనా కానీ షరతులు, కట్టుబాట్లు ఉన్నాయా?"*

"లేవు"

"అంటే మనింటికి సంబంధించినంత వరకు స్త్రీధనం, స్త్రీస్వేచ్ఛకు భంగం లేనట్లే కదా" నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం గారు.

"చూడమ్మా... మన ఇంట్లో పురుషాధిక్యత కానీ, స్త్రీ అణచివేత కానీ ఉండదు. *స్త్రీ భావి తరాలకు ఆరోగ్యమైన సంతానాన్ని అందించాలి*. అది మగవారిగా మాకు చేతకాని పని. సాధ్యమైనంత వరకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండి, వేళకు తింటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే చక్కని బిడ్డలు కలుగుతారు. ఇంట్లో పనులు చేసుకుంటూ, తనవాళ్ళు వచ్చేసరికి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, బయటనుంచి వచ్చేవారికి, ఇంట్లో ఉన్నవారికి కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడే బంధాలు బాగుంటాయి.

*పగలంతా ఉద్యోగం పేరుతో* ఇద్దరు అలసిపోయి వచ్చి, ఒకరి మీద ఒకరు విసుక్కుంటు, ఏదో తప్పనిసరిగా ఇంత ఉడకేసుకుని తినగానే అలసిన శరీరాలు యాత్రికంగా విశ్రాంతి కోరుకొని, మళ్ళీ ఉదయం నుండి ఉరుకులు పరుగులు, తీరా పిల్లల్ని కనే సమయానికి సెలవు దొరక్క వత్తిడి, తీరా పిల్లలు పుట్టాక వాళ్ళని సరిగ్గా పెంచే తీరిక లేక, ఆయాలకు, బేబీ కేర్ సెంటర్ కు అప్పగించడం, కాస్త పెద్దవగానే హాస్టల్ లో వెయ్యడం, మేము ముసలి అవగానే వృద్ధాశ్రమానికి వెళ్లడం... *అవసరం అంటావా?"* 

అందని దూరాలకు పరుగులెత్తి,  అందే ఆనందాల్ని, అనుబంధాల్ని దూరం చేసుకోవడం ఎందుకు తల్లి? *సమాజం మారాలంటే మార్పు మనతోనే మొదలు పెడదాం. ఆరోగ్యకరమైన జాతిని అందిద్దాం. ఇదే నా ఉద్దేశ్యం"* ముగించారు చంద్రశేఖరం గారు.

"మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం మామయ్యగారు. చదువుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నన్ను ఉద్యోగం మాన్పించినందుకు *మొదట్లో కోపం వచ్చినా,* మీరు, అత్తయ్యగారు, మిగతా కుటుంబసభ్యులు నన్ను ఆదరించిన తీరు, నన్ను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా మన కుటుంబాలలో ఇద్దరూ ఉద్యోగస్టులవడం వలన బంధువులను పెళ్లిళ్లలో , అదికూడా మొక్కుబడిగా మాత్రమే కలవగలుగుతున్నాం.  ఇప్పుడు ఇంట్లో ఉన్న మేము మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు, మన కుటుంబాలలో ఉన్న మిగతా సభ్యులతో తరచుగా తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ముక్కు మొహం తెలియని సామాజిక అనుసంధాన వేదికల కంటే మన కుటుంబ, బంధువర్గమే పెద్దది, శ్రేయోదాయకమైనది అని అర్ధమైంది.  వంటలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఎన్నో కొత్తవిషయాలు గూగుల్ అవసరం లేకుండానే తెలుస్తున్నాయి. మీ విశాలమైన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇది నాకే కాదు మరో మూడునెలల్లో మన కుటుంబం లోకి రాబోయే నా బిడ్డకి కూడా నేను నేర్పుతాను" అంది సుహాసిని.

"చాలా సంతోషం సుహాసిని, పిల్లలూ.. మీరేమంటారు..."

"నాన్నగారు, నేను కూడా మీరు పదవీవిరమణ చేసేవరకు ఉద్యోగం మానేస్తాను" అన్నాడు వంశీకృష్ణ...

"చిన్నన్నా... నువ్వు చేసే ఉద్యోగం మానేసేది కాదు... పదిమందికి భుక్తి పెట్టే వ్యవసాయం.. నీ పరిశోధనలు నువ్వు చేస్తూ, మరిన్ని ఎక్కువ పంటలు నిచ్చే సేంద్రీయపద్దతులు కనిపెట్టు..." అన్నది వైష్ణవి

"అంతేనంటావా.. "

"నాన్నగారు మీ ఈ విలువైన ఉపన్యాసం మా వరకే పరిమితం కాకూడదు. మీరు అనుమతిస్తే మన కుటుంబాలలో అందరికి పంపిస్తాను. సాంకేతికత మేలును కూడా చేస్తుందిగా" అన్నాడు వంశీకృష్ణ...

   * ఆడవాళ్ళని ఉద్యోగం చెయ్యనివ్వడం లేదని నన్ను ఆడిపోసుకునే మన కుటుంబంలో ని ఇతరులకు కూడా నా ఉద్దేశ్యం అర్ధమవుతుంది. నావి కుత్సిత, సంకుచిత భావాలు కావని వాళ్ళు కూడా తెలుసుకుంటారు."

*కుటుంబ జీవనానికి ఆద్యం మన భారతీయం. మన హిందూ సంస్కృతి, నాగరికత. కనుక, మూలాలకు తరలి వెళదాం*

🙏🕉️🇮🇳🚩

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP