శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రష్యన్ - రిషి

>> Wednesday, August 8, 2018

రష్యన్ - రిషి

చాలా సంవత్సరాల క్రితం చెన్నైకి వచ్చిన రష్యా మరియు అమెరికా విశ్వవిద్యాలయ ఆచార్యులు పరమాచార్య స్వామివారిని దర్శించుకున్నారు.

1987లో సోవియట్ యునియన్ లో భారతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి కొన్ని విశ్లేషణాత్మక పేపర్స్ తయారు చేసి మహాస్వామి వారికి చూపించడం నాకు అలవాటు. మహాస్వామివారు అనుగ్రహించిన అటువంటి ఒక పేపర్ తో మేము రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మరియు మాస్కోలోని ఓరియంటల్ స్టడీస్ ఇన్ స్టిట్యూట్ అధ్యక్షుడు రిబెకొవ్ కు అందచేయాలని వెళ్ళాము.

ఆయన గదిలో ఉన్న ఒకేఒక చిత్రపటం కంచి పరమాచార్య స్వామివారిది. అతను ఇంతవరకు మహాస్వామి వారిని ఎప్పుడూ కలవలేదు. ఆయన మాతో “నేను ఎప్పుడైనా చెన్నై వస్తే ఒకటి నేను మహాస్వామి వారిని కలవాలి, రెండు ఒక వలంపురి శంఖు సంపాదించాలి” అని అన్నారు.

కొన్నేళ్ళ తరువాత రిబెకొవ్ చెన్నై వచ్చారు. వారు మహాస్వామి దర్శనం కోసం నాతో పాటు శ్రీమఠానికి వచ్చారు. మేము మఠంలోకి వెళ్ళగానే ఈ రోజు మహాస్వామి వారి దర్శనం లేదు. వారికి జ్వరంగా ఉంది అని అన్నారు. నాతో వచ్చిన రిబెకొవ్ మహాస్వామి వారిని అడగాలని కొన్ని ప్రశ్నలు వ్రాసుకుని వచ్చారు. మహాస్వామి వారి దర్శనం దొరకదు అని మేము చాల నిరాశపడి వెనుతిరుగుతుంటే శిష్యులు మమ్మల్ని వెనుకకు పిలిచి “మహాస్వామి వారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని అన్నారు. భక్తుల సందడి లేని ఏకాంత దర్శనం మాకు లభించినందుకు మాకు చాలా సంతోషం వేసింది.

మేము లోపలికి వెళ్ళగానే పడుకున్న మహాస్వామి వారు లేచి కూర్చుని నాతో పాటు వచ్చిన అతని ముఖంలోకి కొద్దిసేపు చూసారు. కొంత సమయం తరువాత అతను ఆనంద భాష్పాలు కారుస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. చాలా సేపు నిశ్శబ్దంగానే ఉండిపోయాము. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారు నాతో “అతను ఏం అడగాలనుకుంటున్నాడో అడగమను” అని ఆన్నారు.

అందుకు రిబెకొవ్ “నా అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి” అని అతను ఇక ఏమి మాట్లాడదలుచుకోలేదు. మహాస్వామి వారు అతన్ని ఉద్దేశించి “మీ రష్యా భాషలో సంస్కృతము యొక్క ఆనవాళ్ళు చాలా కనిపిస్తాయి. అందులోను ఉత్తర రష్యాలో మట్లాడే మాండలికంలో సంస్కృత శబ్ధములు ఎక్కువగా ఉపయోగిస్తారు“ అని అన్నారు.

అందుకు రిబెకొవ్ “నిజమా? అది ఎలా?” అని అడిగాడు.

మహాస్వామి వారు “మీ దేశానికి రిషివర్శం అనే పేరు కూడా కలదు. ఎందుకంటే యాజ్ఞావల్క్యుడు మొదలైన ఋషులు అక్కడే ఒక వేద పరిశోధనా కేంద్రమునును స్థాపించారు“ అని అన్నారు. మహాస్వామి వారు మాకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు. వారు చెప్పిన విషయాలను విని మేము ఆశ్చర్యపోయాము. మేము వారితో సెలవు తీసుకుంటూ రిబెకొవ్, మహాస్వామి వారితో “నేను హిందువు కావాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.

”నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు హిందువువే” అని అన్నారు.

”అయినా సంతృప్తిగా లేదు. నాకు ఒక హిందూ పేరు ఉంటే బావుండును” అని రిబెకొవ్ అన్నాడు.

స్వామి వారు నవ్వుతూ నావైపు చూసి “ఇతను తెల్లని గడ్డముతో ఋషి లాగా కనిపిస్తున్నాడు కనుక ఇతని పేరు రిషి” అని అన్నారు. రిబెకొవ్ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఈ రిషి (రిబెకొవ్) మాస్కోలో రామకృష్ణ మఠం యొక్క శాఖను స్థాపించారు.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP