శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిరుమల గుళ్ళో ఏమవుతున్నది..??

>> Sunday, July 15, 2018

తిరుమల గుళ్ళో ఏమవుతున్నది..??
******************************

రచన: MVR శాస్ట్రీ, ఆంధ్రభూమి మాజీ సంపాదకులు

పుట్టా వారు పగ్గాలు చేపట్టాక ఆగమ శాస్త్రాలు , వాటి నియమాలు హఠాత్తుగా మారిపోయాయా ? మహాసంప్రోక్షణ , కుంభాభిషేకాలు 12 ఏళ్ల కొకసారి రివాజుగా జరిగేవే కదా? వాటికంటూ అనాదిగా పాటిస్తున్న  విధివిధానాలు అంటూ కొన్ని ఉన్నాయి కదా ? 1994 లో ,2006 లో ఇలాగే వారం పాటు గుడి మూసేశారా? విఐపీ బ్రేక్ దర్శనాలను కూడా అప్పుడు ఆపేశారా?

ఏ గ్రహణాల రోజునో కొన్ని గంటలు తప్ప ఏకంగా ఆరు రోజులు పైగా భక్తులకు దర్శనం నిరాకరించడం ఈ శతాబ్దకాలంలో ఎన్నడైనా జరిగిందా? అటువంటి తీవ్ర నిర్ణయం ఎవరి నడిగి , ఏ పెద్దలను సంప్రదించి చేశారు?    రాజకీయ పలుకుబడి తో పదవులు తెచ్చుకున్న శాల్తీలకు పూజలు , క్రతువులకు సంబంధించి తలచిందే తడవుగా ఆగమపరమైన కీలక.నిర్ణయాలు ఏకపక్షంగా చేసే అధికారం ఉందా? వారు గుప్పెట్లో పెట్టుకున్న అర్చకుల చేత తల ఊపిస్తే సరిపోతుందా?

ఆగస్టు 11 న అంకురార్పణ అయితే 9 నుంచే క్యూ గేట్లు ఎందుకు మూస్తున్నారు? దర్శనానికి 48 గంటలు పట్టేంత క్యూ 9 న  ఉంటుందని నడమంత్రపు పెత్తందారులకు ముందే తెలుసా? క్యూలో మిగిలిన భక్తులకు అంకురార్పణ తరవాత గతంలో వలె  దర్శనం చేయించకూడదా?  మునుపటి కంటే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందన్న సాకుతో మొత్తం దర్శనాలను టోకున ఎందుకు ఎత్తేశారు? పరిమిత సంఖ్యలో సాధారణ భక్తులు గాని , విఐపీ బ్రేక్ ల వాళ్ళు గానీ చూడకూడనంతటి రహస్య కార్యకలాపాలు ఆ రోజులలో ఏమి జరపబోతున్నారు?

అన్నట్టు ఆ ఆరు  రోజులు సి.సి. కెమెరాలను కూడా కట్టేస్తారంటున్నారు - నిజమేనా? సి.సి. కెమేరాల కళ్లు కూడా మంచివి కావని పుట్టాగారి ఆగమ శాస్త్రం చెప్పిందా? లేక .. కెమెరాలకు చిక్కితే ప్రమాదం అయిన సాహస కార్యాలేవైనా కొత్త శ్రీవార్లు  కూడబలుక్కుని చేయబోతున్నారా?

జగమొండి సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టులో దుంప తెంచే పిల్ వేయబోతున్నట్టు ప్రకటించిన వెను వెంటనే గుడి ని వారం పాటు మూసి , ఇంకేవో "పనులు " రహస్యంగా చేసుకోవాలని వివాదాస్పద మైన కొత్త బోర్డు హుటాహుటిన నిర్ణయించడం కాకతాళీయమనే అనుకోవాలా?

చేతిలో అధికారం ఉన్నది .కాబట్టి...   మాకు వేరే జరూరు పనులు ఉన్నందున ఫలానా తేదీలలో దర్శనాలన్నీ బంద్ - అని జస్ట్ మూడు వారాల ముందు ఆర్డర్ వేశారు. చాలా బాగుంది! కానీ ఆ తేదీలలో తిరుమల వెళ్లాలని చాలా నెలల కింద ప్లాన్ చేసుకుని , ఆన్ లైన్ లో దర్శనం, సేవల టిక్కెట్లు  కొనుక్కుని, ప్రయాణానికి, బసకూ అన్ని ఏర్పాట్లు చేసుకున్న భక్తుల కుటుంబాలు ఈ ఆకస్మిక నిరంకుశ నిర్ణయం వల్ల ఎన్ని ఇబ్బందులు పడతారు? ఆ కష్టనష్టాలకు పరిహారం ఎవరు చెల్లిస్తారు?

ఇంతకీ మన పేరు గొప్ప పీఠాధిపతులు, ధర్మాచార్యులు  ఏమంటారు? టి. టి .డి . తో మొగమాటాలను వదిలి పెట్టి , వారు ఇలాంటి అనాచారాలను , అపచారాలను, అవకతవకలను ఎప్పటికయినా పట్టించుకోగలరా?

సెక్యులర్ బి.జె.పి.కి హిందువుల సమస్యలు ఎలాగూ పట్టవనుకోండి! నిస్తేజమైన హిందూ మత సంస్థలలోనైనా ఇప్పట్లో  చలనం వచ్చేనా?
Source FB

1 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు July 16, 2018 at 9:05 PM  

అందుకేనా TTD వారి టీవీ ఛానెల్ SVBC ప్రసారం నాలుగైదురోజుల నుండీ రావడంలేదు?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP