శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సింహాద్రిఅప్పన్న,అన్నవరం క్షేత్రదర్శనంతో మనసు నిండింది...అక్కడి నిర్వాహకుల ఆగడాలకు వళ్ళుమండింది.

>> Thursday, November 17, 2016


తనభక్తులకు తనదగ్గరకు రప్పించుకోవటానికి   శ్రీవారు రకరకాల లీలలు ప్రదర్శిస్తుంటారు. ఆపనిలోనే నాలాంటి అథములకు కూడా దయతో తన దివ్యదర్శనం ప్రసాదిస్తుంటారు. స్వామి అనుగ్రహంతో పవిత్ర కార్తీకమున శ్రీవారి దర్శనభాగ్యం దక్కింది.
అనుకోకుండా  నేను విశాఖపట్టణం వెళ్లవలసి వచ్చినది.   అక్కడకు వెళ్ళాక నా దగ్గరచదువుకున్న పిల్లలు సార్! మాయింటికి రావాలని కోరినా ఎందుకో వెళ్లబుధ్ధి కాలేదు. అక్కడ సింహాచల క్షేత్రం సత్రములలో బసచేశాను. ఆరోజు కార్తీక శుధ్ధ ఏకాదశి . ఆక్షేత్రానికి చేరగనే మనసు చల్లగా ,ఉల్లాసంతో నిండిపోయింది .ఉదయాన్నే క్షీరాబ్ది ద్వాదశి రోజున కొండపైకి వెళ్ళాను. ప్రయాణంలో  కొండపైకి చేరుకునే సరికి మనసు పులకరించిపోయింది. ముందుగా క్షేత్రపాలకులైన త్రిపురాంతకేశ్వర స్వామివారిని పూజించుకుని    సతీసమేతంగా  శ్రీవారిని దర్శించుకున్నాను. నిండుగా చందనం పులుముకుని కూర్చున్నారు స్వామి. అందుకేనేమో ! బాహ్యంగాను అంతరంగంలోనూ ఒకటే చల్లదనం.  ఆస్థితిని అనుభవిస్తుండగానే  వైకుంఠంలో కూడా రాక్షసుల సంచారంలా అక్కడ సిబ్బంది ఇంతలేసి గొంతులేసుకుని భక్తులను గదుముతున్నారు.
 స్వామీ !  అంతకోపం ఎందుకు. కాస్త ప్రశాంతంగా  ఉండండి   అని  కోరాను.  ఐతే ఏంటండీ!  నోరుమూసుకుని కూర్చుని మీరుచెప్పినట్లు చేయాలా ! అని ఆయన వెటకారపు సమాధానం. కలిమాయ ! చేసేదేముంది .స్వామితో పాటు ఆయనకు కూడా ఓనమస్కారం పడేశాను.
స్వామి అనుగ్రహంతో దివ్యమైన ఈతిథిలో దర్శనం .ఆయన అనుగ్రహం కాక మరేమిటి .కార్తీక మాసంలో  ఎటూ కదలటానికి వీలుకాని నన్ను ఇలా తనచెంతకు పిలిపించుకున్నారు.

ఇక  ఎలాను వచ్చానుకనుక  తిరుగు ప్రయాణంలో అన్నవరం దర్శించుకుని వెళ్ళమని  మా తమ్ముడు కూడా  చెప్పటంతో     రాత్రికి అన్నవరం క్షేత్రానికి చేరుకున్నాను . వెళ్లగనే స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళాను , కానీ అప్పటికే దర్శనవేళలు ముగిశాయి.  అప్పటికే బెంగళూరు నుండి వచ్చి అక్కడవున్న   హరి  నన్నుగుర్తుబట్టి  గురువుగారూ! మీరెప్పుడొచ్చారు  అని దగ్గరకొచ్చాడు. చాలాసంతోషించాను అతన్ని కలసినందుకు. తెల్లవారుజాముననే సుప్రభాతసేవకెళదామని సిద్దంగా ఉండమని చెప్పి బసకు వెళ్ళిపోయాడు. ఐతే బాగా అలసి ఉండటం వలనేమో  మెలకువరాలేదు.

తెల్లవారాక స్నానాదులు పూర్తిచేసుకుని  ఆక్షేత్రమహిమాతరంగాలు మనసునుపులకింపజేస్తుండగా దర్శనానికి వెళ్ళాను. అక్కడ  పూజాద్రవ్యాలు కొనుక్కుని    వ్రతం కోసం టిక్కెట్ల కోసం వెళ్ళాను.
అక్కడ టిక్కెట్లమ్మేఆయన ఏవ్రతం కావాలి?  మూడువందల వ్రతమా?  ఏడువందల వ్రతమా ? పదిహేనువందల వ్రతమా,రెండువేల వ్రతమా? అనడిగాడాయన.
సత్యన్నారాయణస్వామి వ్రతం  కావాలండి  అన్నాన్నేను .
దానికే ఈటిక్కెట్లు  అన్నడాయన వళ్లుమండి.
సరేలెండి ! ఆ చిన్నటిక్కేట్టెదో ఇవ్వండి అని మూడువందల టిక్కెట్టు   తీసుకుని వెళ్ళి వ్రతానికి ఉపక్రమించాము.
సామూహిక విధానంలో కనుక శాస్త్రవిషయాలను కొద్దిగా పక్కనబెట్టినా   భక్తులకు మనస్సు త్రుప్తి కలిగేలా వ్రతం నిర్వహించారు పురోహితులు. అక్కడ వ్రతవిధానాన్ని  నడుపుతున్న ఆచార్యులవారు చాలాచక్కగా వ్రతవిధిని నడిపారు.
వ్రతానంతరం బ్రాహ్మణులకు ఇష్టమైనవారు తమకు తోచిన సంభావన ఇవ్వమని అడిగారు. నాకు కలిగినంతలో వారికి సంభావన సమర్పించి నమస్కరించుకున్నాను. సంభావన స్వీకరించి వారు బాగా అనందపడ్డారు. ఇంతలా సంభావన ఇవ్వగలిగినప్పుడు పెద్దటిక్కేట్ తీసుకుని వ్రతానికెందుకెళ్లలేదనే ప్రశ్నవారి ముఖంలో కదలాడింది.

నేడు ఆలయాలలో హుండిలలో,వేయటం, టిక్కెట్లకు దర్శనాలకు భారీగా వెచ్చించటం నాకు ఇష్టం లేదు. ఈ డబ్బు  ఏగుడిలో ఎక్కువవుతుందో అక్కడ   రాబందులు వాలుతాయి అధికారులుగా,పాలకమండల్లుగా .
అదే మనకున్నంతలో అర్చకులకు పురోహితులకు సమర్పిస్తే   వారు తృప్తి పడతారు. భగవత్సేవను జీవితంగా స్వీకరించినందుకు ఆనందపడతారు. ధర్మాచరణకు పట్టుగొమ్మలై నిలబడటమే కాదు తమ తరువాతి తరాన్నికూడా  ఈ జీవనధారలో భాగస్తులను చేస్తారు.  అందుకే  నేను మీకు విన్నవించుకుంటున్నాను . ప్రత్యేక దర్శనాలు పూజల పేరుతో కానుకలపేరుతో హుండిలలో వేసేవాటిని అక్కడి పదిమంది పురోహితులకు సమర్పించండి ధర్మాన్ని రక్షించుకున్నవారుకూడా అవుతారు మీరు.

ఇక వ్రతానంతరం  స్వామి వారి దర్శనానికి పంపారు.  గర్భగుడిలో దేవేరితోను,పరమేశ్వరునితోనూ కలసి దర్శనమిస్తున్న స్వామి వారిని దర్శంచటానికి రెండుకళ్ళు  చాలవు . గర్భగుడి సమీపిస్తుండగా   పెద్దపెద్దగా పిలుపులు.   రండిరండి  లోపలకెళ్లి దర్శించుకోవచ్చు  టిక్కేట్ వందరూపాయలే .. వంద ...వంద  , టిక్కేట్  వంద.... అంటూ నాలుగు పక్కలనుండి అరుపులు. మాగుంటూరు బస్టాండ్ లో సిటీ బస్సులవాళ్లు, ఆటోలవాళ్లు అరుస్తుంటారు    రండి రండి... బ్రుందావన్ గార్డెన్స్ ,శంకరవిలాస్ , కంకరగుంటా గేట్ ...... అంటూ కేకలు  వేసి  ప్రయాణికుల్ని పిలుస్తుంటారు. వాళ్లకంటే అధ్వాన్నంగా ఉంది   వీళ్ల పద్దతి. అది దైవసన్నిధానమన్న   ఇంగితంగానీ భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటారనే జ్ఞానం కూడా లేదు. వాళ్లకున్నది ఒక్కటే ధ్యాస.  భక్తులనుండి  ఇంకా ఎంత ఎక్కువ రాబట్టాలి ?
దానికోసం భగవద్దర్శనాన్నే కాదు . వీలయితే ఆయన్నకూడా అమ్మే లా తయారయ్యారు.  ఇక అక్కడ మాట్లాడితే ఆ ఒక్కక్షణం దర్శనం కూడా కోల్పోతానని భయమేసి స్వామిని దర్శించుకుని బయటకు వచ్చి  నా కోపమంతా అక్కడ ఫిర్యాదుల పుస్తకంలో వెళ్లగక్కాను.
ఏమిటండి? ఈ అపచారం  ? అని అక్కడ  సిబ్బందిపై నాకోపం వ్యక్తం చేసినా  వాళ్ళెవరూ నోరు మెదపలేదు.   ఎంతసేపూ  మన మొక్కులు , మనబోడిగుండ్లు,కొబ్బరికాయల గూర్చి మాత్రమే ఆలోచించే భక్తులం మనం. మనం నోరు మెదపకుండా ఉన్నంతసేపూ ఈ అనాచారాలు ఆగవు.
బయటకొచ్చి చూద్దునుకదా ! అక్కడ ఆటొలమీద  సువార్త మహా సభల ప్రచార పోస్టర్లు . వళ్లుమండింది . ఎవడయ్యా మిమ్మల్ని పైకి రానిచ్చింది , తినేది స్వామి సొమ్ము .  చేసే ప్రచారం  ఇతరమతాలకా అని కేకలు  వేశాను. లేదండి చూసుకోలేదు  అని ఆటొడ్రైవర్లు వాటిని తీసివేసే ప్రయత్నం చేస్తున్నా  అంతమంది భక్తులు కానీ సిబ్బందిగానీ నోరుమెదపలేదు. చోద్యం చూస్తున్నారు.
నాకుమాత్రం ఎక్కడికెళ్లినా  అక్కడ కావాలని  చేసే అనాచారాలపట్ల ఉదాసీనతగా ఉండటం సాధ్యం కాదు. అది నాతండ్రి సన్నిధానం. అక్కడ అపచారాలపట్ల నా నిరశన వ్యక్తం చేయకుంటే  నేను ఆయన బిడ్డనెలా అవుతాను? నాధర్మాన్ని నిర్వర్తించిన వాన్నెలా అవుతాను ?

ఆయన అనుగ్రహం వలన దర్శనభాగ్యం లభించింది . అదింకా మనోఫలకం పై చెదరలేదు.  జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP