శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందూమతానికి పెనుముప్పు.......... మేలుకోవాలి

>> Saturday, October 27, 2018

హిందూ మతానికి పెనుగండం

మొదట - వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను నోరెత్తలేదు -  నేను కమ్యూనిస్టును కాను కనుక

తరవాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు 
నేను నోరెత్తలేదు - నేను యూదును కాను కాబట్టి

తరవాత వాళ్ళు కాథలిక్కుల కోసం వచ్చారు 
నేను  నోరెత్తలేదు - నేను ప్రొటెస్టంటును కాబట్టి

ఇక అప్పుడు వాళ్ళు నా కోసం వచ్చారు
నాకోసం నోరెత్తటానికి ఎవరూ మిగలలేదు

నాజీలు చేలరేగి ఒక సమూహం తరవాత ఒక సమూహాన్ని మట్టుపెడుతున్న సమయంలో జర్మన్ మేధావుల నిర్లిప్తత గురించి మార్టిన్  నీమోలర్ (  MARTIN NIEMOLLER ) రాసిన సుప్రసిద్ధ కవిత ఇది . ఏదీ పట్టని ఇప్పటి హిందూ సమాజం ఉదాసీనతకూ చక్కగా సరిపోతుంది.

దీని గురించి చెప్పాలంటే చేటభారతమంత . వెనకటి సంగతులు వదిలేసి ఈ ఒక్క ఏటి అనుభవాలనే గమనించండి.

కలియుగ వైకుంఠమనుకునే తిరుమల దేవస్థానంలో క్రిస్టియన్లు చొరబడి పెత్తనాలు కూడా చేస్తున్నారని దశాబ్దాలుగా, శ్రీవారి సేవలూ కైంకర్యాలలో అపచారాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా లో గగ్గోలు లేస్తే ఏమైంది ?    అది టి టి డి అధికారులు , గవర్నమెంటు తేల్చాల్సిన సమస్య అయినట్టూ , దానిపై కడుపు మండిన హిందూ సంఘాలూ , చిన్న పాటి సంస్థలూ మొదలెట్టిన ఆందోళనలకు కనీసం అండగా నిలవాల్సిన బాధ్యత కూడా తమకు లేనట్టూ హిందూ సమాజంలో సో కాల్డ్ పెద్ద తలకాయలు , పేరుగొప్ప హిందూ సంస్థలు మిన్నకున్నాయి. టి.టి.డి.కి వ్యతిరేకంగా మాట్లాడితే తమ ఆలయమర్యాదలకూ , దర్శనాలకూ , కొండ మీద వైభోగాలకూ ఎక్కడ మోసం వస్తుందోనని పెద్ద పీఠాధిపతులూ , మఠాధిపతులూ నోళ్ళు మూసుకున్నారు. గుడి ఆంధ్రా లో ఉన్నది కాబట్టి అది ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు తేల్చుకోవలిసిన స్థానిక  వ్యవహారమైనట్టూ , దానితో తమకేమీ సంబంధం లేనట్టూ  ఇతర రాష్ట్రాల వాళ్ళు వదిలేశారు.

ఇప్పుడు శబరిమల గోడు పైనా అదే వరస .



శబరిమల సన్నిధానంలో నిష్టకూ నియమాలకూ ఎనలేని ప్రాధాన్యం . అక్కడ ఎప్పటినుంచో వస్తున్న , భక్తులెవరికీ  ఎలాంటి అభ్యంతరం లేని ఆచారాన్ని నిష్కారణంగా తుంగలో తొక్కి ,
ఆలయ పవిత్రతను చెడగొట్టేందుకు హిందూ మత ద్వేషులైన అన్య మతస్థులూ , నాస్తికులూ , కమ్యూనిస్టులూ పెద్ద కుట్ర పన్నారు. అందులో భాగంగా - అయ్యప్ప మీద భక్తిగాని, హిందూ మతమంటే విశ్వాసం గాని లేని పనికిమాలిన వాళ్ళు పెట్టిన పేచీకి సుప్రీం కోర్టు పెద్ద బెంచి తగని విలువ ఇచ్చి తెంపరి తీర్పు చెప్పింది . ఋతుస్రావం అయ్యే వయసు లోని ఆడవాళ్ళు రాకూడదన్న గుడి కట్టుబాటును కొట్టేసి , అన్ని వయసుల మహిళలనూ అనుమతించాల్సిందేనని హుంకరించి హుకుం వేసింది. ఆడవాళ్ళు కంట పడితేనే అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యం పాడవుతుందా , ప్రకృతి ధర్మమైన ఋతుస్రావాన్ని దోషం అంటారా , మహిళలను అంటరాని వాళ్ళలా చూస్తారా - అంటూ ఆ సందర్భంలో జడ్జీలు వంకర మాటలు చాలా అన్నారు. సుప్రీం కోర్టే చెప్పాక ఇక మమ్మల్ని ఎవరు ఆపగలరు , ఇదుగో ఋతుస్రావ సమయంలోనే వచ్చి  ముట్టు బట్టలు అయ్యప్ప మొగాన పడేస్తాం , అయ్యప్ప ఎదుటే మా బాయ్ ఫ్రెండ్సు తో సెక్స్ చేస్తాం అంటూ వీర ఫెమినిస్టులు కొందరు పేట్రేగారు . ఆరు నూరైనా కోర్టు తీర్పును అమలు జరిపి తీరుతామని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తొడ గొట్టింది.

కేసు శబరిమలదైనా ఇది ఈ జాతికి ప్రాణమైన సనాతన ధర్మానికీ , దాన్ని ఆచరించే హిందూ మతానికీ , మొత్తంగా హిందూ సమాజానికీ వచ్చిన ఆపద. తమ మతాన్నీ , మతాచారాలనూ స్వేచ్చగా నిరాఘాటంగా అనుసరించేందుకు రాజ్యాంగ 25 వ అధికరణం పౌరులందరికీ ఇచ్చిన ప్రాధమిక హక్కు జనాభాలో 80 శాతమైన హిందువులకు మాత్రం వర్తించదా ?! ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇంగ్లీషువాళ్ళు " డినామినేషన్ " పదానికి ఇచ్చిన కిరస్తానీ అర్థాలకు సరిపోనంత మాత్రాన శతాబ్దాలుగా నడుస్తున్న , కోట్ల మంది పాటిస్తున్న అయ్యప్ప సంప్రదాయం మతపరమైన " డినామినేషను " కాకుండా పోతుందా ? ఆ కారణం చేత  అయ్యప్ప భక్తులు " జస్ట్ హిందువులే " నని తేల్చి , 26 వ అధికరణం కింద మతసంస్థలను , మత వ్యవహారాలను ఇష్టానుసారం నడుపుకునే ప్రాప్తం వారికి లేదని సుప్రీం కోర్టు ఎలా చెప్పగలదు ? అంటే హిందువులు కాని మైనారిటీలకే   తప్ప హిందూ దేశంలో హిందువులకు మతహక్కులు ఉండవా? దేవుడి గుడిలో దేవుడి నియమాలు చెల్లవా ? పవిత్రమైన దేవాలయంలో ఆచారానికీ కట్టుబాటుకూ విలువ లేదా ? పార్కులాగా , పబ్లిక్ రోడ్డులాగా హిందూ దేవాలయం కూడా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా యధేచ్చగా వెళ్ళగలిగిన " పబ్లిక్ ప్లేసా"  ?

సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం లో మెజారిటీ జడ్జీలు చేసిన ఈ " ధర్మ " నిర్ణయాన్ని సహించి ఊరుకుంటే ఇక దేశం లో ఏ హిందూ ఆలయం లోనూ పవిత్రత అనేది మిగలదు. హిందూ ద్వేషులైన ఏ తిరుగుబోతులైనా ఎటువంటి జులాయిలైనా ఏ గుడిలోనైనా  చొరబడి ఆచారాలను చెడిపి , నియమాలను ఉల్లంఘించి  ఆగమాగం చేయగలరు. అదేమంటే సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించి , 14, 15 వగైరా నంబర్ల రాజ్యంగ హక్కులను ఏకరువు పెట్టగలరు. ఏ మతానికి చెందిన పెద్దలు , పూజ్య ఆచార్యులు  చూసుకోవలసిన మత వ్యవహారాలలోకి , మతాచారాల లోకి కోర్టుల విచ్చలవిడి జోక్యాన్ని ఇప్పుడే అడ్డుకోకపోతే ఇక హిందూ మతానికి నానా భ్రష్టత్వాలు తప్పవు . మతంలో  ఏది అతిముఖ్య  ఆచారమో ,( essential practice) ఏది కాదో నిర్ణయించేది కోర్టులు అయితే  ఒక్కో కోర్టు తీర్పును బట్టీ, దాని మీద పై కోర్టు , మళ్ళీ దానిమీద ఆ పై కోర్టు చేసే నిర్ణయాలను బట్టి ఆచారాలు , ఆలయ నియమాలూ , మత కట్టుబాట్లు తడవకో విధంగా మారిపోతుంటాయి. ఇక ఆగమాలనూ , ధర్మశాస్త్రాలనూ గుంటబెట్టి గంట వాయించవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ముంచుకొచ్చింది కేవలం శబరిమల సన్నిధానానికీ , ఒక్క అయ్యప్ప భక్త కూటమికే కాదు . మొత్తం హిందూ సమాజం హక్కులకూ , హిందూ ధర్మం మనుగడకూ పెనుముప్పు. ధర్మం పట్ల , మతం పట్ల , మతానికి పట్టుగొమ్మ అయిన ఆలయ వ్యవస్థ మీద  విశ్వాసం , గౌరవం ఉన్న  ప్రతి హిందువూ , ప్రతి హిందూ సంస్థా ప్రమాద తీవ్రతను గుర్తించి కలిసికట్టుగా పోరాడవలసిన సందర్భమిది . మరి అలాంటి సమయాన హిందూ సమాజం ఎలా స్పందించింది ?

చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇంతకుముందు తిరుమల విషయం లో లాగే ఈ సారీ ! శబరిమల కేరళ లో ఉన్నది కాబట్టి అదేదో కేరళ వాళ్ళు కిందా మీదా పడవలసిన స్థానిక తగవు అయినట్టు మిగతా రాష్ట్రాలవారు చోద్యం చూశారు. సాధారణంగా దక్షిణాత్యులంటే ఉత్తరాది వారికి ఉండే దూరభావం ఈ ఘట్టంలోనూ కొట్టొచ్చినట్టు కనిపించింది.

అయ్యప్ప సంప్రదాయం వ్యాప్తి ప్రధానంగా దక్షిణాదికి పరిమితం . కాబట్టి శబరిమల మూర్తి నైష్థిక బ్రహ్మచారి కావటం , 41 రోజుల కఠోర వ్రతం చేస్తేగానీ ఆయన దర్శనానికి యోగ్యత రాకపోవటం , ఒక వయసు స్త్రీలు అక్కడికి వెళ్ళకూడదనటం లోని అంతరార్థం ఉత్తరాది రాష్ట్రాల వారికి అంతుబట్టకపోతే ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ అయ్యప్ప భక్తి కొల్లలుగా పొంగిపొరలే దక్షిణ రాష్ట్రాల వారికి ఏమయింది ? కేరళకు ఆనుకునే ఉండే తమిళనాడు, కర్ణాటకలలో కూడా శబరిమల మహాపోరాటం ప్రకంపనాలు పెద్దగా లేవు. ఏటా కోట్లమంది మాలలు వేసి , మండల దీక్ష పట్టి ప్రవాహంలా శబరిమల దారిపట్టే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సామూహిక పడిపూజలలో రివాజుగా కనిపించే హడావిడిలో పదోవంతు అయినా అయ్యప్పకు జరిగిన అపచారానికి నిరసనగా కానరాలేదు.

 అంటే మన అయ్యప్ప భక్తులలో అసలు చలనమే లేదని కాదు. వేలమంది భక్తులు రెండు తెలుగు  రాష్ట్రాలలోనూ గట్టిగా స్పందించారు. తమకున్న పరిమితుల్లో , తమకు చేతనైన రీతిలో బాగానే ప్రతిఘటించారు. అయ్యప్ప గుళ్ళలో , ఇతరత్రా నిరసన సభలు , బహిరంగంగా నిరసన కార్యక్రమాలు బాగానే చేసారు. మొన్న సన్నిధానంలో గుడి రక్షణ కార్యంలోనూ మనవాళ్ళు కొంతమంది స్వయంగా పాల్గొన్నారు. సోషల్ మీడియా లో  సరే సరి . కానీ ఈ రెండు రాష్ట్రాలలోనూ అయ్యప్ప కూటములకు ఉన్న సంఘటిత బలంతో , జన సమీకరణ శక్తితో పోల్చితే ఇక్కడ  నిరసనల పరిమాణం , ప్రభావం తక్కువే.

మొత్తం మీద క్రికెట్ మాచిలను చూసినట్టు , టీవీ చానెళ్ళ లో పనికిమాలిన పంచాయితీలను తిలకించినట్టు కేరళలో లక్షలాది అయ్యప్ప భక్తులు , భక్తురాళ్ళు గుడి పవిత్రతను కాపాడటానికి ఎన్నో రోజుల పాటు జరిపిన అత్యద్భుత పోరాటాన్ని కూడా మిగతా దేశం ఎంతో ఉత్కంఠతో వీక్షించింది. వీర హిందువులమని చెప్పుకునే లక్షోపలక్షల మాటలరాయుళ్ళు ఫేస్ బుక్కులో , వాట్సప్ లో , ట్విట్టర్ లో నీడ పట్టున తెగ ఆవేశపడ్డారు. హోరాహోరీ గా ట్రోలారు. ట్రోలించుకున్నారు. పళ్ళబిగువున ప్రాణాలకు తెగించి ప్రతిఘటించి అయ్యప్ప స్వామి మహిమవల్ల ఒక్క పాతకిని కూడా గుడిలోకి అడుగు పెట్టనివ్వకుండా వేలాది భక్తులు జయప్రదంగా నిరోధించగలగటంతో యుద్ధం గెలిచినట్టు సోషల్ మీడియా శూరులు అమందానందం చెందారు . హిందూ శిబిరం దిగ్విజయం సాధించి , శబరిమల కథ సుఖాంతమయిందని బోలెడు సంతోష పడ్డారు.

నిజానికి అసలు యుద్ధం ఇప్పుడే మొదలయింది. అసలు ఉపద్రవం ఇప్పుడు తరుముకొస్తున్నది.

ఎవరెన్ని విధాల కవ్వించినా , వేధించినా హిందువులలో చలనం ఉండదని సాధారణంగా అందరూ అనుకుంటారు. కేరళ కమ్యూనిస్టు సర్కారు కూడా  మొదట అదే ధీమాతో ఉన్నది. ఎంత ధీమా అంటే అయ్యప్ప భక్తులు కోర్టు తీర్పుతొ కుతకుతలాడుతున్నారని ఎరిగి కూడా వారేమి చేయగలరు లెమ్మన్న దిలాసాతో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సకుటుంబంగా విదేశాలకు విహారయాత్ర  వెళ్లాడు. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనట్టు రామజన్మభూమి ఉద్యమం తరవాత మళ్ళీ ఆ స్థాయిలో - కొమ్ములు తిరిగిన కమ్యూనిష్టులకే దిమ్మతిరిగే రీతిలో హిందువులు లక్షల సంఖ్యలో అనేక పట్నాల్లో వీధుల్లోకి వస్తారని ఎర్ర దొరలు ఊహించలేదు. నేషనల్ మీడియా మొత్తం మహిళా హక్కుల కోసమే చొక్కాలు చించుకుంటున్నప్పుడు , ప్రత్యేకంగా ఏ పార్టీ , ఏ మత సంస్థా భక్తుల పక్షాన నిలబడనప్పుడు వెర్రి భక్తులు ఎంతమంది ఉన్నా ఏమీచేయలేరు  అని  కామ్రేడ్లు వేసిన లెక్క తప్పింది. శబరిమల వెళ్ళే కొండ దారుల పొడవునా స్థానిక భక్తులు ఆర్ ఎస్ ఎస్ , బి జె పి కార్యకర్తల తోడ్పాటుతో వ్యూహాత్మకంగా మొహరించి వాహనాలను తనిఖీ చేసి , వెళ్లకూడని మహిళలను వెనక్కి పంపేశారు. ఆలయ సన్నిధానంలో వేలాది భక్తులు కంటికి కునుకు లేకుండా కాపలా కాసి ,  పోలీసు శిరస్త్రాణాలతో పోలీసు వేషాలతో పోలీసుల రక్షణలో చొరబడి , మూటకట్టుకొచ్చిన ముట్టు బట్టను స్వామి ఎదుట విసరాలనుకున్న ఆడవాళ్ళను లోనికి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు.  దైవబలం , సంఖ్యాబలం దండిగా ఉన్న భక్తశక్తి ముందు నిలవలేక పోలీసులు  తోక ముడిచారు. తాము అతి రహస్యంగా వెంటబెట్టుకుని వచ్చిన జాణలను  తామే వెనక్కి పంపేశారు. అలా నిరంతర అప్రమత్తతతో అపచారాలను , అవాంఛనీయ ఘటనలను  గుడి తెరిచి ఉన్న ఐదు రోజులూ నిలవరించగలగటం తో " స్వామి శరణం " అని భక్తకోటి ఊపిరి పీల్చుకుంది.



కాని అక్కడితో గండం తప్పలేదు. అంతకంటే పెద్ద గండం మీద పడింది . కంగు తిన్న ఎర్ర దొరలు భంగపాటు నుంచి పాఠం నేర్చారు. భక్తుల సంఘబలాన్ని చిన్నాభిన్నం చేసి , ప్రతిఘటనను ఉక్కు పాదాలతో అణచి , గుడి కట్టు ను చెడగొట్టి తీరేందుకు భయానక వ్యూహం పన్నారు.  శాంతియుతంగా , ప్రజాస్వామ్యబద్ధంగా ఊరూరా  నిరసన ప్రదర్శనలలో పాల్గొన్న సాధారణ పౌరుల మీద , అవాంఛనీయ మహిళల చొరబాటును అడ్డుకున్నారని అనుమానం కలిగిన వారి మీద తప్పుడు కేసులుపెట్టి పోలీసులు పిశాచాల్లా పీడిస్తున్నారు. ఒక్క రాత్రే 1400 మందిని ఇళ్ళమీద పడి  విచ్చలవిడిగా అరెస్టులు చేశారు.  బెయిలు రాని తీవ్ర అభియోగాలు బనాయించి ఇప్పటికే మూడు వేల మందిని పైగా నిర్బంధించారు. దేవుడికి జరుగుతున్న అపచారానికి పౌర నిరసన తెలపడమే నేరమైనట్టు , శబరిమలను  కాపాడాలని ఫేస్ బుక్కులో పోస్టు షేర్ చెయ్యటమే దేశద్రోహమంత మహాపరాధమైనట్టు కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపుతున్నారు. వారేదో అంతర్జాతీయ టెర్రరిష్టులయినట్టు సామాన్య గృహస్థుల , గృహిణుల ఫోటోలతో నోటీసులు జారీచేసి భయోత్పాతం సృష్టిస్తున్నారు.




 ఇది కమ్యూనిస్టు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా తెచ్చిపెట్టిన అప్రకటిత ఎమర్జెన్సీ . బరితెగించింది వామపక్ష ప్రభుత్వం కాబట్టి , బాధితులు అమాయక హిందువులు కాబట్టి ఈ ఘాతుకానికి ఏ హక్కుల రాయుళ్ళూ పెదవి మెదపటం లేదు. ఐదుగురు అర్బన్ నక్సల్స్ ని అరెస్టు చేస్తేనే మహాఘోరం జరిగినట్టు యాగీ చేసిన మీడియా , మేధావి భూత గణాలకు ఒకే రాత్రి 1400 మంది పౌరులను కేరళ పోలీసులు  పగపట్టి అరెస్టు చేయటం పౌరహక్కుల ధిక్కారమన్న ఆలోచనే లేదు. శబరిమలలో మహిళాహక్కులకేదో పుట్టిమునిగినట్టు కల్లు తాగిన కోతిలా చిందులేసి , పనిగట్టుకుని ఆడ రిపోర్టరును పంపి నానా గోల చేసిన అర్నబ్ ముఖర్జీ అనే రిపబ్లిక్ చానెల్ అబద్ధాలకోరుకు  మహిళా భక్తులపై పోలీసుల వేధింపులు కంటపడనే లేదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తితే కేసులూ , జైళ్ళ పీడాకారం తప్పదన్న హడలు పుట్టించి , సామాన్య కుటుంబీకులు ఇంకో సారి అయ్యప్ప పనుపున వీధుల్లోకి రాకుండా చేయాలన్నది కమ్యూనిస్టు ప్రభువుల పన్నాగం . ఇలాంటి దుర్మార్గపు దాడిని తట్టుకునే శక్తి మామూలు గృహస్థులకు సహజంగా ఉండదు. జనం వెనక్కి తగ్గినప్పుడు పోరాటం నీరు కారుతుంది . కామ్రేడ్లకు కావలసింది అదే .

దీనితో పాటు విజయన్ సర్కారు ఇంకో పాపిష్టి ఎత్తు వేసింది. సన్నిధానం లో భక్తులు గుమికూడి నిషిద్ధ వ్యక్తులను ఆపేందుకు ఆస్కారం ఉండకుండా ఆలయం లోకి ప్రవేశాలను క్రమబద్దం పేరుతొ తన చేతుల్లోకి తీసుకోదలచింది. ఆన్ లైన్ లో ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారినే , అదీ అనుమతించిన సమయాన మాత్రమే గుడిలో ఉండనిస్తామని కొత్త రూలు తలపెట్టింది. పోలీసులు విచారించి అనుమతి ఇస్తేతప్ప ఎవరూ అయ్యప్ప సన్నిధికి వెళ్ళలేకుండా చేస్తే ఏ రెహనా ఫాతిమా అయినా ఎన్ని నెత్తుటి నాప్కిన్ల పవిత్ర చిహ్నాలతో అయినా పోలీసు పహారాలో ప్రవేశించి  అయ్యప్ప స్వామి నిష్ఠను  అపహాస్యం చెయ్యగలదు. కోర్టు తీర్పును అమలుపరచటం లో భాగంగానే ఇదంతా - అనటం వల్ల ఏ కోర్టూ తప్పుపట్టదు . ఏ మీడియా వాడికీ కళ్ళు చెవులు పనిచేయవు. భ్రష్టమయ్యేది హిందూ ధర్మం ! హిందూమత నాశనం కోరే అన్యమతాలకు, వాటి తై నాతీలకూ, చెడబుట్టిన హిందువులకూ కావలసింది అదే.

ఇదీ ప్రమాదం. దీన్ని ఎదుర్కోవటం ఒక్క కేరళ రాష్ట్రం వల్ల , కేవలం అయ్యప్ప భక్తుల వల్ల అయ్యేపని కాదు. ఇది మొత్తంగా హైందవ ధర్మం మీద , హిందూ మత విశ్వాసాల మీద , హిందువులకు పవిత్రమైన దేవతా మూర్తులమీద ఎక్కుపెట్టిన దాడిగా పరిగణించి మొత్తం హిందూ సమాజం ఒక్కటై ఈ ఆటలు ఇక సాగవని గర్జిస్తే గాని ఆగడాలు ఆగవు. అందుకు తక్షణం నడుము కట్టవలసింది జాతీయ హిందూ  సంస్థలు  . కదలవలసింది , ప్రజలను కదిలించవలసింది హైందవ ధర్మాచార్యులు , సమస్త పీఠాదిపతులు , ఆద్యాత్మిక సద్గురువులు !  అయ్యప్ప సంప్రదాయానికి చేటు వస్తే మనకేమి పట్టిందని మిగతా సంప్రదాయాల వాళ్ళు మిన్నకుంటే మునుముందు ఏ ధార్మిక సంప్రదాయమూ మిగలదు. తస్మాత్ జాగ్రత !

ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించటం భారత ప్రభుత్వం పాత్ర, ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. జల్లికట్టు తరహాలో  ఆర్డినెన్సు జారీ చేసి , శబరిమలను 26వ అధికరణం కింద మత డినామినేషనుగా ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఉంది. అలాగే పౌర హక్కులను కాలరాచి అధికార దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని కన్నుగానని కేరళ ప్రభుత్వానికి  తొడపాశం పెట్టటం కేంద్రం చేతిలోని పని. దానికి కావలసిందల్లా కొంచెం తెగువ . మహోన్నత హిందూ మతం పట్ల కాస్త గౌరవం. హిందూ దేశం లోనే  దిక్కులేని హిందువుల పట్ల కొంచెమైనా  కనికరం .

అవన్నీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్నాయనే హిందువుల ఆశ.


 mvs sastry gari blog  numdi










0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP