శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మార్పు మంచికే

>> Monday, June 20, 2016

మార్పు మంచికే
09-06-2016 22:41:59

భాగవతంలో ఒక కథ మనకు బాగా తెలిసిందే. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గాథ. యాదవులుందరూ ఇంద్రుని గూర్చి యజ్ఞం చేయాలని సంకల్పించారు. మేఘాలకు అధిపతి ఇంద్రుడు. వర్షాలు సరిగా కురవాలంటే అతని గూర్చి యజ్ఞం చేయాలని అదివరకు ఉన్న ఆచారం ప్రకారం యజ్ఞానికి పూనుకున్నారు. శ్రీకృష్ణుడు వారికి మరోవిధంగా సలహా ఇచ్చాడు. ‘భగవంతుడు కేవలం కర్మఫలాన్ని ఇస్తాడు. కర్మచేయని వానికి ఫలం ఇవ్వలేడు. మన ధర్మం, దేవేంద్రుని విధి. మనం కేవలం గోవులకు మంచి ఆహారం పెడదాం. ఆ ఆహారాన్ని ఇస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. ఇంద్రుని పేరిట యజ్ఞమెందుకు’ అని అన్నాడు. తన పూజలను ఆపేశారని తెలిసిన ఇంద్రుడు ప్రళయకాల మేఘాల్ని పంపాడట. ఆ కుండ పోత వర్షానికి గోకులమంతా మునిగిపోగా.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఒక చేతితో పైకెత్తి ఏడు రోజులు అలా మోసి పట్టుకున్నాడట. ఇంద్రుడు తన తప్పును గ్రహించడం, శ్రీకృష్ణుడ్ని శరణుజొచ్చడం అన్నది తర్వాతి కథ. ఈ కథ కేవలం కృష్ణలీల అన్నది సాధారణ అవగాహన. కానీ ఆనాటి సమాజంలో యజ్ఞయాగాదుల పట్ల మారుతున్న ఆలోచనల్ని ఈ కథ ప్రతీకాత్మకంగా తెలుపుతుంది.
 
భాగవతం మరొకచోట ఇలా అంటుంది. కృతయుగంలో తపస్సు వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపరయుగంలో సేవలు, పూజల వల్ల, కలియుగంలో శ్రీహరిని కీర్తించడం వల్ల మోక్షం లభిస్తుంది (12-3-52). ఉపనిషత్తుల కాలంలో ఆత్మవిచారానికి ప్రాధాన్యం ఉండేది. జ్ఞానంపై శ్రద్ధ క్రమక్రమంగా తగ్గి యజ్ఞాల రూపంలోకి మారింది. శ్రీరాముని కాలంలో యజ్ఞాలను రక్షించడం ధర్మం. ద్వాపరమందు భక్తికి ప్రాధాన్యం. భాగవతమంతా భక్తి వర్ణనే. సమాజంలో వస్తున్న కొత్త భావాలకు అనుగుణంగా మతపరమైన ఆచారాన్ని మార్చడానికి వ్యాసమహర్షి అందించిన కథ ఇది.
 
భాగవంతలోనే మరొక ఘట్టం కృష్ణుని పట్ల బ్రాహ్మణపత్నుల భక్తి. ఒకరోజు గోపాలురందరూ అడవిలో గోవుల్ని కాస్తున్నారు. ఆ సమయంలో వారికి చాలా ఆకలి వేసింది. ఆహారమెక్కడా దొరకలేదు. దగ్గరలో కొందరు బ్రాహ్మణులు స్వర్గాన్ని పొందాలనే దీక్షతో బృహస్పతి యాగం చేస్తుంటారు. కృష్ణుడు తన స్నేహితుల్ని వారి వద్దకు పంపాడు. యజ్ఞంలో పశుబలి అనే దీక్ష ఉంటే అలాంటివారి ఆహారాన్ని తీసుకోకూడదని చెప్పి పంపాడు. గోపాలురు అలాగే వెళ్లి బలరామకృష్ణులకు ఆకలిగా ఉంది ఆహారమివ్వండి అని అడిగారు. బ్రాహ్మణులు ఏమీ మాట్లాడలేదు. గోపాలురు వెళ్లి ఆ విషయాన్ని కృష్ణుడితో చెప్పారు. కృష్ణుడు గట్టిగా నవ్వి సరే, యజ్ఞపత్నుల దగ్గరకు వెళ్లి అడగండి అన్నాడు. కృష్ణుడు ఆకలిగా ఉన్నాడని తెలియగానే యజ్ఞపత్నులు ఎంతో ఆదుర్దగా వెళ్లి ఆయనకూ, మిగతా గోపాలురకు ఆహారం ఇచ్చారు. యజ్ఞంలో ఉన్నవారు కూడా తమ తప్పు తెలుసుకుని భార్యల్ని ఏమీ అనకుండా యజ్ఞాన్ని ముగిస్తారు. ఈ కథలో కూడా ఆ రోజుల్లో యజ్ఞాల్లో జరిగే పశుహింసను ప్రస్తావించారు. ఇది కూడా సమాజంలో వస్తున్న మార్పునకు అనుగుణంగా వేదవ్యాసుడు భాగవత పురాణం ద్వారా మతవిశ్వాసాల్లో తెచ్చినమార్పు.
 
సమాజంలోని మార్పులకు అనుగుణంగా అందులోని వ్యవస్థలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతుంటాయి. అది కుటుంబ వ్యవస్థ కావచ్చు. మత సిద్ధాంతాలు కావచ్చు. మారడం అనేది ఒక సహజ పరిణామం. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, పాత వ్యవస్థపై విమర్శలు వస్తూ ఉంటాయి. ఎంతో ఉదాత్త ఆశయాలతో ప్రారంభమైన వ్యవస్థలు క్రమేణ వ్యక్తుల బలహీనత వల్ల వ్యతిరేకతకు గురవుతాయి. పరిణామక్రమంలో సహజంగా మార్పు రానపుడు అది ఒకానొక విప్లవ రూపంలో కూడా రావచ్చు.
 
పై కథలాంటిదే మరొకటి శివుని గూర్చి పురాణాల్లో ఉంది. దీనిని తెలుగులో హరవిలాసం అనే కావ్యంలో శ్రీనాథుడు చక్కగా వర్ణించాడు. దారుకావనం అనే చోట రుషులు ఎంతో విద్యాగర్వంతో యజ్ఞం చేస్తున్నారట. శివుడు వారి ఎదుట నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. రుషులు ఆయనపై కోపంతో యుద్ధానికి వెళ్లారు. రుషుల గర్వాన్ని అణచడానికి శివుడు వారిని తీవ్రంగా మర్దించాడట. ఇక్కడ వర్ణన కొంత అశ్లీలంగా కనిపిస్తుంది. కానీ అశ్లీలతను పక్కన ఉంచి కథలో ఉన్న ప్రతీకాత్మక సందేశాన్ని చూస్తే శ్రీకృష్ణుడి కథలో ఉన్న విషయమే ఇక్కడ మరింత తీవ్రంగా చెప్పడాన్ని గమనిస్తాం. కేవలం యాంత్రికంగా యజ్ఞాలు చేయడం అనే విశ్వాసంపై ఆనాటి సమాజంలో వచ్చిన విముఖత ఇక్కడ చూడగలం. విష్ణుభక్తి గూర్చి చెప్పిన పురాణగాథలకు సమాంతరంగా శివభక్తిని ప్రతిపాదిస్తూ చెప్పిన కథ ఇది. భక్తి అన్నదే ఉత్తమ మార్గమనీ, కేవలం కర్మ సరైన మార్గం కాదనీ ఇందులో సారాంశం. పురాణ రచయిత అత్యుత్సాహం వల్ల పాశ్చాత్య విమర్శకులు శివుడ్ని కాముకుడిగా చూపిస్తూ రచనలు చేశారు.
 
హిందూమతంలో సంస్కరణలు ఆధునిక కాలంలో సాంఘిక ఉద్యమ రూపంలో వచ్చాయి. కానీ ఒకప్పుడు రుషులు పురాణాల ద్వారా, లేదా వేదాల్ని కొత్తకోణంలో వ్యాఖ్యానం చేయడం ద్వారా ఈ మార్పుల్ని తేవడానికి ప్రయత్నించారు. వ్యాసుని భారతం, భాగవతం ఈ రెండూ ఇందుకు ఉదాహరణలు. భగవద్గీతలో అనేక విషయాలపై ఇలాంటి మార్పుల్ని చూడగలం. నాలుగు వర్ణాలూ గుణాలపై ఆధారపడినవని చెప్పడం ఇదివరకు వ్యాసాల్లో చూశాం. యజ్ఞమనే పదానికి కూడా శ్రీకృష్ణుడు విస్తృతమైన అర్థాన్ని చెప్పాడు. యాంత్రికంగా హోమాలు చేయడం, ఆహుతులివ్వడం, పశుబలి లాంటివి కాకుండా సమాజశ్రేయస్సుకు తోడ్పడే పనులు, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, ప్రాణాయామం మొదలైనవన్నీ యజ్ఞం లాంటివే అన్నాడు (నాల్గో అధ్యాయం). అలాగే దేవుడికిచ్చే నైవేద్యం యజ్ఞాల్లోని ఆహుతుల రూపంలో ఉండక్కర్లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం (నీరు) అనే రీతిలో ఎవరు సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు అనే భావాన్ని భగవద్గీతలో చూడగలం. యజ్ఞాల్లో ఒకప్పుడు ఉన్న పశుహింసను వ్యాసుని కాలానికే సంస్కరించడం జరుగగా ప్రస్తుతం షెల్డాన్‌ పోలాక్‌ లాంటి విమర్శకులు హిందూ సమాజం హింసాత్మకమైనదంటూ రాయడం కేవలం అసత్య ప్రచారం.
 
యజ్ఞాలవల్ల సాధించగలిగే స్వర్గమనేది ముఖ్యమైన లక్ష్యం కాదనీ, పిల్లవాడు మందును మింగాలనే కోరికతో తల్లి బెల్లము ఆశగా చూపినట్లు స్వర్గమనే చాక్లెట్టును గూర్చి చెప్పారని భాగవతం చెబుతుంది (11-21-23). గీతపై, ఉపనిషత్తులపై వచ్చిన వ్యాఖ్యానాలన్నీ పై భావాలకు అనుగుణంగా ఉంటాయి. వేదకాలం నాటి అనేక ఆచారాలను సంస్కరించి ఆత్మజ్ఞానాన్ని పొందడమే ముఖ్యలక్ష్యం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వేదాంతాన్ని సార్వకాలిక మార్గంగా ప్రతిష్టించాయి.
 
(రచయిత ప్రసంగాలను యూట్యూబ్‌లో “advaita academy talks by aravinda rao” అనే శీర్షికలో చూడవచ్చు.)
 
- డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
 
 
from andhrajyothi daily

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP