శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మొదట శృంగేరి వెళ్ళండి*🌸

>> Tuesday, November 13, 2018

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🌸 *మొదట శృంగేరి వెళ్ళండి*🌸

ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మేము ఒక యాభై మందిమి కలిసి కర్ణాటకలోని క్షేత్రాలకు వెళ్దామని నిర్ణయించుకొని ఒక టూరిస్ట్ బస్సులో ప్రయాణం ప్రారంభించాము. ముందుగా కంచి వెళ్ళి ప్రమాచార్య స్వామి వారిని దర్శించుకుని వెళ్ళడం మాకు అలవాటు. కనుక మొదట అక్కడికి వెళ్ళాము. సుమారు సాయింత్రం నాలుగు గంటల సమయంలో శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారిని దర్శించుకొని వారికి సాష్టాంగం చేసి నిలబడ్డాము. చిన్నగా నవ్వి రెండు చేతులు పైకెత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇలా అడిగారు “అందరూ పెద్ద గుంపుగా వచ్చారు. ఏమిటి సంగతి?” తరువాత నేను స్వామివారికి మా కర్ణాటక యాత్ర గురించి మొత్తం వివరించాను.

స్వామి వారు చాలా సంతోషపడి కనుబొమ్మలు పైకెత్తి, “మొదట అక్కడికి వెళ్ళాల్సిన ఉద్దేశం ఏమిటి?” అని అడిగారు. “మా ఉద్దేశం పెరియవ మంగళూరు చేరగానే మొదట తలకావేరికి వెళ్ళి, అక్కడ సంకల్ప స్నానం చేసి, శృంగేరికి వెళ్తాము. తరువాత అక్కడినుండి కుక్కె సుబ్రహ్మణ్య, ధర్మస్థళ, ఉడుపి, కొల్లూరు మూకాంబిక, కటిలు దుర్గాపరమేశ్వరి . . .ఇలా” అని అన్నాను.

నేను ముగించక ముందే స్వామి వారు అడ్డుపడుతూ, “ఆగాగు. . . నువ్వు చెప్పిన క్షేత్రాలలో ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మరచిపోయావు”. ప్రశ్నార్థకంగా చూస్తున్న మావైపు చూసి నవ్వుతూ, “ఏమిటి? అర్థం కాలేదా? నేనే చెప్తాను. . . హొరనాడు క్షేత్రం! అమ్మ అక్కడ అన్నపూర్ణగా వెలసి అనుగ్రహిస్తున్నది. చలా విశిష్టమైన క్షేత్రం. తప్పకుండా దర్శించండి” అని చెప్పారు.

మరలా ఇలా చెప్పారు: “మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యండి. మొదట మంగళూరు నుండి శృంగేరి క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ తుంగా నదిలో సంకల్ప స్నానం చేసి, గురువులను దర్శించుకొని ప్రసాదం తీసుకొని శారదా దేవిని దర్శించుకొని మీ యాత్ర మొదలుపెట్టండి. తరువాత మీరు వెళ్లవలసిన ప్రదేశాలకు వెళ్ళండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు శృంగేరికి ఏ రోజు వెళ్ళినా, సాధ్యమైనంతవరకు సాయింత్రం లోగా చేరుకోండి”.

అందరమూ అంగీకరిస్తున్నట్టు తలఊప్పి, మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, మాకు ప్రసాదం ఇచ్చి పంపించారు. మా బస్సు యొక్క డ్రైవరు కండక్టరుకు కూడా ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. మేము మా యాత్రను కొనసాగించాము.

మరుసటిరోజు ఉదయం మా ప్రయాణం బెంగళూరు నుండి మంగళూరుకు. రాత్రికి మంగళూరులో ఒక కళ్యాణమండపంలో బస చేసాము. మరుసటి రోజు ఉదయం లేచి స్నానాదులు ముగించుకొని బయలుదేరుతున్నాము. రామనాథన్ అని మాతో పాటే వచ్చిన ఒకతను నావద్దకు వచ్చి, “మనం ముందు తలకావేరి వెళ్దాము. అక్కడ సంకల్ప స్నానం చేసి, తరువాత శృంగేరి వెళ్దాము” అని నన్ను ఒప్పించబోయాడు.

నేను ఒప్పుకోక ”పరమాచార్య స్వామి వారు మనకు ఏమి చెయ్యమ్ని చెప్పారో అలాగే చేద్దాం” అని అన్నాను. కాని వాళ్ళకి అది నచ్చలేదు. “ముందు తలకావేరికే వెళ్ళాలి” అని ఒత్తిడిచేసారు. బహుశా వారు ముందే మాట్లాడుకున్నారేమో నేను ఎంతగా ప్రాధేయపడ్డా నా మాట వారి చెవికెక్కలేదు.

బస్సు తలకావేరివైపు ప్రాయాణించింది. రోజంతా అక్కడ గడిపి నదిలో సంకల్ప స్నానం చేసి, శృంగేరికి బయలుదేరాము. అప్పుడు రాత్రి 8:00 గంటల సమయం. శృంగేరికి కొండమార్గంలో వెళ్తున్న మా బస్సు ముందు రెండు టైర్లు పంక్చర్ అయ్యి బస్సు ఆగిపోయింది. బయటంతా కటిక చీకటి కళ్ళు పొడుచుకున్నా ఏమి కనబడదు. టార్చిలైటు వెలుతురులో డ్రైవరు మరియు కండక్టరు పంక్చర్ అయిన టైర్లు తీసివేసి వేరే వాటిని అమర్చుతున్నారు. మాకందరికి కడుపులో చాలా ఆకలిగా ఉంది. చివరగా మద్యాహ్నం బాడమండలలో తిన్నాము.

దాదాపు 10:00 గంటల సమయంలో బస్సు బయలుదేరింది. హఠాత్తుగా చిన్నగా వర్షం మొదలైంది. అప్పుడు సమయం 11:00 గంటలు, అయినా శృంగేరి జాడ కనిపించడం లేదు. అప్పుడె మాకు అనుమానం వచ్చింది నిజంగా మేము సరైన దారిలో వెళ్తున్నామా లేదా దారి తప్పామా అని. అప్పుడే దేవుడు పంపాడా అన్నట్టు దూరంగా ఒక మనిషి కనబడ్డాడు. మేము అతని దగ్గరగా బస్సు ఆపి అడిగాము. అతను తల కొట్టుకుని “అది వేరే మార్గం. 15 కిమీ ముందే మీరు కుడి వైపున తిరగవలసి ఉన్నింది” అని మాకు షాకిచ్చాడు.

కావున ఇప్పుడు బస్సు మేము వచ్చిన దారివైపు తిరగాలి. డ్రైవరు దిగి పరిశీలించగా, ఇరువైపులా లోయలతో కూడుకున్న చిన్న రోడ్డుమార్గం అది. తన స్థానంలో కూర్చుని తెచ్చి పెట్టుకున్న ధైర్యంతో, “మీరేమి భయపడకండి. నేను కొద్ది కొద్దిగా బస్సును వెనకకు తీస్తూ బస్సును తిప్పుతాను” అని మొదలెట్టాడు. ఎలాగో కష్టపడి ఒక తొంబై డిగ్రీలు తిప్పిన తరువాత, ఆందోళన పడుతూ గట్టిగా అరిచాడు.

“సార్ .. సార్ బ్రేకుని నేను ఎంత గట్టిగా తొక్కిపట్టినా పడటం లేదు బస్సు వెనక్కు పడిపోతోంది. దేవుడే మనల్ని కాపాడగలడు గట్టిగా ప్రార్థించండి” అని అన్నాడు. మాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది. బస్సు వెనక్కు పడిపోతొందని మాకు తెలుస్తోంది. మా అందరి కళ్ళల్లొ నీరు కారుతుండగా గట్టిగా అరవడం మొదలెట్టాము. “అమ్మా శృంగేరి శారదాంబా కాపాడు! శృంగేరి మహాసన్నిధానం కాపాడండి! కంచి పరమాచార్యగళే, రామచంద్రమూర్తియే కాపాడండి కాపాడండి!!!”

హఠాత్తుగా డ్రైవరుచెప్పాడు “సార్ సార్ నేను బ్రేకు పైన కాలు తీసేసాను అయినా బస్సు వెనక్కు పడిపోవడం లేదు. ఒక వంద మంది వెనక నిలబడి బస్సును పట్టుకున్నట్టుగా బస్సు ఆగిపోయింది. ఏమి భయపడకండి. నేను మెల్లిగా బస్సును తిప్పుతాను” అని తన ప్రయత్నం మొదలు పెట్టాడు. కాని మేము నామఘోష ఆపలేదు.

హమ్మయ్య చివరగా డ్రైవరు బస్సును తిప్పాడు. అందిరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు. సరిగ్గా ఒకటిన్నరకు శృంగేరి సంస్థానం ప్రవేశ ద్వారం చేరుకున్నాము. మాకోసం ఎదురు చూస్తున్న నాగేశ్వర గణపదిగళ్ మమ్మల్ని చూడగానే నవ్వుతూ, “రండి రండి మీరందరూ మద్రాసు నుండి వస్తున్నారు కదూ? ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కొద్దిగా తినండి. చలా ఆకలిగా ఉన్నారు. మీ కోసమని అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు సిద్ధం చేసాము” అని అన్నారు.

”శాస్త్రిగారు మేము వస్తున్నామని మీకు ఎలా తెలుసు? మేము మీకు జాబుకూడా రాయలేదు” అని అడిగాను. అతను నవ్వుతూ, “అవును నిజం. మీరు వస్తున్నారని మావంటివారికి తెలియకపోవచ్చు. కాని లోపల ఉన్న త్రికాలవేదులు శ్రీ మహాసన్నిధానం వారికి అంతా తెలుసు. మీకు తెలుసా, దాదాపు పదకొండు గంతలప్పుడు స్వామి వారు నన్ను పిలిచి, ‘శారదాంబ దర్శనం కోసం 54 మంది భక్తులు వస్తున్నారు. వారు చాలా ఆకలిగొని ఉంటారు. మీ వాళ్ళకి చెప్పి అన్నం ఉప్మా వంకాయ గొజ్జు తయారుచేఏయించి సిద్ధంగా ఉంచు. అలాగే వారు కోసం ఒక పెద్ద హలును సమకూర్చు’. అన్నీ ముగించుకొని మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇక్కడ నిలబడ్డాను” అని మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసారు.

శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దూరదృష్టి, వారి అవ్యాజమైన కరుణని తలచుకొని నేను ఆశ్చర్యపోయాను. నా కళ్ళ వేంట నీరు వచ్చింది. అది శాస్త్రి గారు “దీనికే మీరు ఆశర్యపోతున్నారు. రేపు ఉదయం మీకు మరొక విషయం కూడా చెప్తాను. మీరు అది విని ఇంకా ఆశ్చర్యపోతారు” అని అన్నారు. అరిటాకులపై వేడి వేడిగా అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు వడ్డించారు. మా కడుపులు నిండుగా తిని ఆ రాత్రికి విశ్రమించాము.

మరుసటి రోజు ఉదయం తుంగా నదిలో మా స్నానాలు ముగించుకొని దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వరులు మహాసన్నిధానం శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరాము. రాత్రి మేము కలిసిన శాస్త్రి గారు కూడా మాతోనే ఉన్నారు.

నేను వారికి రెండుచేతులు జోడీంచి నమస్కరించి “నిన్న మీరు మాకు ఇంకొక విషయం చెబుతాను అన్నారు. దయచేసి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను” అని వారిని ప్రార్థించాను.

వారు చెప్పడం ప్రారంభించారు “రాత్రి దాదాపు 12:00 గంటల సమయంలో మహాసన్నిధానం వారు వారి ఏకాంత మందిరంలో కూర్చుని శాస్త్ర సంబధమైన పుస్తకాలు చూస్తున్నారు. నేను బయటి గదిలో కూర్చున్నాను. హఠాత్తుగా బయటకు వచ్చి స్వామి వారు తమ రెండు చేతులని గోడకి ఆనించి గట్టిగా అదుముతూ, ఏదో మంత్రం చదవనారంభించారు. నేను లేచి నిలబడ్డాను. వారిని చూస్తే ఆ గోడ పడకుండా ఆపుతున్నట్టు ఉంది. నాకు ఏమి అర్థం కాలేదు.

ఒక ఐదు నిముషాల తరువాత గోడపైనుండి చేతులు తీసి, మహాసన్నిధానం వారు నా దగ్గరకు వచ్చి ‘నేను ఇలా గోడకు చేతులు అడ్డుపెట్టి జపం చెయ్యడం చూసిన నీకు వింతగా అగుపిస్తోది కదూ. ఏమి లేదు! మద్రాసు నుండి శారదాదేవి దస్ఱనానికి వస్తున్న బస్సు దారి తప్పింది. వారు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నామని తెలుసుకుని బస్సును వెనక్కు తిప్పుతుండగా, బ్రేకులు పడక లోయలోకి పడిపోతోంది.

అందులో ఉన్న భక్తులు గట్టిగా "అమ్మా శారదా! కాపాడు కాపాడు" అని అరిచారు. అందుకనే గోడకి నా చేతులను అడ్డుపెట్టి ఆ బస్సు పడకుండా ఆపాను. ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది. బస్సు శృంగేరి వైపు వస్తోంది. నీవు వెళ్ళి నేను ఆనతిచ్చినట్టుగా వారికి అన్నీ సిద్ధం చెయ్యి’ అని చెప్పి వారు గదిలోకి వెళ్ళిపోయారు. నేను ఇదంతా విని స్థాణువైపోయాను.” ఇది విని మేమందరమూ ఉండబట్టలేక కన్నీరు కారుస్తూ, ఆ నడయాడే శారదా దేవిని చూడటానికి బయలుదేరాము.

శ్రీవారికి సాష్టాంగం చేసి నిలుచున్న నావైపు చూసి, శ్రీ శ్రీ శ్రీ మహాసన్నిధానం వారు నవ్వుతూ, మాకు హెచ్చరిక చేస్తున్నట్టు “మహాత్ములు చెప్పినదాన్ని ఎప్పుడూ వినాలి. దాన్ని తప్పకుండా పాటించాలి. అలాకాకుండా ప్రవర్తిస్తే జరగవలసినవి ఏవి సరిగ్గా జరగవు. ఏమిటి అర్థమైందా?” అని అన్నారు. మహాసన్నిధానం వారు చెప్తున్నది కంచి పరమాచార్యులు వారు మాకు ఆజ్ఞాపించినదాని గురించే అని నాకు అర్థమైంది.

--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP