శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గురూఛ్చిష్ఠ మహిమ

>> Friday, July 1, 2016

ఒక భక్తురాలికి ఆమె కొడుకు తప్ప వేరే ఆధారం లేదు. ఆ అబ్బాయికి ఏదో చర్మవ్యాధి వచ్చి వేగంగా శరీరమంతా వ్యాపించి బాధిస్తోంది. వొళ్ళంతా చాలా దురదగా ఉంటుంది ఆ అబ్బాయికి. బాధ తట్టుకోలేక గోకితే చర్మం పగిలి తీవ్ర రక్తస్రావమయ్యి, పెద్ద పుండు పడేది. ఆ మాతృహృదయం పిల్లవాడి బాధను చూడలేకపొయింది. పరమాచార్య స్వామి దగ్గరకు వచ్చి తన కష్టాలని చెప్పుకుంది. 
  • గురూఛ్చిష్ఠ  మహిమ

"మీ అనుగ్రహం వల్లనే నా కొడుకు వ్యాధి నయంఅవ్వాలి పెరియవ. నేను మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నాను. మీరు తప్ప నాకు దిక్కు లేదు" అని వేడుకుంది.

మహాస్వామివారు ఆమెను ఆమె కొడుకుని మఠంలోనే ఉండమని చెప్పారు. ఆ పిల్లవాడితో, "నేను భిక్ష చేసాక మిగిలినది తప్ప నువ్వు ఏమీ తినకు, తాగకు - కాఫీ, టీ, పాలు కూడా ఏమీ తీసుకోకూడదు" అని ఆజ్ఞాపించారు. ఆ తల్లి చాలా సంతోషంతో గురు ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించింది.

స్వామివారు శ్రీమఠం వంట బృందానికి కొన్ని సూచనలు ఇచ్చి, తాను మరలా చెప్పేదాకా వాటిని పాటించవలసిందిగా సూచించారు. స్వామివారు కేవలం అరటిచెట్టు యొక్క దూట లోపలి భాగాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించేవారు. వంటవాడు అరటి దూటను ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పువేసి ముక్కల్ని ఉడికించేవాడు. మహాస్వామి వారు దాన్ని భిక్షగా స్వీకరించి కొద్దిగా మజ్జిగను త్రాగేవారు. స్వామివారు తినగా మిగిలిన అరటి దూట పదార్థాన్ని, మజ్జిగని ఆ పిల్లవాడికి పెట్టేవారు. మొదట్లో అతనికి ఈ భోజనం సహించేది కాదు. కాని తనకి గురూచ్చిష్టం తినే భాగ్యం కలిగింది అని గ్రహించి ఆనందంగా పెట్టింది తినేవాడు.

ఒక 10 రోజులయ్యాక దురద మరియు చర్మం పైన ఉన్న మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టసాగాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాధి తగ్గి చర్మం తేటపడి ఆరోగ్యంగా తయారౌతోంది. మండలం రోజులయ్యేసరికి అతని చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యి ఆ పిల్లవాడు కొత్త తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.

"నా కొడుకు అదృష్టాన్ని ఏమని చెప్పగలను. పూర్వ జన్మ పాప కర్మ వలన ఈ చర్మ వ్యాధి వచ్చింది అని అనుకున్నాను. కాని, పూర్వ జన్మ పుణ్య ఫలం వల్లనే ఈ వ్యాధి వచ్చింది. ఎందుకంటే మండలం రోజుల పాటు ప్రతి రోజూ పరమాచార్య స్వామి ఉచ్చిష్ఠం తినే భాగ్యం ఎవరికి కలుగుతుంది" అని ఆ తల్లి ఆనంద పడింది

"ఇది కేవలం అరటిదూట లోని ఔషధ గుణాల వలన మాత్రమే తగ్గింది" అని మహాస్వామివారు అన్నారు.

"అరటి దూట ఔషధం అతని బాధను నివారించడానికి ఒక నెపం మాత్రమే. కేవలం మీ ఉచ్చిష్టాన్ని భుజించడం వల్లనే అది తగ్గింది" అని ఆ తల్లి పరిపూర్ణ కృతఙ్ఞతా భావంతో స్వామికి నమస్కరించింది.

--- సుజాత విజయరాఘవన్, ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం 1

#KanchiParamacharyaVaibhavam#కంచిపరమాచార్యవైభవం
Regards
G .BHASKARA RAMAM
INDIA

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP