శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మోక్ష సన్యాస యోగము

>> Tuesday, October 24, 2017

18-56-గీతా మకరందము.
        మోక్షసన్న్యాసయోగము
   
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ||  భగవంతుని ఆశ్రయించువానికి భగవదనుగ్రహముచే శాశ్వత మోక్షపదవి లభించగలదని చెప్పుచున్నాడు –

సర్వకర్మాణ్యపి సదా
కుర్వాణో  మద్వ్యపాశ్రయః |
మత్ప్రసాదాదవాప్నోతి
శాశ్వతం పదమవ్యయమ్ ||

తా:- సమస్తకర్మములను ఎల్లప్పుడును చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు (శరణు బొందువాడు) నా యనుగ్రహమువలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు.

వ్యాఖ్య:- భక్తితో గూడి కర్మనాచరించుటవలన భగవదనుద్రహము లభ్యమై జీవునకు మోక్షపదవి చేకూరుచున్నదని యిచట తెలుపబడినది. “సర్వకర్మాణ్యపి" అని చెప్పబడినదాని యర్థము విధ్యుక్తములగు సమస్తకర్మములనియే కాని, దోషయుక్తములగు కర్మములుకూడ అనికాదు. ఏలయనిన అవి మొదటనే నిషిద్ధములైయున్నవి. సర్వేంద్రియములచే ఏ యే కర్మలు చేయుచున్నను భగవంతుని సదా స్మరించుచునేయుండువాడు, లేక ఆ యా  కర్మఫలములను భగవదర్పణముచేయుచు నుండువాడు భగవదనుగ్రహమునకు పాత్రుడు కాగల్గును. దానిచే మోక్ష మాతనికి సులభముగ లభించుచున్నది.  దీనినిబట్టి భక్తితో గూడి కర్మచేయుచో ఆ కర్మయే మనుజుని మోక్షపదమునకు గొనిపోగలదని స్పష్టమగుచున్నది. భగవంతుని ఆశ్రయించినవాడు ఒక కార్యముకాదు అనేక కార్యములను చేసినను బంధింపబడడు. అదియు ఎపుడో ఒకపుడు కాదు, నిరంతరము చేసినను బద్ధుడుకాడు. పైపెచ్చు భగవదనుగ్రహమును బడసి దానిచే అవ్యయమోక్షపదమును బొందును. శిరస్సుపై ఉదకకుంభముంచుకొని నృత్యమొనర్చు స్త్రీ, నోటితో పాటపాడినను, చేతులతోను కాళ్ళతోను నాట్యవిన్యాసములను గావించినను, ఆమె మనస్సు మాత్రము శిరస్సుపైగల నీటికుండ పైననే యుండునట్లు , సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనస్సు భగవంతునిపైననే యుండునో సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనస్సు భగవంతునిపైననే లగ్నమైయుండునో అతడు భగవదగ్రహమునకు పాత్రుడై ముక్తినొందగలడని యిచట వచింపబడినది.
దీనినిబట్టి కర్మ దైవస్మృతితో చేయబడినపుడే, లేక ఈశ్వరార్పణబుద్ధితో చేయబడినపుడు మాత్రమే మోక్ష హేతువగునుగాని తదితర సమయములందు గాదని స్పష్టమగుచున్నది. అట్లు  భగవంతుని ఆశ్రయింపక, ఫలములను ఈశ్వరార్పణము గావింపక చేయు కామ్యకర్మాదులచే జీవుడు బద్ధుడై మోక్షమును పొందజాలకుండును. కావున కర్మమార్గము నవలంబించు సాధకు లీవిషయము చక్కగా నెఱుంగవలెను.
"మత్ప్రసాదాత్" - భగవంతుని యనుగ్రహములేనిచో ఈ మాయాబంధమునుండి యెవడును తప్పించుకొనజాలడు. మాయాధీనులగు జనులు మాయాధీశుడగు ఈశ్వరుని యనుగ్రహమును పొందనిదే మాయను దాటజాలరు. (మామేవ యే ప్రపద్యన్తే మాయా మేతాం తరన్తి తే). కావున ఆతని యనుగ్రహమును మొట్టమొదట సంపాదించవలెను. అది యెట్లు లభించును? భగవదాశ్రయముచే. సమస్తకర్మములను ఈశ్వరార్పణబుద్ధితో గావించుటచే, అట్టివారిని అతడు కరుణించి అనుగ్రహించునేకాని తదితరులను గాదు. ఇట భగవంతుని పక్షపాతమేమియులేదు. ఎవరాతని నాశ్రయించుదురో వారి నత డనుగ్రహించును. అట్టి  భగవదనుగ్రహముచే నతనికి ముక్తిపదవి లభించుచున్నది. కాబట్టి సర్వులును మొట్టమొదట భగవదాశ్రయపూర్వకముగ, భగవత్ప్రీత్యర్థముగ కర్మలను చేయవలెను. దానిచే లభించు మోక్షపదవి యెట్టిది? శాశ్వతమైనది. నాశరహితమైనది. దృశ్యపదార్థమెద్దియు శాశ్వతముకాదు; అది యెంతటి గొప్పదైనను సరియే. అది దేశకాలములకు లోబడియే యుండును. కాబట్టి అట్టి మహోన్నత నిత్యపదవికై, సర్వోత్కృష్ట దైవపదమునకై సర్వులును నిష్కామకర్మ భక్త్యాదులద్వారా యత్నించవలయును.

ప్ర:- మోక్ష మెట్టిది?
ఉ :- శాశ్వతమైనది, నాశరహితమైనది.
ప్ర: - అదియెట్లు  లభించును?
ఉ:- భగవదనుగ్రహముచే (మత్ప్రసాదాత్).
ప్ర:- భగవదనుగ్రహ మెట్లు  లభించును?
ఉ :- సమస్తకార్యము లాచరించుచుండినను భగవంతుని ఆశ్రయించి భగవత్స్మరణగలిగి యుండినచో, లేక భగవత్ప్రీత్యర్థముగా ఆ యా కర్మలను చేయుచుండినచో లభించును.
ప్ర:- మోక్షమునొందుటకు కర్మలను వదలవలెనా?
ఉ:- లేదు. అన్ని కార్యములను  నిరంతరము చేయుచున్నను, భగవంతునియందు మనస్సు లగ్నమై యున్నచో వారి యనుగ్రహమువలన జీవునకు శాశ్వతమగు మోక్షము చేకూరగలదు కావున భగవద్భక్తి, నిష్కామకర్మాచరణము ఆవశ్యకములై యున్నవి.
ప్ర: - కర్మల నేప్రకార మాచరింపవలెను?
ఉ:- భగవంతుని ఆశ్రయించి కర్మలను భగవత్ప్రీతికరములుగ, నిష్కామముగ, ఈశ్వరార్పణముగ గావించవలెను.
ప్ర:- అట్టి భక్తిపూర్వక నిష్కామకర్మాచరణముచే ఏమి లభించును?
ఉ:- భగవదనుగ్రహము, అట్టి యనుగ్రహముచే మోక్షము లభించును.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP